5 Key Things People Want From Work: Randstad Report - Sakshi
Sakshi News home page

మీ పనికీ, జీవితానికీ మధ్య సమతుల్యత ఉందా?: రాండ్‌స్టాడ్స్‌ అధ్యయనం

Published Fri, Feb 10 2023 10:30 AM | Last Updated on Fri, Feb 10 2023 1:14 PM

5 Key Things People Want From Work Randstads Report - Sakshi

మీరు ఉద్యోగం ఎందుకు చేస్తున్నారని ఎవరినైనా అడిగామనుకోండి! జీతం కోసం పని చేస్తున్నామని కొందరు, మెరుగైన జీవితం 
కోసమని మరికొందరు సమాధానం చెబుతారు. ఇలా పది మందిని అడిగితే ఎవరికి తోచిన సమాధానం వారు చెబుతారు. మరి... ఆర్థిక మాంద్యం, ఉద్యోగ భయం వెన్నాడుతున్న ప్రస్తుత తరుణంలో ఉద్యోగుల మనోభావాలేంటి?బడాబడా కంపెనీలే వేలకు వేల మందికి క్షణాల్లో ఉద్వాసన పలుకుతున్న సందర్భంలో ఉద్యోగులు ఏమనుకుంటున్నారు? ఉన్న ఉద్యోగం ఊడకుండా ఉంటే చాలు భగవంతుడా అని అంటున్నారా? ఏమైనా ఫరవాలేదని ధీమాగా ఉన్నారా? రాండ్‌స్టాడ్స్‌ అనే కంపెనీ 15 దేశాల్లో సుమారు 35 వేల మందిని ప్రశ్నించి మరీ కనుక్కున్న ఆ విషయాలేంటో చూద్దాం. 

అత్యధికుల్లో కనిపించని బెంగ
ఆర్థిక మాంద్యం వచ్చేస్తోందన్న భయం ఉద్యోగుల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఉద్యోగం పోతుందన్న బెంగ ఉందని 37 శాతం మంది చెప్పగా, అత్యధికులు మాత్రం తాము ఉద్యోగం పోతుందని భయపడటం లేదని సర్వేలో చెప్పడం గమనార్హం. ఈ అధ్యయనం జరగడానికి ఆరు నెలల ముందుతో పోలిస్తే తమ పరిస్థితి ఇప్పటికీ మెరుగ్గానే ఉందని 25 శాతం మంది చెప్పారు. ఇదే సమయంలో పెరిగిపోతున్న ఖర్చులను తట్టుకోవాలంటే రోజూ మరికొన్ని అదనపు గంటలు పనిచేయాలని అనుకుంటున్నట్లు 23 శాతం మంది తెలిపారు. లాటిన్‌ అమెరికాలో 60 శాతం మంది ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తే, యూరప్‌ వాయవ్య ప్రాంతంలో కేవలం 24 శాతం మంది మాత్రమే ఆందోళనగా ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. 

ఫీలింగ్‌ ఉండాలబ్బా..
మూడేళ్లలో సంభవించిన పరిణామాల ఫలితమో లేక ఇంకో కారణమో గానీ.. చాలామంది ఉద్యోగులు తాము పనిచేసే కంపెనీతో ఒకరకమైన అనుబంధం ఏర్పడాలని ఆశిస్తున్నట్లు ఈ అధ్యయనం ద్వారా స్పష్టమైంది. అందుకే చాలామంది తాము చేసే ఉద్యోగం విలువ, అవసరాలను మదింపు చేసుకుంటున్నారని ఈ సర్వే వెల్లడించింది. కంపెనీ మనదన్న ఫీలింగ్‌ లేకపోతే అక్కడ పని మానేసేందుకైనా సిద్ధమని 54 శాతం మంది చెప్పారు. అలాగే పనిచేసే కంపెనీ కూడా కొన్ని విలువలు పాటించాలని లేదంటే ‘బై బై’ చెప్పేస్తామని 42 శాతం మంది స్పష్టం చేశారు. ఏంటా విలువలని ప్రశ్నిస్తే 77 శాతం మంది వైవిధ్యం, పారదర్శకత, సస్టెయినబిలిటీలను ప్రస్తావించారు. 

అందరిదీ ఒకే కోరిక
ఆర్థిక మాంద్యం పరిస్థితులు ఎలా ఉన్నా ఈ అధ్యయనంలో ఒక విషయమైతే స్పష్టమైంది. పనికీ, జీవితానికీ మధ్య సమతుల్యత ఉండాలని ఎక్కువ మంది చెప్పారు. ఈ సమతుల్యత లేకపోతే ఉద్యోగం వదులుకోవడానికీ వెనుకాడబోమని 61 శాతం మంది చెప్పడం, వీరందరూ 18– 34 మధ్య వయస్కులు కావడం విశేషం. పనిచేసే వాతావరణం బాగా లేదనిపిస్తే రాజీనామా చేసేస్తామని 34 శాతం మంది అభిప్రాయపడ్డారు. జీవితాన్ని అనుభవించలేని పరిస్థితులు తలెత్తితే ఉద్యోగం అవసరం లేదని 48 శాతం మంది చెప్పారు. 

మళ్లీ పనుల బాటలో..
మనదేశం మాటెలా ఉన్నా... ఈ అధ్యయనం నిర్వహించిన చాలా దేశాల్లో పదవీ విరమణ చేసిన వృద్ధులు మళ్లీ ఉద్యోగాలు వెతుక్కునే పనిలో ఉన్నారట. ఆర్థిక పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణం. భారత్‌లో ఉద్యోగాలకు వయో పరిమితి ఉంది కానీ, పాశ్చాత్య దేశాల్లో చాలా తక్కువ. కాలూ చేయి ఆడినంత కాలం పని చేస్తూంటారు. నచ్చినప్పుడు రిటైరవడమన్నది అక్కడ సాధా­రణం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో 65 ఏళ్లకు రిటైరవుదామని అనుకున్న వారు కూడా మరి కొంతకాలం పనిచేయాలని యోచిస్తున్నారు. గత ఏడాది 61 శాతం మంది పదవీ విరమణ ఆలోచ­న చేస్తే, ఈ ఏడాది ఆ సంఖ్య 51 శాతానికి పడిపోవడం గమనార్హం. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో గణాంకాలను పరిశీలిస్తే ఇటీవలి కాలంలో 65 ఏళ్లు పైబడ్డ వారు మళ్లీ ఉద్యోగాల వేటలో ఉన్న విషయం స్పష్టమవుతుంది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 32 శాతం మంది తమకు ఉద్యోగాలు అవసరమని చెప్పారు. కేవలం వేత­నాల కోసమే కాదు, ఇతరులతో సంబంధాలు కలిగి ఉండేందుకు, వచ్చే జీతం తమదీ అన్న ఒక భావన పొందేందుకూ ఏదో ఒక ఉద్యోగం అవసరమన్నది వారి అభిప్రాయంగా ఉంది.

యజమానులు ఆదుకోవాలి
ఖర్చులు పెరిగిపోతుండటంతో చాలామంది ఉద్యో­గు­లు.. యజమానులు తమను ఏదోవిధంగా ఆదు­కోవాలని ఆశిస్తున్నట్లు 39 శాతం మంది అభి­ప్రాయపడ్డారు. జీతాలైనా పెంచాలని, లేదంటే ఆర్థిక సాయం అందించాలని వీరు కోరుతున్నారు. ఏడాదికి ఒకసారి ఇచ్చే పెంపునకు అదనంగా ఈ సాయం చేయాలన్నది వారి భావన. పెట్రోల్, గ్యాస్‌ ఖర్చుల విషయంలో ఆదుకున్నా ఫర్వా­లేదని, లేదంటే ఆఫీసుకు వచ్చిపోయేందుకు అవస­రమైన రవాణా, తదితర ఖర్చులను కంపెనీలు భరించినా ఓకేనని దాదాపు 30 శాతం మంది తెలిపారు. ఆసక్తికరమైన విషయమేంటంటే.. 50 శాతం మంది తాము ఇప్పటికే ఈ రకమైన సాయం అందుకుంటున్నట్లు చెప్పడం. ఆర్థిక అంశాలను పక్కన పెడితే ఉద్యోగులను బాగా కలవరపె­డు­తు­న్న అంశం వర్క్‌ ఫ్లెక్సిబిలిటీ. సుమారు 45 శాతం మంది తమకు అనుకూలంగా ఉన్న సమ­యంలో పనిచేసేందుకు ఇష్టం చూపితే 40 శాతం మంది ఆఫీసులకు వెళ్లేందుకు బదులు రిమోట్‌ లేదా హైబ్రిడ్‌ పద్ధతుల్లో పనిచేసేందుకు ఆసక్తికన­బరిచా­రు. తమకు అనుకూలంగా లేదన్న కారణంతో 27 శాతం మంది ఉద్యోగాలు వదులుకున్నట్లు తెలిపా­రు. పనివేళలు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని 83 శాతం మంది అభిప్రాయపడగా, పనిచేసే ఊరు, ప్రాంతం విషయంలోనూ ఈ వెసులుబాటు ఉండాలని 71 శాతం మంది చెప్పారు. ఇలా చెప్పిన వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు.

సర్వే జరిగిందిలా..
కోవిడ్‌ తదనంతరం ప్రపంచం మొత్తమ్మీద ఆర్థిక మాంద్యం భయం కనిపిస్తున్న తరుణంలో ఉద్యోగులు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు రాండ్‌స్టాడ్స్‌ ఈ సర్వే నిర్వహించింది. ‘వర్క్‌ మానిటర్‌’ పేరుతో నిర్వహించిన ఈ సర్వేలో 15 దేశాలకు చెందిన 35 వేల మంది పాల్గొన్నారు. వారానికి 24 గంటలపాటైనా పనిచేసే వారు లేదా వ్యాపారాలు చేసుకునేవారు, ఉద్యోగం కోసం వెతుక్కుంటున్న వారిని ఆన్‌లైన్‌లో ప్రశ్నించారు. ఒక్కో దేశంలో కనీసం 500 మందితో ఈ సర్వే నడిచింది. గత అక్టోబరు 18–30 మధ్య భారత్, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, ఆ్రíస్టియా, బెల్జియం, బ్రెజిల్, కెనడా, చిలీ, చైనా, చెక్‌ రిపబ్లిక్, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హాంకాంగ్, దక్షిణాఫ్రికా, హంగేరీ, ఇటలీ, జపాన్, లగ్జెంబర్గ్, మలేసియా, మెక్సికో, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, పోలండ్, పోర్చుగల్, రుమేనియా, సింగపూర్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, టర్కీ, యునైటెడ్‌ కింగ్‌డమ్, అమెరికాల్లో ఈ సర్వే నిర్వహించారు.  

-కంచర్ల యాదగిరిరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement