న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగులు మెచ్చే అత్యంత ఆకర్షణీయ సంస్థగా (అట్రాక్టివ్ ఎంప్లాయర్ బ్రాండ్) మైక్రోసాఫ్ట్ ఇండియా నిలిచింది. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2022 ర్యాంకుల జాబితా విడుదలైంది. ఆర్థిక ఆరోగ్యం విషయంలో మైక్రోసాఫ్ట్ ఇండియా చాలా ఎక్కువ స్కోరు సాధించింది.
బలమైన పేరు, గుర్తింపు, ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనాలు, ఇతర ప్రయోజనాలు.. ఈ మూడు అంశాలు మైక్రోసాఫ్ట్‌ను నంబర్ 1 స్థానంలో నిలిపాయి. ఈ జాబితా లోని టాప్–10లో హ్యూలెట్ ప్యాకార్డ్ నాలుగో స్థానంలో, ఇన్ఫోసిస్ ఐదో స్థానంలో ఉన్నాయి. విప్రో, టీసీఎస్, టాటా స్టీల్, టాటా పవర్ కంపెనీ, శామ్‌సంగ్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాండ్‌స్టాడ్ రీసెర్చ్ సర్వే కోసం 5,944 కంపెనీలకు చెందిన 1,63,000 మంది నుంచి (31 దేశాల వారు) అభిప్రాయాలు తెలుసుకున్నారు.
కెరీర్‌లో పురోగతి కీలకం..
భారత్‌లో ప్రతి 10 మంది ఉద్యోగుల్లో 9 మంది (88%) శిక్షణ, వ్యక్తిగత కెరీర్ పురోగతి తమకు చాలా ముఖ్యమైనవిగా చెప్పారు. అదే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇలా చెప్పిన ఉద్యోగులు 76%. 2021 చివరి ఆరు నెలల్లో భారత్‌లో 24% ఉద్యోగులు తమ కంపెనీని మార్చుకున్నారని రాండ్‌స్టాడ్ తెలిపింది. సంస్థను ఎంపిక చేసుకునే విషయంలో పని–వ్యక్తిగత జీవితం మధ్య బ్యాలన్స్ తమకు ముఖ్యమని 63% మంది తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment