Microsoft India
-
మైక్రోసాఫ్ట్‌కు భారత్ కీలకం
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) ఉపయోగాల గురించి తెలిసే కొద్దీ, దానిపై సాధారణంగా నెలకొన్న వ్యతిరేకత స్థానంలో క్రమంగా సానుకూల ధోరణి పెరుగుతోందని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా, దక్షిణాసియా విభాగం ప్రెసిడెంట్ పునీత్ చందోక్ తెలిపారు. తమ ’కోపైలట్’ ఏఐ అసిస్టెంట్ ప్రస్తుతం కృత్రిమ మేథకు దాదాపు పర్యాయపదంగా మారుతోందని పేర్కొన్నారు. ఇటీవలి అధ్యయనం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఆరుగురు ఏఐ డెవలపర్లలో ఒకరు భారత్ నుంచి ఉంటున్నారని చందోక్ తెలిపారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు అన్ని టెక్ కంపెనీలకు భారత్ అత్యంత కీలకమైన మార్కెట్లలో ఒకటిగా ఉందని ఆయన పేర్కొన్నారు. తమ సంస్థపరంగా చూస్తే అత్యంత వేగంగా ఎదుగుతున్న మార్కెట్లలో భారత్ కూడా ఒకటని చందోక్ చెప్పారు. పటిష్టంగా డిమాండ్, సరఫరా.. ఇటు డిమాండ్ అటు సరఫరాపరంగా భారత మార్కెట్ పటిష్టంగా ఉందని చందోక్ చెప్పారు. ‘డిమాండ్‌పరంగా చూస్తే భారత్‌లో 7,000 పైగా లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థ ఉంది. సరఫరాపరంగా చూస్తే మైక్రోసాఫ్ట్‌కి చెందిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్లాట్‌ఫాం ’గిట్‌హబ్’లో అమెరికా తర్వాత అత్యధికంగా భారత్ నుంచి దాదాపు 1.5 కోట్ల మంది డెవలపర్లు ఉన్నారు. మరో రెండు మూడేళ్లలో ఈ సంఖ్య అమెరికాను కూడా దాటిపోతుంది‘ అని చందోక్ పేర్కొన్నారు. -
ఉద్యోగులు మెచ్చే సంస్థ ‘మైక్రోసాఫ్ట్’
న్యూఢిల్లీ: భారత్‌లో ఉద్యోగులు మెచ్చే అత్యంత ఆకర్షణీయ సంస్థగా (అట్రాక్టివ్ ఎంప్లాయర్ బ్రాండ్) మైక్రోసాఫ్ట్ ఇండియా నిలిచింది. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2022 ర్యాంకుల జాబితా విడుదలైంది. ఆర్థిక ఆరోగ్యం విషయంలో మైక్రోసాఫ్ట్ ఇండియా చాలా ఎక్కువ స్కోరు సాధించింది. బలమైన పేరు, గుర్తింపు, ఉద్యోగులకు ఆకర్షణీయమైన వేతనాలు, ఇతర ప్రయోజనాలు.. ఈ మూడు అంశాలు మైక్రోసాఫ్ట్‌ను నంబర్ 1 స్థానంలో నిలిపాయి. ఈ జాబితా లోని టాప్–10లో హ్యూలెట్ ప్యాకార్డ్ నాలుగో స్థానంలో, ఇన్ఫోసిస్ ఐదో స్థానంలో ఉన్నాయి. విప్రో, టీసీఎస్, టాటా స్టీల్, టాటా పవర్ కంపెనీ, శామ్సంగ్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రాండ్‌స్టాడ్ రీసెర్చ్ సర్వే కోసం 5,944 కంపెనీలకు చెందిన 1,63,000 మంది నుంచి (31 దేశాల వారు) అభిప్రాయాలు తెలుసుకున్నారు. కెరీర్లో పురోగతి కీలకం.. భారత్‌లో ప్రతి 10 మంది ఉద్యోగుల్లో 9 మంది (88%) శిక్షణ, వ్యక్తిగత కెరీర్ పురోగతి తమకు చాలా ముఖ్యమైనవిగా చెప్పారు. అదే ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇలా చెప్పిన ఉద్యోగులు 76%. 2021 చివరి ఆరు నెలల్లో భారత్‌లో 24% ఉద్యోగులు తమ కంపెనీని మార్చుకున్నారని రాండ్‌స్టాడ్ తెలిపింది. సంస్థను ఎంపిక చేసుకునే విషయంలో పని–వ్యక్తిగత జీవితం మధ్య బ్యాలన్స్ తమకు ముఖ్యమని 63% మంది తెలిపారు. -
సైబర్ నేరాలు.. ఏటా రూ.10 లక్షల కోట్ల భారం !
న్యూఢిల్లీ: సైబర్ నేరాలనేవి డిజిటలీకరణకు అతి పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. వీటి వల్ల 2025 నాటి కల్లా ఎకానమీలపై ఏటా 10 లక్షల కోట్ల మేర భారం పడనుందని అంచనాలు నెలకొన్నాయి. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. సైబర్ నేరాల వల్ల ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలపై ఏటా 6 లక్షల కోట్ల డాలర్ల మేర భారం పడుతోందని, 2025 నాటికి ఇది దాదాపు 10 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయని ఆయన వివరించారు. వ్యాపారంలో టెక్నాలజీ వినియోగ తీవ్రతను బట్టే ప్రతి కంపెనీ వృద్ధి ఆధారపడి ఉంటోందని మహేశ్వరి తెలిపారు. పరిశ్రమ వృద్ధి చెందే కొద్దీ, కంపెనీలు సైబర్ సెక్యూరిటీపైనా, విశ్వసనీయ టెక్నాలజీపైనా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. డిజిటల్‌కు మారే క్రమంలో భారత్ .. క్లౌడ్ సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. -
మైక్రోసాఫ్ట్ ఏఐ ఇన్నోవేట్
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా ఏఐ ఇన్నోవేట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆర్టీఫీషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ఉన్న స్టార్టప్స్ కార్యకలాపాలను విస్తృతం చేయడం, ఆవిష్కరణలను నడిపించడంతోపాటు పరిశ్రమకు కావాల్సిన నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది. నవంబర్‌లో ప్రారంభమై 10 వారాలపాటు ఇది సాగనుంది. ఏఐ రంగంలో స్టార్టప్స్ సంఖ్య పరంగా ప్రపంచంలో భారత్ మూడవ స్థానంలో ఉందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. ఏఐ వినియోగం ద్వారా 2035 నాటికి భారత ఆర్దిక వ్యవస్థకు రూ.6,75,000 కోట్లకుపైగా తోడవుతుందని మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి వెల్లడించారు. -
ఉద్యోగాలకు ఆకర్షణీయ సంస్థల్లో గూగుల్ టాప్
న్యూఢిల్లీ: ఉద్యోగాలకు సంబంధించి అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్‌గా టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా అగ్రస్థానం దక్కించుకుంది. అమెజాన్ ఇండియా, మైక్రోసాఫ్ట్ ఇండియా తర్వాత స్థానాల్లో నిల్చాయి. రాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2021 సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక పరిస్థితి, ప్రతిష్ట, ఆకర్షణీయమైన వేతనాలు, ప్రయోజనాలు వంటి అంశాల ప్రాతిపదికన గూగుల్ ఇండియా అత్యధికంగా మార్కులు దక్కించుకున్నట్లు రాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ విశ్వనాథ్ పీఎస్ తెలిపారు. టాప్ 10 ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్స్ జాబితాలో ఇన్ఫోసిస్(4వ స్థానం), టాటా స్టీల్(5), డెల్(6), ఐబీఎం(7), టీసీఎస్(8), విప్రో(9), సోని(10) ఉన్నాయి. 34 దేశాల్లో 6,493 కంపెనీలపై నిర్వహించిన ఈ సర్వేలో 1,90,000 మంది పాల్గొన్నారు. ఉద్యోగం, కుటుంబానికి సమ ప్రాధాన్యం.. ఉద్యోగార్థుల ఆలోచనా ధోరణుల్లో గణనీయంగా మార్పులు వచి్చనట్లు ఈసారి సర్వేలో వెల్లడైంది. వారు అటు ఉద్యోగ విధులు, ఇటు కుటుంబ బాధ్యతల మధ్య సమతౌల్యం పాటించేందుకు ప్రాధాన్యమిస్తున్నట్లు తేలింది. వేతన ప్యాకేజీకి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో.. ఈ అంశానికీ అంతే ప్రాధాన్యమిస్తున్నట్లు సర్వే పేర్కొంది. దీని ప్రకారం.. ఆకర్షణీయమైన జీతభత్యాలతో పోలిస్తే (62%).. ఉద్యోగం, కుటుంబం మధ్య సమతౌల్యానికే(65%) ఉద్యోగార్థులు ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడైంది. కోవిడ్–19 నిబంధనలకు అనుగుణమైన పని వాతావరణం(61%), ఉద్యోగ భద్రత(61%) అంశాలు తర్వాత స్థానా ల్లో ఉన్నాయి. కంపెనీల ఎంపికలో ఉద్యోగార్థుల కొలమానాలు మారుతున్నాయని విశ్వనాథ్ తెలిపారు. తమకు విలువనిచి్చ, అండగా నిలవడంతో పాటు తమ అభిప్రాయాలు, లక్ష్యాలకు అనుగుణమైన సంస్థలనే ఉద్యోగార్థులు ఇష్టపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. -
మైక్రోసాప్ట్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
న్యూఢిల్లీ : మైక్రోసాప్ట్ ఇండియా తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. సంరక్షకుని సెలవు(కేర్‌గివర్ లీవ్) పేరిట నాలుగు వారాల పెయిడ్ లీవ్‌ను ప్రకటించింది. కుటుంబసభ్యులు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న పరిస్థితుల్లో వెంటనే వారికి సంరక్షకునిగా ఉండేందుకు ఈ పెయిడ్ లీవ్‌ను ఉద్యోగులకు అందించనున్నట్టు మైక్రోసాప్ట్ పేర్కొంది. జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు, అత్తామామలు, తోబుట్టువులు, తాతయ్య,నాన్నమ్మలు, సంతానం వంటి వారిని ప్యామిలీ కేర్‌గివర్ లీవ్‌లో చేర్చింది. ఈ సెలవు కింద ఉద్యోగులకు వేతనం చెల్లించనుంది. గతేడాదే కంపెనీ ప్రసూతి సెలవు కింద 26 వారాలను తమ ఉద్యోగులకు అందించనున్నట్టు ప్రకటించింది. పురుష ఉద్యోగులు కూడా ఆరు వారాల పితృత్వ సెలవును పెట్టుకోవచ్చని తెలిపింది. దీనిలోనే సరోగసీ లేదా దత్తత కూడా ఉంటాయని చెప్పింది. కుటుంబసభ్యులకు వారి అవసరం మేరకు ఉద్యోగులు ఏం చేయాలనిపిస్తే అది చేసుకునే విధంగా తమ విధానాలను రూపొందిస్తున్నామని మైక్రోసాప్ట్ హెచ్ఆర్ అధినేత ఇరా గుప్తా తెలిపారు. సంరక్షకుని సెలవును విస్తరించుకోవచ్చు. ఏడాదంతంటా ఉద్యోగి ఏ రూపంలోనైనా దీన్ని వాడుకోవచ్చని పేర్కొన్నారు. భారత్ లో మైక్రోసాప్ట్ కు 8000 మంది ఉద్యోగులున్నారు. ముఖ్యంగా మహిళలు వర్క్ చేస్తున్న ప్రాంతాల్లో తీసుకున్న మంచి నిర్ణయం ఇదేనని కన్సల్టెంట్స్ చెబుతున్నాయి. -
టెక్నాలజీలో భారత్ జిగేల్
ప్రపంచవ్యాప్తంగా నవకల్పనల్లో మన ఎంట్రప్రెన్యూర్స్, డెవలపర్లదే కీలక పాత్ర ♦ వాళ్లకు సరైన వేదికను మైక్రోసాఫ్ట్ కల్పిస్తుంది.. ♦ కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల న్యూఢిల్లీ: భారతీయ డెవలపర్లు, ఎంట్రప్రెన్యూర్స్ అద్భుతాలను సృష్టిస్తున్నారని... నవకల్పనల్లో ప్రపంచవ్యాప్తంగా కీలకపాత్ర పోషిస్తున్నారంటూ మైక్రోసాఫ్ట్ ఇండియా సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు. వీళ్లందరికీ సరైన వేదికను కల్పించడంలో మైక్రోసాఫ్ట్ ముందుంటుందని చెప్పారు. ఒక్కరోజు భారత్ పర్యటనలో భాగంగా సోమవారమిక్కడ మైక్రోసాఫ్ట్ ‘టెక్ ఫర్ గుడ్, ఐడియాస్ ఫర్ ఇండియా’ పేరుతో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. అదేవిధంగా ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా ఆయన కలిశారు. ‘ఇంతమంది విభిన్నమైన అభ్యాస డెవలపర్లు, ఎంట్రప్రెన్యూర్లు, కళాకారులనే కాకుండా భారత్‌తోపాటు మొత్తం ప్రపంచ టెక్నాలజీ రూపురేఖలనే మార్చేస్తున్న ఈ-కామర్స్ రంగ దిగ్గజాలను కలుసుకోవడం నాలో కొత్త స్ఫూర్తిని నింపుతోంది. ఈ విజయాల్లో మా (మైక్రోసాఫ్ట్) ప్లాట్‌ఫామ్ కూడా భాగస్వామ్యం కావడాన్ని గర్వకారణంగా భావిస్తున్నా. ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి, సంస్థను మరింత ఉన్నతంగా, శక్తిమంతంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. మరీ ముఖ్యంగా టెక్నాలజీతో భారత్‌లోని ప్రతిఒక్కరి శక్తిసామర్థ్యాలను తేజోవంతం చేయడంపై దృష్టిపెట్టాం. తద్వారా ప్రజలు తమ జీవనగమనంలో ఉన్నతస్థానాలను అందుకోవడంతోపాటు దేశాభివృద్ధికి కూడా తోడ్పడతారు. మేం అభివృద్ధిచేసిన టెక్నాలజీ కంటే... ఇప్పుడు భారత్‌లో మీరంతా సృష్టిస్తున్న అద్భుతాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. రానున్నకాలంలో ఈ జోరును మరింత పెంచేందుకు మైక్రోసాఫ్ట్ తగిన వేదికను కల్పిస్తుంది’ అని నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా కూడా పాల్గొన్నారు. భారత్ వృద్ధి పథానికి టెక్నాలజీ వెన్నుదన్నుగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. గాలిబ్ కవితలు కూడా... సత్య తన ప్రసంగంలో విఖ్యాత మీర్జా గాలిబ్ కవితలను కూడా ప్రస్తావించడం గమనార్హం. కలలు, ఆకాంక్షలను సాకారం చేసుకోవడం గురించి ఉద్దేశిస్తూ గాలిబ్ కవితల్లోని కొన్ని వాక్యాలను ఉటంకించారు. ‘కలలను సాకారం చేసుకోవడమే కాదు... అద్భుతాలను ఆవిష్కరించగలిగే కలలకోసం పరితపించడం కూడా చాలా ముఖ్యం. మనలో అనునిత్యం స్ఫూర్తిని నింపేది కూడా ఇదే’ అంటూ సత్య యువత, సభికులను ఉత్తేజపరిచారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులపై వ్యాఖ్యానిస్తూ... ప్రపంచాన్ని మనం చూసే దృక్కోణంలో మార్పుగనుక వస్తే.. ఇప్పుడున్న ప్రపంచాన్ని మార్చగలిగే సత్తా కచ్చితంగా ఉన్నట్టేనని సత్య పేర్కొన్నారు. భారత్‌కు మూడోసారి... మైక్రోసాఫ్ట్ సీఈఓగా 2014 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత సత్య నాదెళ్ల భారత్‌కు రావడం ఇది మూడోసారి. గతేడాది డిసెంబర్లో ముంబైతోపాటు హైదరాబాద్‌లోని టీ-హబ్‌ను కూడా సత్య సందర్శించారు. కాగా, సోమవారం భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన కార్యక్రమానికి నాదెళ్ల హాజరయ్యారు. ఇంటెల్ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్-దక్షిణాసియా) దేవ్జానీ ఘోష్, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ చైర్మన్ రవి పార్థసారథి, విప్రో ప్రెసిడెంట్-సీఓఓ భానుమూర్తి బీఎం, ఎన్ఐఐటీ సీఈఓ రాహుల్ పత్వార్ధాన్ తదితరులు దీనిలో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో భేటీ... భారత్ పర్యటనలో భాగంగా సత్య నాదెళ్ల సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం, ఐటీ రంగానికి సంబంధించి మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవడం గురించి ఆయన ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం. అంతకుముందు నాదెళ్ల టెలికం, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హాతో కూడా సమావేశం అయ్యారు. ‘ఐటీ రంగానికి సంబంధించిన పలు అంశాలపై మేం మాట్లాడుకున్నాం’ అని భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేశారు. అయితే, ప్రభుత్వ రంగంలో క్లౌడ్ సేవల ఉపయోగం, స్కైప్‌తో ఆధార్ అనుసంధానం వంటివి మోదీతో సమావేశంలో నాదెళ్ల చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇటేవలే భారత్‌కు తొలిసారి రావడం, మోదీతో సమావేశం కావడం తెలిసిందే. కాగా, ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా తదితర కార్యక్రమాలకు చేయూతనందిస్తాంటూ మైక్రోసాఫ్ట్, యాపిల్లు ఇప్పటికే ముందుకొచ్చాయి కూడా. -
ఉద్యోగాలకు ఆకర్షణీయ కంపెనీ... గూగుల్
న్యూఢిల్లీ: దేశీయంగా ఉద్యోగాలకు ఆకర్షణీయమైన సంస్థగా ఇంటర్నెట్ సెర్చి దిగ్గజం గూగుల్ నిల్చింది. వివిధ విభాగాల కంపెనీలపై మానవ వనరుల కన్సల్టెన్సీ సంస్థ రాండ్‌స్టాడ్ 2015 సంవత్సరానికి గాను నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గత నాలుగేళ్లుగా అగ్రస్థానంలో ఉంటున్న మైక్రోసాఫ్ట్ ఇండియా తాజాగా హాల్ ఆఫ్ ఫేమ్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. రంగాలవారీగా చూసినప్పుడు తయారీకి సంబంధించి టాటా స్టీల్, ఎఫ్ఎంసీజీ విభాగంలో పీఅండ్‌జీ, ఆటోమొబైల్ విభాగంలో హోండా ఇండియా అగ్రస్థానంలో నిల్చాయి. వీటితో పాటు ఉద్యోగాలకు ఆకర్షణీయమైన కంపెనీల్లో కాగ్నిజెంట్, హెచ్‌పీ, హెచ్‌పీసీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, ఎల్అండ్టీ తదితర సంస్థలు ఉన్నాయి. భారత ఎకానమీతో పాటు జాబ్ మార్కెట్ క్రమంగా పుంజుకుంటున్నాయని రాండ్‌స్టాడ్ ఇండియా సీఈవో మూర్తి కె. ఉప్పలూరి తెలిపారు. కంపెనీ ఆకర్షణీయంగా నిలవడానికి సంబంధించి జీతభత్యాలు, ఉద్యోగులకు సదుపాయాలు (54%) , ఉద్యోగ భద్రత (49%) మొదలైనవి కీలక పాత్ర పోషిస్తున్నాయి. -
విద్యార్థినుల కోసం మైక్రోసాఫ్ట్ ‘విమెన్ ఇన్ టెక్’ ప్రోగ్రామ్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ ఇండియా కంపెనీ విమెన్ ఇన్ టెక్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ఏడాది కాలంలో పది లక్షల మంది మహిళలకు ఐటీ శిక్షణ ఇవ్వడానికి, ఐటీ రంగంలో వారికి మార్గదర్శకంగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించామని మైక్రోసాఫ్ట్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం భారత ఐటీ రంగంలో పది లక్షల మంది మహిళలున్నారని, కొన్నేళ్లలో ఈ సంఖ్యను రెట్టింపు చేయడం లక్ష్యమని మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ చెప్పారు. విమెన్ ఇన్ టెక్ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్ధినులు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్(ఎస్టీఈఎం-స్టెమ్) విద్యార్ధినులు, మహిళా ఐటీ ఉద్యోగులు, ఎంటర్ప్రెన్యూర్ల కోసం ఉద్దేశించామని మైక్రోసాఫ్ట్ ఇండియా చీఫ్ ఎవాంజలిస్ట్ జోసెఫ్ లండేస్ చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థినులు ఒక ఐటీ ఉద్యోగిగా కానీ, సొంత ఐటీ వెంచర్ ప్రారంభించగల వ్యక్తిగా గానీ ఎదిగేందుకు తగిన తోడ్పాటునందిస్తామని వివరించారు. ఐటీని కెరీర్‌గా తీసుకునేలా బాలికలను, టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్లుగా మారేందుకు మరింత మంది మహిళలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. -
ఏటీఎంలకు ‘ఎక్స్పీ’ గండం...
న్యూఢిల్లీ: విండోస్ ఎక్స్పీ నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లోని చాలా పర్సనల్ కంప్యూటర్లు, ఏటీఎంలను ఆప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని అమెరికా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఇలా చేయని పక్షంలో ఈ పీసీలకు, ఏటీఎంలకు సెక్యురిటీ రిస్క్‌లు తప్పకపోవచ్చని వివరించింది. ఈ కంపెనీ విండోస్ ఎక్స్‌పీని 2001, ఆక్టోబర్‌లో విడుదల చేసింది. ప్రస్తుతమున్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8తో పోల్చితే విండోస్ ఎక్స్పీ మూడు జనరేషన్లు వెనకబడి ఉంది. వచ్చే నెల 8 నుంచి విండోస్ ఎక్స్‌పీకి సపోర్ట్ సర్వీసులందించడం ఆపేస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో లక్ష వరకూ ఏటీఎంలు ఉంటాయని, వీటిల్లో అధిక భాగం విండోస్ ఎక్స్‌పీపైనే పనిచేస్తున్నాయని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం(విండోస్ బిజినెస్) అమ్రిష్ గోయెల్ పేర్కొన్నారు. అయితే కేవలం కొన్ని పాత ఏటీఎంలకు మాత్రమే సమస్య ఉంటుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎం.వి. టంకసాలె పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సపోర్ట్ సర్వీసులు ఆగిపోతే సమస్యలు పెరుగుతాయని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని గత వారంలోనే భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కూడా హెచ్చరించింది.