విద్యార్థినుల కోసం మైక్రోసాఫ్ట్ ‘విమెన్ ఇన్ టెక్’ ప్రోగ్రామ్
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ ఇండియా కంపెనీ విమెన్ ఇన్ టెక్ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించింది. ఏడాది కాలంలో పది లక్షల మంది మహిళలకు ఐటీ శిక్షణ ఇవ్వడానికి, ఐటీ రంగంలో వారికి మార్గదర్శకంగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించామని మైక్రోసాఫ్ట్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం భారత ఐటీ రంగంలో పది లక్షల మంది మహిళలున్నారని, కొన్నేళ్లలో ఈ సంఖ్యను రెట్టింపు చేయడం లక్ష్యమని మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ చెప్పారు.
విమెన్ ఇన్ టెక్ కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్ధినులు, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్(ఎస్‌టీఈఎం-స్టెమ్) విద్యార్ధినులు, మహిళా ఐటీ ఉద్యోగులు, ఎంటర్‌ప్రెన్యూర్‌ల కోసం ఉద్దేశించామని మైక్రోసాఫ్ట్ ఇండియా చీఫ్ ఎవాంజలిస్ట్ జోసెఫ్ లండేస్ చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యార్థినులు ఒక ఐటీ ఉద్యోగిగా కానీ, సొంత ఐటీ వెంచర్ ప్రారంభించగల వ్యక్తిగా గానీ ఎదిగేందుకు తగిన తోడ్పాటునందిస్తామని వివరించారు. ఐటీని కెరీర్‌గా తీసుకునేలా బాలికలను, టెక్నాలజీ ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారేందుకు మరింత మంది మహిళలకు ప్రోత్సాహం అందిస్తామన్నారు.