
వారం నుంచి నెల రోజుల ముందే గుర్తించే టెక్నాలజీ.. 19 ఏళ్లుగా సాగిస్తున్న పరిశోధనలు తుది అంకానికి
ఏలూరుకు చెందిన ఇంజనీర్ శివ సీతారామ్ ఆవిష్కరణ
ప్రస్తుతం 30, 40 సెకన్లు మాత్రమే ముందుగా చెప్పే వ్యవస్థ
అది కూడా అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితం
నూతన సాంకేతికతతో భారీ ప్రమాదాలను తగ్గించవచ్చు
భూకంపం ఎలా వస్తుంది..? ఎప్పుడు వస్తుంది..? ఎందుకు వస్తుంది..? ఎంత తీవ్రతతో వస్తుంది..? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాల శాస్త్రవేత్తలు ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అయినా కచ్చితమైన ఫలితం రాలేదు. అతి కొద్ది దేశాల్లో 30 నుంచి 40 సెకన్లు మాత్రమే ముందుగా చెప్పే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. మన దేశంలో అయితే అటువంటిది కూడా లేదు. అయితే, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను వాతావరణ శాఖ ముందుగా గుర్తించి ఎలా సమాచారం అందిస్తుందో అదే తరహాలో భూకంపాలను అంచనా వేసే టెక్నాలజీపై ఏలూరు నగరానికి చెందిన ఇంజనీర్ సాగించిన పరిశోధన తుది అంకానికి చేరుకుంది. – సాక్షి ప్రతినిధి, ఏలూరు
భూకంపాలు ఎలా వస్తాయంటే..
భూమి లోపల కోర్, మాంటేల్, క్రస్ట్ అనే మూడు ప్రధాన పొరల్లో గణనీయమైన మార్పులతో భూకంపాలు సంభవిస్తుంటాయి ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున రిక్టర్ స్కేల్‌పై 7 మ్యాగ్నిట్యూడ్ కంటే ఎక్కువగా 6 నుంచి 18 వరకు భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. మన దేశంలో భూకంపాలను జోన్లుగా విభజించారు. జోన్–2లో హైదరాబాద్, దక్కన్ ప్రాంతం ఉన్నాయి. ఇక్కడ సగటున 5 మ్యాగ్నిట్యూడ్ నమోదుకు అవకాశం ఉంది. జోన్–3లో కోస్టల్ ప్రాంతం, గోదావరి, తెలంగాణలో కొంత ప్రాంతం ఉన్నాయి. ఇక్కడ 6 మ్యాగ్నిట్యూడ్ వరకు నమోదుకు అవకాశముంది.
జోన్–4లో ఢిల్లీ, హరియాణా ఉన్నాయి. ఇక్కడ 7 మ్యాగ్నిట్యూడ్ వరకు నమోదుకు అవకాశముంది. హిమాలయాలు, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, గుజరాత్, ఉత్తరాఖండ్‌లలో 7 నుంచి 9 మ్యాగ్నిట్యూడ్ వరకు నమోదవుతుంది. జోన్–5లో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. ఇక్కడ అత్యధికంగా 9 మ్యాగ్నిట్యూడ్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. 6 నుంచి 9 వరకు మ్యాగ్నిట్యూడ్‌ల వరకు ఉంటే ఆస్తి, ప్రాణనష్టాలు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది. దీనిపై మన దేశంలో నేషనల్ జియో ఫిజిక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ పనిచేస్తోంది.
శివ ఆవిష్కరణ ఇలా...
భూకంపం సమయం, ప్రదేశం, తీవ్రతను వారం నుంచి నెల రోజుల పాటు ముందస్తుగా అంచనా వేసేందుకు శివ సీతారామ్ 19 ఏళ్లు విస్తృతంగా రీసెర్చ్ చేసి ఫలితాన్ని తుది దశకు తీసుకొచ్చారు. ఇలా ముందస్తు అంచనాలతో సిద్ధం చేసిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. 7 మ్యాగ్నిట్యూడ్ కంటే ఎక్కువ తీవ్రత ఉండే భూకంపాలు రావడానికి ముందు 3 నుంచి 6 నెలల పాటు భూమి లోపల పొరల్లో వివిధ రకాల సంకేతాలు అందుతుంటాయి.
దాని ప్రభావం 300 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీనినిబట్టి ప్రదేశం, సమయం, తీవ్రతలో కచ్చితత్వాన్ని అంచనా వేయగలిగితే ఆస్తి, ప్రాణ నష్టం నివారించవచ్చు. దీనిపైనే శివ రీసెర్చ్ చేసి సూక్ష్మ స్థాయి మార్పులు భూకంప కేంద్రం నుంచి కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయని గుర్తించారు. వీటిని కొన్ని పద్ధతుల్లో నిర్మిరామంగా పర్యవేక్షించి అంచనా వేస్తున్నారు. జనవరిలో టిబెట్‌లో (7.1), 2024 జనవరిలో జపాన్‌లో (7.6), 2023 నవంబరులో నేపాల్‌లో (6.3) సంభవించిన భూకంపాల డేటాతో పాటు సుమారు 20 చోట్ల జరిగిన నష్టం తీవ్రత పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు.
గతంలో భూకంపాలు ఇలా..
2004 డిసెంబర్ 26న వచ్చిన సునామీతో 2.50 లక్షల మంది, 2005 అక్టోబర్ 8న జమ్మూకశ్మీర్‌లో వచ్చిన భూకంపానికి 80 వేల మంది మృత్యువాతపడ్డారు. సునామీ తీవ్రతతో రాష్ట్రంలో 612 మైళ్ల సముద్ర తీరంలో కొంత నష్టం జరిగింది. ఈ పరిణామాల క్రమంలో దేశంలో 2004లో సునామీ అలర్ట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు. సముద్రంలో కొన్ని ప్రాంతాల్లో సెన్సార్ల ద్వారా ముందుగానే తెలుసుకుని శాటిలైట్ ద్వారా కమ్యూనికేషన్ అందిస్తున్నారు. సునామీ అలలు గంటకు 700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తాయి. అండమాన్, నికోబార్‌లో పెద్ద భూకంపాలు వస్తే గంటన్నరలోపు ఆంధ్రప్రదేశ్ కోస్తా తీరాన్ని తాకుతాయి.
మరింత అభివృద్ధి చేస్తా: శివ సీతారామ్
నా వద్ద ఉన్న తక్కువ సామర్థ్యం పరికరాలతోనే అంచనాలను రూపొందిస్తున్నా. భవిష్యత్‌లో పరిధి మరింత పెంచుకోవడానికి ప్రయతి్నంచి, మెరుగ్గా అంచనా విధానాన్ని సిద్ధం చేస్తున్నాం. దీంతో 50 పైగా దేశాల భూకంపాల డేటాను పరిశీలించి సమాచారం పంపే అవకాశం ఉంటుంది. దీనిని కొద్ది సంవత్సరాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి ఆవిష్కరిస్తా. భారత వాతావరణ శాఖ 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మాట్లాడుతూ భూకంపాలను ముందుగా అంచనా వేసే వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆ దిశగా నా ప్రాజెక్టు సాగుతోంది.
ప్రయోగాలు.. తుది దశకు..
19 ఏళ్లుగా పరిశోధనలు.. ఈ క్రమంలో అనేక అవాంతరాలు, అవరోధాలు..! వీటిని దాటుకుని భూకంపాలను ముందస్తుగా అంటే కనీసం వారం నుంచి నెల రోజుల ముందు గుర్తించే సరికొత్త టెక్నాలజీని సిద్ధం చేశారు ఏలూరుకు చెందిన మరడాని శివ సీతారామ్. ఆరేళ్లుగా భూకంపాలకు సదడంబంధించిన సమగ్ర సమాచారంతో కూడిన డేటాను సేకరించిన ఆయన.. ప్రస్తుతం తుది దశ పరీక్షల్లో ఉన్నాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఏడున్నరేళ్లు జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ నెట్ వర్కింగ్‌పై పనిచేసిన శివ.. హైదరాబాద్ కేంద్రంగా భూకంపాలపై పరిశోధనను కొనసాగిస్తున్నారు.
2004లో భూకంపాలు, సునామీలను గుర్తించడం ఎలా అనేదానిపై పరిశోధన ప్రారంభించి సరికొత్త విధానాన్ని రూపొందించారు. ఆరేళ్ల నుంచి ట్విట్టర్ www.seismo.in వెబ్‌సైట్‌లో ఫిలిప్పీన్స్, తైవాన్, జపాన్ ఇథియోపియా, ఆప్ఘనిస్తాన్, నేపాల్, టిబెట్, ఇండియా భూకంపాలకు సంబంధించిన సమగ్ర డేటాను పొందుపరిచారు. 2004 నుంచి 300కు పైగా భూకంపాలకు సంబంధించి సమాచారాన్ని సేకరించారు. 2020 నుంచి పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.
20 రకాల పద్ధతులతో ముందస్తు అంచనా
ప్రపంచవ్యాప్తంగా 20 రకాల పద్ధతుల్లో భూకంపాలను అంచనా వేస్తున్నారు. టెక్నాలజీలో అభివృద్ధి చెందిన జపాన్, తైవాన్, మెక్సికో, అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు భూమిలో అమర్చిన సెన్సార్ ద్వారా 30 నుంచి 40 సెకన్ల ముందు పసిగట్టే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment