దొంగ కెమెరాలపై ఓ కన్నేద్దాం | Lets take a look at burglar cameras | Sakshi
Sakshi News home page

దొంగ కెమెరాలపై ఓ కన్నేద్దాం

Published Wed, Sep 18 2024 5:52 AM | Last Updated on Wed, Sep 18 2024 5:52 AM

Lets take a look at burglar cameras

టెక్నాలజీ యుగంలో వ్యక్తుల గోప్యత, భద్రతకు రక్షణ లేకుండా పోతోంది.రహస్య కెమెరాల ద్వారా వ్యక్తిగత జీవితాన్ని చిత్రీకరించి.. తద్వారా బ్లాక్‌మెయిల్‌ చేసే సంస్కృతి ఏటేటా పెరిగిపోతోంది. రహస్య కెమెరాలను గుర్తించడం కొంత కష్టమైనా.. అసాధ్యం మాత్రం కాదు. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు, లేదా నిత్యం సంచరించే ప్రాంతాల్లో కూడా వాటి పట్లఅలెర్ట్‌గా ఉండటం మేలు. కొంత జాగ్రత్త వహిస్తే రహస్య కెమెరాల కంట్లో పడకుండా సులువుగా తప్పించుకోవచ్చు.  

సాధారణంగా గదుల్లో రహస్య కెమెరాలు ఎక్కడెక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి  
» మంచం ఫ్రేములు, మంచానికి ఉండే హెడ్‌ బోర్డులలో.. 
» గోడ గడియారాలు, బల్బులు, లైట్ల స్విచ్‌బోర్డులు, ఇతర ఎలక్ట్రికల్‌ డివైజ్‌లలో..  
» డ్రస్సింగ్‌ టేబుల్స్‌ అద్దాల్లో, ఇతర టేబుల్స్‌ పైన ఉండే వస్తువుల్లో.. 
» పిక్చర్‌ ఫ్రేమ్‌లు, వాల్‌ హ్యాంగింగ్, డెకరేటివ్‌ ఐటమ్స్, ప్లాంట్‌లలో.. 
» బాత్‌రూమ్‌లు, టాయ్‌లెట్లలో ఉండే డెకరేటివ్‌ ఐటమ్స్‌లో, షవర్‌ హెడ్స్, అద్దాల వెనుక..  
» గది సీలింగ్‌ మూలల్లో.. కిటికీల ఫ్రేముల్లో, అనుమానాస్పదంగా కనిపించే వైర్లలో.. 
»  డోర్‌ హ్యాండిల్స్,డోర్‌ బెల్స్, యూఎస్‌బీ చార్జింగ్‌ పాయింట్లు,స్రూ్కలు, క్లాత్‌ హ్యాంగర్లలో.. 

ఎలా గుర్తించాలి
క్షుణ్ణంగా పరిశీలన: కొత్త రూమ్‌లోకి అడుగుపెట్టినప్పుడు లోపల అంతా క్షుణ్ణంగా పరిశీలించాలి. బెడ్‌రూమ్‌లోనూ, బాత్‌రూంలోనూ అసాధారణంగా ఉండే వస్తువులను పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.  

వస్తువులను చెక్‌ చేయాలి: రోజువారీ వినియోగించే సామగ్రిలో రహస్య కెమెరాలు ఉంచే అవకాశం కూడా ఉంటుంది. స్విచ్‌ బోర్డులు, అద్దాల వెనక, స్మోక్‌ డిటెక్టర్లు ఉంటే వాటిలో, ల్యాంప్స్, డెకరేటివ్‌ వస్తువులను చెక్‌ చేయాలి.  

ఫ్లాష్‌ లైట్‌తో గుర్తింపు: రూమ్‌లో ముఖ్యంగా చీకటిగా ఉండే ప్రాంతాల్లో ఫ్లాష్‌ లైట్‌ వేయాలి. దీనివల్ల ఇతర వస్తువులపై పడే లైట్‌ కన్నా కెమెరాల లెన్స్‌పై పడిన లైట్‌ విభిన్నంగా ప్రతిబింబిస్తుంది. అలాగే రూమ్‌లో లైట్లు ఆర్పేసి ఫ్లాష్‌లైట్‌ ఆన్‌ చేస్తే రహస్య కెమెరాల నుంచి వచ్చే రిఫ్లెక్షన్‌ ద్వారా వాటిని గుర్తించవచ్చు.  

స్మార్ట్‌ఫోన్‌ యాప్స్‌: రహస్య కెమెరాల ఇన్‌ఫ్రారెడ్‌ లైట్‌ను గుర్తించే స్మార్ట్‌ ఫోన్‌ యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్స్‌ను వినియోగించడం ద్వారా రహస్య కెమెరాలను గుర్తించవచ్చు.  

ఆర్‌ఎఫ్‌ డిటెక్టర్స్‌: కెమెరాల నుంచి వచ్చే వైర్‌లెస్‌ సిగ్నల్స్‌ను పోర్టబుల్‌ రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్‌ఎఫ్‌) డిటెక్టర్స్‌ ద్వారా గుర్తించవచ్చు. ఇతర నిఘా పరికరాల ఫ్రీక్వెన్సీలను కూడా ఆర్‌ఎఫ్‌ డిటెక్టర్ల ద్వారా గుర్తించవచ్చు. 

వైర్లు, కేబుల్స్‌: సాధారణంగా ఉండే వైర్లు, కేబుల్స్‌ కాకుండా.. అనుమానాస్పదంగా ఉండే కేబుళ్లు, వైర్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇవి రహస్య కెమెరాలకు ఎలక్ట్రిసిటీని అందించేవి లేదా డేటా ట్రాన్స్‌ఫర్‌ చేసేవి కావచ్చు.   

వైఫై నెట్‌వర్క్‌ స్కానర్లు: పబ్లిక్‌ ప్లేసుల్లో ఉచితంగా లబించే వైఫై నెట్‌వర్క్‌ వినియోగించడం అంత మంచిది కాకపోయినా.. వైఫై స్కానర్‌ ఓపెన్‌ చేసి అనుమానాస్పదంగా ఉండే నెట్‌వర్క్‌లు కనిపిస్తే జాగ్రత్తగా ఉండటం మంచిది.  

భౌతిక పరిశీలన: రహస్య కెమెరాలు పెట్టే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సున్నితంగా తట్టినప్పుడు అక్కడ డొల్ల శబ్దం కనుక వస్తే అనుమానించాలి.  

ఫోన్‌ ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరా: మన ఫోన్‌ కెమెరా ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరా అయితే.. దాని ద్వారా రహస్య కెమెరాలను గుర్తించవచ్చు. ఆ కెమెరాను ఓపెన్‌ చేసి రూమ్‌ను స్కాన్‌ చేస్తే చిన్న చిన్న బరస్ట్‌లు, ఫ్లాష్‌ లైట్‌ కనబడితే అక్కడ రహస్య కెమెరా ఉందని గుర్తించవచ్చు.     

రహస్య కెమెరాలను గుర్తించే కొన్ని యాప్స్‌ 
»    హిడెన్‌ కెమెరా అండ్‌ డివైజ్‌ ఫైండర్‌: రహస్య కెమెరాలను వేగంగా, సులువుగా గుర్తించగలం అని యాప్‌ డెవలపర్లు చెబుతున్నారు. ఎలాంటి రహస్య కెమెరానైనా యాప్‌లో వైఫై, బ్లూటూత్‌ 
టెక్నాలజీతో గుర్తించవచ్చు.  

»    హిడెన్‌ స్పై కెమెరా డిటెక్టర్‌: ఈ యాప్‌లో ఆల్‌ ఇన్‌ వన్‌ నెట్‌వర్క్‌ స్కానర్‌ ఉంది. దీనితో జీపీఎస్‌ ట్రాకర్లు, రహస్య కెమెరాలను వేగంగా గుర్తించే సామర్థ్యం 
దీని సొంతం. 

»   హిడెన్‌ కెమెరా డిటెక్టర్‌– స్పై సీ: ఏదైనా అనుమానాస్పదంగా ఉన్న వస్తువు వద్దకు కెమెరాను తీసుకెళితే యాప్‌ ద్వారా దానిలో రహస్య కెమెరా ఉందో, లేదో గుర్తించవచ్చు. దీనికి అదనంగా దీనిలో మేగ్నెటోమీటర్‌ కూడా ఉంది. దీనితో కెమెరాలు, స్పీకర్ల నుంచి వెలువడే అయస్కాంత తరంగాలను సులువుగా గుర్తించవచ్చు.  

»    హిడెన్‌ స్పై కెమెరా డిటెక్టర్‌: ఈ యాప్‌ రహస్య కెమెరాలను, ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలను గుర్తించడానికి సహాయ పడుతుంది.  

»   హిడెన్‌ కెమెరా డిటెక్టర్‌ ప్రో: రహస్య కెమెరాలనే కాకుండా, రహస్య మైక్రోఫోన్లను కూడా ఈ యాప్‌ ద్వారా గుర్తించవచ్చు. ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలను గుర్తించడమే కాకుండా, యూజర్ల రక్షణ కోసం టిప్స్, మెలకువలు కూడా 
అందిస్తామని యాప్‌ చెబుతోంది.  

»   హిడెన్‌ పిన్‌హోల్‌ కెమెరా డిటెక్టర్‌: రహస్యంగా రికార్డు చేసే కెమెరాల విషయంలో ఈ యాప్‌ యూజర్లను ముందస్తుగా అలెర్ట్‌ చేస్తుంది. నిఘాకు అనువుగా ఉండే ప్రాంతాల విషయంలో ముందస్తు హెచ్చరికలు చేస్తుంది.  


–ఏపీ సెంట్రల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement