638 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా
2020–24 మధ్య నాలుగు రెట్లు పెరిగిన మెడికల్ టూరిస్టుల సంఖ్య
2029 నాటికి 14.31 బిలియన్ డాలర్లకు చేరుకోనున్న మెడికల్ టూరిజం మార్కెట్
ఈ ఏడాది 65 బిలియన్ డాలర్లకు చేరుకున్న ఫార్మా మార్కెట్
2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం
బజాజ్ ఫైనాన్స్ అధ్యయనంలో వెల్లడి
సాక్షి, అమరావతి: ఆదాయపరంగా దేశంలో అతిపెద్ద రంగాల్లో ఒకటిగా ఆరోగ్య రంగం నిలుస్తోంది. ఆస్పత్రులకు వెళ్లాల్సిన పని లేకుండానే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆన్‌లైన్‌లోనే వైద్యులతో సంప్రదింపులు, మందులు ఇంటికే పంపడం వంటివాటితో ఆరోగ్య రంగం వేగంగా విస్తరిస్తోంది.
పాశ్చాత్య దేశాలతో పోల్చితే భారత్‌లో తక్కువ ఖర్చుకే వైద్యం లభిస్తుండటంతో విదేశీయులు చికిత్సల కోసం మనదేశానికి క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో 2025 నాటికి దేశ ఆరోగ్య సంరక్షణ రంగం 638 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బజాజ్ ఫైనాన్స్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ఒక అధ్యయనం నిర్వహించింది.
బజాజ్ ఫైనాన్స్ అధ్యయనం ప్రకారం..
» 2016లో 110 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశ ఆరోగ్య రంగం మార్కెట్ 2023 నాటికి 372 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
» 2016–23 మధ్య 22.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదైంది. గత పదేళ్లలో 17.5 శాతం సీఏజీఆర్ చోటు చేసుకుంది.
» ప్రధానంగా ఆస్పత్రులు, ఫార్మాస్యూటికల్స్, డయాగ్నోస్టిక్స్, ఇతర పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి.
» 2021లో ఫార్మా మార్కెట్ 42 బిలియన్ డాలర్లు ఉండగా 2024లో 65 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. అలాగే డ్రగ్స్, ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల్లోనూ ఆశాజనకమైన వృద్ధి చోటు చేసుకుంటోంది.
నాలుగు రెట్లు పెరిగిన మెడికల్ టూరిజం
అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర గుండె, కిడ్నీ, తదితర ప్రధానశస్త్రచికిత్సలకు వ్యయం 20 శాతంపైగానే తక్కువ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి భారత్‌కు చికిత్సల కోసం వచ్చే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇలా 2020 నుంచి 2024 మధ్య దేశంలో మెడికల్ టూరిజం నాలుగు రెట్లు పెరిగింది. 2024లో 7.69 బిలియన్ డాలర్లుగా ఉన్న మెడికల్ టూరిజం మార్కెట్ 2029 నాటికి 14.31 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది.
2048 నాటికి 12% పడకలు పెరుగుదల
టైర్ 2–6 నగరాల్లో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్స్, స్పెషాలిటీ క్లినిక్స్‌లో పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నట్టు అధ్యయనం పేర్కొంది. 2048 నాటికి దేశంలోని ఆస్పత్రుల్లో పడకల సంఖ్య 12 రెట్లు పెరగనుంది. అయితే జపాన్‌లో ప్రతి వెయ్యి మందికి 13, చైనాలో 4.3, అమెరికాలో 2.9 చొప్పున పడకలు ఉండగా మన దేశంలో 1.3 మాత్రమే ఉన్నాయి.
ఇక 2018తో పోలిస్తే 2022 నాటికి దేశంలో వైద్యుల సంఖ్య 1.1 రెట్లు పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) 2021 నివేదిక ప్రకారం.. ఆరోగ్య రంగంపై దేశ జీడీపీలో అమెరికా 17.4, యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) 12.4, కెనడా 12.3 శాతం చొప్పున వెచ్చించాయి. భారత్ 3.3 శాతం మాత్రమే ఖర్చు పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment