ఏఐ రాకతో పెరగనున్న కచ్చితత్వం.. సమయం ఆదా
22.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు నమోదు
వచ్చే ఏడాదికి 7.8 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరిక
భారత వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) దూకుడు పెరుగుతోంది. 2016 నుంచి 2022 మధ్య ఏఐ హెల్త్‌కేర్ పరిశ్రమ 22.5 శాతం సగటు వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)ను నమోదు చేసింది. 2025 నాటికి ఇది 7.8 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి.
ప్రజారోగ్య పరిరక్షణలో వైద్యులు, నర్సులు, సహాయ సిబ్బంది, చికిత్సలకు మౌలిక సదుపాయాల కొరతను అధిగమించడంలో ఏఐ ఎంతో కీలకంగా వ్యవహరిస్తోందని వైద్యరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో వైద్య సదుపాయాల కొరతను కోవిడ్ బట్టబయలు చేసింది.
2019–20 ఆర్థిక సర్వే ప్రకారం.. దేశంలోని ప్రతి 1,456 మందికి ఒక వైద్యుడు మాత్రమే ఉన్నారు. నేషనల్ హెల్త్ ప్రొఫైల్ 2021 ప్రకారం దేశంలో ప్రతి వెయ్యి మందికి 0.6 మేర ఉన్నాయి. ఈ కొరతను అధిగమించడానికి కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతోంది. – సాక్షి, అమరావతి
ఔషధ పరిశోధనల్లో వేగం
టీకాలు, జనరిక్ మందులు, బయోసిమిలర్స్, ఇతర ఉత్పత్తుల తయారీలో పరిశోధనలను వేగవంతంగా చేపట్టడానికి ఏఐని పెద్దఎత్తున వినియోగిస్తున్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్‌తో క్లినికల్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలవుతోందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో మందుల డిమాండ్ అంచనా వేయడం, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసుకోవడం, రోగుల అవసరాలకు అనుగుణంగా మందులను అందించేందుకు ఏఐ కీలకంగా వ్యవహరిస్తోంది.
చికిత్సల్లో కచ్చితత్వం
భవిష్యత్ వైద్య రంగం అంతా ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్‌పైనే ఆధారపడి ఉంటుంది. చికిత్సలు, రోగనిర్ధారణ, సర్జరీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో సేవల కల్పనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఉదాహరణకు జాయింట్ రీప్లేస్‌మెంట్, ఎముకలకు సంబంధించిన ఇతర సర్జరీల్లో రోబోటిక్ సర్జరీల వినియోగంతో సర్జరీ అనంతరం రోగికి సహజ సిద్ధమైన శరీర ఆకృతి, సర్జరీ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటోంది.
సర్జరీల్లో కచ్చితత్వం, తక్కువ కోతలు, రక్తస్రావం లేకపోవడంతో పాటు, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా తక్కువ. సాధారణ చికిత్సలతో పోలిస్తే చాలా త్వరగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతిక పరిజ్ఞానం తక్కువగా వినియోగంలో ఉండటంతో చికిత్సలకు కొంత ఎక్కువ ఖర్చు ఉంటుంది.
భవిష్యత్‌లో పరిజ్ఞానం వినియోగం పెరిగేకొద్దీ చికిత్సలకు అయ్యే ఖర్చులు కూడా తగ్గుతాయి. ప్రజల్లో ఈ చికిత్సలపై కొన్ని అపోహలున్నాయి. చికిత్సల్లో వాడే అధునాత వైద్య పరికరాలన్నీ వైద్యుడి నియంత్రణలోనే ఉంటాయి. వైద్యుడి దిశా నిర్దేశంలోనే రోగనిర్ధారణ, శస్త్ర చికిత్సలు జరుగుతాయి. – డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి, జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జన్, గుంటూరు
30 నుంచి 40 శాతం సమయం ఆదా
రోగ నిర్ధారణ, సర్జరీ, ఇతర చికిత్సల కోసం ఏఐ టూల్స్‌ను వినియోగిస్తున్నారు. ఏఐతో రోగ నిర్ధారణలో కచ్చితత్వంతో పాటు, రోగులకు సమయం ఆదా అవుతోందని వైద్యులు చెబుతున్నారు. వైద్యుడిని రోగి సంప్రదించడానికి ముందే ప్రామాణికమైన ప్రశ్నలకు రోగుల నుంచి సమాధానాలు రాబట్టి చాట్‌బాట్, మెటా వంటి ఏఐ సాధనాల ద్వారా విశ్లేíÙస్తున్నారు. ఇలాంటి పద్ధతుల్లో రోగులకు 30–40 శాతం మేర సమయం ఆదా అవుతున్నట్టు చెబుతున్నారు.
ఇక రోగుల రికార్డులు, ఎక్స్‌రే, సీటీ స్కాన్, రక్తపరీక్షలు, జన్యుక్రమ విశ్లేషణ వంటి అంశాల్లో వైద్యులు, సిబ్బందికి సహాయకారిగా పనిచేసే ఏఐ ఉపకరణాలెన్నో అందుబాటులో ఉంటున్నాయి. ఇవి వైద్యులు, సిబ్బందిపై పని ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతున్నాయి. క్యాన్సర్, రెటినోపతి, ఊపిరితిత్తుల జబ్బులు, రక్తంలో ఇన్ఫెక్షన్, అరుదైన వ్యాధుల నిర్ధారణలో తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రులు ఏఐని వినియోగిస్తున్నాయి.
సర్జరీల్లో రోబోలను వినియోగించడం సాధారణ విషయంగా మారింది. విజయవాడ, గుంటూరు, విశాఖ నగరాల్లోని అనేక ఆస్పత్రుల్లో రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment