ఆయుష్షు పెంచే ‘ఏఐ’ | Faster medical services with AI | Sakshi
Sakshi News home page

ఆయుష్షు పెంచే ‘ఏఐ’

Published Sun, Dec 8 2024 4:46 AM | Last Updated on Sun, Dec 8 2024 4:46 AM

Faster medical services with AI

వైద్య సేవల్ని శాసించే దిశగా కృత్రిమ మేధ.. ఇందుకోసం సంస్కరణలు తెస్తున్న ప్రపంచ దేశాలు

ఏఐతో వేగంగా వైద్య సేవలు

రోగ నిర్థారణ, సలహాలు, చికిత్సల్లో కచ్చితత్వం వస్తుంది

ప్రస్తుతం హెల్త్‌ కేర్‌లో 6 శాతం మాత్రమే ఏఐ సేవలు

భవిష్యత్‌లో ఇది 85 శాతానికి చేరే అవకాశం

వైద్య రంగంలో ఏఐ వినియోగంలో భారత్‌ కూడా పురోగమిస్తోంది

భారత్‌ మరింతగా దృష్టి సారిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి

అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్‌ ఎండోస్కోపీ ప్రెసిడెంట్‌ డా.ప్రతీక్‌ శర్మ

సాక్షి, విశాఖపట్నం: కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ – ఏఐ).. అన్ని రంగాల్లోనూ ఈ అత్యా­ధునిక సాంకేతిక పరిజ్ఞానం సమూల మార్పులు తెస్తోంది. అత్యంత వేగంగా, కచ్చితత్వంతో కూడిన ఫలితాలతో ప్రపంచాన్ని మార్చేస్తోంది. 

వైద్య రంగంలోనూ వేగంగా చొచ్చుకు వస్తున్న ఈ కృత్రిమ మేధ మనిషి ఆయుష్షును పెంచడానికి కూడా దోహ­ద పడుతుందని ప్రఖ్యాత వైద్య నిపుణులు, అమె­రికన్‌ సొసైటీ ఆఫ్‌ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్‌ ఎండోస్కోపీ ప్రెసిడెంట్‌ డా. ప్రతీక్‌ శర్మ తెలిపారు. 

భవిష్యత్తులో వైద్య రంగాన్ని కృత్రిమ మేధ (ఏఐ) శాసిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలు ప్రజలకు చేరువ చేసే విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయని ఆయన చెప్పారు. విశాఖలో జరిగిన డీప్‌టెక్‌ సదస్సులో పాల్గొన్న డా. ప్రతీక్‌ శర్మ వైద్య రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు.

ఇప్పుడు 6% మాత్రమే ఉపయోగిస్తున్నాం
కృత్రిమ మేధ అన్ని రంగాల్లోనూ దూసుకుపో­తున్నా.. వైద్య రంగంలో మాత్రం అట్టడుగున ఉంది. వైద్య సేవల రంగంలో ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్‌ వంటి సాంకేతికతలు కీలక ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రంగంలో ఏఐ వినియోగం పెంచడానికి అన్ని దేశాలూ సంస్కరణలు కూడా తెస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే హెల్త్‌ కేర్‌లో ఏఐ సేవలు 6 శాతమే. 2022కి యూఎస్‌లో ఏఐ అడాప్షన్‌ రేట్‌ 19 శాతమే ఉంది.

2047కి 85 శాతం వరకూ పెరిగే సూచనలున్నాయి. ఇది వైద్య సేవల్ని వేగవంతం చేయడమే కాకుండా మనిషి ఆయుష్షును పెంచేందుకు కూడా దోహదపడుతుందని భావిస్తున్నాం. ఏఐ వినియోగంతో రోగ నిర్థారణ, సలహాలు, చికిత్సల్లో కచ్చితత్వం వస్తుంది. చాలా సమయం ఆదా అవుతుంది. ఔషధ పరిశోధనల్లోనూ ఏఐ సేవలు విస్త్రృతమవుతున్నాయి.

హెల్త్‌కేర్‌ ఏఐలోభారీ పెట్టుబడులు..
హెల్త్‌ కేర్‌లో ఏఐ వినియోగం కోసం అన్ని దేశాలూ పెట్టుబడులు భారీగా పెంచుతున్నాయి. అమెరికా ప్రస్తుతం 28.24 బిలియన్‌ డాలర్లు మాత్రమే వెచ్చిస్తోంది. 2030కి 187.85 బిలియన్‌ డాలర్లను పెట్టుబడులుగా పెట్టాలని నిర్ణయించింది. హెల్త్‌ కేర్‌లో ఏఐ వినియోగంలో భారత్‌ కూడా పురోగమిస్తోంది. 

భారత్‌లో 2022కి 0.13 బిలియన్‌ డాలర్లు మాత్రమే పెట్టుబడులుండగా.. 2030కి 2.92 బిలియన్‌ డాలర్లకు చేరుకోనుంది. ఇది శుభపరిణామమే అయినా.. భారత్‌ మరింతగా దృష్టి సారిస్తే అద్భుతమైన ఫలితాలు అందుకుంటుంది.

వైద్యంలో ఏఐ అప్లికేషన్స్‌ వినియోగం ఇలా..
హెల్త్‌కేర్‌లో ఏఐ ఆధారిత అప్లికేషన్లు చాలా వరకూ వినియోగంలో ఉన్నాయి. డయాగ్నసిస్‌ను మరింతగా మెరుగుపరిచేందుకు, రోగి వైద్య రికార్డుల నిర్వహణ, వ్యక్తిగత వైద్య సేవల అభివృద్ధి,  వైద్యులపై పనిభారం తగ్గించడం మొదలైన అంశాలకు సంబంధించిన యాప్స్‌ ఉన్నాయి. ఇప్పటికే వీటిని అమెరికా, చైనా, రష్యా, జపాన్‌ వంటి దేశాల్లో ఉపయోగిస్తున్నారు. భారత్‌లో పేరొందిన ఆస్పత్రుల్లో ఇప్పుడిప్పుడే ఇవి ప్రారంభమవుతున్నాయి.

క్యాన్సర్‌ చికిత్సలో అద్భుత ఫలితాలు
క్యాన్సర్‌ చికిత్సలో ఆంకాలజీ విభా­గంలో ఏఐ అద్భుత ఫలితాలు అందిస్తోంది. ప్రాథమిక దశలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ని గుర్తించడం కష్టతరం. కానీ, అమెరికాలో అతి తక్కువ సమయంలోనే ఏఐ ద్వారా రొమ్ము క్యాన్సర్‌ని గుర్తించారు. సెర్టిస్‌ ఏఐ యా­ప్‌ ద్వారా ఇది సాధ్యమవుతోంది. 

ఏఐ–­డ్రివెన్‌ ఆంకాలజీ డ్రగ్‌ డిస్కవరీతో ఫలి­తాలు రాబడుతు­న్నారు. ఊపిరితిత్తులు, మెద­డు, మెడ, చర్మ సంబంధమైన క్యాన్సర్ల గుర్తి­ంపు ఫలి­తాలు కూడా వీలైనంత త్వరగా అందించేలా యాప్‌ల అభివృద్ధి జరుగుతోంది.

మారుమూల పల్లెలకూ వైద్య సేవలు
ఏఐ ద్వారా మారుమూల గ్రామాలకూ వైద్య సేవలు చేరువవుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ ఫోన్‌ వినియోగిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఏఐ ఉంటే.. ఆ ఫోన్‌ కూడా ఒక డాక్టర్‌గా మారిపోతుంది. ఏఐ డ్రివెన్‌ రిమో­ట్‌ కేర్‌ యాప్‌తో మారుమూల పల్లెల్లో ఉన్న రోగితో డాక్టర్‌ నేరుగా మాట్లాడి.. బీపీ, పల్స్‌ చెక్‌ చేసే వ్యవస్థ అందుబాటులోకి వచ్చేసింది. వైద్యుల అపాయింట్‌మెంట్, వైద్య సలహాలు, సూచనల్ని చాట్‌బాట్‌ ద్వారా అందించే రోజులు కూడా వచ్చేశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement