ఏటేటా పెరుగుతున్న మెడికల్ టూరిస్టులు
విదేశాలతో పోలిస్తే భారత్‌లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం
అందుబాటులో అత్యాధునిక సౌకర్యాలు, చికిత్స పద్ధతులు
2014లో వైద్యం కోసం దేశానికి 1.39 లక్షల మంది విదేశీయులు
2023లో 6.35 లక్షలకు చేరిక
మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి ఆయుష్ వీసా
2034కి 50,671 బిలియన్ డాలర్లకు పరిశ్రమ విస్తరిస్తుందని అంచనా
తక్కువ ఖర్చు.. అత్యాధునిక సౌకర్యాలు.., చికిత్స పద్ధతులు, సుశిక్షితులైన వైద్యులు, నాణ్యమైన వైద్యానికి భారత దేశం కేరాఫ్ అడ్రస్. అత్యంత క్లిష్టమైన చికిత్సలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. అందుకే దేశంలో వైద్య పర్యాటకం (మెడికల్ టూరిజం) ఏటేటా పెరుగుతోంది.
ఏటా లక్షలాది మంది విదేశీయులు భారత దేశానికి వచ్చి వైద్యం పొంది వెళ్తున్నారు. గత పదేళ్లలో ఏటా వచ్చే మెడికల్ టూరిస్టుల సంఖ్య దాదాపు ఐదింతలు పెరిగింది. ఇదిలాగే కొనసాగి, 2034 నాటికి 50,671 బిలియన్ డాలర్లకు భారత దేశ మెడికల్ టూరిజం పరిశ్రమ విస్తరిస్తుందన్న అంచనాలున్నాయి. – సాక్షి, అమరావతి
దేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయుష్ వీసాను ప్రవేశపెట్టింది. వివిధ జబ్బులతో బాధపడే విదేశీయులు చికిత్స కోసం భారత్‌కు రావడానికి సరళమైన నిబంధనలతో దీనిని రూపొందించింది. ఈ వీసాతో భారత వైద్య పర్యాటకం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.
ఫలితంగా దేశ ఆరోగ్య సంరక్షణ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 70 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని గతంలో మోదీ ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. గతేడాది 8.7 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది.
ఈ ఏడాది (2024)లో 10.4 బిలియన్ డాలర్ల మేర మెడికల్ టూరిజంలో పెరుగుదల ఉంటుందని ఫార్చ్యూన్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. 17.2 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 2034 నాటికి 50,671 బిలియన్ డాలర్లకు పరిశ్రమ విస్తరిస్తుందన్న అంచనాలున్నాయి.
వివిధ రకాల వ్యాధులకు చికిత్స కోసం 2014లో 1.39 లక్షల మంది విదేశీయులు భారత్‌కు రాగా, ఆ సంఖ్య గత ఏడాది (2023) 6.35 లక్షలకు పెరిగింది. అదే విధంగా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ డేటా ప్రకారం 2017–19 మధ్య రెండేళ్లలో మెడికల్ టూరిజంలో వృద్ధి 34.5 శాతంగా నమోదైంది.
కరోనా కారణంగా 2020లో కొంత తగ్గినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ మెడికల్ టూరిజం గణనీయంగా పుంజుకుంది. గుండె సంబంధిత సర్జరీలు, జాయింట్ రీప్లేస్‌మెంట్, క్యాన్సర్ వైద్యం, ఇతర చికిత్సలకు విదేశీయులు తెలంగాణాలోని హైదరాబాద్, ఏపీలోని గుంటూరు, విజయవాడల్లోని ఆస్పత్రులకు కూడా వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment