Treatments
-
దేశంలో విస్తరిస్తున్న మెడికల్ టూరిజం
తక్కువ ఖర్చు.. అత్యాధునిక సౌకర్యాలు.., చికిత్స పద్ధతులు, సుశిక్షితులైన వైద్యులు, నాణ్యమైన వైద్యానికి భారత దేశం కేరాఫ్ అడ్రస్. అత్యంత క్లిష్టమైన చికిత్సలు కూడా ఇక్కడ లభిస్తున్నాయి. అందుకే దేశంలో వైద్య పర్యాటకం (మెడికల్ టూరిజం) ఏటేటా పెరుగుతోంది. ఏటా లక్షలాది మంది విదేశీయులు భారత దేశానికి వచ్చి వైద్యం పొంది వెళ్తున్నారు. గత పదేళ్లలో ఏటా వచ్చే మెడికల్ టూరిస్టుల సంఖ్య దాదాపు ఐదింతలు పెరిగింది. ఇదిలాగే కొనసాగి, 2034 నాటికి 50,671 బిలియన్ డాలర్లకు భారత దేశ మెడికల్ టూరిజం పరిశ్రమ విస్తరిస్తుందన్న అంచనాలున్నాయి. – సాక్షి, అమరావతిదేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయుష్ వీసాను ప్రవేశపెట్టింది. వివిధ జబ్బులతో బాధపడే విదేశీయులు చికిత్స కోసం భారత్‌కు రావడానికి సరళమైన నిబంధనలతో దీనిని రూపొందించింది. ఈ వీసాతో భారత వైద్య పర్యాటకం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఫలితంగా దేశ ఆరోగ్య సంరక్షణ ఆర్థిక వ్యవస్థ 2025 నాటికి 70 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని గతంలో మోదీ ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. గతేడాది 8.7 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉంది. ఈ ఏడాది (2024)లో 10.4 బిలియన్ డాలర్ల మేర మెడికల్ టూరిజంలో పెరుగుదల ఉంటుందని ఫార్చ్యూన్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. 17.2 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటుతో 2034 నాటికి 50,671 బిలియన్ డాలర్లకు పరిశ్రమ విస్తరిస్తుందన్న అంచనాలున్నాయి.వివిధ రకాల వ్యాధులకు చికిత్స కోసం 2014లో 1.39 లక్షల మంది విదేశీయులు భారత్‌కు రాగా, ఆ సంఖ్య గత ఏడాది (2023) 6.35 లక్షలకు పెరిగింది. అదే విధంగా బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ డేటా ప్రకారం 2017–19 మధ్య రెండేళ్లలో మెడికల్ టూరిజంలో వృద్ధి 34.5 శాతంగా నమోదైంది. కరోనా కారణంగా 2020లో కొంత తగ్గినప్పటికీ, ఆ తర్వాత మళ్లీ మెడికల్ టూరిజం గణనీయంగా పుంజుకుంది. గుండె సంబంధిత సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, క్యాన్సర్ వైద్యం, ఇతర చికిత్సలకు విదేశీయులు తెలంగాణాలోని హైదరాబాద్, ఏపీలోని గుంటూరు, విజయవాడల్లోని ఆస్పత్రులకు కూడా వస్తున్నారు. -
ఇంటింటికీ రక్ష.. జగనన్న ఆరోగ్య సురక్ష
సాక్షి, అమరావతి: పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యల్ని ప్రభుత్వం గుర్తించింది. వివిధ రుగ్మతలతో బాధపడుతున్న వారందరికీ ఉచితంగా చికిత్సలు చేయించి సాంత్వన చేకూరుస్తోంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని సురక్ష క్యాంపుల్లో గుర్తించి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచిత చికిత్సలు చేయించడంతోపాటు బాధితులపై రవాణా ఖర్చుల భారం కూడా పడకుండా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. చికిత్సల అనంతరం కూడా బాధితులకు బాసటగా నిలుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే బాధితులను చేయిపట్టి సీఎం జగన్ ముందుకు నడిపిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుస్తున్నారు. విజయవంతంగా 2.O ఆరోగ్య సురక్ష రెండో దశ కార్యక్రమం ఈ ఏడాది జనవరి నెలలో ప్రారంభించగా విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా వైద్య శాఖ 6,710 శిబిరాలు నిర్వహించగా.. ఒక్కోచోట సగటున 359 చొప్పున 24,11,785 మంది వైద్య సేవలు పొందారు. హైపర్‌టెన్షన్, డయాబెటీస్, హెచ్‌బీ, యూరిన్, మలేరియా, డెంగీ సహా ఇతర 32.64 లక్షల స్పాట్ టెస్ట్‌లను శిబిరాల వద్ద నిర్వహించారు. రెండో దశలో భాగంగా శిబిరాల వద్దకు వచ్చిన ప్రజల్లో 8,179 మందికి తదుపరి వైద్య సేవలు అవసరం ఉన్నట్టుగా వైద్యులు నిర్ధారించి ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వీరిలో ఇప్పటికే 2,030 మంది ఆస్పత్రుల్లో చికిత్సలు అందుకున్నారు. ఇక 2.13 లక్షల మందికి కంటి స్క్రీనింగ్ చేపట్టగా.. 60 వేల మందికి మందులతో నయమయ్యే సమస్యలను గుర్తించి అక్కడికక్కడే మందులు అందించారు. మరో 1.50 లక్షల మందికి అద్దాలను, 2,090 మందికి కేటరాక్ట్ సర్జరీలను సూచించారు. 98 శాతం మందికి చికిత్సలు పూర్తి గత ఏడాది ఆరోగ్య సురక్ష తొలి దశ కార్యక్రమంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా శిబిరాలు నిర్వహించింది. వీటిలో 60.27 లక్షల మంది అవుట్ పేషెంట్ సేవలు పొందారు. వీరిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న 86,713 మందిని వైద్యులు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు రిఫర్ చేశారు. వారందరికీ చికిత్సలు చేయించేలా వైద్య శాఖ పర్యవేక్షించింది. వీరిలో ఇప్పటివరకూ 98 శాతం అంటే.. 84,982 మందికి ప్రభుత్వమే చికిత్సలు చేయించింది. చిన్న పిల్లలకు కాక్లియర్ ఇంప్లాంటేషన్, పుట్టుకతో గుండెలో రంధ్రాలు, ఇతర సమస్యలతోపాటు, పెద్దల్లో న్యూరో, కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, వంటి ఇతర సమస్యలకు ఉచిత చికిత్సలు అందించారు. చిత్తూరు, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, పశి్చమ గోదావరి జిల్లాల్లో వంద శాతం మందికి చికిత్సలు చేయించారు. మొత్తం రోగుల్లో 1,731 మందికి చికిత్సలు అందించేలా వైద్య శాఖ పర్యవేక్షిస్తోంది. కాగా.. తొలి దశలో కంటి సమస్యలతో బాధపడుతున్న 80,155 మందికి కేటరాక్ట్ సర్జరీలు అవసరమని వైద్యులు సూచించగా.. 41633 మందికి ఇప్పటికే సర్జరీలు పూర్తి అయ్యాయి. 5.73 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని గుర్తించగా.. 5.63 లక్షల మందికి పంపిణీ పూర్తయింది. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దండిగుంట గ్రామానికి చెందిన రైతు అనిల్ దంపతులకు ముగ్గురు సంతానం. రెండో కుమార్తె మధుప్రియ గ్రహణం మొర్రితో పుట్టడంతో వెంటనే తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ నిర్వహించిన వైద్య పరీక్షల్లో మధుప్రియ గుండెకు రంధ్రం కూడా ఉన్నట్టు నిర్ధారణ అయింది. పాప పెద్దయ్యాక గానీ ఆపరేషన్ చేయడానికి వీలుండదని అప్పట్లో చెప్పారు. ప్రస్తుతం మధుప్రియకు మూడేళ్లు నిండాయి. పాప గుండెకు ఆపరేషన్ చేయించాలనుకుంటున్న తరుణంలో ప్రభుత్వం ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా వైద్య సిబ్బంది నిర్వహించిన ఇంటింటి సర్వేలో మధుప్రియ సమస్యను తల్లిదండ్రులు తెలియజేశారు. దీంతో వైద్య శిబిరానికి హాజరవ్వమని చెప్పారు. గ్రామంలో శిబిరం నిర్వహించిన రోజు పాపను తీసుకు వెళ్లగా వైద్యులు తొలుత నెల్లూరు ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడి నుంచి మధుప్రియను తిరుపతిలోని చిన్న పిల్లల హృదయాలయానికి తరలించారు. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ పూర్తయింది. బాలిక పూర్తిగా కోలుకుంది. మధుప్రియ తరహాలోనే వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వేలాది మందికి ఆరోగ్య సురక్ష వరంగా మారింది. -
Abhaya Foundation: పేదలకు అభయం బాలచంద్రుని ఆనంద నిలయం
పరాన్న జీవులుగా కాదు.. పరమాత్మ జీవులుగా మనమంతా ఎదగాలి’ అంటారు సుంకు బాలచంద్ర. పదిహేడేళ్లుగా సేవారంగంలో వేలాది మందికి అండగా ఉంటున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉంటున్న యాభై ఏళ్ల బాలచంద్ర. అభయ ఆనంద నిలయం పేరుతో నిరుపేదలకు ఆశ్రయం కల్పిస్తున్నారు. ఉద్యోగం చేస్తూ వచ్చిన ఆదాయాన్ని పేదలకు పంచుతూ మొదలుపెట్టిన సేవామార్గం ఇప్పుడు ఎంతో మందికి నీడనిస్తుంది. అనాథ వృద్ధులను చేరదీస్తూ, విద్యార్థుల చదువుకు అవసరాలను సమకూరుస్తూ, రోగులకు వైద్యచికిత్సను అందజేస్తూ, నిరుద్యోగుల ఉపాధికి కావల్సిన నైపుణ్యాలను అందిస్తున్నారు. స్కూల్ పిల్లలను కలుస్తూ, వారి ప్రశ్నలకు సమాధానాలను పుస్తక రూపంలో తీసుకువచ్చారు. పది వేల రూపాయలతో మొదలుపెట్టిన సేవా మార్గం నేడు ఎంత మందికి చేరవయ్యిందో తెలియజేస్తూ మనం తలుచుకుంటే సమాజంలో పేదరికం, కష్టాలు, కన్నీళ్లు లేకుండా చేయచ్చు అని వివరిస్తున్నారు. పద్దెనిమిదవ వసంతంలోకి అడుగు పెడుతున్న తన సేవా ప్రస్థానాన్ని ఇలా ముందుంచారు. ‘‘ఎనిమిదేళ్ల క్రితం ఓ రోజు నాగర్‌కర్నూలు నుంచి ఫోన్ వస్తే అక్కడకు వెళ్లాను. ఎనభై ఏళ్ల ముసలాయన బాగోగులు చూడలేక వారి పిల్లలు ఇంటి నుంచి అతన్ని రోడ్డు మీదకు తోసేస్తే కొన్ని రోజులుగా చెత్త కుప్ప వద్ద ఉన్నాడు. అతన్ని ఆశ్రమానికి తీసుకువచ్చిన ఆరునెలలకు ఆయన భార్య కూడా వచ్చింది. ఇద్దరూ ఎనిమిదేళ్లపాటు నాతోనే ఉన్నారు. నాకు కరోనా వచ్చి ఆసుపత్రిలో ఉంటే ఆవిడ బెంబేలెత్తిపోయి తన మెడలో ఉన్న మంగళసూత్రాలు, కమ్మలు ఇచ్చి ‘అమ్మి, ఆ బాబును బతికించడయ్యా’ అని వేడుకుంది. కోలుకుని వచ్చాక విషయం తెలిసి కళ్ల నీళ్లు వచ్చాయి. పన్నెండేళ్ల క్రితం పాతికేళ్లమ్మాయి రోడ్డు ప్రమాదంలో హిప్బాల్ దెబ్బతిని మంచానికి పరిమితం అయ్యింది. హైదరాబాద్ గాంధీ నగర్లో ఉండే ఆమెను గుండె నొప్పితో బాధపడే తల్లి తప్ప చూసుకునేవారు ఎవరూ లేరు. నాలుౖగైదేళ్లు ఆ అమ్మాయి బెడ్‌మీదే ఉండిపోయింది. ఆమెకు పలుమార్లు ఆపరేషన్ చేయిస్తే ఏడెనిమిదేళ్లకు కోలుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకొని కుటుంబంతో సంతోషంగా ఉంది. మా అమ్మాయి బాగా చదువుకుంటుంది. డాక్టర్ కావాలన్నది తన కల. కానీ, చదివించే స్థోమత మాకు లేదని బాధపడుతూ వచ్చారు ఒకమ్మాయి తల్లిదండ్రులు. ఆ బిడ్డ ఈ రోజు డాక్టర్ అయి పేదలకు సేవలందిస్తోంది. ఈ పదిహేడేళ్లలో ఇలాంటి కథనాలు ఎన్నో... స్వచ్ఛందంగా ఎంతో మంది కదిలివచ్చి ‘అభయ ఫౌండేషన్’తో చేయీ చేయీ కలిపారు. ఉపనయనం డబ్బులతో... పుట్టి పెరిగింది అనంతపురం జిల్లా తాడిపత్రిలో. బీఎస్సీ ఎల్ఎల్బీ చేశాను. ఇరవై నాలుగేళ్ల క్రితం నాకు ఉపనయనం చేసినప్పుడు బంధువుల ద్వారా పది వేల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బుతో నలుగురికి మేలు కలిగే పని చేయాలనుకుంటున్నాను అని మా కుటుంబంలో అందరికీ చెప్పాను. అందరూ సరే అన్నాను. వారందరి మధ్యనే ‘అభయ’ అనే పేరుతో ఫౌండేషన్‌ను ఏర్పాటు చేస్తున్నాను అని, తమకు తోచిన సాయం అందిస్తూ ఉండమని కోరాను. అక్కణ్ణుంచి హైదరాబాద్ వచ్చి, ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు చేశాను. నా ఖర్చులకు పోను మిగతా జీతం డబ్బులు, బంధుమిత్రులు ఇచ్చినదానితో ఫుట్‌పాత్‌ల మీద ఉండే నిరాశ్రయులకు సాయం చేస్తూ ఉండేవాణ్ణి. నైపుణ్యాల వెలికితీత.. ఏ మనిషి అయినా ఎవ్వరి మీదా ఆధారపడకుండా బతకాలి. అందుకు తగిన నైపుణ్యం కూడా ఉండాలి. దీంతో వారాంతాలు స్కిల్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తుండేవాడిని. చదువుకున్న రోజుల్లో నేను మా బంధువుల నుంచి పుస్తకాలు, ఫీజులు, బట్టల రూపంలో సాయం పొందాను. వారందరిలోనూ ఒక ఎఫెక్షన్ చూశాను. నాలాగే ఎంతో మంది సాయం కోసం ఎదురుచూస్తుండవచ్చు అనే ఆలోచనతో విద్యార్థుల చదువుకు ఊతంగా ఉండాలనుకున్నాను. పుట్టి పెరిగిన జిల్లాతో పాటు ఇప్పుడు దాదాపు 17 రాష్ట్రాలలో నిరుపేద విద్యార్థుల చదువుకు అండగా ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు రాష్ట్రాలతో పాటు మరో మూడు రాష్ట్రాల్లో 12 వేల మంది యువతకు ఉపాధి అవకాశాలకు శిక్షణ ఇస్తున్నాం. వీరిలో మహిళలూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. కర్ణాటక రాష్ట్రంలో నాదస్వరం స్కూల్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఏ వృత్తుల వారికి ఆ వృత్తులలో ప్రత్యేక శిక్షణ ఇచ్చి, వారి కాళ్ల మీద వారు నిలబడేలా సాయంగా ఉంటున్నాం. సేవకు చేయూత ఒక మంచి పని చేస్తే ఎంత దూరమున్నవారినైనా ఆకట్టుకుంటుందని ఓ సంఘటన నాకు అర్థమయ్యేలా చేసింది. పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అక్కడకు 75 ఏళ్ల ఆవిడ వచ్చి ‘నేనూ మీ సేవలో పాలు పంచుకుంటాను, నెలకు 5వేల రూపాయలు ఇవ్వగలను’ అంది. ఆశ్చర్యంగా చూస్తే ‘నేను రిటైర్డ్ ప్రిన్సిపాల్‌ను. 20 వేల రూపాయల పెన్షన్ వస్తుంది. ప్రతి నెలా ఐదు వేల రూపాయలు సేవకు నా జమ’ అంది. నోటమాటరాలేదు. ఎక్కడ సేవ రూపంలో వెళితే అక్కడకు పది, వంద రూపాయలు సాయం అందించినవారున్నారు. ఇంతమందిలో మానవత్వం ఉంటే ఇక మనకు కొరతేముంది అనుకున్నాను. ఎవరికి సాయం అందిందో తిరిగి వాళ్లు ఎంతో కొంత సాయం అందిస్తూ వచ్చారు. కొంతమంది పిల్లలు తమ కిడ్డీ బ్యాంకులో దాచుకున్న డబ్బును కూడా సాయంగా ఇచ్చారు. స్వచ్ఛందంగా ముందుకు.. నేపాల్ కరువైనా, ఉత్తరాఖండ్ వరదలైనా, ఆంధ్ర, తమిళనాడు, కేరళలలో అకాల వర్షాలు ముంచెత్తినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సాయం అవసరమున్నవారికి అండగా ఉంటే చాలు అన్న తపన నన్ను చాలా మందికి చేరువ చేసింది. నాతో పాటు ఎలాంటి స్టాఫ్ లేదు. ప్రత్యేకించి ఆఫీసు లేదు. అందరూ స్వచ్ఛందంగా తమ చేయూతను ఇస్తున్నారు. దీనికి నేను చేస్తున్నదల్లా సాయం చేసే చేతులను కలపడం. ఈ సేవా ప్రస్థానంలో ఇప్పుడు వేల మంది జమ కూడారు. అంతా నా కుటుంబమే! సేవ మార్గమే నా ప్రయాణం కాబట్టి, పెళ్లి, కుటుంబం వద్దనుకున్నాను. హైదరాబాద్‌లో ఒక ప్లాట్ ఉంది. ఇటీవల ఆ ఇంటిని అభయ ఫౌండేషన్‌కు ఇచ్చేశాను. ఆరేళ్ల క్రితం ఇబ్రహీంపట్నంలో వృద్ధులకు, వైద్య సాయం అవసరమైన పేదలకు అభయ ఆనంద నిలయం ఏర్పాటు చేశాను. నేను మరణించేదాకా, మరణించాక కూడా నలుగురిని బతికించే ప్రయత్నం చేయాలన్నది తపన. ఈ ప్రయాణంలో ఎన్నో ఆవేదనలు చుట్టుముట్టాయి. ఎందరి కష్టాలనో దగ్గరుండి చూసి, దుఃఖం కలిగేది. చేసే ప్రతి పనినీ దైవాంశగా భావిస్తూ వచ్చాను. పిల్లల కోసం కంపాస్ రేపటి తరం బాగుండాలంటే విద్యార్థుల్లో మానవతా స్పృహ కలగాలి. అందుకే, ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చిన్నారులకు మన దేశ నాయకుల గురించి, సంస్కార పాఠాలు అందించే ప్రయత్నం చేస్తున్నాను. పిల్లలు అడిగిన ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా ‘కంపాస్’అనే పేరుతో పుస్తకం తీసుకువచ్చాను. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతి రోజూ ఉదయం నుంచి 10 వేల మందికి టచ్‌లో ఉంటాం. నేను కోరేది ఒక్కటే ... వాలంటీర్లుగా వారంలో ఒక్క రోజు మాకివ్వండి. సేవా మార్గంలో తోడవ్వండి. అంకితభావంతో ఉన్న యువత ఇలాంటి సంస్థలలో పనిచేయడం వల్ల వారిలో జీవన నైపుణ్యాలు పెరుగుతాయి. సమాజం బాగుండాలంటే యువత చేతులు ఏకమవ్వాలి’’ అని తెలియజేస్తున్నారు బాలచంద్ర. – నిర్మలారెడ్డి -
ప్రెగ్నెన్సీ సమయంలో పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదా? ప్రమాదమా?
ప్రెగ్నెన్సీ సమయంలో పెయిన్ కిల్లర్స్ వేసుకోవద్దంటారు. నిజమేనా? ఒకవేళ జ్వరం లాంటి వాటికి డోలో వంటి మందులు వేసుకుంటే ఏమన్నా ప్రమాదమా? – సి. వెంకటలక్ష్మి, బిచ్కుంద ప్రెగ్నెన్సీలో ఏ నెలలో అయినా కొంత పెయిన్ ఉండటం చాలామందిలో చూస్తుంటాం. పెయిన్ టైప్, తీవ్రతను బట్టి పెయిన్ స్కేల్ అసెస్మెంట్తో నొప్పిని తగ్గించే మందులు, వ్యాయామాలు లేదా ఫిజియోథెరపీ లేదా కౌన్సెలింగ్ సూచిస్తారు. అయితే వీటన్నిటికీ నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరి. NSAIDS డ్రగ్ ఫ్యామిలీకి సంబంధించిన Brufen, Naproxen, Diclofenac లాంటివి ప్రెగ్నెన్సీ సమయంలో అస్సలు వాడకూడదు. ముఖ్యంగా ఏడు నుంచి తొమ్మిది నెలల్లో. పారాసిటమాల్(డోలో, కాల్పాల్, క్రోసిన్) లాంటివి వాడవచ్చు. ప్రెగ్నెన్సీ సమయంలో మామూలు నుంచి ఓ మోస్తరు పెయిన్ ఉన్నప్పుడు డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్, వేడి, ఐస్ కాపడాలు వంటివి సూచిస్తారు. పారాసిటమాల్‌ని వాడవచ్చు. 30 వారాలు దాటిన తర్వాత ఎలాంటి పెయిన్ కిల్లర్స్‌ని వాడకపోవడమే మంచిది. ఒకవేళ నొప్పి తీవ్రంగా ఉంటే Opiates పెయిన్ కిల్లర్స్ అంటే Morphine, Tramadol లాంటివి సూచిస్తారు. లేబర్ పెయిన్‌ని కూడా కొంతవరకు ఓర్చుకోగల ఉపశమనాన్నిస్తాయి. అయితే ఇవి కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పైనే వాడాలి. కొంతమంది గర్భిణీలకు నర్వ్ పెయిన్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. దీనికి పారాసిటమాల్‌ని ఇస్తారు. గర్భిణీ.. నిపుణల పర్యవేక్షణ, పరిశీలనలో ఉండాలి. కొందరికి Amitriptyline లాంటి మందులను కొన్ని రోజులపాటు ఇస్తారు. పారాసిటమాల్ ఒళ్లు నొప్పులను, జ్వరాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. గర్భిణీలకు పారాసిటమాల్ సురక్షితమైందని చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. డాక్టర్ భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్, హైదరాబాద్ (చదవండి: నాలుగు నెలల పాపకు అలా అవ్వడం ప్రమాదం కాదా?) -
గురుక పెట్టి హాయిగా నిద్రపోతున్నారా?.. అంతకు మించి సమస్యలు
‘చెవిచిల్లు పెట్టే నీ గురక... చిందరవందర అయింది నా పడక’ అని నిద్రలో గురక పెట్టే వాళ్లపైన చుట్టుపక్కలవాళ్లు గింజుకుంటారు. అయితే నిద్రలో గురకపెట్టేవారికి అంతకు మించిన సమస్యలే ఎదురవుతాయని హెచ్చరిస్తున్నాయి అధ్యయనాలు. ఎవరైనా మంచం మీద ఇలా వాలి అలా గుర్రుపెట్టారంటే హాయిగా నిద్రపోతున్నారనుకుంటాం. అయితే గురకపెడుతూ నిద్రపోవడం హాయిగా భావించడం సరికాదని, దానిని తీవ్రమైన ఆరోగ్య సమస్యగా భావించాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గురక తెచ్చిపెట్టే సమస్యలపై మన దేశంలో అవగాహన అత్యల్ప స్థాయిలో ఉందని వారంటున్నారు సాక్షి, హైదరాబాద్ : ఇటీవల చేసిన రెస్‌మెడ్–2023 గ్లోబల్ స్లీప్ సర్వేలో 58 శాతం మంది భారతీయులు గురకను మంచి నిద్రకు చిహ్నంగా భావిస్తున్నట్టు తేలడం నిద్ర ఆరోగ్యంపై వారి అవగాహన లేమిని తేల్చింది. 2022తో పోలిస్తే 2023లో మన వాళ్ల నిద్ర నాణ్యత 22 శాతం క్షీణించినా సర్వేలో పాల్గొన్నవారిలో 85 శాతం మంది తమ నిద్ర నాణ్యత బాగుందన్నారని సర్వే వెల్లడించింది. మూడ్ మార్పులు, పగటి నిద్ర, ఏకాగ్రత లోపం ఉన్న 20 శాతం మంది మాత్రమే వైద్యుడ్ని సంప్రదించాలని నిర్ణయించుకున్నారని తేల్చింది. గురక.. అనారోగ్య కారణమే... అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ మెడికల్ జర్నల్ ‘న్యూరాలజీ ఆన్లైన్’సంచికలోప్రచురించిన అధ్యయనం ప్రకారం..గురక పెట్టే వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం 91 శాతం ఎక్కువ. అంతేకాదు గురకపెట్టేవారిలో దాదాపు 20–25 శాతం మంది గురక.. తద్వారా అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా (ఒఎస్ఎ)తో బాధపడుతూ ఉండవచ్చునని మరో అధ్యయనం తేల్చింది. గురకపెట్టే వారిలో ప్రతి నాల్గవ వ్యక్తి స్లీప్ అప్నియా రోగి అని వైద్యులు అంటున్నారు. పెరుగుతున్నబాధితులు గురక–స్లీప్ అప్నియాతో బాధపడుతున్న చాలా మందికి దాని తీవ్రమైన పరిణామాల గురించి తెలియదని ఛాతీ, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు డాక్టర్ సందీప్ అంటున్నారు. ‘40 శాతం మంది వ్యక్తులు గురక పెట్టినట్లయితే, వారిలో 10 శాతం మందికి స్లీప్ అప్నియా ఉన్నట్టే’అని దేశంలో తొలి స్లీప్ ల్యాబ్ ప్రారంభించిన డాక్టర్ జేసీ సూరి అన్నారు. తాను స్లీప్ ల్యాబ్ ప్రారంభించినప్పుడు నెలకు నలుగురైదుగురు రోగులు మాత్రమే వచ్చేవారని, ఇప్పుడు ఆ సంఖ్య గణనీయంగా పెరిగిందని అందులో మధ్య వయసు్కలు, వృద్ధుల సంఖ్య దాదాపు 15–20 శాతంగా ఉందన్నారు. ‘స్లీప్ అప్నియా ద్వారా రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం కూడా ఉందని అంటున్నారు. బాల్యంలోనే... నగరానికి చెందిన ఏఐజీ ఆసుపత్రి ఇటీవలి అధ్యయనం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 30 నుంచి 40 శాతం మంది పిల్లలు గురక, నిద్రలేమితో బాధపడుతున్నారు. చిన్నారుల్లో గురకకు చికిత్స చేయకపోతే మానసిక వికాసం, మేధో సామర్థ్యాలు దెబ్బతింటాయని, శారీరక చురుకుదనంపై కూడా ప్రభావం చూపుతుందని, దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీయవచ్చునని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గురక లక్షణాలున్న కేసుల్లో దాదాపు 70 శాతం మంది పిల్లలకు స్లీప్ అప్నియా ఉన్నట్టు, 15 నుంచి 20 శాతం మంది పాఠశాల పిల్లలు ఊబకాయంతో ఉన్నారని వీరిలో అత్యధికులు గురకతో బాధపడేవారేనని ఏఐజీ అధ్యయనంలో తేలింది, నిద్ర పోకుండా పిల్లలు ఎక్కువ గంటలు మేల్కొని ఉండటం అధిక చురుకుదనం లక్షణంగా తల్లిదండ్రుల భావిస్తే అది అపోహ మాత్రమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. స్లీప్ అప్నియాలక్షణాలివే.. నిద్రలో కండరాలు సడలించడం వల్ల శ్వాసనాళాలు కుంచించుకు పోతాయి. ఫలితంగా ఆక్సిజన్ అందక అది నాణ్యమైన శ్వాసక్రియకు, నిద్రకు తీవ్రమైన అంతరాయం కలిగించే పరిస్థితే స్లీప్ అప్నియా. గురక ముదిరి స్లీప్ అప్నియాకు దారి తీస్తుంది. సాధారణంగా ఊబకాయం ఉన్న వారిలో ఇది కనిపిస్తుంది. మెడ చుట్టుకొలత తగినంత లేకపోవడం, ఎగువవైపునకు గాలి వెళ్లే మార్గం ఇరుకుగా మారడం స్లీప్ అప్నియాకు దోహదం చేస్తుంది. ఉదాహరణకు, పిల్లలలో టాన్సిల్స్ లేదా అడినాయిడ్స్ కూడా స్లీప్ అప్నియాకు కారణం కావచ్చు. స్లీప్ అప్నియా ముదురుతున్న దశలో వ్యక్తి సురక్షితంగా డ్రైవింగ్ చేసే సామర్థ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. పగటిపూట అధికంగా నిద్రపోవడం ఏకాగ్రత లోపాలకు దారితీస్తుంది. ‘స్లీప్ అప్నియా చికిత్సలో భాగంగా బరువు తగ్గడం, ధూమపానం మానేయడం, ఆల్కహాల్ బాగా తగ్గించడం, తీరైన ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం తప్పనిసరి. ఈ వ్యాధి తీవ్రమైతే రోగులకు మాస్క్ ద్వారా గాలిని అందించే వైద్య పరికరం, కొన్ని సందర్భాల్లో, అడ్డంకిని సరిచేయడానికి శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. పిల్లలకు మరింత చేటు... తీవ్ర గురకతో బాధపడుతున్న పిల్లల్లో చురుకుదనం, శ్రద్ధ లోపిస్తాయి. చిరుతిళ్లు అధికంగా తినడం, చిరాకు, తరచుగా అలసట ఉంటాయి. గురక, నోటితో శ్వాస తీసుకోవడం, రాత్రి పూట చెమట పట్టడం వంటివి పిల్లల్లో గమనిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. –ఆర్.దీప్తి, చీఫ్ పీడియాట్రిషియన్,అమోర్ హాస్పిటల్స్ -
హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్.. పరాకు వద్దు
తల భాగంలోని శ్వాస–జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్స్‌ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటారు. పెదవులు, నోరు, చిగుర్లు, నాలుక, నేసల్ క్యావిటీ (ముక్కు భాగం), ఫ్యారింగ్స్, స్వరపేటిక వంటి భాగాలలో క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ కిందికి వస్తాయి. ఈ క్యాన్సర్స్‌లో 90 శాతం వరకు స్క్వామస్ సెల్ కార్సినోమా రకానికి చెందినవి. అంటే మ్యుకస్ ఉండి ఎప్పుడూ తడిగా ఉండే లోపలి పెదవులు, చిగుర్లు, కాలుక వంటి భాగాలలో ఈ క్యాన్సర్ వస్తుంటాయి. మెదడు, అన్నవాహిక, థైరాయిడ్ గ్రంథి, తలలోని కండరాలు, చర్మానికి వచ్చే క్యాన్సర్స్‌ను క్యాన్సర్స్‌ను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణించరు. ఊపిరితిత్తుల క్యాన్సర్స్‌కు లాగానే ఈ క్యాన్సర్స్కూ ఆల్కహాల్, పొగాకు, దాని సంబంధిత ఉత్పత్తులే ప్రధాన కారణాలు. తల, మెడకు సంబంధించిన క్యాన్సర్స్‌కు 75% కారణాలుగా పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పాదనలు, గుట్కా, పాన్, జర్దా, నస్యం, వక్క, బీడీ, చుట్ట, తమలపాకులు, సిగార్లు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఆల్కహాల్, పొగాకు... రెండు అలవాట్లూ ఉన్నట్లయితే ముప్పు మరింత ఎక్కువ. నోటిలో తెలుపు ఎరుపు మిళితమైన మచ్చలు (ప్యాచెస్), గొంతు బొంగురుగా ఉండటం, మింగడంలో ఇబ్బంది, దవడల వాపు, శ్వాస తీసుకోవడం, మాట్లాడటం కష్టం కావడం, తలనొప్పి, వినికిడిశక్తి తగ్గడం, చెవిపోటు... ఇలా క్యాన్సర్ కణితి పెరిగే ప్రదేశాన్ని బట్టి లక్షణాలు అనేక రకాలుగా ఉంటాయి. లక్షణాలు అనుమానాస్పదంగా ఉంటే బయాప్సీ, ఎమ్మారై, పెట్ స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలతో క్యాన్సర్ వచ్చిన భాగాన్ని పరీక్షించి స్టేజ్నూ, గ్రేడింగ్‌లను నిర్ధారణ చేస్తారు. క్యాన్సర్ వచ్చిన భాగం, స్టేజ్, రోగి వయసు, ఆరోగ్యం వంటి అనేక అంశాల ఆధారంగా చికిత్స ఉంటుంది. సర్జరీ, రేడియేషన్, కీమో, టార్గెటెడ్ థెరపీ లేదా అవసరాన్ని బట్టి కొన్ని కాంబినేషన్ థెరపీలూ నిర్ణయిస్తారు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు ఓరల్ క్యావిటీ అంటే పెదవులు, నాలుక చిగుర్లు, నోటిలోని కింది భాగం, పైభాగం, జ్ఞానదంతాల వెనుకవైపున ఉండే చిగుర్ల వంటి ప్రాంతాల్లో ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఫ్యారింజియల్ : ముక్కు వెనక కూడా ఆ భాగం 5 అంగుళాల లోతు వరకు ఉంటుంది. లారింజియల్ : మాట్లాడటానికి సహకరించే స్వరపేటిక, వోకల్ కార్డ్స్, ఆహారాన్ని శ్వాసనాళాల్లోకి పోకుండా అడ్డుకునే ఎపిగ్లాటిస్. పారానేసల్ సైనసెస్తో పాటు నేసల్ క్యావిటీ : తల మధ్యభాగంలో ముక్కుకు ఇరువైపులా బోలుగా ఉండే సైనస్‌లు. లాలాజల (సెలైవరీ) గ్రంథులు : నోటి లోపల కింది భాగంలో దవడ ఎముకలకు ఇరుపక్కలా ఉండే లాలాజల గ్రంథులు. మన దేశంలో కనిపించే ప్రతి మూడు క్యాన్సర్లలో ఒకటి ఈ తరహా క్యాన్సర్లకు సంబంధించినదై ఉంటుంది. లేటు దశలో గుర్తించడం వల్ల లేదా ఇతర భాగాలకు (మెటాస్టాసిస్) క్యాన్సర్ పాకడం వల్ల ఈ క్యాన్సర్‌కు గురైన వారిలో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటోంది. మనదేశంలో ఏడాదికి పది లక్షల మంది వరకు ఈ క్యాన్సర్లకు గురవుతున్నారు. వారిలో దాదాపు రెండు లక్షల మంది వరకు ఈ క్యాన్సర్‌కు సంబంధించినవారే. పొగాకును అనేక రకాలుగా ఉపయోగించడం, సున్నంతో కలిపి ఎక్కువసేపు నోటిలో ఉంచుకోవడం, తమలపాకు, వక్క నమలడం వంటి అలవాట్లే మనదేశంలో ఈ సంఖ్య ఇంతగా పెరగడానికి దోహదం చేస్తున్నాయి. తొలిదశలో అంటే స్టేజ్ 1, స్టేజ్ 2 లలో కనుగొంటే... కేవలం సర్జరీతోనే ఈ క్యాన్సర్‌కు శాశ్వత పరిష్కారం లభించవచ్చు. సర్జరీ తర్వాత చాలాసార్లు రీ–కన్స్ట్రక్టివ్ సర్జరీ అవసరం ఉంటుంది. స్టేజ్ 3, స్టేజ్ 4 లలో కీమో, రేడియేషన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. 3 డీసీఆర్, వీఎమ్‌ఏటీ, ఐఎమ్ఆర్టీ, ఐజీఆర్టీ, బ్రాకీథెరపీ, బీమ్ థెరపీ వంటి ఆధునిక రేడియోథెరపీ పద్ధతులలో చికిత్స విధానాలుంటాయి. సాధారణంగా ఈ క్యాన్సర్‌కు కీమోథెరపీ పాత్ర ఒకింత తక్కువే అని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో కీమోను కంబైన్డ్ ట్రీట్మెంట్గా లేదా కొంతవరకు ఉపశమనంగా ఉపయోగిస్తారు. ఈ చికిత్స తర్వాత బాధితులు తమకు ఇంతకుముందు ఉన్న అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. నోటి పరిశుభ్రతను పాటించాలి. ఫిజియోథెరపీ, స్పీచ్‌థెరపీ, జా–స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ల వంటివాటిని అనుసరించాలి. డాక్టర్లు సూచించిన మేరకు తప్పనిసరిగా ఫాలో–అప్‌లో ఉండాలి. మానసిక ఒత్తిడి, విటమిన్ల లోపంతో వచ్చే నోటిపొక్కులు, అల్సర్స్ బాధాకరంగా ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎక్కువగా పట్టించుకుంటూ ఉంటాం. నొప్పిలేని వాటిని నిర్లక్ష్యం చేస్తాం. నోటిలో నొప్పిలేకుండా తెలుపు (ల్యూకోప్లేకియా) లేదా ఎరుపు (ఎరిథ్రోప్లేకియా) రంగులో ప్యాచెస్ కనిపించినప్పుడు తప్పక పరీక్షలు చేయించుకోవాలి. చాలామంది డెంటల్ చెకప్స్ లేదా దంత, చిగుర్ల సంబంధిత సమస్యలతో డెంటిస్టుల దగ్గరికి వెళ్లినప్పుడు ఈ సమస్యలు బయటపడుతూ ఉంటాయి. అందుకే తరచూ దంతవైద్యుడిని కలుస్తూ, నోటి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంటూ ఉండటం అవసరం. - డా. సీహెచ్. మోహన వంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, హైదరాబాద్ ఫోన్ నంబరు: 9849022121 -
కళ్లకింద నల్లటి వలయాలా?.. ఇంట్లోనే చక్కటి పరిష్కారం
ఇటీవలి కాలంలో మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం, కంప్యూటర్ స్క్రీన్ వైపు అధికంగా చూడటం వల్ల చాలామందికి కళ్లు ఎర్రబడటం, మంటలు, కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడటం వంటి ఇబ్బందులు చోటు చేసుకుంటున్నాయి. అలాంటి వాటికి ఇంటిలో సహజంగా దొరికే వాటితోనే చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఓసారి ప్రయత్నించి చూడండి. ►కళ్ల ఎర్రబడి, మంట పుడుతుంటే ఉదయం లేదా సాయంత్రం.. సుమారు పది నిమిషాలు ఐస్‌క్యూబ్స్‌తో కళ్లను మసాజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా చర్మం మీద కాకుండా.. కాటన్ క్లాత్‌లో చుట్టి.. మెల్లిగా కళ్లను మసాజ్ చేయాలి. ఒకవేళ ఐ మాస్క్ ఉంటే.. దానిని కొంతసేపు ఫ్రిజ్‌లో ఉంచి కళ్లకు పెట్టుకోవచ్చు. చల్లని టీ బ్యాగులు: కోల్డ్ కంప్రెస్ లేదా ఐ మాస్క్ లేకుంటే.. ఉపయోగించిన టీ బ్యాగ్‌లు మీకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. గ్రీన్ టీ వంటి అనేక టీలు యాంటీ ఆక్సిడెంట్లతో కూడి ఉండటం వల్ల వీటిని ఫ్రిజ్‌లో పెట్టి కళ్ల మీద పెట్టుకుంటే చాలు... కళ్లకింద ఉండే క్యారీబ్యాగ్స్ను, డార్క్ సర్కిళ్లను తగ్గిస్తాయి. ►తాజా కీరదోసకాయను ఒక మాదిరి పరిమాణంలో గుండ్రటి ముక్కలుగా తరిగి.. వాటిని ఒక గిన్నెలో పెట్టి అరగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి. తర్వాత వాటిని ఫ్రిజ్ నుంచి తీసి కళ్లపై ఉంచి.. 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. బాదం నూనె: బాదం నూనె, విటమిన్ ఇ మిశ్రమాన్ని ఉపయోగిస్తే కళ్ల కింద ఉండే నల్లటి వలయాలు క్రమంగా మటుమాయం అవుతాయి. పడుకునే ముందు మీ డార్క్ సర్కిల్స్‌ను బాదం నూనె, విటమిన్ ఇ మిశ్రమంతో కలిపి మసాజ్ చేయాలి.. ఉదయం లేచిన తర్వాత.. ఆ ప్రాంతాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే కళ్ల మంటలు తగ్గి హాయిగా ఉంటుంది. చల్లని పాలు: పాల ఉత్పత్తులు విటమిన్–ఎ ను కలిగి ఉంటాయి. ఇందులో రెటినోయిడ్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచడంలో గొప్పగా పనిచేస్తాయి. చల్లని పాల గిన్నెలో కాటన్ మేకప్ రిమూవర్ ప్యాడ్‌ను నానబెట్టండి. అనంతరం 10 నిమిషాల పాటు కళ్లపై ఉంచండి. గోరు వెచ్చని నీటితో శుభ్రం చేస్తే.. డార్క్ సర్కిల్స్ సమస్య తగ్గుతుంది. కంటి నిండా నిద్ర: నిర్ణీత సమయం పడుకోకపోవడం వల్ల కళ్ల కింద ద్రవం పేరుకుపోతుంది. కాబట్టి కంటినిండా హాయిగా∙నిద్రపోవాలి. క్రమగా వ్యాయామం చేయాలి. ఈ సహజ నివారణలతో కంటిచుట్టూ ఉండే నల్లటి వలయాలను సులువుగా ఛేదించవచ్చు. -
సేఫ్ సెకండ్ ఒపీనియన్ ప్లీజ్!
ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్‌కు చూపించుకుని, ఆయన సూచించిన చికిత్స సక్రమమైన మార్గంలోనే వెళ్తుందా లేదా అని తెలుసుకోడానికి సెకండ్ ఒపీనియన్ కోసం చాలామంది మొగ్గుచూపుతుంటారు. తమ చికిత్స సక్రమమైన మార్గంలోనే సాగుతుందని మరో డాక్టర్ కూడా భరోసా ఇస్తే... బాధితులకు అదో ధీమా. నిజానికి మొదటి డాక్టర్ మీద సందేహం కంటే... ఈ భరోసా కోసం, ఈ ధీమా కోసమే చాలావరకు సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్తుంటారు. ఒకరికి ఇద్దరు డాక్టర్లు ఒకేమాట చెబితే మనసుకెంతో ఊరట. కానీ ఒక్కోసారి సెకండ్ ఒపీనియన్ మరీ తేడాగా ఉంటే... మరోసారి మనం సందర్శించిన మొదటి డాక్టర్‌తోనూ ఒక మాట మాట్లాడటం ఎంతో అవసరం. అదెందుకో చూద్దాం. ఓ కేస్ స్టడీ: వైద్య విషయాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఓ డాక్టర్‌ను సంప్రదించారు. ఆయనకు కడుపులో ట్యూమర్స్ వంటివి ఉన్నాయనీ, ఆపరేషన్‌తో తొలగించాల్సిన అవసరముందని డాక్టర్ చెప్పారు. మరో ఒకరిద్దరు డాక్టర్ల దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు వారూ శస్త్రచికిత్స తప్పదని చెప్పడంతో... బాధితుడు సర్జరీ చేయించుకున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఇచ్చే పోస్ట్ ఆపరేటివ్ మందుల్లో ఒకదాని గురించి డాక్టర్ ఓ మాట చెప్పారు. ‘‘ఈ మందు మీకు కాస్త ఇబ్బందిని తెచ్చిపెట్టవచ్చు. అందరికీ అలా జరగాలని లేదు. ఒకవేళ మీ విషయంలో ఇబ్బంది కలిగితే నాకు చెప్పండి. నేను మందు మారుస్తాను’’ అని చెప్పారు డాక్టర్. ఎప్పటిలాగే సెకండ్ ఒపీనియన్లో భాగంగా ఆ పేషెంట్ ఆ మందు గురించి మరో డాక్టర్‌ను అడిగారు. ‘‘ఆ... అదంత ముఖ్యమైన మందు కాదులే’’ అని ఆ డాక్టర్ చెప్పడంతో బాధితుడు ఆ మందు తీసుకోలేదు. బాధితుడికి ఆర్నెల్లలోనే కడుపులో ట్యూమర్ మరోసారి పెరిగింది. సమస్య ఎందుకు పునరావృతమైందో తెలియక డాక్టర్ తలపట్టుకున్నారు. ఈ ఆర్నెల్ల కాలంలో బాధితుడి దగ్గర్నుంచి ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రయత్నంలో తాను మొదట ఇచ్చిన మందుల్లో ఒకదాన్ని బాధితుడు వాడలేదని తెలియవచ్చింది. దాంతో డాక్టర్ కాస్తంత ఆగ్రహం చూపాల్సివచ్చింది. ‘‘నిజానికి అదో కీమో తరహా మందు. కీమో అన్న మాట వినగానే తమకు క్యాన్సరేనేమో అని పేషెంట్ అపోహ పడవచ్చు. కానీ కాన్సర్ కానటువంటి కొన్ని రకాల (నాన్ క్యాన్సరస్) ట్యూమర్లు మళ్లీ మళ్లీ రాకుండా కీమోలాంటి చికిత్సనే అందించే ఓరల్ ట్యాబ్లెట్లను డాక్టర్లు ఇస్తుంటారు. ట్యూమర్ తొలగింపులో... దాన్ని పూర్తిగా తొలగించడానికి వీలుకాని ప్రదేశంలో సూక్షా్మతిసూక్ష్మమైన భాగం కొంత మిగిలిపోతే... మళ్లీ పెరగకుండా ఉండేందుకు ఇచ్చిన మందు అది. మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం తప్పుకాదు. కానీ ఆ తర్వాత మళ్లీ నాతో మాట్లాడితే... నేను మరింత వివరించేవాణ్ణి. ఇప్పుడు మరోసారి సర్జరీ చేయాల్సి వస్తోంది. అది కూడా గతంలో కంటే పెద్ద సర్జరీ. ఖర్చు కూడా దాదాపు రెట్టింపు’’ అంటూ మందలించారు డాక్టర్. ఇదీ మరోమారు జబ్బు రిలాప్స్ (పునరావృతం) అయిన ఓ బాధితుడి వాస్తవ గాధ. ఆందోళన కలిగించే విషయాలు అనవసరం : ఈ కేస్ స్టడీలో డాక్టర్ కావాలనే కొన్ని విషయాలను బాధితలకు విపులంగా చెప్పలేదు. దానికీ కారణం ఉంది. నిజానికి డాక్టర్ ఇచ్చిన మందు వాడేసి ఉంటే... ఆ మిగిలిపోయిన భాగమూ మృతిచెంది... రోగి పూర్తిగా స్వస్థుడయ్యేవాడు. కానీ ఈ మందు కీమో వంటిది అనగానే రోగిలో అనవసరమైన ఆందోళన మొదలయ్యే అవకాశం ఉంటుంది. దాంతో లేనిపోని ఊహలూ, అనవసరమైన సందేహాలతో మరింతమంది డాక్టర్లను సంప్రదించవచ్చు. దాంతో డబ్బూ, సమయమూ వృథా కావడమే కాదు... అవసరమైన యాంగై్జటీ, కుంగుబాటుకు తావిచ్చినట్టు అవుతుంది. అందుకే రోగి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అతడికి అనవసరమైన విషయాలను చెప్పకపోవచ్చు. లేదా ఒకవేళ బాధితులు మంచి విద్యావంతులే అని చెపినప్పటికీ, వారిలో మరిన్ని సందేహాలు చెలరేగే అవకాశాలు ఎక్కువ. నిజానికి ఇలాంటి సందేహాలు విద్యావంతుల్లోనే ఎక్కువ అని డాక్టర్లు అంటుంటారు. సరికొత్త అనర్థాలకు తావిచ్చే గూగుల్ : ఏదైనా విషయాన్ని డాక్టర్లు యథాలాపంగా చెప్పినా సరే... చాలామంది విద్యావంతులు గూగుల్‌ను ఆశ్రయిస్తారు. వైద్యవిజ్ఞానానికి చెందిన చాలా అంశాలు గూగుల్‌లో విపులంగా ఉంటాయి. నిజానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది వ్యక్తికీ, వ్యక్తికీ వేరుగా ఉండవచ్చు. కొన్ని అంశాలు వారికి వర్తించకపోవచ్చు. అవి డాక్టర్‌కు తెలుస్తాయి. కానీ గూగుల్‌లో మొత్తం సమాచారమంతా ఉంటుంది. అది తమకు వర్తించదన్న అంశాన్ని గ్రహించలేని పేషెంట్లు... ఆ అనవసర పరిజ్ఞానాన్ని తలకెక్కించుకుని మరింతమంది డాక్టర్ల చుట్టూ తిరుగుతూ మనశ్శాంతిని దూరం చేసుకుంటుంటారు. ఫేస్బుక్, యూట్యూబ్‌లలో పనికిరాని పరిజ్ఞానం : దీనికి తోడు ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో మరిన్ని క్లిప్స్ ఉంటాయి. తమ లైక్స్ కోసం లేదా తమ పాపులారిటీని పెంచుకునేందుకు అర్హత లేని నకిలీలు (క్వాక్స్) కూడా ఏమాత్రం శాస్త్రీయతకు తావు లేని అంశాలతో వీడియోలు చేసి పెడుతుంటారు. వీటిని చూసి బాధితులు మరింత అయోమయానికి గురవుతుంటారు. సెకండ్ ఒపీనియన్ బాధితుల హక్కు నిజానికి మరో డాక్టర్ దగ్గర్నుంచి వారి అభిప్రాయం తీసుకోవడం పేషెంట్స్ హక్కు. మరొకరి ఒపీనియన్ తీసుకున్న తర్వాతే చికిత్సకు రమ్మని చాలామంది డాక్టర్లూ సూచిస్తుంటారు. దానికి కారణమూ ఉంది. సెకండ్ ఒపీనియన్ వల్ల పేషెంట్స్‌లో మంచి నమ్మకమూ, తాము తీసుకునే చికిత్స సరైనదే అనే విశ్వాసం పెంపొందుతాయి. అది బాధితులను మరింత వేగంగా కోలుకునేలా చేస్తుంది. చాలా సందర్భాల్లో తొలి డాక్టర్ చెప్పిన విషయాలూ, సెకండ్ ఒపీనియన్ ఇచ్చిన్న డాక్టర్ చెప్పిన అంశాలు నూటికి తొంభై పాళ్లు ఒకేలా ఉంటాయి. కొన్ని అటు ఇటుగా ఉన్నప్పటికీ మొదటి డాక్టర్ చెప్పిన అంశాలను చాలావరకు రెండో డాక్టర్ విభేదించరు. ఒకవేళ విభేదిస్తే కారణాలు చెబుతారు. కానీ తాము తీసుకున్న సెకండ్ ఒపీనియన్ గనక మన డాక్టర్ చెప్పిన విషయాలకు దాదాపుగా పూర్తిగా భిన్నంగా ఉన్నప్పుడు అదే విషయాన్ని మనం చికిత్స తీసుకునే డాక్టర్‌తో ఆ విషయాలపై స్పష్టంగా, నిర్భయంగా, విపులంగా చర్చించవచ్చు. మన సందేహాలనూ, సంశయాలనూ తీర్చడం డాక్టర్ విధి కూడా. అలాంటప్పుడు ఒకసారి మన డాక్టర్‌తోనూ మాట్లాడటం మంచిది. డాక్టర్ షాపింగ్ వద్దు ఓ డాక్టర్‌ను సంప్రదించాక... ఇంకా తమ సందేహాలు తీరలేదనో లేదా మరోసారి డాక్టర్‌ను అడిగితే ఏమనుకుంటారనో ఒకరి తర్వాత మరొకరి దగ్గరకు వెళ్తుంటారు. దీన్నే ‘డాక్టర్ షాపింగ్’ అంటారు. నిజానికి డాక్టర్ షాపింగ్ అన్నది మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని గ్రహించడం మంచిది. డాక్టర్ జి. పార్థసారధి, సీనియర్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ -
కేన్సర్ కణుతులను మాత్రమే చంపేసే థెరపీ
హూస్టన్: శరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలు, కణజాలాల జోలికి పోకుండా కేన్సర్ కణుతులను మాత్రమే చంపేసే కొత్త విధానాన్ని అమెరికా పరిశోధకులు కనుగొన్నారు. నేచురల్ కిల్లర్ (ఎన్కే) కణాల వంటి రోగ నిరోధక కణాలతో తయారైన యాంటీట్యూమర్ రోగ నిరోధక ప్రతిస్పందనను ఈ చికిత్స ద్వారా క్రియాశీలకంగా మార్చవచ్చు. అంకోలైటిక్ వైరోథెరపీ (ఓవీ) అనే ఈ విధానం ఇటీవల వచ్చిన కేన్సర్ చికిత్సల్లో అత్యంత నమ్మకమైనదిగా భావిస్తున్నారు. హూస్టన్‌లోని సెంటర్ ఫర్ న్యూక్లియర్ రిసెప్టార్స్ అండ్ సెల్ సిగ్నలింగ్ డైరెక్టర్ షౌన్ ఝాంగ్ దీన్ని అభివృద్ధి చేశారు. దీనిపై మరింత లోతుగా పరిశోధనలు చేసేందుకు ప్రభుత్వం ఆయనకు భారీ గ్రాంటు మంజూరు చేసింది. -
మన దేశంలో ఈ సమస్య తీవ్రత ఎక్కువే..
ఈ చలికాలంలో నీళ్లు తాగేది ఒకింత తక్కువే అయినా... కొందరికి తరచూ మూత్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా సాధారణం కంటే చాలా ఎక్కువ సార్లు మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వచ్చే పరిస్థితినే ‘ఓవర్ యాక్టివ్ బ్లాడర్’ అంటారు. ఇది ఆరోగ్యపరంగానే కాదు... సామాజికంగా కూడా బాధితులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. దీంతో ఈ సమస్య ఉన్న బాధితులు నీళ్లు తక్కువగా తాగడం మొదలుపెడతారు. ఫలితంగా సాధారణ జీవక్రియలు, మూత్రపిండాలకు సంబంధించిన మరికొన్ని సమస్యలూ వచ్చే అవకాశముంది. తరచూ నిద్రాభంగం వల్ల ‘నిద్రలేమి’తో వచ్చే ఆరోగ్యసమస్యలు అదనం. ఈ సమస్య లక్షణాలేమిటో, దాన్ని అదుపు చేయడం ఎలాగో తెలుసుకుందాం. కొందరిలో మూత్రాశయపు బ్లాడర్ గోడలు తరచూ అతిగా స్పందించి, త్వరత్వరగా ముడుచుకుపోతూ... మూత్రాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నిస్తాయి. ఈ సమస్యతో బాధపడేవారు తాము ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు అక్కడ టాయిలెట్ గదులెక్కడున్నాయో వెతుక్కుంటూ ఉంటారు. ఈ ప్రవర్తననే ‘‘టాయిలెట్ మ్యాపింగ్’’ అంటారు. ఇక రాత్రివేళ తరచూ పక్క మీది నుంచి లేస్తూ ఉండటం... కేవలం వారిని మాత్రమేగాక వారి భాగస్వామికీ నిద్రాభంగం కలిగిస్తూ ఇబ్బందిగా పరిణమిస్తుంది. దాంతో ఆరోగ్యసమస్య కాస్తా... కుటుంబ సమస్యగా కూడా పరిణమిస్తుంది. ఫలితంగా ఇది వారి ‘జీవననాణ్యత’ (క్వాలిటీ ఆఫ్ లైఫ్)ను దెబ్బతీస్తుంది. మనదేశంలో దీని తీవ్రత... నిజానికి మన దేశంలో ఈ సమస్య ఎక్కువే అయినప్పటికీ దీని గణాంకాలు చాలా తక్కువగా నమోదవుతుంటాయన్నది వైద్య నిపుణుల భావన. అయినప్పటికీ కొన్ని అధ్యయనాల ప్రకారం పురుషుల్లోని 14 శాతం, మహిళల్లో 12 శాతం మందిలోనూ ఈ సమస్య ఉంటుంది. మెనోపాజ్‌కు చేరువైన/ మెనోపాజ్ వచ్చిన మహిళలు, ప్రోస్టేట్ సమస్య ఉన్న పురుషుల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. మేనేజ్మెంట్ / చికిత్స ∙జీవనశైలి మార్పులు : ఇందులో భాగంగా సాధారణ జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకొమ్మని డాక్టర్లు / నిపుణులు సలహా ఇస్తారు. కొందరు అవసరమైన దాని కంటే చాలా ఎక్కువ నీళ్లు తాగుతుంటారు. ఉదాహరణకు... ఉదయాన్నే చేసే మూత్రవిసర్జన వల్ల దేహంలోని చాలా విషపదార్థాలు బయటకు వెళ్తాయనే అపోహతో చాలామంది రెండు లీటర్లకు పైగా నీళ్లు తాగేస్తారు.అవసరానికి మించి నీళ్లు తాగకుండా జాగ్రత్తపడాలి. (ఇందుకు కొంత పరిశీలన, అభ్యాసం అవసరం. మనకు ఎన్ని నీళ్లు సరిపోతాయనే అంశాన్ని మరీ నీళ్లు తక్కువైనప్పుడు డీహైడ్రేషన్‌లో కనిపించే లక్షణాలైన కండరాలు బిగుసుకుపోవడం (మజిల్ క్రాంప్స్) వంటి వాటిని గమనిస్తూ... దేహానికి అవసరమైన నీళ్ల మోతాదును ఎవరికి వారే స్వయంగా గుర్తించగలిగేలా నిశితంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది.); నిద్రపోవడానికి రెండు గంటల ముందుగా నీళ్లు తాగడం...ఆ తర్వాత తాగకపోవడం; పొగతాగడం, కాఫీ (కెఫిన్), ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండటం; ఓవర్ ద కౌంటర్ మందులకు దూరంగా ఉండటం వంటి జీవనశైలి మార్పులతో ఈ సమస్యను చాలావరకు కట్టడి చేయవచ్చు. ►బిహేవియర్ థెరపీ : మానసిక చికిత్సలో భాగంగా ఇచ్చే అభ్యాస చికిత్సతో బ్లాడర్‌పై క్రమంగా అదుపు సాధించేలా చేయడం. ►నోటితో ఇచ్చే మందులు / బ్లాడర్‌కు ఇంజెక్షన్లు : సమస్య తీవ్రత తక్కువగా ఉన్నవారికి నోటితో ఇచ్చే కొన్ని మందులతో... సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారిలో నేరుగా బ్లాడర్ కండరాలు బలోపేతమయ్యేందుకు నేరుగా బ్లాడర్‌లోకి ఇచ్చే కొన్ని ఇంజెక్షన్లతో. ►ఎలక్ట్రిక్ ఇంపల్స్ / స్టిమ్యులేషన్ టెక్నిక్స్ : ఏదైనా నరం దెబ్బతిన్నప్పడు దాన్ని ప్రేరేపించేలా (నర్వ్ స్టిమ్యులేటింగ్ టెక్నిక్స్) చేయడం. ఇందులో భాగంగా మెదడు, వెన్నుపూస నుంచి వచ్చే నరాలు, అవి బ్లాడర్‌కు చేరాక... వాటి నుంచి అందే సిగ్నల్స్ అన్నీ సరిగా అందేలా దెబ్బతిన్న నరాలకు ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన కలిగేలా విద్యుత్ ప్రేరణలు కల్పించడం. ►శస్త్రచికిత్స : ఇది చాలా చాలా అరుదుగా మాత్రమే అవసరమయ్యే ప్రక్రియ. ►పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ ఎక్సర్సైజ్లు : కెగెల్స్ ఎక్సర్సైజ్ అని పిలిచే ఈ వ్యాయామల వల్ల పొత్తికడుపు కండరాలు, యూరినరీ బ్లాడర్ కింది భాగంలోని కండారాలు, మూత్రసంచి (బ్లాడర్) నుంచి బయటకు తీసుకొచ్చే నాళమైన యురెథ్రాకు మధ్య ఉండే ‘నెక్’ లాంటి చోట ఉండే కండరాలు బలోపేతమవుతాయి. ఈ వ్యాయామాలతో మూత్రం ఆపుకోగల సామర్థ్యం క్రమంగా (అంటే 4 – 8 వారాలలో) పెరుగుతుంది. డాక్టర్ల పర్యవేక్షణలో ఫిజియోల సూచనలతో చేసే ఈ వ్యాయామాలతో పరిస్థితి క్రమంగా చాలావరకు మెరుగువుతుంది. ఏ వైద్య నిపుణులను సంప్రదించాలి ‘ఓవర్ యాక్టివ్ బ్లాడర్’తో బాధపడే పురుషులు యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. అలాగే ఓవర్ ఆక్టివ్ బ్లాడర్‌తో బాధపడేవారైనా లేదా స్ట్రెస్ యురినరీ ఇన్‌కాంటినెన్స్ (ఎస్‌యూఐ) ఉన్న మహిళలైనా యూరోగైనకాలజిస్ట్ను సంప్రదించాలి. స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ కొందరు మహిళల్లో మూత్రం నిల్వ అయ్యేందుకు ఉపయోగపడే సంచి అయిన బ్లాడర్‌కు కాకుండా... మూత్రాన్ని బయటకి చేరవేసేందుకు... మూత్రసంచి (బ్లాడర్) నుంచి బయటకు తీసుకొచ్చే నాళమైన యురెథ్రాలో సమస్య ఉంటుంది. ఇలాంటివారిలో ఏ చిన్న ఒత్తిడి పడ్డా వారి యురెథ్రా మూత్రాన్ని బయటకు కారేలా చేస్తుంది. అంటే... దగ్గినా, తుమ్మినా, గట్టిగా నవ్వినా... వారికి తెలియకుండానే మూత్రం కారిపోతుంది. అంటే అర్జెంటుగా మూత్రానికి వెళ్లాలనిపించే భావన వేరు, తమకు తెలియకుండానే మూత్రం పడిపోవడం వేరు. ఇలా... తమకు తెలియకుండానే మూత్రం పడిపోయే సమస్యను స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ (ఎస్‌యూఐ) అంటారు. ఇక్కడ స్ట్రెస్ అంటే మానసిక ఒత్తిడి కాదు. మూత్రసంచి లేదా దాని పరిసరాల్లో ఉండే కండరాలపై పడే చిన్నపాటి ఒత్తిడిని కూడా తట్టుకోలేకపోవడమని అర్థం. ఇది మహిళల్లో చాలా ఎక్కువగా కనిపించే సమస్య. ప్రసవం సమయాల్లో గర్భసంచి నుంచి శిశువు బయటకు వచ్చే మార్గం (బర్త్ కెనాల్) చాలా ఎక్కువగా సాగడం, ఎక్కువ సార్లు కాన్పులు కావడం (మల్టిపుల్ వెజినల్ డెలివరీస్) వంటి అనేక అంశాలు... మూత్రవిసర్జనను నియంత్రించే కండరాలను బలహీనపరచడం వల్ల ఈ సమస్య వస్తుంటుంది. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ ఉన్నవారి కంటే స్ట్రెస్ యూరినరీ ఇన్‌కాంటినెన్స్ సమస్య ఉన్న మహిళలకు ఇవ్వాల్సిన చికిత్స ఒకింత వేరుగా ఉంటుంది. కారణాలు ► ఏదైనా కారణాలతో మెదడు, వెన్నుపూసలోని నరాలు దెబ్బతినడంతో తలెత్తే నాడీ సంబంధ సమస్యల వల్ల. ►పక్షవాతం, మల్టిపుల్ స్కిరోసిస్, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి వాటి కారణంగా. ►వయసు పెరుగుతున్న కొద్దీ బ్లాడర్ కండరాలు బలహీనం కావడం (ఇది అందరిలో జరిగే పరిణామం కాదు... కేవలం కొద్దిమందిలోనే). ►వెన్నుపూస లేదా పెల్విక్ లేదా నడుముకు సర్జరీ జరిగిన కొంతమందిలో. ►కెఫిన్ / ఆల్కహాల్ / కొన్ని ఓవర్ ద కౌంటర్ మందుల వల్ల. ►ఇన్ఫెక్షన్ల (ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) వల్ల. ►స్థూలకాయం వల్ల. ►మహిళల్లో మెనోపాజ్ తర్వాత దేహంలో ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల లోపం వల్ల. డా. శివరాజ్ మనోహరన్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, యాండ్రాలజిస్ట్ – రీనల్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్. -
తప్పుడు ప్రచారం చేయడం తగదు
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో గాయపడిన భారత సైనికులకు సరైన చికిత్స అందించడం లేదన్న విమర్శలను భారత సైన్యం ఖండించింది. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం తగదని హితవు పలికింది. లేహ్‌లోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 3న పరామర్శించిన సంగతి తెలిసిందే. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అక్కడ సరైన వసతులు లేవని, సైనికులను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కొందరు వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు. దీనిపై భారత సైన్యం శనివారం స్పందించింది. ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రచారం చేయొద్దని కోరింది. వీర సైనికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. లేహ్‌లోని జనరల్ హాస్పిటల్లో కొన్ని వార్డులను కరోనా ఐసోలేషన్ వార్డులుగా మార్చారని, అందుకే ఆడియో వీడియో ట్రైనింగ్ హాల్‌ను ప్రత్యేక వార్డుగా తీర్చిదిద్ది, సైనికులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. అక్కడ సకల సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది. -
రైల్వే ఉద్యోగులకు ‘సీజీహెచ్ఎస్’ చికిత్స
న్యూఢిల్లీ: భద్రతా ప్రమాణాలను పెంచడంలో భాగంగా రైల్వే ఉద్యోగులకు పలు చికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. లోకో పైలట్లు, ట్రాక్మెన్లు, గ్యాంగ్మెన్లకు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) కింద ఫిజియో థెరపీ, వృత్తి సంబంధ థెరపీ, స్పీచ్ థెరపీ వంటి చికిత్సలను అందించనున్నారు. ఇప్పటి వరకు ఈ చికిత్సలు రైల్వే ఉద్యోగులకు అందుబాటులో లేవు. ఒక వేళ బయట వేరే చోట చికిత్స చేయించుకున్నా వారికి రీయింబర్స్మెంట్ ఉండేది కాదు. ‘రైల్వేలో పెద్ద సంఖ్యలో డ్రైవర్లు, ట్రాక్మెన్లు, గ్యాంగ్మెన్లు పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ప్రయాణికుల భద్రత వీరిపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో వారికి మెరుగైన చికిత్స అందించాలని నిర్ణయించాం’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
3 లక్షల మందికి ‘కంటి వెలుగు’
సాక్షి, హైదరాబాద్: ‘కంటి వెలుగు’ఇంటింటా కొత్త వెలుగును తీసుకొస్తోంది.. ఈ కార్యక్రమంతో పేదలకు ఎంతో మేలు కలుగుతోంది.. కంటి వైద్యశిబిరాలకు జనం భారీగా తరలివస్తున్నారు.. మూడురోజుల్లోనే మూడు లక్షల మంది పరీక్షలు చేయించుకున్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఆరోగ్యశ్రీ’ని ప్రారంభించినప్పటి మాదిరిగా ‘కంటి వెలుగు’కు భారీ స్పందన కనిపిస్తోందని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మూడు రోజుల్లో మూడు లక్షల మంది పరీక్షలు చేయించుకున్నారని ప్రజారోగ్య శాఖ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. పరీక్షల వివరాలను ప్రభుత్వానికి నివేదించినట్లు వెల్లడించారు. ఈ నెల 15న కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. శని, ఆదివారాలు సెలవుల అనంతరం సోమవారం నుంచి పరీక్షలు పుంజుకుంటాయని పేర్కొన్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రజలు 8 గంటలకే వచ్చి సాయంత్రం ఐదు దాటినా బారులు తీరుతున్నారని అంటున్నారు. ఒక్కోసారి రాత్రి ఏడు గంటల వరకు శిబిరాలు నడుపుతున్నామని అంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. బలహీన వర్గాలే అధికం... కంటి పరీక్షలు చేయించుకున్నవారిలో బడుగు, బలహీన వర్గాలు, పేదలే అధికం. వారిలో వయసు మీరినవారే ఎక్కువ. మూడు లక్షల మందిలో దాదాపు 50 వేల మంది ఎస్సీలు, 18 వేల మంది ఎస్టీలు, లక్షన్నర మంది బీసీలు, మైనారిటీలు దాదాపు 19 వేల మంది ఉన్నారు. దాదాపు 45 వేల మందికి రీడింగ్ గ్లాసులు ఇవ్వగా, మరో 48 వేల మందికి కంటి అద్దాల కోసం చీటీ రాసిచ్చారు. 41 వేల మందికి క్యాటరాక్ట్ లోపం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మరో 2 వేల మందికి సంక్లిష్టమైన క్యాటరాక్ట్ ఉన్నట్లు నిర్ధారించారు. దాదాపు 80 వేల మందికి తదుపరి వైద్య సేవలు అవసరమని గుర్తించారు. అధికారుల్లో ఆందోళన... కంటి వెలుగు కార్యక్రమం కింద 40 లక్షల మందికి రీడింగ్ గ్లాసులు, మూడు లక్షల మందికి కంటి శస్త్రచికిత్సల అవసరం పడుతుందని అధికారులు భావించారు. శస్త్రచికిత్సలు చేసే క్రమంలో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భయపడుతున్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ శిబిరంలో 68 ఏళ్ల వృద్ధురాలు చనిపోవడంతో వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగినా ఉపేక్షించబోమని కిందిస్థాయి అధికారులకు సర్కారు హెచ్చరికలు జారీ చేసింది. -
ఆరోగ్యానికి ‘టాపప్’ బూస్ట్
శ్రీనివాసరావు వయసు 50. ఓ ప్రయివేటు కంపెనీలో పనిచేసి ఈ మధ్యనే వ్యక్తిగత కారణాల రీత్యా మానేశాడు. కంపెనీలో పనిచేసినంత కాలం కంపెనీ ఇచ్చిన ఆరోగ్య బీమా పాలసీ ఉండేది. కంపెనీది ఉంది కదా... అని సొంత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోలేదు. ఇప్పుడేమో కంపెనీలో మానేశాడు. సరే! ఆరోగ్య బీమా పాలసీ ఒక్కటైనా ఉండాలి కదా అని ఆలోచించి... కొన్ని పాలసీలు చూశాడు. అన్నీ బావున్నాయి. కానీ బీమా ప్రీమియం మాత్రం కాస్తంత ఎక్కువగానే ఉంది. అదేంటని సదరు బీమా సిబ్బందిని అడిగాడు శ్రీనివాసరావు. ‘‘మీ వయసును బట్టి చూస్తే మీకు రిస్కు ఎక్కువ కదండీ! అందుకే ప్రీమియం ఎక్కువ. ఒకవేళ ఇంకో ఏడాది రెండేళ్లు పోయాక తీసుకుంటే ప్రీమియం మరింత పెరుగుతుంది’’ అని చెప్పారా సిబ్బంది. అప్పుడు తెలిసొచ్చింది శ్రీనివాసరావుకు!! చిన్న వయసు నుంచే ఆరోగ్య బీమా పాలసీని కొనసాగించటం ఎంత మంచిదో...! – సాక్షి, బిజినెస్ విభాగం నిజమే! వైద్య బీమా పాలసీని చిన్న వయసులోనే తీసుకోవడం... అప్పటి నుంచి దాన్ని కొనసాగించటం ఆరోగ్యానికే కాదు. జేబుకు కూడా చాలా మంచిది. ఉద్యోగంలో చేరిన లేదా ఆర్జన మొదలైన వెంటనే పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ ఎప్పుడో తీసుకుని ఉంటే అది నేటి వైద్య అవసరాలకు అనుగుణంగా సరిపోతుందా? లేదా అన్న సమీక్ష కూడా అవసరమే. దేశంలో కొన్నేళ్లుగా వైద్య ద్రవ్యోల్బణం ఏటా 10 శాతం మేర పెరుగుతూ పోతోంది. 2018లో ఇది 11.3 శాతం మేర ఉంటుందని అడ్వైజరీ సంస్థ విల్లిస్ టవర్ వాట్సన్ నివేదిక స్పష్టం చేసింది. ఇక బీమా సంస్థలయితే వైద్య ఖర్చులు ఏటేటా 15 శాతం మేర భారం అవుతాయని అంచనా వేస్తున్నాయి. కనుక ఓ కుటుంబానికి ఎంత లేదన్నా రూ.10–15 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అవసరం. ఒకవేళ తక్కువ మొత్తానికే పాలసీ తీసుకుని ఉంటే అటువంటి వారు చేయాల్సింది తక్షణం మరో పాలసీ తీసుకోవడం... లేదా టాపప్ వేసుకోవడం. మరో పాలసీ అంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. కనుక టాపప్ లేదా సూపర్ టాపప్ పాలసీని తక్కువ ప్రీమియానికే ప్రస్తుత పాలసీకి కొనసాగింపుగా తీసుకోవచ్చు. టాపప్‌తో ఖర్చు తక్కువ... టాపప్ పాలసీ తీసుకోవడం ద్వారా వైద్య బీమా కవరేజీ పెంచుకోవటమన్నది తక్కువ ఖర్చులో అయిపోయే వ్యవహారం. అపోలో మ్యునిక్, ఐసీఐసీఐ లాంబార్డ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ ఎర్గో, బజాజ్ అలియంజ్ తదితర సంస్థలు ఈ తరహా టాపప్ పాలసీలను అందిస్తున్నాయి. 35 ఏళ్ల వయసున్న వ్యక్తి రూ.5 లక్షల కవరేజీతో హెల్త్ పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం రూ.8,500 నుంచి 13,500 వరకు అవుతుంది. భార్యా, భర్త, వారి ఇద్దరు పిల్లలకు కవరేజీ లభిస్తుంది. దీనికి అదనంగా టాపప్ పాలసీని రూ.10 లక్షల కవరేజీతో తీసుకుంటే ప్రీమియం మరో రూ.4,300 –6,330 మేర చెల్లిస్తే చాలు. కొన్ని పరిమితులున్నాయి... టాపప్ పాలసీలకు కొన్ని పరిమితులుంటాయని తెలుసుకోవాలి. వీటిలో ముఖ్యమైనది ఆరంభ పరిమితి (త్రెషోల్డ్) లేదా మినహాయింపు (డిడక్టబుల్). ఉదాహరణకు బేసిక్ పాలసీ (మొదట తీసుకున్నది) రూ.3 లక్షలకు ఉందనుకోండి. దానికి అదనంగా రూ.10 లక్షలకు టాపప్ తీసుకున్నారనుకోండి. అప్పుడు హెల్త్ క్లెయిమ్ రూ.3 లక్షలు దాటితేనే టాపప్ అమల్లోకి వస్తుంది. దీని ప్రకారం వైద్య బిల్లు రూ.7 లక్షలు వచ్చిందనుకుందాం. అప్పుడు బేసిక్ పాలసీ రూ.3 లక్షలు చెల్లించగా, టాపప్ ప్లాన్ నుంచి రూ.4 లక్షల చెల్లింపు జరుగుతుంది. అలాగే, బేసిక్ పాలసీ రూ.5 లక్షలకు ఉండి, టాపప్ పాలసీ రూ.10 లక్షలకు తీసుకున్నారనుకోండి. అప్పుడు రూ.5 లక్షలు డిడక్టబుల్ అవుతుంది. దీని ప్రకారం ఆస్పత్రిలో బిల్లు రూ.3 లక్షల చొప్పున ఒక ఏడాదిలో రెండు క్లెయిమ్‌లు వచ్చాయనుకోండి. సాధారణంగా బేసిక్ పాలసీ కవరేజీ రూ.5 లక్షల వరకే ఉంది కనుక రూ.లక్షను జేబులో నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక్కో బిల్లు రూ.3 లక్షలుగానే ఉంది. అది బేసిక్ లిమిట్‌ను దాటలేదు. ఒకే బిల్లు బేసిక్ కవరేజీని దాటి ఉంటేనే టాపప్ అక్కరకు వస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. సూపర్ టాపప్ టాపప్ పాలసీల్లో ఉన్న పరిమితులు ఇబ్బందిగా భావించే వారికి సూపర్ టాపప్ పాలసీలున్నాయి. హెచ్డీఎఫ్సీ ఎర్గో, అపోలో మ్యునిక్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ తదితర కంపెనీలు వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఉదాహరణకు మీకు బేసిక్ హెల్త్ పాలసీ రూ.3 లక్షలకు ఉండి రూ.12 లక్షల కవరేజీని సూపప్ టాపప్‌గా తీసుకున్నారనుకుంటే... అప్పుడు రూ.3 లక్షలు డిడక్టబుల్ అవుతుంది. అంటే రూ.4 లక్షలు చొప్పున ఒకే ఏడాదిలో రెండు క్లెయిమ్స్ వచ్చాయనుకోండి. అప్పుడు మొదటి క్లెయిమ్‌లో బేసిక్ పాలసీ నుంచి రూ.3 లక్షలు, టాపప్ నుంచి రూ.లక్ష పరిహారంగా అందుతుంది. రెండో క్లెయిమ్‌లో రూ.4 లక్షలు టాపప్ పాలసీ నుంచే చెల్లింపులు జరుగుతాయి. సూపర్ టాపప్ పాలసీలు రూ.15 లక్షలపైన కవరేజీలను కూడా అందిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ ఎర్గో నుంచి రూ.20 లక్షల సమ్ అష్యూర్డ్‌తో రూ.5 లక్షల డిడక్టబుల్‌తో సూపర్ టాపప్ తీసుకోవాలనుకుంటే ప్రీమియం రూ.3,850 మాత్రమే. ఇది 35 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి కుటుంబానికి (దంపతులు, ఇద్దరు పిల్లలు) సంబంధించిన అంచనా. చూడాల్సిన ఇతర అంశాలివీ... ♦ నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్స పొందేటట్లయితే టాపప్ పాలసీల్లో నగదు రహిత చెల్లింపులు జరిగిపోతాయి. ♦ ముందుగా అనుకుని పొందే చికిత్స అయితే 48 గంటల ముందుగా బీమా కంపెనీకి తెలియజేస్తే సరిపోతుంది. లేదా అత్యవసరం అయి ఆస్పత్రిలో చేరాల్సి వస్తే చేరిన తర్వాత 24 గంటల్లోపు తెలియజేసి అప్రూవల్ తీసుకోవాలి. ♦ రెండూ కాకపోతే చికిత్సకు సొంతగా చెల్లింపులు చేసి తర్వాత రీయింబర్స్మెంట్ పొందొచ్చు. ♦ రెగ్యులర్ పాలసీ అయితే ముందు నుంచి ఉన్న వ్యాధులకు కవరేజీ కోసం కనీస కాలం (వెయిటింగ్ పిరియడ్) వేచి ఉండాలి. అలాగే, కొన్ని వ్యాధులకు చికిత్సా మినహాయింపులు కూడా ఉంటాయి. ♦ ప్రత్యేకంగా కొన్ని వ్యాధులకు కవరేజీ పరిమితులు కూడా ఉండొచ్చు. ♦ రెగ్యులర్ పాలసీ, టాపప్ పాలసీని వేర్వేరు బీమా సంస్థల నుంచి తీసుకుని ఉంటే క్లెయిమ్ కోసం రెండు కంపెనీలకు సమాచారం తెలియజేయడం ఇబ్బందిగా అనిపించొచ్చు. ఒకవేళ వేర్వేరు సంస్థల నుంచి తీసుకున్నప్పటికీ రెండింటితోనూ టైఅప్ ఉన్న నెట్వర్క్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటే ఇబ్బందేమీ ఉండదు. ♦ టాపప్ ప్లాన్లపై నో క్లెయిమ్ బోనస్ రాదు. వీటి లో ప్రవేశ వయసు గరిష్టంగా 65–80 వరకే. ఒకవేళ తల్లిదండ్రులు బేసిక్ ప్లాన్‌లో లేకపోతే, టాపప్ ప్లాన్లలో యాడ్ చేసుకోవచ్చు. ♦ ఇక చివరి అంశం... రెగ్యులర్ పాలసీ లేకపోయినా కానీ టాపప్ ప్లాన్లను తీసుకునే సదుపాయం ఉంది. -
35కు పెరిగిన డయేరియా బాధితులు
కారంపూడి: మండలంలోని మిరియాల గ్రామంలో డయేరియా బాధితుల సంఖ్య 35కు పెరిగింది. ఆదివారం వరకు 18 మంది వ్యాధి బారిన పడి వాంతులు విరోచనాలతో మంచం పట్టి చికిత్సపొందుతుండగా, సోమవారం నాటికి కొత్తగా మరో 17 కేసులు నమోదయ్యాయి. వారిలో ఏడుగురికి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. వీరిలో అలవాల సంధ్యారాణి, కెంటిల్లి సత్యవాణి, ఎం.లక్ష్మిలకు గ్రామంలోనే కారంపూడి పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. నరసారావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్న మేకల అఖిల్, కొండా చలమయ్యల పరిస్ధితి మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. బత్తుల అరుణ, శ్రీలక్ష్మికి ఇంకా వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. పరిస్థితి అదుపులోనే ఉందని డాక్టర్ లక్ష్మీశ్రావణి తెలిపారు. ఇదిలా ఉంటే ఒక వీధికే పరిమితమైన వ్యాధి ప్రస్తుతం గ్రామం మొత్తం విస్తరించింది. అడిషనల్ డీఎంహెచ్ఓ రెడ్డి శ్యామల సోమవారం గ్రామంలోని వైద్య సేవలను పరిశీలించారు. డ్రైనేజిలో ఉన్న మంచి నీటి పైపు లైన్ లీకు కావడం వల్లే వ్యాధి ప్రబలిందని, ముందుగా డ్రైనేజిలో ఉన్న పైపులను తీసి వేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు. గురజాల ఆర్డీవో మురళి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తహసీల్దార్ సాయిప్రసాద్, ఎంపీడీవో హీరాలాల్ ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ అధికారులు గ్రామాన్ని సందర్శించి తగిన తక్షణ చర్యలు చేపడుతున్నారు. జిల్లా అంటువ్యాధుల నివారణ శాఖ అధికారులు కూడా సోమవారం గ్రామంలో పర్యటించి నీటి శాంపిల్స్ సేకరించారు. -
సర్కారు ఆస్పత్రిలో దైన్యం
కోటనందూరు: తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో సుమారుగా లక్షమంది ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంధకారంలో కొట్టు మిట్టాడుతోంది. ఆస్పత్రి లోపల, వెలుపల ఎక్కడా ఒక్క లైటు కూడా లేని దయనీయ పరిస్థితి ఉంది. బ్యాటరీ లైట్ల వెలుగుల్లోనే ప్రసవాలు చేస్తూ, రాత్రి వేళల్లో వచ్చే రోగులకు సెల్, బ్యాటరీ లైట్ల వెలుగులో వైద్యం అందిస్తున్నారు. స్థానిక పంచాయతీ అధికారులు వేయించిన ఎల్ఈడీ వెలుగు మాత్రమే రాత్రి వేళల్లో అక్కడి సిబ్బందికి దిక్కు. ఇక పోతే ఆపరేషన్ థియేటర్లో కనీసం ప్రసవ సమయంలో వెలువడే వ్యర్థాలను బయటకు పంపే సింక్లు లేకపోవడంతో గదిలో వాతావరణం దుర్గంధభరితంగా తయారవుతోంది. ప్రసవానంతరం వినియోగించే బాత్రూంకు ఏడాదిగా తలుపులు లేకపోయినా చిన్న కర్టెన్ కట్టి గడిపేస్తున్నారు. ఈ ఆస్పత్రికి లక్షల రూపాయలు ఆస్పత్రి అభివృద్ధి నిధులున్నా వాటిని ఖర్చు చేయడంలో వైద్యులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ గాని, స్థానిక పాలకులు గాని పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ పరిస్థితి 1962 సంవత్సరంలో సాధారణ ఆస్పత్రిగా ఏర్పడిన ఈ పీహెచ్‌సీని 1998లో నూతన భవనం నిర్మించి ఆరు పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేశారు. అవసరాలకు అనుగుణంగా భవనం లేకపోవడంతో ఆరు నెలల క్రితం వరకూ పాత భవనంలోనే వైద్య సేవలు నడిచాయి. పాత భవనం ఏ సమయంలోనైనా కూలిపోయే పరిస్థితిలో ఉండడంతో ఆరు నెలల క్రితం వైద్య సేవలను నూతన భవనంలోకి మార్చారు. ఇన్‌పేషెంట్లు, ఓపీ, మందుల పంపిణీ, వైద్యులు, సిబ్బంది విశ్రాంతి, ఇతర అవసరాలకు చాలినన్నీ గదులు లేకపోవడంతో రోగులతో పాటు సిబ్బంది అవస్థలు పడుతున్నారు. అరకొరగా వైద్య సేవలు ♦ పీహెచ్సీలో ఇద్దరు కాంట్రాక్టు వైద్య సిబ్బంది ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ విధులు నిర్వహించాల్సిన వీరు రోజు విడిచి రోజు ఒకరు చొప్పున వస్తున్నారని రోగులు అంటున్నారు. పది గంటల తరువాత వచ్చి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని వారంటున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆస్పత్రులకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని వారు ఆరోపిస్తున్నారు. డిప్యుటేషన్‌పై సిబ్బంది ♦ ఆస్పత్రిలో పని చేయాల్సిన కొందరు సిబ్బంది డిప్యుటేషన్‌పై వారికి అనువుగా ఉన్న చోటకు వెళ్లిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా స్థాయి అధికారులను ప్రభా వితం చేసి విధి నిర్వహణలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. 30 పడకల ప్రతిపాదన పడకేసినట్టే ♦ ఆస్పత్రిని 30 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామంటూ పదేళ్లుగా ప్రకటనలు చేయడం తప్ప పాలకులు పట్టించుకోవడం లేదు. ఆస్పత్రి అధ్వానంగా ఉంది ఇక్కడి పీహెచ్సీ పరిస్థితి అధ్వానంగా ఉంది. పాము కుట్టిందని మా బందువుని తీసుకొస్తే బ్యాటరీ లైట్ల వెలుగులో వైద్య చేశారు. ఒక్క ఫ్యానుగాని, తాగడానికి మంచినీళ్లు గానీ, కూర్చోడానికి బల్ల లు గాని లేవు. జన సంచారం లేని అడవిలో ఉన్న ఆస్పత్రిగా ఉంది. అధికారులు స్పందించి కనీస వసతులు ఏర్పాటు చేయాలి. – కోడి నానాజీ, రోగి బంధువు,ఎంబీపట్నం, నాతవరం మండలం, విశాఖజిల్లా. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం ఇటీవలే ఆసుపత్రికి వచ్చాను. గతంలో పని చేసిన ఆస్పత్రితో సంబంధం ఉన్న విషయాల పరిష్కారానికి అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. 15 రోజులుగా రోజు ఆస్పత్రికి వచ్చి నిర్ణీత సమయం వరకూ విధి నిర్వహణలో ఉంటున్నాను. సొంత డబ్బులు ఇచ్చి ఆస్పత్రిలో బల్బుల ఏర్పాటు చేయమని చెప్పాను. కాని ఎలక్ట్రీషియన్ దొరకలేదని సిబ్బంది చెబుతున్నారు. సమస్యల పరిష్కారానికి ఇటీవల జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశం దృష్టికి తీసుకువెళ్లాం. రూ.2.24 లక్షలతో వివిధ ఉపకరణాల కొనుగోలుకు కమిటీ నిర్ణయం తీసుకుంది. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం – డాక్టర్ సందీప్, వైద్యాధికారి,కోటనందూరు పీహెచ్సీ -
సేవకు సెలవ్!
స్విమ్స్ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోంది. ఈఎస్ఐ ఆస్పత్రి రెఫరల్ సేవలను నిర్దాక్షిణ్యంగా ఆపేసింది. ఏడాదిగా రూ.9 కోట్ల బకాయి చెల్లించలేదన్న సాకుతో కార్మికుల సేవకు నిరాకరిస్తోంది. పది రోజులుగా టై అప్ లెటర్లు మంజూరు చేయకుండా కార్మికులను ముప్పుతిప్పలకు గురిచేస్తోంది. విధిలేని పరిస్థితిలో కొందరు కార్మికులు విజయవాడ ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఇటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. తిరుపతి (అలిపిరి): కార్మిక రాజ్య బీమా సంస్థ ద్వారా స్విమ్స్‌లో వైద్య సేవలు పొందుతున్న రోగులకు కష్టాలు తప్పేట్లు లేవు. ఈ నెల ఒకటో తేదీ నుంచి కొత్త కేసులు తీసుకోవడానికి స్విమ్స్ నిరారించిం ది. ఈఎస్ఐ కార్పొరేషన్ స్విమ్స్‌కురూ.9 కోట్లు బకాయి చెల్లించకపోవడంతో స్విమ్స్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈఎస్ఐ కార్డులున్న కార్మికులు, ఉద్యోగులు వైద్య సేవలు పొందడానికి తంటాలు పడాల్సి వస్తోంది. బిల్లుల చెల్లింపులో కార్మిక రాజ్య బీమా సంస్థ జాప్యం చేస్తోందని, ఆడిటింగ్ సమయంలో లోటు బడ్జెట్‌ను చూపించడం కష్టతరంగా మారడం వల్ల కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్విమ్స్ అధికారులు చెబుతున్నారు. విజయవాడకు రెఫర్ స్విమ్స్ రెఫరల్ కేసును తీసుకోకపోవడంతో తిరుపతి ఈఎస్ఐ ఆస్పత్రి అధికారులు చేసేది లేక విజయవాడలోని ఆస్పత్రులకు పంపుతున్నారు. ఈఎస్ఐ పరిధిలో తిరుపతిలో శ్రీరమాదేవి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఉన్నా అందులో పూర్తి స్థాయిలో అన్ని విభాగాలు అందుబాటులో లేకపోవడంతో విధిలేని పరిస్థితిలో రోగులను విజయవాడ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. 20 ఏళ్లలోరూ.300 కోట్లు చెల్లింపు.. గడిచిన 20 ఏళ్లలో ఈఎస్ఐ కార్పొరేషన్ స్విమ్స్‌కు రూ.300 కోట్లు చెల్లిం చింది. బకాయిలు సకాలంలో చెల్లించినా.. కొంతకాలంగా ఈఎస్ఐ కార్పొరేషన్లో దస్త్రాల కదలికలో తీవ్ర జాప్యం చోటుచేసుకోంది. స్విమ్స్‌కు బకాయి చెల్లింపుల్లో ఆలస్యమవుతోంది. బకాయి ని సాకుగా చూపి స్విమ్స్ యాజమాన్యం కార్మికులకు వైద్యం నిరాకరించడంపై సర్వత్రా విమర్శలు తలెత్తుతున్నాయి. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈఎస్ఐ కార్డులున్న ఉద్యోగులకు స్విమ్స్‌లో వైద్య సేవలు అందేలా తక్షణం చర్యలు తీసుకోవాల్సింది. టై అప్ లెటర్‌మంజూరుకు నిరాకరణ ఈఎస్ఐ ఆస్పత్రి రెఫర్ చేసిన కేసులకు స్విమ్స్‌లో అడ్మిషన్లు ఇవ్వడం లేదు. కనీసం టై అప్ లెటర్లూ మంజూరు చేయడం లేదు. రోగి వివరాలతో కూడి న టై అప్ లెటర్‌ను ఈఎస్ఐ కార్పొరేషన్‌కు పంపుతుంది. అప్రూవల్ వచ్చిన తర్వాత ఈఎస్ఐ ఆస్పత్రి రెఫరల్ చేస్తుంది. కార్పొరేషన్లో బకాయి మం జూరులో తీవ్రజాప్యం చోటు చేసుకోవడంతో ఈఎస్ఐ కార్డులున్న ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. -
కార్డు పని చేయదు..వైద్యం అందదు
ఉద్యోగులకు నగదురహిత వైద్యంప్రకటనలకే పరిమితమైంది.వారికిచ్చిన హెల్త్‌కార్డులు నిరుపయోగంగా మారాయి.నెలనెలా ప్రీమియం వసూలుచేస్తున్నా వైద్యం అందించే విషయంలోసర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులు నగదు రహితవైద్యం చేయడానికి నిరాకరిస్తున్నాయి.దీంతో తప్పని పరిస్థితిలో ఉద్యోగులు,ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ చేతిలో నుంచి డబ్బులు ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. కడప ఎడ్యుకేషన్: నగదు రహిత వైద్యం అమలుకు నోచుకోవడం లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ, òపెన్షనర్లకు ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే పూర్తి ఉచితంగా నగదు రహిత వి«ధానంలో వైద్యం అందుతుందని సీఎం చంద్రబాబునాయుడు 2014 నవంబర్‌లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అట్టహాసంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఉద్యోగులకు, పెన్షనర్లకు కార్డులను కూడా జారీచేశారు. ఇవన్నీ ఇచ్చి దాదాపు మూడేళ్లు పూర్తయినా ఇప్పటికీ హెల్త్‌కార్డుల వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. 2014కు ముందు రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు మెడికల్ రీయింబర్స్మెంట్ విధానం కొనసాగుతుంది. ఈ విధానం ద్వారా ఉద్యోగుల నుంచి ఎటువంటి డబ్బులు వసూలు చేయకుండా ముందుగా నగదు చెల్లించి ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న తర్వాత ఆయా శాఖలకు బిల్లులు సమర్పించి గరిష్టంగా రూ.2లక్షల వరకూ పొందేవారు. అయితే ఈ విధానం కాదని ఆసుపత్రులకు వెళ్లిన వెంటనే పూర్తి ఉచితంగా నగదు రహిత విధానంలో వైద్యం అందించడానికి హెల్త్‌కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. నెలనెలా ప్రీమియం వసూలు 2014 నవంబర్ నుంచి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల వేతనాల నుంచి ప్రతి నెల రూ.90 రూ.120లను వారి వేతన శ్రేణిని బట్టి ప్రీమియం రూపంలో వసూలు చేస్తున్నారు. ఈ రకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నుంచి వసూలు చేసిన మొత్తం ద్వారా దాదాపు రూ.350 కోట్లు ప్రభుత్వానికి జమవుతున్నట్లు తెలిసింది. ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేయబట్టి మూడేళ్లైనా కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు హెల్త్‌కార్డుల ద్వారా వైద్యం అందించడానికి నిరాకరిస్తున్నాయి. జిల్లా కేంద్రాల్లోని చిన్న చిన్న ఆసుపత్రుల్లో కొన్ని చిన్న వ్యాధులకు మాత్రమే వైద్యం అందుతుంది. దంత, కంటి సమస్యలతోపాటు చిన్నచిన్న శస్త్రచికిత్సలు చేస్తున్నారు తప్ప పెద్దవ్యాధులకు వైద్యం చేయడం లేదు. క్యాన్సర్, గుండె, కిడ్నీ మార్పిడి, కాలేయ సంబంధిత వ్యాధులకు రూ.5 నుంచి రూ.10 లక్షల వరకూ ఉద్యోగులకు ఖర్చవుతుంది. హైదరాబాద్‌లోని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ వైద్యశాలల్లో హెల్త్‌కార్డులు చెల్లుబాటు కాకపోవడంతో పెన్షనర్లు ఉద్యోగులు ముందుగా డబ్బులు కట్టి వైద్యం చేయించుకోవాల్సి రావడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురై అప్పులపాలవుతున్నారు. జిల్లాలో ఉద్యోగ,ఉపాధ్యాయ పెన్షనర్లుఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు జిల్లావ్యాప్తంగా 35వేలమంది దాకా ఉన్నారు. వీరందరూ నెలకు ఒకొక్కరు రూ.90, 120 ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇలా గత మూడేళ్ల నుంచి తాము ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తున్నామని, అయినా నగదు రహిత వైద్యం అందడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు కట్టి వైద్యం చేయించుకున్నా.. ప్రస్తుతం హెల్త్‌కార్డులు అమలుకాకపోవడంతో చాలామంది డబ్బులు కట్టి వైద్యం చేయించుకుంటున్నారు. చికిత్స పూర్తయిన తర్వాత మెడికల్ రీయింబర్స్ విధానం ద్వారా బిల్లులను సమర్పిస్తే ఒక్కో బిల్లుకు గరిష్టంగా రూ.2లక్షలను చెల్లిస్తున్నారు. ఆ మొత్తాలు కూడా ఏ ఆరునెలలకో ఏడాదికో మంజూరవుతున్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మెడికల్ రీయింబర్స్మెంట్ గడువును కూడా రాష్ట్రప్రభుత్వం ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వస్తూ ఉంది. ఆ గడువు కూడా మార్చి 31కి ముగియనుంది. -
సాయం చేస్తే..ప్రమాదం కాదు
రోడ్డు పమాదాల్లో.. ఇతర చోట్ల క్షతగాత్రులకు, బాధితులకు సాయం చేసేవారు ఇకపై కేసులకు భయాపడాల్సి అవసరం లేదు. ఎందుకంటే సాయం చేసిన వారిని.. వారి సమ్మతి లేకుండా కనీసం సాక్ష్యానికి కూడా పిలవకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. తిరుపతి క్రైం: ఒకటి కాదు.. రెండు కాదు.. నగరంలో రోజూ ఏదో ఒకచోట రోడ్డుప్రమాదాలు జరగడం సర్వసాధారణమయ్యాయి. ఈ నేపథ్యంలో క్షతగా త్రులకు వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వ నిబంధనలు ప్రతిబంధకంగా ఉన్నాయి. బాధితుల అత్యవసర పరిస్థితి చూసి ఎవరైనా స్పందించి ఆస్పత్రిలో చేర్చినా, వారిని పోలీసులు విచారణ పేరుతో వేధింపులు ఎక్కువగా ఉండేవి. వివరాలు సేకరించేందుకు గంటల తరబడి నిలిపేసేవారు. ఇది చాలదన్నట్లు కేసులంటూ కోర్టుల చుట్టూ తిప్పేవారు. ఫలితంగా ఈ నిబంధనల జంజాటం మనకెందుకులే అనుకుంటూ జనం సాయానికి వెనుకడుగు వేసేవారు. ఆ సమయంలో రక్షించడానికి అవకాశం ఉన్నా కూడా ఎవరూ బాధ్యత తీసుకునేందుకు సిద్ధపడేవారు కాదు. ఈ పరిస్థితి మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. గెజిట్ నోటిఫికేషన్ ఏం చెప్పింది? రోడ్డుప్రమాదంలో బాధితులకు తక్షణ సాయం అందించేందుకు, వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించేవారికి ఏవిధమైన ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రప్రభుత్వం సరికొత్త నిబంధనలతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఢిల్లీకి చెందిన ఓ స్వచ్ఛందసేవా సంస్థ సేవ్‌లైవ్ ఫౌండేషన్ ప్రమాద బాధితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రమాద బాధితులకు, సాయం చేసే వారికి అనుకూలంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిప్రకారం ప్రమాద బాధితులకు సాయం చేసేవారు తమ వివరాలను చెప్పకపోయినా.. వారు తీసుకొచ్చిన క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చుకోవా ల్సిందే. వారు తమ వివరాలను వెల్లడించి స్వచ్ఛందంగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతామంటేనే పోలీసులు వారి వివరాలు నమోదు చేసుకోవాలి. లేనిపక్షంలో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి రక్షకులు వెళ్లిపోవచ్చు. ఇంకా గెజిట్‌లో ఏఏ నిబంధనలు ఉన్నాయంటే. పేరు చెప్పాల్సిన అవసరం లేదు.. రోడ్డు ప్రమాద బాధితులను సమీపంలోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తీసుకుని రావచ్చు. అతన్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచి వెంటనే వెళ్లిపోవచ్చు. ఆస్పత్రి సిబ్బంది రక్షించిన వ్యక్తిని వివరాలేమీ అడగరు. ఉండమని చెప్పరు. రోడ్డుప్రమాదంలో ఇరుకున్నవారికి, సాయంచేసిన వారి వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఇతరులకు వెల్లడించకూడదు. ఒకవేళ డిమాండ్ చేస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు. క్షతగాత్రులకు సత్వరమే వైద్యం ప్రమాద బాధితులకు డాక్టర్లు తక్షణమే చికిత్స అం దించాలి. ఏ వైద్యుడైనా, ఏకారణం లేకుండా చికిత్స చేసేందుకు నిరాకరిస్తే అతనిపై ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు ఈ నిబంధనలు ంటనే అమలు చేయాలని కేంద్రం పేర్కొంది. ఒక్కసారే కోర్టుకు... ఎవరైనా రోడ్డుప్రమాదానికి ప్రత్యక్ష సాక్షి అయితే కేసు దర్యాప్తులో భాగంగా తన వివరాలను పోలీసులకు స్వచ్ఛందంగా అందజేయవచ్చు. ఇలాంటి కేసుల విచా రణలో భాగంగా సాక్ష్యం చెప్పేందుకు ఒక్కసారి కోర్టు కు హాజరుకావాల్సి ఉంది. అయితే అతన్ని విచారణ పేరిట వేధింపులకు గురి చేయకూడదు. ఎప్పుడు రావాలో సదరు సాక్షికి ముందస్తుగా తెలియజేయాలి. తరువాత అతన్ని ఎప్పుడూ పిలువ కూడదు. -
పశువైద్యాధికారికి బదులుగా వోఎస్ భర్త!
ఇక్కడ పశువుకు వైద్యం చేస్తున్న వ్యక్తి పశువైద్యుడనుకుంటే పొరపాటే. ఈయన కనీసం ఆస్పత్రిలో ఉద్యోగి కూడా కాదు. కానీ అక్కడి ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్) భర్త. ఇలా నేరుగా చికిత్సలు చేసేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడమే ఇక్కడి విశేషం. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం చింతాడ గ్రామీణ పశువైద్య కేంద్రంలో అటెండర్‌గా కాంట్రాక్ట్ పద్ధతిలో మరడాన లక్ష్మి పనిచేస్తున్నారు. కానీ ఆమెకు బదులుగా భర్త సింహాచలం హాజరై ఇలా చికిత్సలు చేసేస్తుంటారు. ఇక్కడ ఓ లైవ్‌స్టాక్ అసిస్టెంట్ ఉన్నా ఆయన ఇదేమీ పట్టించుకోవడం లేదు. దీనిపై పాత్రికేయులు ఆయన్ను ప్రశ్నిస్తే ఆయనకు అన్నీ తెలుసు. అందుకే మేమేం అడ్డుచెప్పట్లేదంటూ తప్పించుకున్నారు. కాగా, ఆయనా సక్రమంగా విధులకు హాజరుకావడం లేదని స్థానికులు చెబుతున్నారు. – బొబ్బిలి రూరల్ -
బట్టతలా.. ఇక బాధపడకండి!
బట్టతలకు ఎన్ని రకాల ట్రీట్మెంట్లు తీసుకున్నా ఫలితం లేదా..? అయితే ఇంకొంత కాలం వేచి చూడండి.. తలపై మళ్లీ వెంట్రుకలు పెరిగేలా చేసే సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చేస్తోంది అంటున్నారు అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. శరీరంలోని ఏ కణంలా అయినా మారగలిగే మూలకణాలనే పోలిన ప్రొజెనిటర్ కణాల ద్వారా ఇది సాధ్యమవుతోందని చెబుతున్నారు. ప్రొజెనిటర్ కణాలు ఆర్గనాయిడ్స్‌గా అంటే అవయవాన్ని పోలినట్లు మారగలవని తమ పరిశోధనల్లో తెలిసిందని, ఆ తర్వాత దశల వారీగా ఈ ఆర్గనాయిడ్స్ ఉన్న చోట చర్మం, వెంట్రుక కుదుళ్లు ఏర్పడ్డాయని.. వీటిని ఎలుక చర్మంపై ఏర్పాటు చేసినప్పుడు అక్కడ వెంట్రుకలు పెరిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. బట్టతల ఉన్న వారి నుంచే ప్రొజెనిటర్ కణాలను సేకరించి లేబొరేటరీల్లో వెంట్రుకల కుదుళ్లు కలిగిన చర్మాన్ని అభివృద్ధి చేస్తారని.. ఈ చర్మాన్ని తలపై అతికించడం ద్వారా అక్కడ వెంట్రుకలు పెరిగి బట్టతల మాయమవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే ఈ పద్ధతిని మానవులపై పరీక్షిస్తామని చెబుతున్నారు. -
మళ్లీ వికటించిన చికిత్సలు
సాక్షి, హైదరాబాద్: నలుగురు బాలింతలు బలైనా ప్రభుత్వ ఆసుపత్రులకు పట్టిన నిర్లక్ష్యం జబ్బు వదలడం లేదు. వరుస మరణాలు సంభవిస్తున్నా మార్పు కనిపించడంలేదు. తాజాగా సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో మళ్లీ చికిత్సలు వికటించాయి. ఆరుగురు బాలింతల పరిస్థితి విషమంగా మారింది. వీరిలో నలుగురిని గాంధీ జనరల్ ఆసుపత్రికి, మరో ఇద్దరిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందజేస్తున్నారు. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలతో ప్రభుత్వం తాత్కాలికంగా సిజేరియన్లును నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆపరేషన్ థియేటర్లను శుభ్రం చేసి, ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్ లేదని నిర్ధారించుకున్న తర్వాత ఇటీవల మళ్లీ వాటిని తెరిచారు. పడిపోయిన బీపీ... తీవ్ర రక్తస్రావం...: ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన బాధితుల్లో పది మందికి గురువారం సిజేరియన్ చేయగా, వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా మారింది. ఒక్కసారిగా బీపీ పడి పోవడంతో పాటు అధిక రక్తస్రావంతో బాధపడుతున్న మౌనిక, మీనాక్షి, రజిత, సాజియా బేగంను గాంధీ జనరల్ ఆస్పత్రికి తరలించగా, స్వప్న, యమునలను ఉస్మానియాకు తరలించారు. ఫంగస్ ఉన్న సెలైన్ ఎక్కించడం వల్లే బాధితుల ఆరోగ్య పరిస్థితి విష మించిందని బంధువులు ఆరోపి స్తుండగా, తమ వద్దకు వచ్చిన వారంతా హైరిస్క్ బాధితులని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. సెలైన్ బాటిళ్లు వెనక్కి...: కాగా, ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉన్న ‘ప్రెసీనియస్’కంపెనీ సెలైన్ బాటిళ్ల వినియోగాన్ని నిలిపి వేశారు. వాటి ని వెంటనే సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు తిప్పి పంపాలని డైరెక్టరేట్ ఆఫ్ మెడి కల్ ఎడ్యుకేషన్ ఆయా ఆసుపత్రు లకు ఆదేశాలు జారీ చేసింది. -
భవితకు బాటేదీ?
ధర్మవరం : భవిత కేంద్రాల్లోని ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు వైద్యసేవల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో వీరు ప్రత్యేక అవసరాలు కల్గిన పిల్లలుగానే ఉండిపోవాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2,223 పాఠశాలల్లో 7,212 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు. వీరికి ఈ ఏడాది ఫిజియోథెరపీ సేవలు అందలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వారానికి ఒకరోజు చొప్పున ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఫిజియోథెరపీ శిబిరాన్ని నిర్వహించేవారు. వారికి ఉచితంగా చికిత్స అందించేవారు. ఇందుకోసం ప్రభుత్వం ఔట్సోర్సింగ్ విధానంలో ఫిజియోథెరపిస్ట్‌లను నియమించేది. సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఆధ్వర్యంలో నడిచే భవిత కేంద్రాల్లో ఆయా ఫిజియోథెరపిస్ట్‌లు విద్యార్థులతో తగిన వ్యాయామం చేయించేవారు. ఇంటివద్ద కూడా వ్యాయామం చేయించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించేవారు. ఈ ఏడాది మాత్రం వైద్యసేవల గురించి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. వేసవి సెలవుల తరువాత ఫిజియోథెరపీ సేవలకు మంగళం పాడారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడునెలలు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క శిబిరం కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం సమకూర్చిన పరికరాలు ఎమ్మార్సీలు, భవిత కేంద్రాల్లో మూలనపడ్డాయి. శారీరక, మానసిక వైకల్యం కల్గిన చిన్నారులకు తగిన వ్యాయామం లేక పరిస్థితి మొదటికి వస్తోంది. వారి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అనుమతి రాలేదు ఫిజియోథెరపీ శిబిరాల విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులూ రాలే దు. ప్రభుత్వం ఇంకా ఫిజియోథెరపిస్టులను ఎంపిక చేయలేదు. ఈ ప్రక్రియ పూర్తయితే వైద్యసేవల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తాం. – నూర్ అహమ్మద్, ధర్మవరం మండల విద్యాధికారి ఎకరాకు రూ.15 వేల నష్టపరిహారమివ్వాలి అనంతపురం అర్బన్: జిల్లాలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతినిందని, ఎకరాకు రూ.15 వేలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ గేయానంద్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీనా మేషాలు లేక్కిస్తూ పంట నష్టాన్ని తక్కువగా చూపే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. రైతుల మనోధైర్యాన్ని కాపాడేందుకు బేషరుతుగా పంట నష్ట పరిహారాన్ని ప్రకటించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే రాయలసీమను కరువు లేని ప్రాంతంగా మారుస్తామని ప్రకటిస్తున్నారన్నారు. కరువు రైతులకు వెంటనే పంట నష్ట పరిహారం ప్రకటిండం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలిపారు. -
కంటికి జిమ్
ఒంటికి జిమ్ లాగే కంటికీ జిమ్ ఉంటుంది. కానీ, కంటికి చేయవలసిన వ్యాయామాలు కొన్ని వ్యాధులు ఉన్నప్పుడు వాటి చికిత్సకోసం ఉపయోగపడుతాయి. ఒంటికి చేసే వ్యాయామం ప్రాధాన్యం మనకు తెలియనిది కాదు. ఆయా అవయవాలకోసం చేసే ప్రత్యేక వ్యాయామాలు వాటి బలాన్ని, సామర్థ్యాన్ని పెంచేందుకు అవి ఉపకరిస్తాయి. అలాగే కంటికి చేసే ఈ వ్యాయామాల వల్ల రెండు కళ్లూ ఒకేలా చూసే క్రమంలో (బైనాక్యులార్ విజన్‌లో) ఏవైనా లోపాలు వచ్చినప్పుడు వాటిని సరిదిద్దవచ్చు. వీటిని ఎలా చేయాలో కంటి వైద్య నిపుణులు సూచిస్తుంటారు. కంటి కోసం వ్యాయామాలు చేయాల్సిన అవసరం ఎప్పుడొస్తుంది, వాటిని సందర్భాల్లో సూచిస్తారు అన్న విషయాలు తెలుసుకుందాం. దృష్టిని మెరుగుపరిచేందుకు ఆఫ్తాల్మాలజిస్టులు కంటి వ్యాయామాలు చేయించడం 1928లో మొదలైంది. దీన్ని ఒక ప్రత్యేక విభాగంగానూ అభివృద్ధి చేశారు. కంటికి చేయించే వ్యాయామాల విభాగాన్ని వైద్య పరిభాషలో ‘ఆర్థాప్టిక్స్’ అంటారు. ఈ విభాగాన్ని తొలిసారి బ్రిటన్ గుర్తించింది. కంటి వ్యాయామాలకు ఇంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్నా నిజానికి సాధారణ ప్రజల్లో దీని గురించిన అవగాహన పరిమితమే. ఎలాంటి సందర్భాల్లో కంటి వ్యాయామాలు అవసరం? కంటికి సంబంధించి మూడు రకాలుగా ఉపయోగపడేలా కంటి వ్యాయామాలు చేయవచ్చు. చికిత్సలో భాగంగా వీటిని చేయించడం ద్వారా నిపుణులు దృష్టిని మెరుగుపరచగలరు. అవి... 1) తప్పక ఉపయోగపడతాయని నిరూపితమైనవి : మెల్లకన్ను లేదా స్ట్రాబిస్మస్ : రెండు కళ్ల చెందిన నల్లగుడ్లు ఒకేలా లేని (విజువల్ యాక్సిస్ పారలల్‌గా లేని) సందర్భాన్ని మెల్లకన్ను లేదా స్ట్రాబిస్మస్ అంటారు. సాధారణ వ్యక్తులందరిలోనూ రెండు కళ్లతోనూ ఒకే దృశ్యాన్న చూస్తుంటారు. దీన్ని బైనాక్యులార్ సింగిల్ విజన్ అంటారు. కానీ మెల్లకన్ను వ్యాధి ఉన్నవారిలో రెండు కనుగుడ్లూ ఒకేచోట కేంద్రీకృతం కావు. కనుగుడ్డు తిరిగి ఉన్న పొజిషన్ ఆధారంగా దీన్ని నాలుగు రకాలుగా విభజిస్తారు. అవి... ఎ) ఎగ్సోట్రోఫియా (కనుగుడ్డు బయటివైపునకు తిరిగి ఉండటం) బి) ఈసోట్రోఫియా (కనుగుడ్డు లోపలి వైపునకు తిరిగి ఉండటం) సి) హైపర్ట్రోఫియా (పై వైపునకు తిరిగి ఉండటం) డి) హైపోట్రోఫియా (కిందివైపునకు తిరిగి ఉండటం) సరిచేసే వ్యాయామాలు : మెల్లకన్నులోని పై నాలుగు లోపాలను సరిచేయడానికి రకరకాల వ్యాయామాలు ఉన్నాయి. అందులో కొన్ని ఇవి... 1) పెన్సిల్ పుష్అప్స్ (ఇందులో ఒక పెన్సిల్‌ను ముక్కుకు సూటిగా పెట్టుకొని దగ్గరగా, దూరంగా జరుపుతుంటారు) 2) బ్రోక్ స్ట్రింగ్ (ఫ్రెడ్రిక్ బ్రోక్ అనే నిపుణుడు రూపొందించిన ఈ వ్యాయామ రీతికి ఆయన పేరునే పెట్టారు. ఇందులో ఒక పది అడుగుల పురికొసపైన దారానికి మూడు పూసలు ఎక్కించి, ఆ పూసల స్థానాలను మారుస్తూ వాటిని కంటితో చూసేలా వ్యాయామం చేయిస్తారు). 3) బ్యారెల్ కార్డ్స్ ఎక్సర్సైజ్ (పేకముక్కల వంటి వాటిపై వేర్వేరు రంగులను అద్ది, ఒక్కోముక్కపైనా కాసేపు దృష్టిసారిస్తూ, మరో ముక్కవైపునకు దృష్టి మళ్లిస్తూ చేసే ఒక రకం వ్యాయామం ఇది). ఇవీగాక ప్రత్యేకమైన వైద్యపరమైన పరికరాలతోనూ వ్యాయామాలు చేయిస్తారు. ఆంబ్లోపియా (లేజీ ఐ): ఇందులో చూడటానికి రెండు కళ్లూ బాగానే కనిపించినా ఒక కంటి నుంచి మెదడుకు అందే దృశ్యంలో స్పష్టత తగ్గుతూ ఉండటం వల.్ల... మెదడు నాణ్యమైన దృశ్యం అందే కంటి నుంచే దృష్టి సంకేతాలను స్వీకరిస్తుంటుంది. అంతగా నాణ్యత లేని కంటి నుంచి సంకేతాలను నిరాకరిస్తూ ఉండటం వల్ల క్రమంగా ఒక కంటి చూపు తగ్గుతూ పోతుంది. ఈ ప్రక్రియను సప్రెషన్ అంటారు. కాలక్రమంలో ఆ కన్ను చూపును కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ కండిషన్‌ను సరిచేయడానికి వ్యాయామాలు ఉంటాయి. దీనికి అక్లూజన్ అనే వ్యాయామం చేయిస్తారు. ఇందులో బాగా కనపడే కంటిని పాక్షికంగానో లేదా పూర్తిగా మూసి, సరిగా కనిపించని కంటి ద్వారా మంచి నాణ్యమైన సంకేతాలు మెదడుకు అందేలా క్రమంగా అలవాటు చేస్తారు. దాంతో నాణ్యమైన సంకేతాలు పంపడం మానేసిన ‘లేజీ ఐ’ కూడా క్రమంగా బలపడుతూ పోతుంది. 2) దృష్టిని మెరుగుపరచడానికి పరోక్షంగా ఉపయోగపడేవి మామూలుగా మనం చేసే వ్యాయామ కార్యకలాపాలు మన పూర్తి ఆరోగ్యానికి మేలు చేసినట్లే, మన కళ్లకూ బలాన్ని చేకూర్చి, అనేక కంటి వ్యాధులను నివారిస్తాయి. మనం చేసే వ్యాయామాలు మన రక్తంలోని కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో పెడతాయి. వ్యాయామంతో అన్ని అవయవాలకు రక్తసరఫరా పెరిగినట్లే, కళ్లకూ రక్తసరఫరా పెరిగి ఎక్కువ మోతాదులో ఆక్సిజన్, పోషకాలు అందుతాయి. దాంతో కళ్లు, కంటి కండరాలు కూడా బలపడతాయి. కంటికి వచ్చే అనేక వ్యాధులు వాటంతట అవే నివారితమవుతాయి. అవి... క్యాటరాక్ట్ (కళ్లలో తెల్ల ముత్యం), ఏఆర్‌ఎమ్‌డీ (ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజనరేషన్), డయాబెటిక్ రెటినోపతి, హైపర్టెన్సివ్ రెటినోపతి, గ్లకోమా వంటివి. 3) కంటి ఆరోగ్యానికి తాత్కాలికంగా మాత్రమే ఉపయోగపడేవి ఇవి కంటిపై ఉన్న భారాన్ని తాత్కాలికంగా తొలగించి, కొద్దిపాటి ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. అప్పటికప్పుడు కనిపించే ప్రయోజనమే తప్ప దీర్ఘకాలిక లాభం ఉండని వ్యాయామరీతులుగా వీటిని చెప్పవచ్చు. అవి... ♦ కనుగుడ్డును కదిలిస్తూ ఉండటం; ♦ రెండుకళ్లనూ అరచేతులతో మూసుకొని కళ్లకు తాత్కాలిక విశ్రాంతి ఇచ్చి, కొంతసేపు ఉపశమనం కలిగించడం (దీన్ని పామింగ్ అంటారు); ♦ బ్లింకింగ్ (రెండు రెప్పలనూ ఠక్కున కొడుతూ ఉండటం, ఈ ప్రక్రియలో కారు అద్దాలపై నీరు చిమ్మి వైపర్స్‌తో శుభ్రం చేసినట్లుగానే, కంటిలోని నీటి (లాక్రిమల్ సెక్రిషన్స్) సహాయం వల్ల బ్లింకింగ్ చేసినప్పుడల్లా కన్ను శుభ్రమవుతుంది. ♦ యానింగ్ (ఆవలించడం - మనం ఆవలించినప్పుడు ఒక్కోసారి కంటిలో కొద్దిగా నీళ్లు రావడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. ఈ కన్నీరు (లాక్రిమల్ సెక్రిషన్) కంటిలోని పొడిదనాన్ని తొలగించి, కన్నును తేమగా ఉండేలా చేస్తుంది. ప్రమాదకరం... ఎప్పుడూ చేయకూడని పని సన్నింగ్ కొందరు వ్యాయామంలో భాగంగా ‘సన్నింగ్’ అనే ప్రక్రియను చేస్తుండేవారు. ఇది తమకు మేలు చేసే అంశంగా భావించేవారు. ఈ తరహా భావన 1920 ల నుంచి 1960ల వరకు రాజ్యమేలుతూ ఉండేది. సన్నింగ్లో భాగంగా పట్టపగలు సూర్యుణ్ణి తదేకంగా కాసేపు చూస్తుండేవారు. ప్రాతఃకాలం, సాయం సందెవేళ మినహాయించి మిగతా ఏ సమయంలోనూ ఎలాంటి రక్షణ ఉపకరణాలు లేకుండా సూర్యుణ్ణి తదేకంగా చూడటం కంటికి తీవ్రంగా హానిజరుగుతుందనే విషయాలను గుర్తుంచుకోండి. దీన్నే ‘రెటినల్స్ బర్న్స్’ అంటారు. ఇక కంటి చూపును అద్దాలతో మాత్రమే సరిదిద్దగలిగే రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అయిన మయోపియా, హైపరోపియా, ఆస్టిగ్మాటిజమ్ వంటి లోపాలను వ్యాయామాలతో సరిదిద్దలేం. వీటికి ఎలాంటి కంటి వ్యాయామాలూ (ఆక్యులార్ ఎక్సర్‌సెజైస్) ఉండవు. వీటిని సరిచేయడానికి కేవలం అద్దాలనే వాడాలి. డాక్టర్ కె. రవికుమార్‌రెడ్డి కంటి వైద్య నిపుణులు, మెడివిజన్ ఐ హాస్పిటల్, హైదరాబాద్ -
థెరపినిచ్చే కిరణాలు...
ట్రీట్మెంట్స్ విత్ రేడియాలజీ చికిత్సారంగంలో ఈరోజు సీటీ స్కాన్ అంటేనో, ఎమ్మారై అంటేనో తెలియని వారు ఉండరంటే అతి అతిశయోక్తి కాదు. ఈ రంగంలో జరిగిన అభివృద్ధి అంతా ఇంతా కాదు. ఇరవై ఏళ్ల కిందట ఒక అధ్యయనం నిర్వహించడానికి 20 నిమిషాలు పడితే... ఇవ్వాళ్ల ఆ పనికి కేవలం రెండు సెకండ్లు చాలు! ఇదే వ్యాధినిర్ధారణ విషయంలో, చికిత్సారంగంలో ఓ విప్లవం తెచ్చింది. కేవలం సమయం, సునిశితత్వం పరంగానే కాదు. సంస్థల మధ్య పోటీ పెరుగుతూ ఆర్థిక కోణంలోనూ గతంలో సగటు రోగికి అందుబాటులో లేని కొన్ని ప్రక్రియలు ఇప్పుడు అతడి చెంతకు వచ్చాయి. అంతేకాదు... దీర్ఘకాలంలో జరిగే ఖర్చులు ముందే నివారితమయ్యాయి. మరిన్ని ప్రాణాలు నిలిచాయి. వీటన్నింటికీ కారణం... రేడియేషన్ ద్వారా వెలువడే కిరణాల సాయంతో వ్యాధి నిర్ధారణలతో పాటు కొన్ని చికిత్సలూ చేయడం సాధ్యం కావడమే. ఎక్స్‌రే, సీటీస్కాన్, ఎమ్మారై వంటివి శరీరంలోని ఏ భాగంలోనైనా వ్యాధి నిర్ధారణలో తోడ్పడతాయన్న సంగతి తెలిసిందే. కానీ చికిత్సలో ఈ రేడియేషన్ తరంగాలు ఎలా ఉపయోగపడతాయి, ఏయే వ్యాధులకు ఉపయోగపడతాయన్న విషయాన్ని తెలుసుకోవడం కోసమే ఈ కథనం. వేరికోసీల్స్ కొందరిలో శుక్రకణాలను చేరవేసే నాళాల్లో అడ్డంకులు ఏర్పడి వృషణాల వాపు, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ అడ్డంకుల వల్ల పురుషుల్లో వంధ్యత్వం రావచ్చు. ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు ఈ అడ్డంకులను తొలగించడం వల్ల వేరికోసీల్స్కు చికిత్స జరగడంతో పాటు పురుషుల్లో శుక్రకణాల ప్రవాహానికి అడ్డంకులు తొలగి పిల్లలు పుట్టడానికి అవకాశాలు పెరుగుతాయి. బయాప్సీలు ఏదైనా ఒక అవయవం నుంచి చిన్న కండరాన్ని సేకరించే ప్రక్రియను ‘బయాప్సీ’ అంటారు. ఇమేజింగ్ గెడైన్స్ ప్రక్రియ ద్వారా ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు సాధ్యమైనంత తక్కువ/చిన్న గాటుతో ఇప్పుడు కండను సేకరించడం సాధ్యమవుతోంది. రక్తనాళాల జబ్బులకు... వేరికోజ్ వెయిన్స్ రక్తనాళాల్లో రక్తం ఒకేవైపు పయనిస్తుందన్న విషయం తెలిసిందే. మంచి రక్తం ధమనుల్లో, చెడు రక్తం సిరల్లో ప్రవహిస్తుంటుంది. కొన్ని సందర్భాల్లో రక్తాన్ని ఇలా ఒకే వైపునకు ప్రవహింపజేస్తూ... వెనక్కు రాకుండా చూసే కవాటాలు (వాల్వ్స్) బలహీనపడటం వల్ల రక్తం మునుపటిలా ప్రవహించక సిరల్లో పోగుపడుతుంది. దాంతో చాలా సందర్భాల్లో కాళ్లపై సిరలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. దీనివల్ల చూడటానికి బాగుండకపోవడమే (కాస్మటిక్గానే) కాదు... నొప్పులు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో రేడియేషన్ కిరణాలను ఉపయోగించి ఇలా వాల్వ్స్ దెబ్బతిన్న రక్తనాళాల్లోకి ట్యూబ్‌లను పంపి, వాటి ద్వారా లేజర్ కిరణాలను పంపి చికిత్స చేస్తారు. ఈ ప్రక్రియనే వైద్య పరిభాషలో ఇంటర్వెన్షనల్ ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ లేదా స్క్లీరోథెరపీ అంటారు. దాంతో కవాటాలు బలహీనపడ్డ రక్తనాళాలు శాశ్వతంగా మూసుకుపోతాయి. ఆ పనిని ఆరోగ్యకరమైన ఇతర సిరలు చేస్తాయి. ఫలితంగా రక్తప్రవాహం మునుపటిలాగే జరుగుతుంది. సిరలు ఉబ్బి కనిపించడం, నొప్పులు రావడం తగ్గుతాయి. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (పీఏడీ) సాధారణంగా మంచి రక్తాన్ని తీసుకుపోయే ధమనుల గోడలు చాలా మృదువుగా ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో అవి గట్టిబారడం, పెళుసుబారినట్లుగా కావడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితినే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. ధమని ఇరు చివరలా ఇలా జరిగితే... దీనివల్ల రక్తం మధ్యలోనే పోగుపడినట్లుగా అవుతుంది. దాంతో నొప్పి, చర్మంపైన పుండ్లు రావడం, ఒక్కోసారి ఆ పుండ్లు కుళ్లిపోవడం (గ్యాంగ్రీన్) జరగవచ్చు. ఇలాంటి సందర్భాల్లో రక్తనాళంలోకి అంతకంటే సన్నటి నాళాన్ని మళ్లీ ప్రవేశపెట్టి యాంజియోప్లాస్టీ ప్రక్రియతోగానీ లేదా కొంత ఒత్తిడి కలిగించిగానీ ఆ ధమనిని వెడల్పు చేస్తారు. ఇందుకు రేడియాలజీ ప్రక్రియ సహాయం తీసుకుంటారు. డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ) రక్తనాళాల్లోని సిరల్లో చెడురక్తం, ధమనుల్లో మంచి రక్తం ప్రవహిస్తాయన్నది తెలిసిందే. శరీరం లోపల ఉండే ఏదైనా సిరలో రక్తం గడ్డ కట్టడం జరిగితే ఆ భాగంలో వాపు కనిపిస్తుంది. సాధారణంగా కాళ్లలో ఎక్కువగా కనిపించే ఈ కండిషన్లో కాలుకు విపరీతంగా వాపు రావడం, దానిపైన ఉండే చర్మపు రంగు మారిపోవడం, తీవ్రమైన నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే డీప్ వీన్ థ్రాంబోసీస్ (డీవీటీ) అంటారు. ఒకవేళ డీవీటీ దీర్ఘకాలం పాటు కొనసాగితే అది పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ లేదా పల్మునరీ ఎంబోలిజమ్ అనే పరిస్థితికి దారితీయవచ్చు. పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్‌లో రక్తం గడ్డకట్టిన పై భాగంలో వాపు వచ్చి, చర్మంపైన పుండ్లు పడతాయి. ఇక పల్మునరీ ఎంబోలిజమ్ అన్నది ప్రాణాపాయం కలిగించే స్థితి. ఇందులో గడ్డకట్టిన రక్తపు ముద్ద మరింత చిన్న చిన్న గడ్డలుగా విడిపోయి రక్తప్రవాహంతో కలిసి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించవచ్చు. దీన్నే పల్మునరీ ఎంబోలిజమ్ అంటారు. ఫలితంగా శ్వాసతీసుకోవడం కష్టమై ప్రాణాపాయం సంభవించవచ్చు. తొలుత డీప్‌వీన్ థ్రాంబోసిస్ ఉన్న చోటికి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు రక్తనాళాల్లోకి మరింత సన్నటి నాళాన్ని (క్యాథెటర్‌ను) ప్రవేశపెట్టడం ద్వారా రక్తపు గడ్డ ఉన్న ప్రాంతానికి చేరతారు. అక్కడ బెలూన్ యాంజియోప్లాస్టీ ప్రక్రియ ద్వారాగానీ లేదా స్టెంటింగ్ ద్వారాగానీ ఆ అడ్డు తొలగించి చికిత్స చేస్తారు. ఫలితంగా రక్తప్రవాహం మళ్లీ మునపటి స్థితికి వస్తుంది. పల్మునరీ ఎంబోలిజమ్ ముందు చెప్పుకున్నట్లుగా గడ్డ కట్టిన రక్తం ముద్దలు మళ్లీ చిన్న చిన్న ముక్కలుగా మారి రక్తప్రవాహంలో కలిసి ఊపిరితిత్తులను చేరుతాయి. ఇది ప్రాణాపాయ స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఊపిరి ఆడకపోవడం, నీసరం, నిస్సత్తువ, గుండెదడ, స్పృహతప్పిపడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్లు దాన్ని పల్మునరీ ఎంబోలిజమ్గా నిర్ధారణ చేసి ‘క్యాథెటర్ డెరెక్టైడ్ థ్రాంబోలైసిస్’ ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తారు. అంటే కాలు లేదా చేతిలోని ప్రధాన రక్తనాళంలోకి మరింత సన్నటి నాళాన్ని పంపి దాని చివర గడ్డకట్టిన రక్తపు ముద్దను చెల్లాచెదురు చేసే (క్లాట్ బస్టింగ్) మందులను ఉపయోగిస్తారు. దాంతో రక్తపు గడ్డ రక్తప్రవాహాన్ని అడ్డగించలేనంత చిన్న చిన్న ముక్కలుగా చెదిరిపోయి ప్రాణాపాయం తప్పుతుంది. ఐవీసీ ఫిల్టర్ ప్లేస్మెంట్ చికిత్స పల్మునరీ ఎంబోలిజమ్ వ్యాధి చరిత్ర ఉన్న రోగులు గానీ లేదా ఇలా జరిగేందుకు అవకాశం ఉన్న రోగుల విషయంలో డాక్టర్లు ఒక ముందు జాగ్రత్త / నివారణ చర్యను చేపడతారు. అదేమిటంటే... గుండెకు చెడు రక్తాన్ని తీసుకుపోయే ‘వేన-కేవా’ అనే అత్యంత ప్రధాన రక్తనాళంలోకి గానీ లేదా ఊపిరితిత్తుల్లోకి గానీ ఈ రక్తపు గడ్డలు ప్రవేశించకుండా ముందుగానే అక్కడ రక్తపు గడ్డలను అడ్డుకునే ‘ఫిల్టర్ల’ను అమర్చుతారు. దీనికోసం రేడియేషన్ థెరపీ చికిత్స సహాయం తీసుకుంటారు. ఈ ప్రక్రియనే ‘ఐవీసీ ఫిల్టర్ పేస్‌మెంట్’ అంటారు. ఫలితంగా పల్మునరీ ఎంబోలిజమ్ను ముందుగానే నివారించవచ్చు. అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్స్ (ఏఏఏ) కడుపు/పొట్టకు రక్తాన్ని చేరవేసే ప్రధాన రక్తనాళమైన అబ్డామినల్ అయోర్టా బలహీనపడటం వల్లగానీ లేదా అది తన ఎలాస్టిసిటీ కోల్పోయి మామూలు పరిమాణం కంటే ఎక్కువగా సాగిపోయి వెడల్పు కావడం వల్లగానీ తీవ్రమైన పొట్టనొప్పి లేదా వీపునొప్పి వస్తాయి. ఇలాంటి స్థితిలో ఎలాస్టిసిటీ కోల్పోయి సాగిపోయి బలహీన పడ్డ రక్తనాళం చీలిపోతే అది ప్రాణాపాయ స్థితికి దారితీస్తుంది. ఈ కండిషన్‌నే ‘అబ్డామినల్ అయోర్టిక్ అన్యురిజమ్’ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి శస్త్రచికిత్స లేకుండా కేవలం యాంజియోగ్రఫీ / స్టెంటింగ్ ద్వారా ‘ఎండోవ్యాస్క్యులార్ అన్యురిజమ్ రిపేర్’ అనే ప్రక్రియ సహాయంతో సాగిపోయిన/బలహీన పడ్డ అబ్డామినల్ అయోర్టాకు చికిత్స చేయవచ్చు. మూత్రపిండాలు రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ హైబీపీ ఉన్నవారికి మూత్రపిండాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసే రీనల్ ఆర్టరీ కుంచించుకుపోయినప్పుడు బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా స్టెంటింగ్ ప్రక్రియ ద్వారా దాన్ని వెడల్పు చేసి రేడియాలజీ సహాయంతో చికిత్స చేయడం సాధ్యమే. డయాలసిస్ ఫిస్టులా / ఆర్టీరియో వీనస్ గ్రాఫ్ట్ క్లాట్ కొందరిలో మూత్రపిండాలకు సరఫరా చేసే రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టుకుపోయే అవకాశాలు ఉంటాయి. అలాంటి గడ్డలను ‘ఇంటర్వెన్షనల్ డీక్లాట్’ ప్రక్రియ ద్వారా తొలగించే అవకాశం ఉంది. నెఫ్రోస్టోమీ ట్యూబ్ రీప్లేస్మెంట్ కొందరిలో కిడ్నీలో ఏర్పడిన రాళ్లు... కిడ్నీ నుంచి యురేటర్ ద్వారా మూత్రకోశానికి చేరి అక్కడి నుంచి మూత్ర విసర్జన చేసే మూత్రనాళాల్లోకి (యురెథ్రాలోకి) ప్రవేశించి అక్కడ అడ్డంకిగా మారవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మూత్రద్వారం గుండా మరొక చిన్న నాళాన్ని ప్రవేశపెట్టి ఆ రాయిని తొలగించవచ్చు. క్యాన్సర్ గడ్డలు క్యాన్సర్ గడ్డల చికిత్స విషయంలో రేడియాలజీ రంగాన్ని ఉపయోగించి అనేక రకాల చికిత్సలు చేయడం సాధ్యమవుతుంది. ఇందులో గడ్డ ఎలాంటి రకానికి చెందింది, ఎంత పరిమాణంలో ఉంది, ఏ మేరకు వ్యాపించి ఉంది, దాని ఆకృతి ఎలా ఉంది... లాంటి అనేక విషయాలను పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన చికిత్సను నిర్ణయిస్తారు. కొన్ని సందర్భాల్లో ‘ట్రాన్స్ ఆర్టీరియల్ కీమో ఎంబోలైజేషన్’ అనే ప్రక్రియను ఉపయోగించి... గడ్డకు జరిగే రక్తసరఫరాను ఆపివేస్తారు. దాంతో గడ్డ కుంచించుకుపోయి రాలిపోతుంది. మరికొన్ని సందర్భాల్లో రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్, మైక్రోవేవ్ అబ్లేషన్, క్రయోఅబ్లేషన్, ఇర్రివర్సిబుల్ ఎలక్ట్రోపోరేషన్, హై-ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్ అనే ప్రక్రియలను అనుసరించి రేడియేషన్ కిరణాలతో నేరుగా క్యాన్సర్ గడ్డలోని కణజాలాన్ని శిథిలమైపోయేలా చేస్తారు. కేవలం గడ్డ ఉన్న ప్రాంతంలోనే కిరణాలు ప్రసరింపజేయడం వల్ల పక్కన ఉండే ఆరోగ్యకరమైన కణజాలానికి అత్యంత తక్కువ నష్టం జరిగేలా చూస్తారు. అలాగే కీమోథెరపీ వల్ల కలిగే సైడ్ఎఫెక్ట్స్నూ తగ్గిస్తారు. కాలేయం పోర్టల్ హైపర్‌టెన్షన్ కాలేయంపై పగుళ్లు ఏర్పడటం (సిర్రోసిస్) లేదా దానికి ఇతరత్రా ఏవైనా ప్రమాదాలు జరగడం (హెపటైటిస్) వంటి సందర్భాల్లో కాలేయానికి రక్తప్రసరణ వేగం తగ్గిపోతుంది. ఇలాంటి సందర్భాల్లో రోగులకు అంతర్గత రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రాణాపాయ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో అతి తక్కువ గాటుతో ‘ట్రాన్స్జ్యుగులార్ ఇంట్రాహెపాటిక్ పోర్టోసిస్టమిక్ షంట్ (టిప్స్)’ అనే ప్రక్రియ ద్వారా చికిత్స చేసి రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తారు. బైల్ డక్ట్ అబ్స్ట్రక్షన్ కాలేయ క్యాన్సర్, బైల్ డక్ట్ క్యాన్సర్, కోలిసిస్టైటిస్, కోలాంజిటిస్ లేదా కాలేయ, బైల్ వ్యవస్థలకు చెందిన ఏ జబ్బుల్లోనైనా బైల్ ప్రవాహానికి అడ్డంకి ఏర్పడినప్పుడు రేడియాలజిస్ట్‌లు సాధారణంగా ‘పెర్క్యుటేనియస్ ట్రాన్స్హెపాటిక్ కోలాంజియోగ్రఫీ (పీటీహెచ్సీ లేదా పీసీటీ) అనే ఇమేజింగ్ ప్రక్రియ ద్వారా ఆ అడ్డంకిని గుర్తిస్తారు. అలా గుర్తించిన తర్వాత పెర్క్యుటేనియస్ ట్రాన్స్హెపాటిక్ బిలియరీ డ్రైనేజ్ (పీటీబీడీ) అనే ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తారు. ఇందులో క్యాథెటర్ లేదా స్టెంట్‌ను చర్మం పొరల ద్వారా బైల్‌డక్ట్ లోకి పంపి, బైల్ స్రావాన్ని బయటకు డ్రెయిన్ చేస్తారు. ఆ తర్వాత సర్జరీకి పూనుకుంటారు. న్యూరలాజిక్ స్ట్రోక్ (పక్షవాతం) మెదడుకు రక్తనాళాల ద్వారా అందాల్సిన ఆక్సిజన్ లేదా పోషకాలు అందని సమయంలో మెదడులోని ఆ ప్రాంతం దెబ్బతింటుంది. దీన్నే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. ఒకవేళ మెదడుకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు చిట్టిపోయి అంతర్గత రక్తస్రావం జరిగి మెదడులోని భాగాలు దెబ్బతినడం వల్ల ఆ భాగం నియంత్రించే శరీర అవయవాలు పనిచేయకపోవడాన్ని హేమరేజిక్ స్ట్రోక్ అంటారు. స్ట్రోక్ ఎలా వచ్చినా దాని వల్ల మాట్లాడటంలో మార్పులు, కాళ్లూ చేతులు సరిగా పనిచేయకపోవడం, చూపు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లోనే ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ అనే నిపుణులు సీటీ స్కాన్ లేదా ఎమ్మారై స్కాన్ వంటి ఇమేజింగ్ ప్రక్రియలతో వచ్చిన పక్షవాతం... ఇస్కిమిక్ స్ట్రోకా లేక హేమరేజిక్ స్ట్రోకా అన్నది నిర్ణయిస్తారు. ఒకవేళ ఆ స్ట్రోక్ రక్తం గడ్డకట్టడం వల్ల జరిగితే ఇంట్రా ఆర్టీరియల్ థ్రాంబోలైసిస్ అనే ప్రక్రియ ద్వారాగానీ లేదా థ్రాంబెక్టమీ అనే ప్రక్రియ ద్వారాగాని ఆ గడ్డను తొలగిస్తారు. ఒకవేళ రక్తనాళాలు సాగిపోయి, ఉబ్బి అవి చిదిమిపోవడం (అన్యురిజమ్స్)వల్ల రక్తస్రావం అయితే వాటిని ఎంబోలైజేషన్ ప్రక్రియ ద్వారా చికిత్స చేస్తారు. కెరటాయిడ్ ఆర్టరీ స్టెనోసిస్ మన మెడలోని కెరటాయిడ్ ఆర్టరీ అనే ధమని సన్నబారితే మెదడుకు తగినంత రక్తం అందదు. ఇలా సన్నబారినప్పుడు కెరటాయిడ్ ఆర్టరీ స్టెంటింగ్ అనే ప్రక్రియ ద్వారా మెదడుకు తగినంత రక్తం అందేలా చేస్తారు. ఇది కెరటాయిడ్ ఎండార్టరెక్టమీ అనే శస్త్రచికిత్సకు ప్రత్యామ్నాయం. కెరటాయిడ్ ఆర్టరీ సన్నబడినట్లు గుర్తించినప్పుడు స్ట్రోక్ రాకుండా ముందస్తు నివారణ చర్యగా ఈ చికిత్స చేస్తారు. స్పైనల్ ఫ్రాక్చర్స్ వెన్నెముకకు ఏదైనా పగుళ్ల వంటివి ఏర్పడితే అలా ఏర్పడిన పగుళ్ల చీలికలలోనికి ఇంజెక్షన్ ద్వారా సిమెంట్ వంటి ఎముకలోనే కలిసిపోయే పదార్థాన్ని పంపి చికిత్స చేస్తారు. ఇంజెక్షన్ ద్వారా చర్మం పొర అయిన ‘పర్క్యుటేనియస్’ లేయర్లోకి ఇంజెక్షన్ చేసి నిర్వహించే ఈ చికిత్సను వర్టిబ్రోప్లాస్టీ లేదా కైఫోప్లాస్టీ అంటారు. ఇలా రేడియాలజీ అన్నది కేవలం వ్యాధి నిర్ధారణ విషయంలోనే గాక... రకరకాల చికిత్సల్లోనూ కీలక భూమిక పోషిస్తోంది. - నిర్వహణ: యాసీన్ మహిళల ఆరోగ్యం విషయంలో... యుటెరైన్ ఫైబ్రాయిడ్స్ ఇవి యుటెరస్‌లో ఏర్పడే ఒక రకం గడ్డలు. వీటి వల్ల మహిళల్లో తీవ్రమైన నొప్పి, రక్తస్రావం జరుగుతాయి. శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఇప్పుడు ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు ‘యుటెరైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ (యూఎఫ్ఈ) లేదా ‘యుటెరైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ (యూఏఈ) ప్రక్రియల ద్వారా ఈ గడ్డలకు రక్తప్రసరణ చేసే ధమని నుంచి ఒక క్యాథెటర్‌ను పంపి, ఆ ధమనిని మూసి వేసి ఆ గడ్డలకు జరిగే రక్తప్రసరణను ఆపివేస్తారు. దాంతో ఆ ఫైబ్రాయిడ్స్ కుంచించుకుపోయి రాలిపోతాయి. మహిళల్లో ఫలదీకరణకు తోడ్పడటం కొందరిలో ఫెలోపియన్ ట్యూబ్స్ కుంచించుకుపోవడం వల్ల పురుషుల నుంచి విడుదల అయ్యే శుక్రకణాలు అండాన్ని చేరలేవు. అలాంటి సందర్భాల్లో సాల్పింగోగ్రఫీ అనే ప్రక్రియ ద్వారా ఫెలోపియన్ ట్యూబ్స్‌లోకి సన్నటి నాళాలను పంపి బెలూన్ సహాయంతో వాటిని వెడల్పు చేసి మహిళల్లోని వంధ్యత్వాన్ని నివారించగలరు.