కారంపూడి: మండలంలోని మిరియాల గ్రామంలో డయేరియా బాధితుల సంఖ్య 35కు పెరిగింది. ఆదివారం వరకు 18 మంది వ్యాధి బారిన పడి వాంతులు విరోచనాలతో మంచం పట్టి చికిత్సపొందుతుండగా, సోమవారం నాటికి కొత్తగా మరో 17 కేసులు నమోదయ్యాయి. వారిలో ఏడుగురికి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. వీరిలో అలవాల సంధ్యారాణి, కెంటిల్లి సత్యవాణి, ఎం.లక్ష్మిలకు గ్రామంలోనే కారంపూడి పీహెచ్‌సీ వైద్యులు, సిబ్బంది వైద్య సేవలు అందిస్తున్నారు. నరసారావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్న మేకల అఖిల్, కొండా చలమయ్యల పరిస్ధితి మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తోంది. బత్తుల అరుణ, శ్రీలక్ష్మికి ఇంకా వ్యాధి తగ్గుముఖం పట్టలేదు. పరిస్థితి అదుపులోనే ఉందని డాక్టర్ లక్ష్మీశ్రావణి తెలిపారు.
ఇదిలా ఉంటే ఒక వీధికే పరిమితమైన వ్యాధి ప్రస్తుతం గ్రామం మొత్తం విస్తరించింది. అడిషనల్ డీఎంహెచ్‌ఓ రెడ్డి శ్యామల సోమవారం గ్రామంలోని వైద్య సేవలను పరిశీలించారు. డ్రైనేజిలో ఉన్న మంచి నీటి పైపు లైన్ లీకు కావడం వల్లే వ్యాధి ప్రబలిందని, ముందుగా డ్రైనేజిలో ఉన్న పైపులను తీసి వేయాలని పంచాయతీ అధికారులకు సూచించారు. గురజాల ఆర్డీవో మురళి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తహసీల్దార్ సాయిప్రసాద్, ఎంపీడీవో హీరాలాల్ ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ రాజ్ అధికారులు గ్రామాన్ని సందర్శించి తగిన తక్షణ చర్యలు చేపడుతున్నారు. జిల్లా అంటువ్యాధుల నివారణ శాఖ అధికారులు కూడా సోమవారం గ్రామంలో పర్యటించి నీటి శాంపిల్స్ సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment