వైద్య ఆరోగ్య సిబ్బందికి సూచనలిస్తున్న డీటీసీవో డాక్టర్ రమేష్
మిరియాల (కారంపూడి): మండలంలోని మిరియాల గ్రామంలో ప్రబలిన డయేరియాకు నీటిలో ఉన్న బ్యాక్టీరియానే ప్రధాన కారణమని గుంటూరులోని రీజినల్ ల్యాబ్æ నుంచి శుక్రవారం రిపోర్టులు వచ్చాయి. దీంతో డీటీసీవో డాక్టర్ రమేష్ శుక్రవారం గ్రామంలో పర్యటించారు. ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీ అధికారులు, డాక్టర్లు ఎస్. ప్రియాంక, సిబ్బందితో గ్రామంలో ఆయన సమావేశమయ్యారు. బోర్లు, రక్షిత నీటి ట్యాంకుల నీటిలో బ్యాక్టీరియా ఉందని రిపోర్టు వచ్చిందని, నివారణ చర్యలపై ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. డ్రెయినేజీలో ఉన్న నీటి పైపులను మార్చాలని, శిథిలమైన పైపుల స్థానంలో కొత్తవి వేయాలని, ట్యాంకులను శుభ్రం చేసి క్లోరినేషన్ చేయాలని, శానిటేషన్‌ను ఇంకా మెరుగుపర్చాలని, తర్వాత గ్రామస్తులకు హెల్త్ ఎడ్యుకేషన్‌పై పూర్తి అవగాహన కల్పించాలని కోరారు.
ఇప్పటికే ట్యాంకులు శుభ్రం చేయించామని, గ్రామంలో ఉన్న బోర్లను ఫ్లషింగ్ చేయిస్తున్నామని, పైపులు కొత్తవి రాగానే మెయిన్ లైన్ మొత్తం మారుస్తామని ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ వెంకటేశ్వర్లు వివరించారు. డ్రెయినేజిలో ఉన్న పైపులను తీసివేసి పాత పైపుల స్థానంలో కొత్తవి వేయడానికి నాలుగైదు రోజులు పడుతుందన్నారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిని కూడా క్లోరినేషన్ చేయాలని, ముఖ్యంగా ఇళ్లలో ఉన్న బోరు నీటిని కాచి చల్లార్చిన తర్వాతనే తాగాలని సూచించారు. అలా చేయక పోవడం వల్లే కొత్త కేసులు వస్తున్నాయని అధికారులు చెప్పారు. పరిశుభ్రతపై గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించాలని వైద్య అధికారులకు డాక్టర్ రమేష్ సూచించారు. ఈ పనులన్నీ పూర్తి చేసి వ్యాధిని పూర్తిగా అదుపులోకి తీసుకురావాలని ఆయన కోరారు.
మరో మూడు కేసులు నమోదు..
గ్రామంలో శుక్రవారం మరో మూడు డయేరియా కేసులు నమోదయ్యాయని వైద్య శిబిరం నిర్వహిస్తున్న డాక్టర్ ప్రియాంక తెలిపారు. వారి పరిస్థితి అదుపులోనే ఉందని, గ్రామంలోనే చికిత్స అందిస్తున్నామన్నారు. గ్రామంలో చికిత్స పొందుతున్న వారు చాలా వరకు కోలుకున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దారెడ్డి కరుణాకరరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆయనకు కిడ్నీ వ్యాధి కూడా ఉండడంతో డయాలసిస్ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. అలాగే మరో రోగి బత్తుల పున్నయ్యకు కూడా కిడ్నీ సమస్య ఉండడంతో నరసరావుపేట మహాత్మాగాం«ధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారి ఆరోగ్యం మెరుగవుతోందని డాక్టర్లు తెలిపారు.
కొనసాగుతున్న నివారణ చర్యలు
గ్రామంలో శుక్రవారం నాటికి మూడు ఓవర్ హెడ్ ట్యాంకు క్లీనింగ్ పనులు పూర్తయ్యాయని ఏఈ రత్నబాబు తెలిపారు.మూడు బోర్లు ప్లషింగ్ చేశామని మరో నాలుగు చేయాల్సి ఉందని, కొత్త పైపులైన్ వేయడానికి పైపులకు ఆర్డర్ ఇచ్చామని ఐదు రోజుల్లో పనులు పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కొనసాగుతోందని, బోర్లు, బావుల్లో నీటిని ఎవరు తాగవద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment