సాక్షి, గుంటూరు: గుంటూరు జిల్లాలో అతిసారంతో చనిపోయిన కుటుంబాలను శుక్రవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. డయేరియా బాధితులతో పాటు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా ఆయన కలిశారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. ‘తాగునీరు కలుషితం కావడంతో 14 మంది చనిపోతే మున్సిపల్ కమిషనర్ పట్టించుకోలేదు. చనిపోయిన ప్రాణాలు తీసుకురాలేం.. ఈ ఘటనకు బాధ్యులెవరు? ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు స్వార్థం కోసమే పని చేశాయి.
అభివృద్ధి..అభివృద్ది అంటున్నారు, కానీ త్రాగునీరు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఆస్పత్రిలో రోగులకు సరైన బెడ్‌లు కేటాయించలేదు. అతిసారంతో 14 ఏళ్ల షేక్ ఫరూక్‌కు నూరేళ్లు నిండటం కలిచి వేసింది. ఆరోగ్యాంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ పటంలో ఏమని చూపిస్తారు. రాజధానికి కూతవేటు దూరంలో గుంటూరు ఉంది. ఈ ఘటనపై ఐఏఎస్‌తో కమిటీ వేయలేదు.
ప్రజా ప్రతినిధులకు ఈ సమస్య పట్టడం లేదా? గుంటూరు కార్పొరేషన్‌కు ఎన్నికలు పెట్టలేదు.. కనీసం ఎన్నికలు పెడితే కార్పోరేటర్లకు సమస్య చెప్పుకునేవారు. ప్రజలు ఎక్స్‌గ్రేషియా వైపు చూడరు.. పరిహారం ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకోవడం మంచి పద్దతి కాదు. కల్తీలకు గుంటూరు అడ్డాగా మారింది. కారంలో రంపపు పొడి కలుపుతారని విన్నాను. తప్పు చేసిన వారికి శిక్షపడాల్సిందే.. తప్పుచేసిన వారిని నిలదీయండి. ఏపీ ప్రభుత్వం 48 గంటల్లో స్పదించకపోతే బంద్‌కు పిలుపునిస్తాం.. అవసరమైతే దీక్షకు కూర్చుంటాం.
20 మంది ప్రజా ప్రతినిధులు చనిపోతే ఎలా ఉంటుంది.. మీ ఇంట్లో వాళ్లు చనిపోతే ఇలాగే స్పందిస్తారా. సమాజం డ్రైనేజీలా కుళ్లి పోయింది. అసెంబ్లీలో ఈ అంశంపై తూతూ మంత్రంగా చర్చించారు. ప్రజా సమస్యలకు తుంగలో తొక్కే హక్కు ఎవరికీ లేదు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి వచ్చి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు నాకూ ఉంది. నోటికొచ్చినట్టు మాట్లాడితే నేనూ బలంగా మాట్లాడాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదాపై ఏపార్టీకి స్పష్టత లేదు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment