సర్కారీ హత్యలే! | YSRCP Demand 10lakhs exgrasia For Diarrhea Deaths | Sakshi
Sakshi News home page

సర్కారీ హత్యలే!

Published Fri, Mar 9 2018 1:12 PM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

YSRCP Demand 10lakhs exgrasia For Diarrhea Deaths - Sakshi

కలెక్టర్‌ శశిధర్‌తో చర్చిస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలు

సాక్షి,అమరావతిబ్యూరో: గుంటూరు నగరంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా డయేరియా వ్యాధితో పది మంది చనిపోయారని, ఇవి నిస్సందేహంగా సర్కారీ హత్యలేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు జిల్లా సమన్వయకర్త, పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులను గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతల బృందం పరామర్శించింది. అనంతరం కలెక్టర్‌ను కలిసి డయేరియా వ్యాధి ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. ఐదు రోజుల నుంచి రోగులు మరణిస్తుంటే యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఉండే ఈ ప్రాంతంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్న ప్రభుత్వ ఆసుపత్రిలో గతంలో అత్యవసర విభాగంలో చిన్నారిని ఎలుకలు కొరి కన ఘటన, సెల్‌ఫోన్‌ వెలుగులో శస్త్ర చికిత్సలు చేసిన ఉదంతంతోపాటు కిడ్నీ రాకెట్‌ కూడా వెలుగు చూడడం సిగ్గుచేటన్నారు. కల్తీలకు కూడా జిల్లా కేరాఫ్‌ అడ్రస్‌గా మారిందన్నారు. డయేరియా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యూజీడీ కాంట్రాక్టు ఏజెన్సీ నుంచి మరో రూ.10 లక్షలు ఇప్పించడంతోపాటు, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరిన రోగుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలన్నారు. ఘటనపై ఉన్నత స్థాయి అధికారులతో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వ్యాధి ప్రబలి ఐదు రోజులు గడిచినా అందుకుగల కారణాలపై అధికారులకు స్పష్టత లేకపోవడం దారుణమన్నారు.

వైఎస్సార్‌ సీపీ తరఫున రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం
గుంటూరు నగరంలో డయేరియాతో పది మంది చనిపోయారన్న వార్త తెలియగానే వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారని, వెంటనే తమను వెళ్లి బాధితులను పరామర్శించాలని సూచించారని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఘటనకు గల కారణాలను ఉన్నతాధికారులతో చర్చించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధినేత సూచించినట్టు చెప్పారు. మృతుల కుటుంబాల వారికి పార్టీ పరంగా రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించాలని చెప్పారన్నారు. సమావేశంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, వైఎస్సార్‌ సీపీ గుంటూరు పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకట రమణ, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, గుంటూరు పార్లమెంటు సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు కిలారి రోశయ్య, ఆతుకూరి ఆంజనేయులు, వినుకొండ, పెదకూరపాడు, తెనాలి, తాడికొండ నియోజకవర్గాల సమన్వయకర్తలు బొల్లా బ్రహ్మనాయుడు, కావటి మనోహర్‌నాయుడు, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ప్రాణాలు పోతుంటే ఏం చేస్తున్నారు?
గుంటూరు వెస్ట్‌: ‘కార్పొరేషన్‌ సిబ్బంది, ఇంజినీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా మంచినీటి పైపులైన్లు లీకేజీ అయి కలుషిత మంచినీరు తాగడంవల్ల ఐదు రోజుల నుంచి 9 మంది చనిపోయారు. వందల మంది చికిత్స పొదుతున్నారు.. కలెక్టర్‌గారూ అసలు ఏం జరుగుతుంది?’ అంటూ కలెక్టర్‌ను వైఎస్సార్‌ సీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పార్టీ అగ్రనాయకులంతా గురువారం కలెక్టరేట్‌ కలెక్టర్‌ కోన శశిధర్‌ను కలిసి మరణాలపై తమ అనుమానాలను వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇన్ని రోజులు గడుస్తున్నా, ఇంత యంత్రాంగం అందుబాటులో ఉన్నా ఎందుకు సమస్య అర్థం కాలేదని ప్రశ్నించారు.  కలెక్టర్‌ స్పందిస్తూ సమస్యను అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామన్నారు.
ముఖ్యంగా ఆరు వార్డుల్లో ప్రజలు మరణించారని, అక్కడ అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు ఇంకా ప్రారంభించలేదని, డ్రైనేజీ నీరు కలవడానికి అవకాశం లేదని వివరించారు. వీలైనంత వరకు సమస్యలున్న ప్రాంతాల్లో పైపు లైన్లు మారుస్తున్నామని తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement