సాక్షి, గుంటూరు, నరసరావుపేట: ‘‘మనమంతా వైఎస్సార్‌సీపీ సైనికులం, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 175 సీట్లు గెలిచేలా పనిచేయాలి. ఆ ప్రజా ప్రభంజనం పల్నాడు జిల్లా నుంచే ప్రారంభం కావాలి’’ అని పల్నాడు జిల్లా ఇన్‌చార్జి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. నరసరావుపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో శుక్రవారం వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్లీనరీ సమావేశంలో కారుమూరి మాట్లాడారు.
తొలుత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళి అర్పించి, జ్యోతి ప్రజ్వలనతో ప్లీనరీ ప్రారంభించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎల్లో మీడియా దుష్ప్రచారాలను తిప్పికొట్టి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ రాజ్యం మరోసారి తీసుకురావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. టీడీపీ కరుడుగట్టిన అభిమానులు సైతం ఈసారి వైఎస్సార్ సీపీకి ఓటువేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికే నియోజకవర్గ, జిల్లా స్థాయి ప్లీనరీలు విజయవంతంగా పూర్తిచేశామని, 8, 9వ తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి ప్లీనరీకి పల్నాడు నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని కోరారు.
టీడీపీ బొంబాయి పార్టీ
చంద్రబాబు ఓ బొంబాయి అని, టీడీపీ బొంబాయి పార్టీ అని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్ కొడాలి నాని ఎద్దేవా చేశారు. జగన్‌ను దించి చంద్రబాబును అధికారంలోకి తేవాలని దుష్టచతుష్టయం యత్నిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. తన తండ్రి ఫొటో పక్కన తన ఫొటో పెట్టుకునేలా పరిపాలన అందించాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తాయని, ఈ మేరకు ఒప్పందం కుదిరిందన్నారు. 2024 ఎన్నికలతో చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తమవుతుందన్నారు. ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. మూడు ఎంపీ స్థానాలూ గెలవడన్నాడు.
చంద్రబాబు రాజకీయ జీవితం ఇక సమాప్తం
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఎన్నికలు జరిగితే చంద్రబాబుకు తట్టుకునే శక్తిలేదని, ఆయన రాజకీయ జీవితం ఇక సమాప్తమేనని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అఖండ మెజార్టీతో ఆశీర్వదించడానికి ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేరన్నారు. చంద్రబాబు త్యాగాలు చేసే రకం కాదు.. మోసాలు చేసే రకమని పేర్కొన్నారు. మా ప్రభుత్వంలో పవన్‌ను సీఎం చేయాలని చూస్తున్న బ్యాచ్‌కు కూడా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. అభిమానులు పవన్‌ను సీఎం చేయాలని చూస్తుంటే.. పవన్ మాత్రం చంద్రబాబును సీఎం చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట...
వైఎస్ జగన్ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి విడదల రజిని చెప్పారు. ఎన్నడూలేని విధంగా ఈసారి మంత్రివర్గంలో 17 మంది బలహీనవర్గాలకు చోటు కల్పించారని పేర్కొన్నారు. జగనన్నను ప్రజలందరూ మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా...
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పనిచేస్తోందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
తెలిపారు. ప్లీనరీలో భాగంగా పలు తీర్మానాలను ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. మాజీ మంత్రి కొడాలి నానిని సన్మానించారు. డాక్టర్స్ డే సందర్భంగా వేదికపై కేక్‌ను కట్‌చేశారు. కార్యక్రమంలో ఏపీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అరిమండ వరప్రసాదరెడ్డి, షేక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఖాజావలి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, గ్రంథాలయ రాష్ట్ర చైర్మన్ మందపాటి శేషగిరిరావు, జెడ్పీ వైస్ చైర్మన్ సంఖిరెడ్డి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నిమ్మకాయల రాజనారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధరరెడ్డి, గుంటూరు మిర్చియార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, నరసరావుపేట మార్కెట్ యార్డు చైర్మన్ ఎస్.ఎ.హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుపు మనదే. సుమారు 70శాతానికిపైగా పేదవారు సీఎం జగన్‌పై అభిమానంతో ఉన్నారు.
– గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే
మూడేళ్లలోనే 95 శాతం హామీలు నెరవేర్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే.
– జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్సీ
గత టీడీపీ ప్రభుత్వంలో నిధులు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. మన ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లో జమ చేసింది.
– నంబూరు శంకరరావు, ఎమ్మెల్యే
పచ్చని పల్లెల్లో టీడీపీ నేతలు చిచ్చు పెడుతున్నారు. నడిగడ్డలో వైఎస్సార్‌సీపీలో చేరిన యాదవ నాయకుల కుటుంబంపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు.
– బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్యే
పల్నాడు ప్రజలు సీఎం జగన్ పోరాటానికి మద్దతు ఇస్తున్నారు. సీఎం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నారు.
– బత్తుల బ్రహ్మానందరెడ్డి, పల్నాడు జిల్లా ప్లీనరీ పరిశీలకులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు
టీడీపీ ప్రభుత్వ హయాంలో కుక్క మీద రాయి వేసినా వైఎస్సార్‌సీపీ వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారు.
– కాసు మహేష్‌రెడ్డి, గురజాల ఎమ్మెల్యే
వచ్చే రెండేళ్ళు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి అతిపెద్ద పార్టీ మనది.
కొన్ని భేదాభిప్రాయాలు సహజం.
– పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు, మాచర్ల ఎమ్మెల్యే
Comments
Please login to add a commentAdd a comment