భవితకు బాటేదీ?
భవితకు బాటేదీ?
Published Tue, Sep 13 2016 12:51 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM
ధర్మవరం : భవిత కేంద్రాల్లోని ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు వైద్యసేవల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో వీరు ప్రత్యేక అవసరాలు కల్గిన పిల్లలుగానే ఉండిపోవాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2,223 పాఠశాలల్లో 7,212 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు. వీరికి ఈ ఏడాది ఫిజియోథెరపీ సేవలు అందలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వారానికి ఒకరోజు చొప్పున ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఫిజియోథెరపీ శిబిరాన్ని నిర్వహించేవారు. వారికి ఉచితంగా చికిత్స అందించేవారు. ఇందుకోసం ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ విధానంలో ఫిజియోథెరపిస్ట్‌లను నియమించేది. సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో నడిచే భవిత కేంద్రాల్లో ఆయా ఫిజియోథెరపిస్ట్‌లు విద్యార్థులతో తగిన వ్యాయామం చేయించేవారు. ఇంటివద్ద కూడా వ్యాయామం చేయించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించేవారు. ఈ ఏడాది మాత్రం వైద్యసేవల గురించి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. వేసవి సెలవుల తరువాత ఫిజియోథెరపీ సేవలకు మంగళం పాడారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడునెలలు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క శిబిరం కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం సమకూర్చిన పరికరాలు ఎమ్మార్సీలు, భవిత కేంద్రాల్లో మూలనపడ్డాయి. శారీరక, మానసిక వైకల్యం కల్గిన చిన్నారులకు తగిన వ్యాయామం లేక పరిస్థితి మొదటికి వస్తోంది. వారి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
అనుమతి రాలేదు
ఫిజియోథెరపీ శిబిరాల విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులూ రాలే దు. ప్రభుత్వం ఇంకా ఫిజియోథెరపిస్టులను ఎంపిక చేయలేదు. ఈ ప్రక్రియ పూర్తయితే వైద్యసేవల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తాం.
– నూర్ అహమ్మద్, ధర్మవరం మండల విద్యాధికారి
ఎకరాకు రూ.15 వేల నష్టపరిహారమివ్వాలి
అనంతపురం అర్బన్: జిల్లాలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతినిందని, ఎకరాకు రూ.15 వేలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ గేయానంద్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీనా మేషాలు లేక్కిస్తూ పంట నష్టాన్ని తక్కువగా చూపే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. రైతుల మనోధైర్యాన్ని కాపాడేందుకు బేషరుతుగా పంట నష్ట పరిహారాన్ని ప్రకటించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే రాయలసీమను కరువు లేని ప్రాంతంగా మారుస్తామని ప్రకటిస్తున్నారన్నారు. కరువు రైతులకు వెంటనే పంట నష్ట పరిహారం ప్రకటిండం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలిపారు.
Advertisement