Physiotherapy
-
వైద్య విద్యార్థులకు వరం.. డిజిటల్ లైబ్రరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యవిద్యకు సంబంధించిన అత్యాధునిక పుస్తకాలు, వివిధ రకాల అరుదైన చికిత్సలకు సంబంధించిన వీడియోలు, వేలాది జర్నల్స్‌తో కూడిన డిజిటల్ లైబ్రరీ (ఈ–లైబ్రరీ)ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వైఎస్సార్ మెడ్‌నెట్ కన్సార్షియం పేరుతో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ, ఆయుష్, పారా మెడికల్, నర్సింగ్ కోర్సులకు సంబంధించి వేలాది రకాల అత్యాధునిక పాఠ్యపుస్తకాలు, జర్నల్స్, అరుదైన చికిత్సలు, ట్రీట్మెంట్ ప్రొటోకాల్‌కు సంబంధించిన వీడియోలు ఉంచారు. ప్రతి విద్యార్థి డిజిటల్ లైబ్రరీని సులభంగా వినియోగించుకునేందుకు మైలాఫ్ట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం యూనివర్సిటీ రూ. 4 కోట్లు వెచ్చించింది. మైలాఫ్ట్.. యూజర్ ఫ్రెండ్లీ యాప్.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 2008లోనే డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. కానీ పరిమిత సంఖ్యలో మాత్రమే అక్కడ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. లైబ్రరీలో మాత్రమే దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో లైబ్రరీ పనివేళల్లో వెళ్లేందుకు కుదరకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. పరిస్థితి గమనించిన ప్రస్తుత వర్సిటీ అధికారులు అత్యాధునిక పరిజ్ఞానంతో మైలాఫ్ట్ (మై లైబ్రరీ ఆన్ ఫింగర్ టిప్స్) అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు, టీచింగ్ వైద్యులు, ఎక్కడినుంచైనా తమ మొబైల్లో సైతం లాగిన్ అయ్యి డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీన్లో 21 వేలకు పైగా ఈ–బుక్స్, 22,433కు పైగా ఈ– జర్నల్స్, 11,000 పైగా వీడియోలు ఉన్నాయి. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రతి విద్యార్థి ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా డిజిటల్ లైబ్రరీని ఆధునీకరించాం. మైలాఫ్ట్ యూజర్ ఫ్రెండ్లీ యాప్ ద్వారా విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎక్కడి నుంచైనా, తమ మొబైల్స్‌లో సైతం లాగిన్ అయ్యే అవకాశం కల్పించాం. డిజిటల్ లైబ్రరీ వినియోగంపై అన్ని కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ వి.రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ సద్వినియోగం చేసుకోవాలి మైలాఫ్ట్ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు టెక్నికల్ సిబ్బందితో కలిసి జోనల్ వారీగా సదస్సులు నిర్వహించి యాప్ వినియోగంపై ఫ్యాకలీ్ట, విద్యార్థుల్లో అవగాహన కలి్పస్తున్నాం. వేలాది ఈ–బుక్స్, ఈ–జర్నల్స్, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. – డాక్టర్ కె.సుధ, కో ఆర్డినేటర్, కన్సార్షియం, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
దీర్ఘకాలిక నొప్పి నుంచి బాధపడుతున్నారా? ఫిజియోథెరపీతో మీ సమస్యకు చెక్
శరీర పనితీరును మెరుగుపరచడంలో ఫిజియోథెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? కంకషన్ నుంచి కోలుకోవడానికి చేయాల్సిన వ్యాయామాలు ఏంటి? అన్నది ఇప్పుడ చూద్దాం. మెదడుకు గాయం తగిలిన తర్వాత తక్షణ వైద్య సహాయం తప్పనిసరి. సరైన చికిత్స,త్వరగా కోలుకోవడానికి, కంకషన్ల కోసం ఫిజియోథెరపీ వ్యాయామాల కోసం నిపుణుడిని సంప్రదించాలి. 1.కంకషన్ అంటే ఏమిటి? తలకు నేరుగా గాయం తగిలినప్పుడు లేదా మెదడు వేగంగా కదిలినప్పుడు కంకషన్ సంభవిస్తుంది. కంకషన్ అంటే మెదడు వాస్తవానికి "చెడిపోలేదు", కానీ మెదడులోని రక్త ప్రవాహం మరియు సెల్యులార్ పనితీరు మార్చబడతాయి. గాయపడిన ప్రాంతంపై ఆధారపడి, ఇది తాత్కాలిక లేదా శాశ్వత మెదడు పనితీరు సమస్యలకు దారితీయవచ్చు.వికారం, తలనొప్పి, మైకము, అస్పష్టమైన దృష్టి కంకషన్ యొక్క శారీరక లక్షణాలు. 2.కంకషన్ కోసం ఫిజియోథెరపీ వ్యాయామాలు ఫిజియోథెరపిస్ట్ కార్డియోవాస్కులర్, న్యూరోలాజికల్,ఆర్థోపెడిక్ వ్యవస్థలను పరిశీలిస్తాడు. ఒక ఫిజియోథెరపిస్ట్ రోగి కంకషన్ నుంచి కోలుకోవడానికి సహాయం చేస్తాడు. 3.విశ్రాంతి విశ్రాంతిని నిర్ధారించడానికి కంకషన్ తర్వాత శారీరక శ్రమను పరిమితం చేయడం ముఖ్యం. విశ్రాంతి మెదడును రికవరీ మోడ్‌లోకి పంపుతుంది. 4.మెడ పునరావాసం చాలా తరచుగా.. కంకషన్‌కు ముందు, ఆ తర్వాత మెడ గట్టిగా లేదా ఉద్రిక్తంగా ఉంటుంది. ఫలితంగా దీర్ఘకాలిక నొప్పి భుజాలకు చేరుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్ వ్యాయామాలు నొప్పి,అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా గర్భాశయ థొరాసిక్ వెన్నెముక కదలికను ప్రోత్సహిస్తాయి. 5. శక్తి పునరుద్ధరణ ఒక కంకషన్ తర్వాత కండరాల బలహీనత,శారీరక ఓర్పును తగ్గిస్తుంది. అందువల్ల, ఫిజియోథెరపిస్ట్ లక్షణాలను మరింత దిగజార్చకుండా బలాన్ని పునరుద్ధరించడంపై దృష్టి పెడతారు. 6.తలనొప్పి చికిత్స కంకషన్ల యొక్క చెత్త లక్షణాలలో తలనొప్పి ఒకటి. తలనొప్పి చికిత్స కోసం ఫిజియోథెరపీలో ప్రత్యేకమైన మసాజ్, స్ట్రెచ్‌లు, కంటి వ్యాయామాలు,విద్యుత్ ప్రేరణ వంటివి ఉంటాయి. 7.ఏరోబిక్ వ్యాయామ కార్యక్రమం ఫిజియోథెరపిస్టులు బఫెలో కంకషన్ ట్రెడ్మిల్ పరీక్ష వంటి గ్రేడెడ్ వ్యాయామ పరీక్షలను ఉపయోగిస్తారు. తేలికపాటి కంకషన్ ఉన్న రోగులలో రికవరీ ప్రక్రియలో ఈ పరీక్షను ఉపయోగించవచ్చు. ఇది ముఖ్యంగా నిరంతర లక్షణాలు ఉన్నవారికి బాగా పనిచేస్తుంది. 8.అటానమిక్ నాడీవ్యవస్థ పునరావాసం తలను పైకి లేపడం.కంప్రెషన్ మేజోళ్ళు ధరించడం.ఆహారంలో ఉప్పు కలపడం. ఒక రోగి నిరంతర అటానమిక్ డిస్ఫంక్షన్ లక్షణాలను అనుభవిస్తే, కింది వ్యాయామాలతో కూడిన ఫిజియోథెరపిస్ట్ ఏరోబిక్ వ్యాయామ కార్యక్రమం సిఫార్సు చేస్తారు.ట్రెడ్మిల్ వ్యాయామం,నడక / జాగింగ్,మెట్లు ఎక్కడం.. ఈ వ్యాయామాలు వారానికి మూడుసార్లు 30 నుంచి 60 నిమిషాలు చేయాలి.ఇవి మెదడు,నాడీ వ్యవస్థను ఓవర్‌లోడ్ చేయని విధంగా చేయాలి.ఇది మెదడు కణజాలం యొక్క సరైన వైద్యంలో సహాయపడుతుంది. -
వృద్ధులకు ఏడు ఫిజియోథెరపీ కేంద్రాలు
సాక్షి, అమరావతి: వృద్ధాప్యం కారణంగా కీళ్లు, కండరాల నొప్పులతో బాధపడేవారికి సేవలు అందించేందుకు రాష్ట్రంలో ఏడు ఫిజియోథెరపీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వాటి పరిధిలో వృద్ధులకు మరింతగా సేవలు అందించేందుకు ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వం రూ.కోటి నిధులను కేటాయించింది. రాష్ట్రంలోని విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్), విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో ఫిజియోథెరపీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడు కేంద్రాల్లో నిపుణులైన ఫిజియోథెరపిస్టులు, వైద్యులు సేవలు అందిస్తున్నారు. గడిచిన ఏడాదికాలంలో వీటి ద్వారా 12వేల మందికిపైగా వృద్ధులు ఫిజియోథెరపీ సేవలు పొందారు. వీటితోపాటు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు తెలుసుకుని వారికి తక్షణ వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వయోవృద్ధులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, మానసిక, వ్యక్తిగత సమస్యలు తెలుసుకుని వారికి తక్షణ సహాయం అందించేలా ఎల్డర్ లైన్–14567 టోల్ ఫ్రీ నంబర్‌తో జాతీయస్థాయిలో హెల్ప్‌లైన్‌ను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ప్రత్యేక ఫీల్డ్ రెస్పాన్స్ టీమ్స్‌తో ఎల్డర్‌లైన్ హెల్ప్‌లైన్ విభాగం సమర్థంగా పనిచేస్తోంది. మరోవైపు వయోవృద్ధులకు చేతికర్రలు, వినికిడి యంత్రాలు, మూడుచక్రాల కుర్చీలు వంటి పరికరాలు అందిస్తోంది. రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు(ఎన్జీఓ) నిర్వహిస్తున్న 70 వృద్ధాశ్రమాలకు ప్రభుత్వం గ్రాంట్‌ను నేరుగా అందిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019, జూన్ నుంచి వృద్ధాప్య పింఛనుకు వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. ఫలితంగా వైఎస్సార్ పింఛను పథకం కింద సుమారు 35లక్షల మంది వృద్ధులు ప్రతి నెల పింఛను పొందుతున్నారు. (చదవండి: ఇంకెన్నాళ్లీ ‘కలం’ కూట విషం?) -
నిత్యజీవితంలోని పనులే ఫిజియో వ్యాయామాలైతే...
సాధారణంగా పక్షవాతంతో అవయవాలు చచ్చుబడ్డా లేదా ఇతరత్రా ఏదైనా ప్రమాదం కారణంగా అవయవాల్ని కొద్ది రోజులు పని చేయించలేకపో తే... అవి మళ్లీ నార్మల్‌గా పని చేయడానికి ఫిజియోథెరపీ వ్యాయామాలు అవసరమవుతాయి. మునపటిలా పని చేయడానికి ఉపకరిస్తాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో వీటినే రీ–హ్యాబ్ వ్యాయామాలని కూడా అంటారు. వ్యాయామం అనగానే ఏదో శ్రమతో కూడిన పని అనీ, ఎలాగోలా తప్పించుకుంటే బెటరని అనిపించేవాళ్ల సంఖ్యే ఎక్కువ. చాలా సందర్భాల్లో కంప్యూటర్ సహాయంతోనో లేదా రొబోటిక్స్ సహాయంతోనో వినోదాత్మకంగా తీర్చిదిద్దిన వ్యాయామాలూ ఎక్కువగానే ఉంటాయి. ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ పద్ధతుల కంటే మనం రోజూ చేసే పనులనే ‘ఫిజియో’ వ్యాయామ పద్ధతులుగా తీర్చిదిద్దడమే మంచిదనీ, అవే ఎక్కువ మేలు చేస్తాయంటున్నారు కొందరు నిపుణులు. రోజువారీ పనులే ‘ఫిజియో’ వ్యాయామరీతులెలా అవుతాయో తెలుసుకుందాం. ఫిజియోవ్యాయామాలు అనగానే ‘పక్షవాతం’లాంటి స్ట్రోక్‌కు గురై, కోలుకునే ఏ కొందరికి మాత్రమే పరిమితమైనవనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ మన మొత్తం దేశ జనాభాలో... ఆ మాటకొస్తే ప్రపంచ జనాభాలోని 15% మందికి ఫిజియో అవసరమనేది ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా. ఒక్క పక్షవాతం వచ్చిన వారే కాదు, ప్రమాదాలకు లోనై మళ్లీ కోలుకునే క్రమంలో తమ అవయవాలను మునుపటిలా కదిలించడానికీ, కొన్ని జబ్బులతో చాలాకాలం పాటు మంచం పట్టి... ఆ తర్వాత మళ్లీ తమ పనులు యధావిధిగా చేసుకోవాలనుకుంటున్నవారికీ, మోకాళ్ల కీలు మార్పిడి చికిత్సల తర్వాత మళ్లీ మునపటిలా నడవాలనీ, జాగింగ్చేయాలనుకునేవారు... ఇలా ప్రపంచమంతటా కనీసం 100 కోట్ల మందికి రీ–హ్యాబ్ అవసరం. వీళ్లే కాదు... గుండెపో టు వచ్చాక కూడా వ్యాయామాలు అవసరం కానీ అవి గుండెపై ఏమాత్రం భారం మోపకుండా ఉండేంత సున్నితంగా ఉంటూనే... శరీరానికి తగినంత పని చెప్పేంత శ్రమతో ఉండాలి. ఈ సున్నితమైన బ్యాలెన్స్ పాటించేలా వ్యాయామాలు రూపొందించడం, చేయించడం ‘ఫిజియోథెరపిస్ట్’ ల పని. వాటిని సైంటిఫిక్‌గా రూపొందించడం ఎంతో కీలకం. కంప్యూటర్, రొబోటిక్ ఆధారితమైనవి ఎన్నెన్నో... వ్యాయామాల్ని ఉత్సాహంగా చేయడానికి వీలుగా రూపొందించడం కోసం ‘ఫిజియో’లు ఎన్నెన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు. ఉదాహరణకు కంప్యూటర్ స్క్రీన్ మీద చుక్కల్ని ఓ వరసలో కలిపి, ఓ ఆకృతి వచ్చేలా చేయడం. లేదా ఏదో టాస్క్‌ని ఓ నిర్ణీత/నిర్దేశిత పద్ధతుల్లో పూర్తి చేయడం వంటివి. ఒక రకంగా చెప్పా లంటే చిన్నపిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడి విజయం సాధించనప్పటి థ్రిల్ పొందేలా ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ ఆధారిత ఫిజియో(గేమ్స్) పద్ధతులు ఉంటాయి. ఇవి కూడా చాలావరకు మేలే చేస్తాయి. కంప్యూటర్, రొబోటిక్ వ్యాయామాల్లో పరిమితులు అయితే వాటిలో కొన్ని పరిమితులు ఉండేందుకు అవకాశం ఉంది. 2008లో దాదాపు 330 మందిపై జరిగిన ఓ అధ్యయనంలో ఈ సంగతి రుజువైంది. ఏ వ్యాయామ రీతిలోనైనా... భారం ఎక్కువగా పడుతూ, తక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామం కంటే తక్కువ భారం పడుతూ... ఎక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామంలోనే కండరానికి ఎక్కువ సామర్థ్యం అలవడుతుంది. ఇలా బరువును క్రమంగా పెంచుకుంటూ, దానికి అనుగుణంగానే రిపిటీషన్లను పెంచుతూ పో వడం వల్లనే ప్రయోజనం ఎక్కువ అని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అధిగమించడం ఇలా... పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం ఆ పరిమితుల్ని అధిగమించేందుకు కొన్ని దేశీయ పద్ధతులతో వ్యాయామ రీతుల్ని మన నిపుణులు అభివృద్ధి చేశారు. మనం రోజూ చేసే పాత పనుల్నే వ్యాయామ రీతులుగా సరికొత్తగా రూపొందించారు. రొబోటిక్ రీ–హ్యాబ్ ప్రక్రియల్లో కంప్యూటర్ ఆధారంగా కొన్ని డిజైన్లు వచ్చేలా చుక్కల్ని కలపడం, రొబోటిక్ కదలికలతో కండరం బలం పెంచుకున్నా కదలికల నైపుణ్యం తగ్గడం వల్ల ఒనగూరాల్సిన ప్రయోజనం అందదు. కానీ రోజువారీ పనులతో రూపొందించిన పద్ధతులతో చచ్చుబడ్డ కండరానికి బలమూ, నైపుణ్యమూ పెరుగుతాయి. ప్రయోజనమూ ఎక్కువే, స్వావలంబనా సహజమే ఇలాంటి దేశీయ పద్ధతులతో ఓ ప్రయోజనమూ ఉంది. కంప్యూటర్‌పై ఆటలు చిన్నతనంలో ఆసక్తిగా ఉండవచ్చు. కానీ స్ట్రోక్ లాంటివి మధ్యవయసు దాటాకే వస్తుంటాయి. అందువల్ల ఆ వయసులో కంప్యూటర్‌పై రొటీన్ సీక్వెన్సింగ్ పనులు బోర్‌గా అనిపించవచ్చు. కానీ రోజువారీ పనులు చేస్తుండటం, వాటిలో రోజురోజుకూ మెరుగుదల కనిపించడంతో పేషెంట్లకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పైగా అవి అటు తర్వాత కూడా వారి రోజువారీ జీవితంలో చేసుకోవాల్సిన పనులు కావడంతో స్వావలంబనా, ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసమూ పెరుగుతాయి. రోజువారీ పద్ధతుల్లో కొన్ని... రోటీలు చేయడం... చచ్చుబడ్డ కండరాల సహాయంతోనే రోటీలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. రొట్టెలు చేయడంలో అప్పడాల కర్రతో రొట్టెల్ని గుండ్రంగా వచ్చేలా చేయడం. ఇందులో చేతి వేళ్లన్నింటితో పాటు ముంజేయి కండరాలు, మోచేతి కీలు వంటి వాటికి వ్యాయామం సమకూరుతుంది. కూరగాయలు తరగడం పూర్తిగా నైపుణ్యంతో కాకపో యినా... వీలైనంత మేరకు కూరగాయలు తరిగేలా చేయిస్తారు. దాంతో బొటనవేలితో పాటు, కత్తి చుట్టూ మిగతా వేళ్ల గ్రిప్ పెరుగుతుంది. చేయి, ముంజేయి, మోచేతి కండరాలతో పాటు మణికట్టు ఎముకల కదలికలతో చేతికి కావాల్సిన రీ–హ్యాబ్ వ్యాయామం సమకూరుతుంది. ఇది క్రమంగా బలమూ పెంచుతుంది. నైపుణ్యాలను సైతం పెరిగేలా చేస్తుంది. చీర కుచ్చిళ్ల కదలికలతో మహిళల్లో అయితే వారు రీ–హ్యాబ్ కార్యక్రమంలో ఉన్నప్పుడు నైటీ మీదే చీర కట్టుకునేలా ్రపో త్సహించడం. ఈ ప్రక్రియలో చీర కుచ్చిళ్లను అల్లుకునేలా మాటిమాటికీ చేతులు కదిలించేలా చేస్తారు. స్ట్రోక్‌తో చేతుల్లోని, వేళ్లలోని నరాల కేంద్రం దెబ్బతిన్న వారిలో ఈ వ్యాయామ రీతి వల్ల అతి సున్నితమైన వేలి కండరాలు, వేళ్లకు సప్లై అయ్యే నరాల్లో కదలికల్ని క్రమంగా నింపేలా చూస్తారు. తోట పని ప్రక్రియలు మనం తోట పని చేసేప్పుడు గడ్డపారతో తవ్వడం, పార (స్పేడ్) లాంటి పరికరాలతో మట్టిని నిర్దేశిత రీతిలో పో గుపడేలా చేయడం, కిందపడ్డ ఆకుల్ని కాళ్లలో ఓ పక్కకు తోయడం... ఇవన్నీ పూర్తిస్థాయిలో కాకపో యినా... ఆ పనుల్లో కాళ్లూ, చేతులతో ఎలాంటి కదలికలు అవసరమో, అవే జరిగేలా చూస్తారు. ఇక్కడ నైపుణ్యానికి తావు లేకుండా తొలుత ఆసక్తిగా తోట పనిలో పాలు పంచుకునేలా చేస్తుంటారు. క్రమక్రమంగా ఆయా అవయవాలకు బలం సమకూరడమే కాకుండా... నైపుణ్యమూ పెరుగుతుంది. -డాక్టర్ విజయ్ బత్తిన (పీటీ) ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్ -
దివ్యాంగులకు బంగారు భవిత
కైకలూరు (ఏలూరు జిల్లా): దివ్యాంగుల జీవితాల్లో భవిత కేంద్రాలు చిరుదివ్వెలు వెలిగిస్తున్నాయి. విధి వంచించిన విభిన్న ప్రతిభావంతుల్లో మార్పు తీసుకువస్తున్నాయి. కేంద్రాల్లోని ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్లు(ఐఈఆర్టీ) తల్లిదండ్రులకంటే మిన్నగా చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. అడుగుతీసి అడుగువేయలేని స్థితిలో చేరిన దివ్యాంగులకు నడక నేర్పి విద్యాబుద్ధులు అందిస్తున్నారు. ప్రత్యేకావసరాల పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా ఆధునిక పరికరాలు అందిస్తోంది. దీంతో తమ బిడ్డల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. 744 మంది చిన్నారులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 49 భవిత కేంద్రాల్లో 744 మంది దివ్యాంగులు సేవలు అందుకుంటున్నారు. 68 మంది ఐఈఆర్టీలు వీరి ఆలనాపాలనా చూస్తున్నారు. వీరితో పాటు మరో 40 మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. బుద్ధిమాంధ్యం, మాట్లాడటంలో లోపం, పాక్షిక, పూర్తి అంధత్వం, వినికిడి, అభ్యాసనా లోపాలు, స్థిరత్వం లేమితో బాధపడుతున్న పదహారేళ్లలోపు విద్యార్థులకు భవిత కేంద్రాలు విశేష సేవలు అందిస్తున్నాయి. వైద్య నిర్ధారణ శిబిరాలు ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కోసం వైద్య నిర్ధారణ శిబిరాలు ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం, కై కలూరులో పూర్తికాగా నూజివీడులో నిర్వహించాల్సి ఉంది. మొత్తం 240 మంది దివ్యాంగులను శిబిరాల ద్వారా గుర్తించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరంలో జరగ్గా, 7న తణుకు, 10న పాలకొల్లులో ఉచిత శిబిరాలు నిర్వహించనున్నారు. శిబిరాల్లో గుర్తించిన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అలింకో కంపెనీ నుంచి హియిరింగ్ ఎయిడ్స్, కాలిపర్స్, వీల్‌చైర్స్, రోలెటర్స్, హ్యాండ్ స్టిక్స్, సీపీ చైర్ వంటి పరికరాలను ఉచితంగా అందించనున్నారు. సేవలకు వందనం భవిత కేంద్రాల్లో ప్రత్యేకావసరాల గల చిన్నారులకు ఐఈఆర్టీలు, ఆయాలు ఎనలేని సేవలు అందిస్తున్నారు. ప్రతి వారం ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. దృష్టిలోపం కలిగిన వారికి బ్రెయిలీ లిపిలో బోధిస్తున్నారు. చెవిటి, మూగ వంటి సమస్యలు ఉన్నవారికి స్పీచ్ థెరపీ అందిస్తున్నారు. నడక సరిగా రాని పిల్లల కోసం స్టెప్బర్, వాకింగ్బార్లు అందు బాటులో ఉన్నాయి. మనోవికాసం వృద్ధి చెందేలా గణిత భావనలు గుర్తుండేలా పూసల చట్రాలు, ఆట వస్తువులు ఉన్నాయి. బుద్ధిమాంధ్యం కలిగిన వారికి ఎంఆర్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. స్పీచ్ థెరపీతో మాటలు ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు హకీమా. పుట్టుకతో మూగ, వినికిడి లోపం. 12 ఏళ్ల హకీమా ఆరేళ్ల క్రితం కైకలూరు భవిత కేంద్రంలో చేరింది. స్పీచ్ థెరపీలో చిన్నారికి ఐఈఆర్టీ జి.వెంకటలక్ష్మి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధగా హకీమాను రోజూ కేంద్రానికి తీసుకొస్తున్నారు. దీంతో బాలిక అక్షరాలను అర్థం చేసుకుంటోంది. ప్రస్తుతం ఉర్దూ పాఠశాలలో చదువుకుంటోంది. త్వరలో శస్త్రచికిత్సలు ప్రభుత్వం ప్రత్యేకావసరాల చిన్నారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. సహాయకులకు అలవెన్సు లు, రవాణా ఖర్చులు అంది స్తున్నాం. బుద్ధిమాంద్యం కలిగిన వారికి ఉచితంగా ఇచ్చే సీపీ చైర్ విలువ రూ.35 వేలు ఉంటుంది. నాడు–నేడు పథకంలో ప్రభుత్వం భవిత కేంద్రాలను తీర్చిదిద్దుతోంది. గ్రహణంమొర్రి, గ్రహణశూల, కండరాలలోపంతో బాధపడే వారికి త్వరలో శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. – బి.భాస్కరరాజు, ఐఈఆర్టీ జిల్లా కో–ఆర్డినేటర్, ఏలూరు భవిత కేంద్రాల వివరాలు ఏలూరు ‘పశ్చిమ’ కేంద్రాలు 29 20 చిన్నారులు 484 280 ఐఈఆర్టీలు 38 27 ఫిజియో- థెరపిస్టులు 9 7 ఆయాలు 20 20 -
రోగికి డ్యాన్స్ స్టెప్లతో ఫిజియోథెరఫీ వ్యాయామాలు!: వైరల్ వీడియో!
రోగులు తమ అనారోగ్యాన్ని మరిచిపోయేలా డాకర్లు కౌన్సిలింగ్‌లు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. పేషంట్ మరీ నిరాశ నిస్పృహలకు లోనైతే వాళ్లకు ప్రత్యేకంగా మానసికనిపుణుల పరివేక్షణలో ఉంచి చికిత్స అందిచడం వంటివి చేస్తారు. కానీ వాటన్నింటికి భిన్నంగా పక్షవాతం వచ్చిన రోగిని ఉత్సాహపరిచేందుకు నర్సు డ్యాన్స్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. అసలు విషయంలోకెళ్తే... ఆ వీడియోలో నర్సు పక్షవాత రోగికి వినూత్న పద్ధతిలో కొన్ని ఫిజియోథెరపీ వ్యాయామాలు చేసేలా సహాయం చేసింది. నర్సు అతనికి కొన్ని డ్యాన్స్ స్టెప్పులు చూపుతున్నప్పుడు రోగి మంచం మీద పడుకుని ఉన్నాడు. అంతేకాదు బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక పాట కూడా ప్లే అవుతుంటుంది. అయితే పేషంట్ నర్సు స్టెప్పులను అనుకరించటానికి ప్రయత్నించాడు. వీడియో చివర్లో ఆమె రోగికి తన చేతులతో చేతి కదలిక వ్యాయామాలు చేయడంలో కూడా సహాయపడుతుంది. దీంతో ఆ పేషంట్ ముఖంలో నవ్వు చిగురించడమే కాకుండా తను కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ తనకు తెలియకుండానే చచ్చుబడిన అవయవాలను కదిపేందుకు ప్రయత్నించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి దీపాంషు కబ్రా ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ మేరకు ఫిజియోథెరపీ సెషన్లో రోగికి సహాయం చేస్తున్న నర్సును ఆయన ప్రశంసించారు. नर्स ने बड़ी चतुराई से डांस करते हुए लकवाग्रस्त मरीज़ में उमंग और उत्साह भरकर फिजियोथेरेपी एक्सरसाइज करवा दी. मरीज़ जब ठीक हो जाते हैं, तो सभी डॉक्टर्स को धन्यवाद देते हैं. लेकिन नर्सेस और अन्य मेडिकल स्टाफ अपने प्रेम से जो इलाज करते हैं, उसके लिए 'धन्यवाद' बेहद छोटा शब्द है... pic.twitter.com/dLvXZVgfgh — Dipanshu Kabra (@ipskabra) January 24, 2022 -
పేదలకు ఫిజియోథెర‘ఫ్రీ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) క్రీడాకారులతో పాటు సామాన్యుల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యమిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి బుధవారం పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఉచిత ఫిజియో వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలోని ఫిజియోథెరపీ కేంద్రంలో ఉదయం 10.30 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సీనియర్ ఫిజియో పర్యవేక్షణలో కార్పొరేట్ స్థాయి చికిత్స అందించనుంది. అత్యాధునిక వైద్య పరికరాలు అత్యాధునిక వైద్య పరికరాల సాయంతో శాప్ ఆధ్వర్యంలోని ఫిజియోథెరపీ కేంద్రం ఇప్పటి వరకు క్రీడాకారులకు మాత్రమే వైద్య సేవలందించింది. అనారోగ్యంతో బాధపడుతూ ఖర్చుతో కూడుకున్న ఫిజియో వైద్యం చేయించుకోలేని వారి కోసం ఒక రోజు ఉచిత సేవలకు శ్రీకారం చుట్టింది. ఈ కేంద్రంలో దక్షిణ భారతదేశంలో ఎక్కడా లేని వెన్నుముక సంబంధిత నొప్పుల చికిత్సకు వినియోగించే కేడీటీ ట్రాక్షన్ పరికరం అందుబాటులో ఉంది. దీనిని అమెరికా నుంచి క్రీడాకారుల కోసం ప్రత్యేక తీసుకొచ్చారు. కండర గాయాలను తగ్గించే షాక్వేవ్ థెరపీ పరికరాన్ని స్విజ్జర్లాండ్ నుంచి రప్పించారు. శీతల వైద్యం (క్రయో థెరపీ) యూనిట్, ఎముకలు, నరాల చికిత్స కోసం బీటీఎల్ – ఎలక్ట్రోథెరపీ, కీళ్ల నొప్పులు, క్రయో, ఐస్ వాక్స్ థెరపీ, వాటర్, ఎలక్ట్రిక్ హీట్, స్టిములైజర్స్, అల్ట్రా సౌండ్, జిమ్ పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రజల సౌకర్యార్థం 98764 17999, 85558 47798 నంబర్లతో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇవి వైద్య సేవలు: ఎముకలు, కీళ్ల నొప్పులు, నరాలు, స్పోర్ట్స్ ఇంజ్యూరీస్, కండర, అన్ని రకాల కార్డియో రెస్పిరేటరీ చికిత్సలు అందించనున్నారు. సమాజ ఆరోగ్యం దృష్ట్యా.. ఫిజియోథెరపీ వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది. నిరుపేదలు ఫిజియో వైద్యం చేయించుకోవాలంటే ఆలోచిస్తారు. ఏళ్లు తరబడి వ్యాధులతో బాధపడుతుంటారు. శాప్‌కు క్రీడాకారుల ఆరోగ్యంతో పాటు సమాజ ఆరోగ్యం కూడా ముఖ్యమే. అందుకే శాప్ ఆధ్వర్యంలోని అత్యాధుని ఫిజియోథెరపీ సెంటర్లో వారంలో ఒక రోజు ఉచిత సేవలను అందిస్తున్నాం. అవసరమైన వారు ఈ సేవలను వినియోగించుకోవాలి. – ఎన్.ప్రభాకరరెడ్డి, శాప్ ఎండీ -
కూకట్‌పల్లిలో ఉచిత ఫిజియోథెరపీ సేవలు, టైమింగ్స్ ఇవే..
మోతీనగర్: ప్రస్తుత కాలంలో కాస్త అనారోగ్యానికి గురైనా రూ. వేలల్లో మొదలుకొని లక్షల్లో ఖర్చు అవుతున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తే వివిధ రకాల వైద్య పరీక్షలు, స్కానింగ్‌ల పేర్లతో ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేస్తున్నారు. నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో తమకు వంతు సాయంగా ఫిజియోథెరపీ అందిస్తున్నారు ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్ సభ్యులు. సుమారు దశాబ్దంన్నర క్రితం కూకట్పల్లి వివేకానందనగర్ వ్యవస్థాపక అధ్యక్షుడు హరీష్, ప్రస్తుత అధ్యక్షుడు కొలసాని రాథా మోహన్‌రావు ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్‌ను స్థాపించారు. ఎన్ఆర్ఐ సేవా ఫౌండేషన్, అమెరికా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మురికి వాడల్లో నివసిస్తున్న పేద బడుగు వర్గాల వారికి ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంగా నాటి నుంచి నేటి వరకూ ఫిజియోథెరపీ చేస్తున్నారు. ♦ సంచార ఫిజియోథెరపీ కేంద్రం ద్వారా, ఫిజియోకేర్, రీహాబిలేషన్ కేంద్రం ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాల్లో సేవలు అందిస్తున్నారు. అంతేకాక అనాథ, వృద్ధాశ్రమాల్లో ఉండే వారికి సైతం ఫిజియోథెరపీ చేస్తున్నారు. ♦ సహజంగానే ఎదుర్కొనే వ్యాధులలో ప్రధానంగా వెన్ను, అరికాళ్లు, పిక్కలు, మోకాళ్లు, భుజాలతో పాటు ఇతర నొప్పుల నివారణకు నిపుణులైన వైద్యులతో ఫిజియోథెరపీతో పాటు ప్రముఖ యోగా గురువుతో ఆసనాలు వేయిస్తున్నారు. ♦ రోగులు సూచించిన నొప్పిని బట్టి దాని నివారణకు వివిధ రకాల వ్యాయామాలతో పాటు పలువురు ప్రముఖ యోగా గురువులు ఆసనాలు చేయిస్తున్నారు. ♦ అంతేకాక వ్యాధి తగ్గిన తర్వాత కూడా వైద్యులు, ఫౌండేషన్ ప్రతినిధులు యోగక్షేమాలు తెలుసుకుని సలహాలు, సూచనలు చేస్తుంటారు. ♦ కూకట్పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ పరిధిలోని మురికి వాడల్లో నివసించే వారితో పాటు నగరంలోని పలు వృద్ధాశ్రమాల్లోనూ ఉచితంగా సేవలు అందిస్తున్నారు. ♦ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు. ఆదివారం మినహాయించి ఒక్కో ప్రాంతంలో రెండు వారాల పాటు శిబిరాలు నిర్వహిస్తున్నారు. కూకట్పల్లి సాయికృప ప్లాట్ నెంబర్ 332, శ్రీవివేకానందనగర్, డీఏవీ స్కూల్ రోడ్డులో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ♦ మూసాపేట డివిజన్ మోతీనగర్‌లోని కమ్యూనిటీ హాల్లో గత నాలుగేళ్ల నుంచి నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారు. ♦ కోవిడ్ కారణంగా గత కొన్ని రోజుల నుంచి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మాత్రమే వైద్యులు అందుబాటు ఉంటున్నారు. అదే విధంగా గచ్చిబౌలి స్పోర్ట్స్ స్టేడియం ఆవరణలోనూ వైద్య సేవలు కొనసాగుతున్నాయి. ♦ హ్యాండ్ గ్రిప్పర్, టెన్స్, ఐఎఫ్‌టీ, ఆల్ట్రాసౌండ్, స్విస్ బాల్, షోల్డర్ పుల్లీ, షోల్డర్ వీల్, డెలాయిడ్ మైల్ స్టోన్స్, సైక్లింగ్ వంటి సామగ్రితో వైద్యం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. చిన్నారికి ఫిజియో థెరపీ చేస్తున్న సిబ్బంది ఉచితంగా చేయడం సంతోషం.. : ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ. వేలకు వేలు చెల్లించి వైద్యం చేయించుకున్న నయం కాలేదు. మోతీనగర్ కమ్యూనిటీ హాల్లో ఉచితంగా ఫిజియోథెరపీ కేంద్రం కొనసాగుతుందని నా మిత్రుల ద్వారా తెలుసుకొని వచ్చిన తర్వాత వివిధ రకాల నొప్పులు తగ్గుముఖం పట్టాయి. వైద్యం అందని ద్రాక్షగా ఉన్న ఈ రోజుల్లో ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించటం సంతోషం -టి.నారాయణ చదవండి : రికార్డు కొట్టేసిన వంటలక్క, లక్కీ చాన్స్! అర్థమయ్యే రీతిలో కౌన్సెలింగ్.. చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ తిరిగి విసుగు చెంది మా వద్దకు వస్తుంటారు. అలాంటి వారికి ముందుగా అర్థమైన రీతిలో కౌన్సెలింగ్ ఇచ్చి వారికి ఏయే నొప్పులకు ఏ రకంగా వైద్యం చేయాలో పరిశీలిస్తాం. ఆ తర్వాత సుమారు వారం రోజుల నుంచి నెల పాటు నిత్యం క్రమం తప్పకుండా ఫిజియోథెరపీ చేస్తాం. – డాక్టర్ కె. కామాక్షి, ఎంపీటీ న్యూరాలజీ ఆరోగ్యంగా ఇంటికెళ్లడమే మాకు ఆనందం.. చాలా మంది వివిధ నొప్పులతో బాధపడుతూ తమ కేంద్రానికి వస్తుంటారు. వయస్సు పై బడిన వారు నొప్పులతో బాధపడుతూ రావటం చూసి మాకే ఒక్కోసారి బాధ కలుగుతోంది. వారి సమస్యలు క్షుణ్ణంగా పరిశీలించి వైద్యం ప్రారంభిస్తాం. వారు వ్యాధి తగ్గిన తర్వాత సంతోషంగా వెళ్లటమే మాకు ఆనందం. మాకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ అందిస్తున్న సేవలు అమోఘం. – డాక్టర్ బి. కృష్ణకుమారి, ఎంపీటీ స్పోర్ట్స్ -
ఫిజియోతో కండరాలకు బలం పెంచుకోవడం ఎలా?
కొందరు కరోనా రోగులు తమ చికిత్సతో భాగంగా హాస్పిటల్లో ఒకింత ఎక్కువ రోగులు గడపాల్సి రావచ్చు. ఆ తర్వాత కూడా తాము కోలుకునేవరకు ఇంట్లోనూ చాలాకాలం పాటు బెడ్ రెస్ట్‌లో ఉండి... కేవలం మంచానికే పరిమితం కావాల్సి రావచ్చు కూడా. ఇలాంటివారు తమ కండరాల శక్తిని తాత్కాలికంగా కోల్పోయే అవకాశం ఉంది. వారు మునుపటిలా తమ శక్తిని పెంచుకునేందుకూ, పుంజుకునేందుకు డాక్టర్లు ఫిజియోధెరపీ వ్యాయామాలను సిఫార్సు చేస్తారు. అలాంటి వారు చేయాల్సిన ఫిజియో వ్యాయామాలలో ప్రధానమైనవి ఇవే... వీటిని కరోనా రోగులే గాక ఆరోగ్యవంతులు కూడా చేయవచ్చు. సీటెడ్ నీ ఎక్స్టెన్షన్ కుర్చీలో నిటారుగా ఉంటూ... కాళ్లు కిందకు వేలాడేలా కూర్చోవాలి. ∙ఒక కాలిని మోకాలిని మెల్లగా పైకి లేపుతూ కాలు స్ట్రెయిట్‌గా ఉండేలా లేపాలి. ఇలా లేపి ఉంచిన కాలిని 10 సెకండ్లపాటు అలాగే నిలబెట్టి ఉంచాలి. ∙ఆ తర్వాత రెండో కాలినీ లేపి, దాన్ని కూడా 10 సెకండ్లపాటు నిలబెట్టి ఉంచాలి. ఈ వ్యాయామాన్ని 10 రిపిటేషన్లతో చేయాలి. సీటెడ్ హిప్ ఫిక్సేషన్... కుర్చీలో నిటారుగా కూర్చోవాలి. రెండుకాళ్లూ నేలకు ఆనించి ఉంచాలి. ∙ఒక కాలిని తొడ దగ్గర బలం ఉపయోగిస్తూ లేపుతూ... మోకాలి కిందిభాగం నుంచి కాలు అలాగే వేలాడుతూ ఉంచేలా... కేవలం తొడ భాగం మాత్రమే కుర్చీ నుంచి పైకి లేపాలి. ∙ఇప్పుడు రెండో కాలినీ ఇలాగే లేపాలి. ∙ఇలా రెండు కాళ్లూ మార్చి మార్చి లేపుతూ... మార్చ్ఫాస్ట్ చేస్తున్నట్టు తొడల దగ్గర కాళ్లు లేపుతూ ఉండాలి. సిట్ టు స్టాండ్ : ∙వీపును నిటారు గా ఉంచుతూ కుర్చీ అంచున కూర్చోవాలి. చేతులు రెండింటినీ నేలకు సమాంతరంగా ఉండేలా పైకి లేపాలి. ∙అలాగే నెమ్మదిగా పైకి లేవాలి. ∙ఇలా చేయడం చాలా తేలిగ్గా ఉందని మీకు అనిపిస్తూ మీరు మరింత తక్కువ ఎత్తు ఉండే కుర్చీని ఎంచుకుని అందులోంచి కూర్చుని పైకి లేస్తూ ఉండే వ్యాయామాన్ని రిపిటీషన్లతో చేయాలి. షోల్డర్ ప్రెస్ : మీరు కూర్చుని గానీ లేదా నిల్చుని గానీ ఈ వ్యాయామాన్ని చేయవచ్చు. మీ రెండు చేతులూ పై వైపునకు ఉండేలా ఎత్తాలి. ∙ఆ తర్వాత రెండు చేతులను మోచేతుల దగ్గర మడుస్తూ పై వైపునకు గాలిలో బలంగా కదిలిస్తూ గాలిలో పంచ్‌లు ఇవ్వాలి. ∙మీకు ఈ వ్యాయామం తేలిగ్గా అనిపిస్తే చేతిలో కొంత బరువు ఉండేలా తేలికపాటి డంబెల్స్తోనూ చేయవచ్చు. కష్టంగా అనిపిస్తే తేలికపాటి డంబెల్స్ లేకుండా / పంచ్‌లు కూడా ఇవ్వకుండా తేలిగ్గా మోచేతుల దగ్గర ముడిస్తూ, మళ్లీ చేతులు స్ట్రెయిటెన్ చేస్తూ కూడా వ్యాయామం చేయవచ్చు. షోల్డర్ స్ట్రెంతెనింగ్ : కుర్చీలో నిటారుగా కూర్చోండి. ∙రెండు అరచేతులూ ఒకదానికి మరొకటి ఎదురుగా వచ్చేలా చేతులు స్ట్రెయిట్ గా ముందుకు చాచండి. ముందుకు ఉన్న ఆ రెండు చేతులనూ క్రమంగా పక్కలకు తెండి. మళ్లీ ముందుకు తెండి. ∙ఈ వ్యాయామం తేలిగ్గా అనిపిస్తే... రెండు చేతుల్లోనూ తేలికపాటి డంబెల్స్ ఉంచుకుని కూడా చేయవచ్చు. సీటెడ్ ట్రైసెప్ డిప్స్ హ్యాండ్ రెస్ట్ ఉన్న ఓ కుర్చీని తీసుకుని ఆ కుర్చీలో నిటారుగా కూర్చోండి. ఇప్పుడు మీ చేతులతో హ్యాండ్ రెస్ట్‌ను పట్టుకుని... దానిపై ఒత్తిడి వేస్తూ చేతులు రెండూ మోచేయి దగ్గర స్ట్రెయిట్ అయ్యేంతవరకు కుర్చీలో లేవండి. ∙ఆ తర్వాత మళ్లీ కూర్చుని మళ్లీ లేస్తూ... మీకు వీలైనన్ని రిపిటీషన్లు చేయండి. బ్రిడ్జింగ్ : మీ పడక మీద లేదా నేల మీద వెల్లకిలా పడుకోండి. మోకాళ్లను కొంత మడిచి ఉంచండి. మీ అరికాళ్లతో నేలను బలంగా తంతున్నట్లుగా బలం ఉపయోగించి మీ నడుము భాగాన్ని పైకి ఎత్తుండి. పైకెత్తిన నడుము భాగాన్ని దించుతూ... మళ్లీ ఎత్తుతూ... రిపిటీషన్స్‌తో ఈ వ్యాయామాన్ని చేయండి. సైడ్–వే లెగ్ లిఫ్ట్ : ఓ పక్కకు తిరిగి పడుకుని నేలకు ఆని ఉన్న కాలిని మోకాలి దగ్గర సౌకర్యంగా కాస్త ఒంచి ఉంచండి. ∙నేలకు దూరంగా ఉన్న కాలిని మెల్లగా వీలైనంతవరకు పైకి ఎత్తండి. ఇలా కాలిని ఎత్తుతూ... దించుతూ మీకు వీలైనన్ని రిపిటీషన్స్ చేయండి. ∙ఇప్పుడు మరో వైపునకు ఒరిగి మళ్లీ అనే రిపిటీషన్స్‌తో రెండోకాలితో వ్యాయామాన్ని చేయండి. స్ట్రెయిట్ లెగ్ రెయిజ్ : ∙నేల మీద లేదా పడక మీద వెల్లకిలా పడుకోండి. ఒక కాలిని మోకాలి దగ్గర ఒంచి... మరో కాలిని స్ట్రెయిట్‌గా ఉంచండి. ∙స్ట్రెయిట్‌గా ఉన్న కాలిని మెల్లగా వీలైనంతవరకు పైకి ఎత్తండి. ఆ తర్వాత దించండి. ఇలా ఎత్తుతూ... దించుతూ వీలైనన్ని రిపిటీషన్స్ చేయండి. ∙ఇప్పుడు మరో కాలిని వంచి అలాగే... ఇంకో కాలిని స్ట్రెయిట్ చేసి ఇదే వ్యాయామాన్ని అన్నే సార్లు రిపీట్ చేస్తూ... అనే రిపిటీషన్స్‌తో చేయండి. - డాక్టర్ వినయ్‌కుమార్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ -
మోకాళ్ల నొప్పులా.. ఈ పనులు చేయకండి
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారిలో చాలామంది తాము ఎక్కువగా నడుస్తూ ఉంటే మోకాళ్ళు మరింతగా అరిగిపోతాయేమోనని, దాంతో నొప్పులు మరింతగా పెరుగుతాయేమోనని అపోహపడుతుంటారు. వాస్తవానికి ఇది కేవలం అపోహ మాత్రమే. నిజానికి మన మోకాళ్ల కదలికలు ఎంత ఎక్కువగా ఉంటే, ఆ భాగంలో అంతగా రక్తప్రసరణ జరుగుతుంది. అలా రక్తప్రసరణ పెరగడం వల్ల కీళ్లకు మంచి పోషణ అందుతుంది. రాబోయే కాలం అనువైన సమయం... కొద్దిరోజుల్లోనే చలికాలం ముగియబోతోంది. చలి క్రమంగా తగ్గిపోయి ఉదయం వేళ, సాయంత్రం పూట నడకకు ఆస్కారం ఇచ్చే వాతావరణం... అంటే... అంతగా చలీ, అంతగా వేడీ లేని మంచి వాతావరణం మరో రెండు నెలలూ ఉండబోతోంది. అందుకే వీలైతే వెంటనే రోజుకు కొంతసేపు నడకకు కేటాయించండి. పది నిమిషాలు వ్యవధితో మొదలు పెట్టి క్రమంగా 40 – 60నిమిషాల వరకూ వాకింగ్ సమయాన్ని పెంచుతూ పొండి. నడక వల్ల మీ మోకాళ్లపై మీ దేహభారం పడుతుందని అనిపిస్తే...ఒకే చోట కూర్చుని చేసే సైక్లింగ్ కూడా చేయవచ్చు. నొప్పులు తగ్గేందుకు ఉపయోగపడే ఉపకరణాలివి... మోకాలిలో నొప్పులు లేకుండా ఉండటానికి / నొప్పులు తగ్గడానికి నీ గార్డులు, క్రేప్ బ్యాండేజీలు, మోకాళ్ల వద్ద బిగుతుగా ఉంచే సపోర్టింగ్ సాక్స్, చిన్న బ్రేసెస్ ఇలాంటి కొన్ని ఉపకరణాలను అవసరమైన వారికి ఆర్థోపెడిక్ నిపుణులు సూచిస్తారు. అయితే పనుల్లో భాగంగా మోకాలిపైన భారం పడుతున్న సమయంలో మాత్రమే వీటిని ధరించాలి. లేదా డాక్టర్ సూచనలకు అనుగుణంగా మాత్రమే వీటిని ఉపయోగించాలి. ఈ పనులు చేయకండి... మోకాళ్ల నొప్పులున్నవారు ఇక్కడ పేర్కొన్న పనులేవీ చేయకూడదు. అవేమిటంటే... ఒక అంతస్తు కంటే ఎక్కువగా మెట్లు ఎక్కి దిగడం వద్దు. ఎగుడు–దిగుడుగా ఉండే నేలపై నడవద్దు. నడక వ్యాయామం సమయంలోనూ సమతలంగా ఉండే నేలపైనే నడవండి. నేలపై కాళ్లు రెండూ మడత వేసుకుని కూర్చోవడం / లేవడం (స్కాటింగ్) చేయకండి. గొంతుక్కూర్చొని బరువైన వస్తువలేవీ ఎత్తకండి. నొప్పులు తగ్గకపోతే... పైన పేర్కొన్న జాగ్రత్తలు తీసుకుంటున్నా... నడక మొదలుపెట్టిన వారం లేదా రెండు వారాల్లో తగ్గకపోయినా ఆర్థోపెడిక్ నిపుణుడిని సంప్రదించండి. వారు మీ మోకాళ్ళను ఎక్స్–రే తీసి, అవి ఏ మేరకు అరిగాయి అన్న విషయం తెలుసుకుంటారు. దాన్ని బట్టి మీకు ఎలాంటి వైద్య చికిత్స అవసరమో నిర్ణయిస్తారు. అవసరాన్ని బట్టి మందులతోపాటు ఫిజియోథెరపీని కూడా సూచించవచ్చు. ఫిజియోథెరపీలో కండరాలు, ఎముకలు గట్టిపడి వాటి కదలికలు మెరుగుపడతాయి. ఫిజియో అంటే మళ్లీ వ్యాయామాలే. కాబట్టి ఈ సారి క్రమంగా మీ నొప్పులు తగ్గుతూ మళ్లీ వ్యాయామం వైపునకు మళ్లే అవకాశం ఉంటుంది. -
మరణం దరి చేరకుండా ఉండాలంటే.
వాషింగ్టన్: అనారోగ్య కారణాలతో మరణం దరి చేరకుండా ఉండాలంటే..రోజూ పరుగు తీయాల్సిందే అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. ముఖ్యంగా హృద్రోగులు, కేన్సర్ బాధితులు వారానికి కనీసం 25 నిమిషాలు రన్నింగ్/జాగింగ్ చేస్తే ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చని చెబుతున్నారు. తద్వారా వారికి ఆయా వ్యాధులతో మరణం వచ్చే అవకాశాలు 27 శాతం తగ్గుతాయని పేర్కొన్నారు. ఐదున్నరేళ్ల నుంచి 35 ఏళ్లలోపు 2,32,149 మంది జీవనశైలి, దినచర్య, ఆరోగ్య నివేదికల పరిశీలన అనంతరం ఈ నిర్ధారణకు వచ్చినట్లు చెప్పారు. వ్యాయామానికి బాటలు వేస్తే వ్యాధులకు చెక్ దేశంలో మధుమేహం, కేన్సర్, హృద్రోగాల వ్యాప్తికి అడ్డుకట్ట పడాలంటే నగరాల్లో పర్యావరణ పరిరక్షణ,మౌలిక వసతుల కల్పనపై దృష్టిసారించాలని పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా సూచించింది. కొరవడిన శారీరక వ్యాయామం, ముసురుకుంటున్న కాలుష్యం ప్రజలను వ్యాధిగ్రస్తుల్లా మారుస్తోందని తెలిపింది. దీంతో పడిపోతున్న ప్రజల ఆయుర్దాయాన్ని పెంచాలంటే నగరపాలక సంస్థలు ఇకనైనా మేల్కొనాలని కోరింది. రోడ్లపై పాదచారుల వంతెనలు, వాకింగ్/జాగింగ్ చేసేవారి కోసం రోడ్ల పక్కన కుర్చీలు, ఉద్యానవనాల అభివృద్ధిపై దృష్టి సారించాలని నివేదించింది. వెన్నునొప్పి, నిద్రలేమికి యోగా, పీటీతో చెక్ వెన్నునొప్పి, నిద్రలేమి సమస్యలకు యోగా, ఫిజికల్ థెరపీ (పీటీ) తో కళ్లెం వేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ సమస్యలకు వైద్యం తీసుకునే అవసరాన్ని కూడా యోగా, పీటీ తగ్గిస్తాయని అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలింది. దీర్ఘకాలిక వెన్నునొప్పి, నిద్రలేమి సమస్య ఉన్న 320 మందికి ఓ థెరపిస్టు దగ్గర 12 వారాల పాటు యోగా, పీటీ చేయించారు. అనంతరం వారిలో ఈ సమస్య గణనీయంగా తగ్గినట్లు గుర్తించామని పరిశోధకులు తెలిపారు. నిద్రలేమి, వెన్నునొప్పి సమస్యలకు వాడే మందులతో దుష్ప్రభావం పడొచ్చని, దీంతోపాటు అతిగా మందులు వాడే ప్రమాదం ఏర్పడవచ్చని, కొన్నిసార్లు మరణం కూడా సంభవించవ్చని హెచ్చరించారు. -
ఉన్నట్టుండి కుడివైపు మూతి వంకరపోతోంది!
నా వయసు 52 ఏళ్లు. నాకు ఉన్నట్టుండి మూడు రోజులుగా కుడి పైపున మూతి వంకరపోతోంది. నీళ్లు ఒక్క పక్క నుంచి కారిపోతున్నాయి. ఎంత ప్రయత్నించినా కనురెప్ప మూసుకుపోవడం లేదు. ఇది పక్షవాత లక్షణమా? మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘బెల్స్ పాల్సీ’ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖానికి వెళ్లే ఏడవ నరం (ఫేషియల్ నర్వ్) తాత్కాలికంగా పని చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కొందరిలో వైరల్ జ్వరాల తర్వాత, వాటి కారణంగా కూడా సమస్య రావచ్చు. అయితే ఇది పక్షవాతం అనే అపోహ కొందరిలో ఉంటుంది. అది ఎంత మాత్రమూ నిజం కాదు. కొన్నిరకాల మందులతో దీన్ని తగ్గించవచ్చు. ముఖానికి సంబంధించిన కండరాలకు ఫిజియోథెరపీ చేయడం వల్ల ఇది తొందరగా తగ్గే అవకాశం ఉంది. ఈ జబ్బు వచ్చిన వారిలో దాని తీవ్రతను బట్టి అది నయమయ్యే సమయం ఆధారపడి ఉంటుంది. నూటికి 80 నుంచి 90 మందిలో మొదటి ఆరు నెలల్లో నయమవుతుంది. బెల్స్పాల్సీ ముఖానికి సంబంధించిన కండరాలకు తప్పించి, శరీరంలోని ఏ భాగాలనూ ప్రభావితం చేయదు. అయితే... చేయి, కాళ్లలో బలం కోల్పోయినా, మింగడంలో ఇబ్బంది ఏర్పడినా, కనుచూపులో మార్పు కనబడినా... ఈ లక్షణాలలో ఏవి కనిపించినా తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన అంశాలను బట్టి మీరు అంతగా ఆందోళనపడాల్సిన అవసరం లేదు. డాక్టరును సంప్రదించి సరైన మందులు, ఫిజియోథెరపీ తీసుకోండి. బెల్స్ పాల్సీ తప్పక నయమవుతుంది. కొన్నేళ్లుగా తీవ్రమైన తలనొప్పి...ఎందుకిలా? నా వయసు 33. గత కొన్నేళ్లుగా నాకు తరచూ తలనొప్పి వస్తూ, తగ్గుతూ ఉంది. ఒక్కోసారి అది నెలలో నాలుగైదుసార్లు కూడా వస్తోంది. ఒక్కోసారి నా రోజువారీ పనులేవీ చేసుకోలేనంత తీవ్రంగా ఈ నొప్పి ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్ కావచ్చు. మీకు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, ఘాటైన వాసనలు, పర్ఫ్యూమ్స్ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే దాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఫిజియోథెరపీకి పెరుగుతున్న ప్రాధాన్యత
నెల్లిమర్ల : వైద్యరంగంలో ఫిజియోథెరపీకి ప్రాధాన్యత పెరుగుతోందని మిమ్స్ చైర్మన్ అల్లూరి మూర్తిరాజు అన్నారు. పట్టణంలోని మిమ్స్ క్యాంపస్‌లో ఉన్న అల్లూరి లక్ష్మీకాంతమ్మ మెమోరియల్ ఆడిటోరియంలో ఆదివారం ఫిజియోథెరపీ కళాశాలకు సంబంధించిన పట్టాల ప్రధానోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మూర్తిరాజు మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఫిజియోథెరపీకి అవకాశాలు పెరుగుతున్నాయన్నారు. ఈ ప్రక్రియ వైద్యంలో ఒక భాగమైందన్నారు. మందులతో నయంకాని రోగాలు సైతం ఫిజియోథెరపీతో నయమవుతున్నాయని పేర్కొన్నారు. అంతేగాకుండా ఈ విధానానికి విదేశాల్లో సైతం మంచి అవకాశాలు లభ్యమవుతున్నాయని మూర్తిరాజు చెప్పారు. డీన్ టీఏవీ నారాయణరాజు, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఫిజియోథెరపీతో అన్ని రోగాలు నయమవుతాయని తెలిపారు. గతంతో పోల్చితే ఈ విధానానికి రోగుల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ రవికుమార్ కళాశాల ప్రగతిని వివరించారు. 2013–14 బ్యాచ్ శతశాతం ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ప్రారంభం నుంచి సరాసరి 85 శాతం ఫలితాలు సాధించామని వివరించారు. క్రీడల్లో సైతం ఫిజియోథెరపీ కళాశాల విద్యార్థులు రాణిస్తున్నారని రవికుమార్ వివరించారు. ఈ సందర్భంగా కళాశాల టాపర్ దీపా శర్మను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. వారితో ప్రతిజ్ఞ చేయించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘురామ్, మిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీకుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీలలిత, హోమియో కళాశాల డైరెక్టర్ పివి.నర్సింహరావు, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సీఆర్ఎస్ బేగం, సంక్షేమాధికారి గిరిబాబు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీలో ఆందోళన
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. పేపర్ వాల్యూవేషన్లో అన్యాయం జరిగిందని ఫిజియోథెరపి విద్యార్థులు బుధవారం ధర్నా చేపట్టారు. తక్కువ మార్కులు ఇచ్చి, కావాలనే ఫెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. ఎటెంమ్ట్ చేసిన ప్రశ్నలకు కనీస మార్కులు ఇవ్వలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కనీస మర్యాద కూడా లేకుండా యూనివర్సిటీ సిబ్బంది అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రీకౌంటింగ్ ద్వారా అన్యాయం జరుగుతోందని, రీ వాల్యూవేషన్ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. -
కురుపులు వచ్చి తగ్గాక కూడా ఇప్పుడు మళ్లీ నొప్పి!
నా వయసు 45 ఏళ్లు. పది రోజుల కిందట నాకు ఒక పక్క కురుపులు వచ్చాయి. బాగా నొప్పిగానూ ఉన్నాయి. పదిరోజుల్లో మాడిపోయాయి. అయితే ఇప్పుడు లోపలి నుంచి భరించలేనంత నొప్పి వస్తోంది. నా సమస్యకు పరిష్కారం ఏమిటి? – ఎన్. కిశోర్, నూజివీడు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు పోస్ట్ హెర్పటిక్ న్యూరాల్జియా అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారిలో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది రావచ్చు. కురుపులు కనిపించినప్పుడు ఎసైక్లోవిర్ అనే టాబ్లెట్లు వాడటంతో అవి తగ్గిపోతాయి. అలా వాడని వారిలో కురుపులు మానిపోయాక భరించలేనంత నొప్పి వస్తుంది. దీనినే హెర్పటిక్ న్యూరాల్జియా అని అంటారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు రెండు, మూడు రకాల మందులు వాడి, సమస్యను అదుపు చేయవచ్చు. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. మీ వయసును, బరువును బట్టి డాక్టర్లు ఆ మందులు ఇస్తారు. వాటిని వాడటం వల్ల మీ సమస్య అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. యాక్సిడెంట్ తర్వాత ఫిట్స్... తగ్గేదెలా? నా వయసు 32 ఏళ్లు. నాకు ఒక యాక్సిడెంట్లో తలకు కుట్లు పడ్డాయి. మెదడు స్కానింగ్ చేస్తే... ఎముక ఫ్రాక్చర్ అయినట్లుగా రిపోర్టు వచ్చింది. మెదడులో రక్తస్రావం కూడా అయ్యింది. ఇది జరిగి దాదాపు ఐదేళ్లు అయ్యింది. అయితే అప్పట్నుంచి నాకు ఏడాదికోసారి ఫిట్స్ వస్తున్నాయి. ఇవి తగ్గే మార్గం చెప్పండి. – ఎమ్. ఆదిత్య, నల్లగొండ మెదడుకు దెబ్బ తగిలినప్పుడు కొందరిలో మెదడు కణజాలంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా మెదడు కణాలలో అవసరానికంటే ఎక్కువగా విద్యుత్తు ఉత్పత్తి జరిగి, ఫిట్స్ వస్తాయి. ఇలాంటి వారు చాలా సందర్భాల్లో జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి దెబ్బతగిలినప్పుడు ఫిట్స్ వచ్చి, స్కానింగ్‌లో నార్మల్‌గా ఉంటుంది. అలాంటి ఫలితం వచ్చినవారు కొన్ని నెలల పాటు మందులు వాడితే చాలు. మీరు ఒకసారి మీ డాక్టర్‌ను సంప్రదించండి. వారు మీ వైద్యపరీక్షల ఫలితాలను బట్టి మీకు తగిన మందులు సూచిస్తారు. బాబుకు చేతులు, మెడ వంకర్లు పోతున్నాయి..? మా అబ్బాయి వయసు 16 ఏళ్లు. దాదాపు ఏడాది కాలంగా బాగా నీరసంగా ఉంటున్నాడు. మందకొడిగా ఉంటాడు. ఏ పనిచేయాలన్నా చాలా సమయం తీసుకుంటున్నాడు. ఒక్కోసారి చేతులు, మెడ వంకర్లు పోతున్నాయి. వాడికి ఉన్న సమస్య ఏమిటి? పరిష్కారం చెప్పండి. – ఎమ్. ఆంజనేయులు, భీమవరం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి అది విల్సన్ డిసీజ్‌గా కనిపిస్తోంది. ఆ వయసులో ఉన్న పిల్ల్లలకు ఆ జబ్బు కారణంగా చేతులు, కాళ్లు వంకర్లు పోవడం, మాట స్పష్టంగా రాకపోవడం, పోనుపోను నీళ్లు కూడా మింగలేకపోవడం జరగవచ్చు. ఈ జబ్బును స్లిట్‌ల్యాంప్ పరీక్ష, కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ జబ్బు వల్ల మన శరీరంలో ‘కాపర్’ అనే ఖనిజం ఎక్కువగా పేరుకుపోతుంది. దీనిని పెనిసిల్లమిన్ వంటి మందుల ద్వారా తగ్గించవచ్చు. చేతులు, కాళ్లు వంకర్లు తగ్గించడానికి కూడా మందులు వాడాలి. కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు మందులు వాడాల్సి రావచ్చు. ఇది జన్యుపరమైన జబ్బు. కాబట్టి ఒకే కుటుంబంలో చాలా మంది పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మున్ముందు మేనరికపు సంబంధాల జోలికి వెళ్లకపోవడం మంచిది. బాబుకు ఇంత చిన్న వయసులో ఏమిటీ సమస్య? మా అబ్బాయి వయసు పదకొండేళ్లు. దాదాపుగా గత ఐదేళ్లుగా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు నేల మీద కూర్చొని పైకి లేవలేడు. కాళ్ల పిక్కలు రెండూ బాగా లావుగా అయ్యాయి. మా బాబు సమస్య ఏమిటి? అతడికి నయమయ్యే అవకాశం ఉందా? నాది, మా ఆయనది చాలా దగ్గరి సంబంధం. మాది మేనరికం. దాని వల్లనే ఈ సమస్య వచ్చిందంటున్నారు. మాకు తగిన సలహా ఇవ్వండి. – డి. సుందరి, ఖమ్మం మీ అబ్బాయి డీఎమ్డీ అనే జబ్బుతో బాధపడుతున్నాడు. ఇది చిన్నవయసులోనే ప్రారంభమై పదిహేను సంవత్సరాలకల్లా పూర్తిగా బలహీనమైపోయేలా చేస్తుంది. ఇప్పటికైతే దీనికి సరైన మందులంటూ ఏవీ లేవు. మేనరికం వంటి దగ్గరి సంబంధాలు చేసుకున్నవారిలో జన్యుపరమైన కారణాల వల్లనే ఇది వస్తుంది. అయితే జబ్బు తీవ్రత తగ్గించేందుకు కొంతమందిలో స్టెరాయిడ్స్ వాడవచ్చు గానీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఫిజియోథెరపీ ద్వారా కండరాలు బలహీనం కాకుండా చేయవచ్చు. అయితే దగ్గరి సంబంధాలు చేసుకోకుండా ఈ జబ్బును నివారించాలి తప్ప, ఇది జన్యుపరమైన సమస్య కావడంతో ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత నయం చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. మూర్ఛవ్యాధి ఉంది – గర్భం దాల్చాను... మందులు మార్చాలా? నా వయసు 25 ఏళ్లు. గత పదేళ్లుగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాను. క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి, వారు సూచించినట్లుగానే మందులు వాడుతున్నాను. ప్రస్తుతం నేను మూడు నెలల గర్భవతిని. అవే మందులు వాడితే కడుపులోని బిడ్డకు ఏదైనా ప్రమాదమా? – సుగుణ, నిజామాబాద్ మూర్ఛవ్యాధి వచ్చిన వారు క్రమం తప్పకుండా ఖచ్చితంగా మందులు వాడాల్సిందే. అయితే తల్లి వాడే ఫిట్స్ మందుల వల్ల కడుపులోని బిడ్డకు కొన్ని రకాల లోపాలు వచ్చే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే, ఇలా మూర్ఛవ్యాధి వచ్చి చికిత్స తీసుకుంటున్న మహిళలు గర్భం రాకముందునుంచే ‘ఫోలేట్’ అనే మందును తీసుకోవడం చాలా మంచిది. ఇది తీసుకుంటూ ఉండటం వల్ల బిడ్డకు లోపాలు వచ్చే అవకాశాలను చాలావరకు తగ్గించవచ్చు. అయితే ఒకసారి గర్భం దాల్చాక... ఇప్పుడు ఆ మందులు మొదలుపెట్టడం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. మీరు చెబుతున్న దాని ప్రకారం ఇప్పటికే మీకు మూడు నెలలు నిండాయి కాబట్టి... డాక్టర్‌ను కలిసి, మీ ఆరోగ్యచరిత్ర (కేస్ హిస్టరీ)ని వివరించండి. వారు సూచించిన ప్రకారం ఇక నుంచి క్రమం తప్పకుండా స్కానింగ్ చేయించుకుంటూ బిడ్డలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో చూసుకుంటూ ఉండాలి. మీరు ఫిట్స్ కోసం వాడుతున్న మందులను మీ డాక్టర్ కొనసాగించడం గానీ లేదా మీకు తగినట్లుగా కొన్ని మందులను మార్చడం గానీ చేయవచ్చు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఫిట్స్ మందులను ఆపవద్దు. అదే జరిగి మళ్లీ మీకు ఫిట్స్ వస్తే అది మీకూ, బిడ్డకూ కూడా ప్రమాదకరం. డాక్టర్ మురళీధర్‌రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
నడుము శస్త్రచికిత్స!
డాక్టర్ల వద్దకు వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికం నడుము నొప్పి అనే సమస్యతోనే వస్తుంటాయి. బహుశా మన సమాజంలో చాలామంది ఈ నడుమునొప్పితో బాధపడుతుండటం... దాంతో చాలా పనిగంటలు వృథా అయిపోవడంతో నడుము నొప్పి మన ఉత్పాదకతపైనా ప్రభావం చూపుతోంది. నడుము నొప్పికి చాలా అంశాలు కారణమవుతాయి. అయితే వాటిన్నింటిలోకెల్లా వయసు పెరుగుతున్న కొద్దీ అరుగుదల కారణంగా వెన్నుపూసలు అరగడంతో ఒక ప్రధాన సమస్య కాగా, వెన్నెముకల మధ్యన కుషన్‌లా ఉండే డిస్క్ (ఇంటర్ వర్టిబ్రియల్ డిస్క్) ఒత్తిడికి గురికావడం మరో సాధారణమైన అంశం. చాలా మంది పేషెంట్లు ఫిజియోథెరపీ ద్వారా నడుము నొప్పిని తగ్గించుకోడానికి ప్రయత్నిస్తారు. అయితే నొప్పి నివారణ మందులు వాడటం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, వెన్ను విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించడం కూడా ఈ సమస్యనుంచి ఉపశమనం కలిగిస్తాయి. సాధారణంగా వచ్చే నడుము నొప్పుల్లో దాదాపు 95 శాతం సంప్రదాయ చికిత్సలైన ఫిజియోథెరపీ వ్యాయామాలు, ఉపశమనంగా వాడే పూతమందులు రాయడం వంటి వాటితో తగ్గిపోతాయి. అన్ని రకాల నడుము నొప్పులు సమస్యాత్మకం కాదు గానీ వీటిలో దాదాపు 5 శాతం కేసులు చాలా తీవ్రంగా పరిణమిస్తాయి. నరాలు అన్నీ మెదడు నుంచి మొదలై వెన్నుపాము ద్వారా అన్ని వెన్నుపూసల మధ్య ఖాళీ ప్రదేశాల నుంచి బయటకు వచ్చి మొండెం, చేతులు మొదలుకొని కాళ్ల వేళ్ల వరకు వ్యాపించి ఉంటాయన్న విషయం తెలిసిందే. ఏదైనా కారణం చేతగానీ, అరుదుగల వల్ల గానీ, వెన్నుపూసకూ, వెన్నుపూసకూ మధ్య ఉండే కుషన్ వంటి భాగమైన డిస్క్ జరగడం వల్ల గానీ నడుము ప్రాంతంలో ఏదైనా నరం మీద ఒత్తిడి పడటంతో సాధారణంగా నడుము నొప్పి వస్తుంది. కొన్ని సందర్భాల్లో నడుము భాగంలో డిస్క్ జారడం లేదా ఏదైనా ప్రమాదం వల్ల డిస్క్ నొక్కుకుపోవడంతో ఒక్కోసారి నడుము నొప్పి రావచ్చు. ఇంకొన్నిసార్లు ఆ ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్, ట్యూమర్లు, నడుములో నిర్మాణపరమైన (అనటామికల్) సమస్యలు, వెన్నెముక వంకరగా ఉండటం (స్కోలియోసిస్), నడుము వద్ద ఉండే వెన్ను ఎముకలు విరగడం (ఫ్రాక్చర్స్), కణుతులు, గడ్డలు, ఇతర ట్యూమర్లు రావడం వంటి సందర్భాల్లో తీవ్రంగా నొప్పి రావచ్చు. శస్త్రచికిత్స అవసరమైన సందర్భాలు.. ప్రమాదాల్లో వెన్నుపూసలు విరగడం లేదా డిస్క్ పక్కకు జరిగిపోవడం, వెన్నుపూసల అరుగుదలతో వెన్నుపాము నుంచి కిందివైపునకు వెళ్లే నరాలపై ఒత్తిడి పడి మల, మూత్ర విసర్జనలపై నియంత్రణ కోల్పోవడం, వెన్నుపూసల్లో ఎముక పెరిగి అది వెన్నుపాముపై తీవ్రమైన ఒత్తిడి కలిగించడం, కాళ్లు బలహీనంగా కావడం, కాళ్ల చివర్లలో తిమ్మిరులు వచ్చి ఆ ప్రాంతం స్పర్శ కోల్పోవడం... వంటి కొన్ని సందర్భాల్లో ఇతరత్రా సంప్రదాయ ఉపశమన చికిత్సలతో ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు శస్త్రచికిత్స ఒక్కటే మార్గమవుతుంది. శస్త్రచికిత్స ప్రక్రియ దెబ్బతిన్న వెన్నెముక భాగాలను సరిచేయడమో లేదా అవసరమైన సందర్భాల్లో అక్కడ రాడ్స్, ఫ్రేమ్స్ వంటి కొన్ని పరికరాలను (ఫిక్షేషన్స్) అమర్చడం ద్వారా ద్వారా నొప్పికి కారణమైన అంశాలను తొలగించడం జరుగుతుంది. ఇంకా చాలా అనుభవించాల్సిన జీవితం ముందున్న చిన్న వయసు రోగుల్లో నడుము భాగంలోని వెన్ను ప్రాంతంలో నొప్పి వచ్చి, ఇతరత్రా సంప్రదాయ ఉపశమన చికిత్సలతో తగ్గనప్పుడు శస్త్రచికిత్స చేస్తారు. అయితే సంప్రదాయ ఉపశమన చికిత్సలు ఏడాది పాటు తీసకున్న తర్వాత కూడా నొప్పి తగ్గకుండా ఉన్నప్పుడు డాక్టర్లు శస్త్రచికిత్స అనే ప్రత్యామ్నాయానికి వెళ్తారు. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఇప్పుడు అత్యంత తక్కువ గాటుతో శస్త్రచికిత్స చేసే సౌకర్యాలు ఉన్నాయి. వీటిని కీ–హోల్ సర్జరీగా పేర్కొనవచ్చు. అందులో అత్యాధునికమైన కెమెరాను నడు భాగంలోకి పంపుతారు. మైక్రోస్కోప్ సహాయంతోనూ, వెన్నెముక వద్ద మంచి వెలుగు ప్రసరింపజేయడం ద్వారా వెన్నెముకను పదింతలు పెద్దగా చూసి, సమర్థంగా శస్త్రచికిత్స చేయడం సాధ్యమవుతుంది. అయితే ఇలాంటి కీ–హోల్ సర్జరీల విషయంలో ఎంతో అత్యంత నైపుణ్యం ఉన్న సర్జన్లతో శస్త్రచికిత్స చేయించడం మేలు. ఎందుకంటే అతి చిన్న గాటు ద్వారా లోపలి భాగాలను నేరుగా చూడకుండా శస్త్రచికిత్స చేసే సమయంలో నిర్దిష్టమైన భాగానికి కాకుండా పక్క భాగాలకు గాయం కావడం జరిగే ప్రమాదం ఉంది. అందుకే అంత్యత నిపుణులైన శస్త్రచికిత్సకులు, కీ–హోల్ సర్జరీలో ప్రత్యేక శిక్షణ పొందిన వారు వీటిని చేస్తుంటారు. శస్త్రచికిత్సలో ఏం చేస్తారు... నడుము భాగంలో ఒకవేళ డిస్క్ పెరగడం లేదా పక్కకు తొలగడం వంటి అనర్థాలు జరిగి, అది స్పైన్ భాగంలోని (లంబార్ స్పైనల్) నరాలను నొక్కుతున్నప్పుడు, శస్త్రచికిత్స చేసి, ఆ పెరిగిన డిస్క్ భాగాన్ని తొలగించడం గానీ లేదా తన స్థానం నుంచి పక్కకు తొలగిన డిస్క్‌ను మళ్లీ సరిగా అమిరిపోయేలా చేస్తారు. ఒకవేళ ఏదైనా ప్రమాదాలలో డిస్క్ భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయినప్పుడు మళ్లీ ఆ డిస్క్ భాగాన్ని మెత్తటి ఎముకతో నింపి (బోన్ గ్రాఫ్ట్ చేసి), దానిపై ఒత్తిడి పడకుండా వెన్ను ప్రాంతంలో రాడ్స్, స్క్రూలు బిగిస్తారు. ప్రమాదాలకు గురైన యువ పేషెంట్లకు ఏడాది పాటు ఆగనవసరం లేకుండానే ఈ శస్త్రచికిత్స చేస్తారు. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్,హైదరాబాద్ -
జయ ఫిజియోథెరపీకి సింగపూర్ రోబో?
-
జయ ఫిజియోథెరపీకి సింగపూర్ రోబో?
అపోలో ఆసుపత్రికి చేరుకున్న యంత్రం సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫిజియోథెరపీ ఇచ్చేందుకు సింగపూర్ నుంచి రోబోను తెప్పించినట్లు సమాచారం. చెన్నై అపోలో ఆసుపత్రిలో 65 రోజులుగా చికిత్స పొందుతున్న జయలలిత పూర్తిగా కోలుకున్నట్లు ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి ప్రకటించారు. మైకు సహాయంతో చిన్నగా మాట్లాడుతున్నారని, 90 శాతం వరకు సహజరీతిలో శ్వాసను తీసుకుంటున్నారని తెలిపారు. ఇక నడవడమే తరువారుుగా పేర్కొన్నారు. ఇందుకోసం కొంత ఫిజియోథెరపీ చికిత్స కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం అపోలో ఆసుపత్రికి ఒక రోబోను తీసుకువచ్చారు. ఈ రోబో సీఎం జయకు చికిత్స కోసమేనని చెబుతున్నారు. సింగపూర్‌లోని మౌంట్ ఎలిజిబెత్ ఆసుపత్రి రోబోటిక్ ఫిజియోథెరపీకి ప్రపంచ ప్రసిద్ధి. గతంలో ఇదే ఆసుపత్రి నుంచే ఇద్దరు మహిళా ఫిజియోథెరపిస్టులు సీఎం జయ కోసం సింగపూర్ నుంచి వచ్చారు. జయ ఆప్తురాలు శశికళకు అస్వస్థత! తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత ఆప్తురాలైన శశికళ అస్వస్థతకు గురై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. విరామం లేకుండా ఆసుపత్రిలో అమ్మను కనిపెట్టుకుని ఉన్న కారణంగా శశికళ అనారోగ్యం పాలుకాగా ఈనెల 23న ఆమె అపోలోలోనే చేరినట్లు తెలుస్తోంది. -
భవితకు బాటేదీ?
ధర్మవరం : భవిత కేంద్రాల్లోని ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు వైద్యసేవల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో వీరు ప్రత్యేక అవసరాలు కల్గిన పిల్లలుగానే ఉండిపోవాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2,223 పాఠశాలల్లో 7,212 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఉన్నారు. వీరికి ఈ ఏడాది ఫిజియోథెరపీ సేవలు అందలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో వారానికి ఒకరోజు చొప్పున ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఫిజియోథెరపీ శిబిరాన్ని నిర్వహించేవారు. వారికి ఉచితంగా చికిత్స అందించేవారు. ఇందుకోసం ప్రభుత్వం ఔట్సోర్సింగ్ విధానంలో ఫిజియోథెరపిస్ట్‌లను నియమించేది. సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ఆధ్వర్యంలో నడిచే భవిత కేంద్రాల్లో ఆయా ఫిజియోథెరపిస్ట్‌లు విద్యార్థులతో తగిన వ్యాయామం చేయించేవారు. ఇంటివద్ద కూడా వ్యాయామం చేయించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించేవారు. ఈ ఏడాది మాత్రం వైద్యసేవల గురించి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. వేసవి సెలవుల తరువాత ఫిజియోథెరపీ సేవలకు మంగళం పాడారు. విద్యాసంవత్సరం ప్రారంభమై మూడునెలలు గడుస్తున్నా ఇంత వరకు ఒక్క శిబిరం కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. ప్రభుత్వం సమకూర్చిన పరికరాలు ఎమ్మార్సీలు, భవిత కేంద్రాల్లో మూలనపడ్డాయి. శారీరక, మానసిక వైకల్యం కల్గిన చిన్నారులకు తగిన వ్యాయామం లేక పరిస్థితి మొదటికి వస్తోంది. వారి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అనుమతి రాలేదు ఫిజియోథెరపీ శిబిరాల విషయమై ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులూ రాలే దు. ప్రభుత్వం ఇంకా ఫిజియోథెరపిస్టులను ఎంపిక చేయలేదు. ఈ ప్రక్రియ పూర్తయితే వైద్యసేవల గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తాం. – నూర్ అహమ్మద్, ధర్మవరం మండల విద్యాధికారి ఎకరాకు రూ.15 వేల నష్టపరిహారమివ్వాలి అనంతపురం అర్బన్: జిల్లాలో దాదాపు 12 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతినిందని, ఎకరాకు రూ.15 వేలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని రాయలసీమ అభివృద్ధి వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ గేయానంద్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీనా మేషాలు లేక్కిస్తూ పంట నష్టాన్ని తక్కువగా చూపే ప్రయత్నం చేస్తోందని పేర్కొన్నారు. రైతుల మనోధైర్యాన్ని కాపాడేందుకు బేషరుతుగా పంట నష్ట పరిహారాన్ని ప్రకటించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే రాయలసీమను కరువు లేని ప్రాంతంగా మారుస్తామని ప్రకటిస్తున్నారన్నారు. కరువు రైతులకు వెంటనే పంట నష్ట పరిహారం ప్రకటిండం ద్వారా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని తెలిపారు. -
ఫిజియోథెరపీదే కీలక పాత్ర
అరండల్‌పేట: శస్త్రచికిత్స అనంతరం రోగి త్వరగా కోలుకోవడంలో ఫిజియోథెరపీ కీలకపాత్ర పోషిస్తుందని రమేష్ హాస్పిటల్స్ ప్రముఖ ఆర్ధోపెడిక్ శస్త్రవైద్యనిపుణులు డాక్టర్ రావి పవన్‌కుమార్ అన్నారు. గురువారం ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్బంగా సిమ్స్ ఫిజియోథెరపీ కళాశాల విద్యార్ధులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డాక్టర్ రావి పవన్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నచిన్న నొప్పులకు కూడా పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదన్నారు. చాలా సమస్యలకు ఫిజియోథెరపిలో ఉపశమనం ఉందన్నారు. ఫిజియోథెరపీపై ప్రజలకు అవగాహన పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిమ్స్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ బి.శివశిరీష, డైరెక్టర్ భీమనాధం భరత్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.శ్రీనివాసులు, మేనేజర్ రాంబాబు, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. -
నిమ్స్ లో ఫిజియోథెరపీ విద్యార్థి ఆత్మహత్య
-
ఫిజియోథెరపీ కౌన్సెలింగ్
రెండు రోజుల క్రితం నేను మోటారు సైకిల్ కిక్ కొడుతుండగా కిక్రాడ్ వెనక్కి తన్నడంతో కాలి వెనక మడమపై భాగంలో తీవ్రంగా దెబ్బ తగిలింది. అది చాలా నొప్పిగా ఉంది. ఈ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి? - రాజు, చౌటుప్పల ఇలాంటి దెబ్బ తగలగానే అది తగిలిన చోట ఐస్ పెట్టడం వల్ల నొప్పి తగ్గుతుంది. దెబ్బ తగిలి ఇప్పటికే రెండు రోజులు అయ్యిందంటున్నారు కాబట్టి మీ కాలికి రెండు రకాల చికిత్స చేయవచ్చు. మొదటిది ఒక బకెట్లో కాస్త వేడి నీరు తీసుకొని నొప్పి ఉపశమించేలా కాలిని ముంచి పెట్టడం. ఇక రెండో పద్ధతిని కాంట్రాస్ట్ బాత్ ప్రక్రియ అంటారు. ఈ పద్ధతిలో ఒక వేడి నీళ్ల బకెట్నూ, మరో చల్లటి నీళ్ల బకెట్నూ తీసుకోవాలి. ఈ రెండు బకెట్లనూ పక్కపక్కనే పెట్టి వేడినీళ్ల బకెట్లో మూడు నిమిషాల పాటు కాలిని ఉంచి, ఆ వెంటనే తీసి చల్లటి నీళ్ల బకెట్లో ఒక నిమిషం సేపు ఉంచాలి. ఇలా (ఆల్టర్నేట్గా) బక్కెట్లను మారుస్తూ వేడినీటి బకెట్లో నాలుగుసార్లు (4 గీ 3 = 12 నిమిషాలు) చల్లటి నీళ్ల బక్కెట్లో మూడు సార్లు (3 గీ 1 = 3) మొత్తం 15 నిమిషాలు ఈ ప్రక్రియ కోసం వెచ్చిస్తే మీ నొప్పి తగ్గుతుంది. నేను వీధిలో వెళ్తుండగా గల్లీ క్రికెట్ ఆడుతున్న పిల్లలు విసిరిన బంతి భుజానికి తగిలింది. దాంతో భుజం విపరీతంగా నొప్పిగా ఉంది. ఈ నొప్పి తగ్గాలంటే ఏం చేయాలి? - యాదగిరి, హైదరాబాద్ ఇప్పుడు మార్కెట్లో హాట్ ఫర్మెంటేషన్ కోసం వేడి నీళ్లు నింపే బ్యాగ్స్ లభ్యమవుతున్నాయి. వీటిని కొని ఆ బ్యాగ్‌లో వేడి నీరు నింపి 15 నిమిషాల పాటు కాపడం పెట్టాలి. ఈ హాట్ వాటర్ ఫర్మెంటేషన్ ప్రక్రియ తర్వాత సున్నితంగా భుజాన్ని అన్నివైపులకూ తిప్పాలి. నొప్పిగా ఉంటే బలవంతంగా తిప్పకూడదు. నిద్రపోయే సమయంలో నొప్పిగా ఉన్న భుజం కింద తలగడ పెట్టుకోవాలి. ఒకవేళ దెబ్బ తగిలిన చోట ఎర్రబారడం, వాపు ఉంటే ఐస్ కాపడం పెట్టాలి. ఎన్. మేరి, ఫిజియోథెరపిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఈ ఆసుపత్రి అందరికీ స్ఫూర్తి...
విధివశాత్తూ... రోడ్డు పక్కన చెత్తకుప్పల్లోకి, ముళ్లపొదల్లోకి విసిరేయబడిన విత్తనాలకు కాస్త నీరు పోసి ఆపై కాస్త రక్షణ కల్పించి ఎదగనిస్తే చాలు, ఆ విత్తే చెట్టై ఆ ఊరికి నీడనివ్వడమే కాదు ఫలసాయాన్ని అందిస్తుంది అనేందుకు ఉదాహరణ.. ‘మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమ విద్యార్థులు. తమ వెన్నుతట్టి ఆదరించిన సమాజానికి ఇప్పుడు తామే వెన్నుదన్నుగా నిలిచారు.. ‘విధి చేతిలో ఓడిపోవాల్సిన మేము, ఈ సమాజం ఇచ్చిన చేయూత వల్లే విజేతలుగా నిలచేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆపదలో ఉన్న మాకు వెన్నుదన్నుగా నిలిచిన ఈ సమాజానికి తిరిగి ఏదైనా చేయాలనే లక్ష్యంతో ఉచిత వైద్యసేవలను అందిస్తున్నాం’ అంటూ గర్వంగా చెబుతున్నారు... మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం పిల్లలు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల ఆల నాపాలనకు దూరమైన ఈ అనాథలు ఇప్పుడు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ జిల్లా జఫర్గడ్ మండలం రేగడితండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ‘మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం’లో వైద్యవిద్య అనుబంధ కోర్సులను పూర్తిచేసిన విద్యార్థులంతా కలిసి ఆశ్రమం ఆవరణలో ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. అంతా ఇక్కడి వారే... అనాథ పిల్లలకు అన్నీ తానైంది మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం. 2006 మే 28లో గాదె ఇన్నారెడ్డి ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. ప్రస్తుతం 300 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో ఫిజియోథెరపీ పూర్తి చేసిన డాక్టర్ స్నేహ, నర్సింగ్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న థరంసోతు కల్పన, బానోతు స్వర్ణ, నలుగురు ల్యాబ్‌టెక్నీషియన్స్, ఇద్దరు ఫార్మసిస్టులతో పాటు వైద్యవిద్యకు అనుబంధ విద్యలను చదువుతున్న మరికొందరు విద్యార్థులు మొత్తంగా 15 మంది కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. వీరంతా కలిసి 2013 నవంబరు 10 నుంచి ఆశ్రమం ఆవరణలో ఉచిత వైద్యసేవలను అందిస్తున్నారు. ఇక్కడ ఔట్ పేషెంట్ విభాగం, పది పడకలతో ఇన్‌పేషెంట్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇదే ఆశ్రమంలో పీజీ, డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈ ఆస్పత్రి రోజువారీ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. అన్ని సేవలు ఉచితమే రోజు ఉదయం 7 గంటల నుంచి 10 గంటల మధ్య డాక్టర్, స్టాఫ్‌నర్సులు, ల్యాబ్టెక్నీషియన్లు, ఫార్మసిస్టుల ఆధ్వర్యంలో ఆస్పత్రి పని చేస్తుంది. ఈ సమయంలో వచ్చే రోగులను పరీక్షించి వైద్య సహాయం (ఓపీ) అందిస్తారు. రోగి అవసరాన్ని బట్టి రక్త, మూత్రం, కళ్ళె వంటి రోగ నిర్థారణ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. వ్యాధి నయం కావడానికి అవసరమైన మందులు ఉచితంగానే అందిస్తారు. ఈ అంశంపై ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ స్నేహ మాట్లాడుతూ ‘గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలు రోగాలు వచ్చిన వెంటనే ఆస్పత్రికి వెళ్లేందుకు వెనకాడతారు. ఎందుకంటే అక్కడ చేసే టెస్టుల కారణంగా తాము దాచుకున్న డబ్బులన్నీ అయిపోతాయని భయపడతారు. రోగం ముదిరే వరకు చూస్తారు. ఆ తర్వాత తప్పని పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లి అప్పులపాలవుతారు. దీన్ని నివారించాలనే ఉద్దేశంతోనే మా దగ్గరికి వచ్చే రోగులకు ఉచితంగా రోగనిర్థారణ పరీక్షలు చేయడంతో పాటు మందులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు. దీనికోసం ఇప్పటికే వివిధ మెడికల్ ఏజెన్సీలు, ఎన్జీవోలు, ఔషధ కంపెనీలతో సంప్రదింపులు జరిపారు. వ్యవసాయ పనుల కారణంగా కీళ్లు, నడుం నొప్పులతో బాధపడేవారికి ఉపశమనం కలిగించేందుకు మధ్యాహ్నం వేళలో ఫిజియోథెరపీకి సంబంధించిన ఎక్సర్సైజులు సైతం చేయిస్తారు. ఇందుకోసం ఐఎఫ్‌టీ, ట్రాక్షన్ వంటి పరికరాలను సమకూర్చుకున్నారు. పరిసర ప్రాంత రైతులు ఫిజియోథెరపీ చికిత్స కోసం ఈ ఆస్పత్రికి తప్పనిసరిగా వస్తున్నారు. పక్కా ప్రణాళిక రోగం వచ్చిన తర్వాత మందుబిళ్ల, సూదిమందు ఇవ్వడం వంటి సాధరణ సేవలకే పరిమితం కావడం లేదు. రోగాలకు మూల కారణాలను వెతికి పట్టుకుని వాటికి సైతం మందు వేసేలా పక్కాగా ప్రణాళిక రూపొందించారు. అందులో భాగంగా సేవలను మూడు రకాలుగా విభజించారు. ఒకటి రోగిని పరీక్షించడం, రెండు రోగనిర్థారణ పరీక్షలు, మందుబిళ్లలు ఇవ్వడం అయితే అసలు రోగాలకు గురికాకుండా ప్రజల్లో అవగాహన కలిగించడం మూడోది. జఫర్గడ్ మండలంలో ఉన్న 19 గ్రామపంచాయితీల్లో గ్రామాన్ని ఈ వైద్యబృందంలో సభ్యులు(ఫీల్డ్ విజిట్) సందర్శిస్తారు. అక్కడి ప్రజల ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుంటారు. ఆ గ్రామాల్లో పరిశుభ్రత, అంటువ్యాధుల బారినపడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మద్యపానం, పొగతాగడం, గుట్కాలు నమలడం వంటి చెడు అలవాట్ల వల్ల కలిగే నష్టాల వంటి సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలను చేపడతారు. దీనికోసం ప్రొజెక్టర్‌ను సైతం సమకూర్చుకున్నారు. ఇప్పటి వరకు యాభైకి పైగా హెల్త్‌క్యాంపులు నిర్వహించారు.అంధత్వ నివారణ సంస్థ (బ్లైండ్ కంట్రోల్ సొసైటీ) సహకారంతో నిర్వహించిన హెల్త్ క్యాంపుల ద్వారా 354 మందికి కంటి ఆపరేషన్లు, 400 మందికి కళ్లద్దాలు అందించారు. ‘మా అవసరం తీరింది కదా, ఈ సమాజం ఎటుపోతే ఏం’ అనుకోలేదు ఈ విద్యార్థులు... తిరిగి సమాజానికే సాయం చేసే స్థాయికి ఎదిగారు. తమలాంటి ఎందరికో ఆసరాగా ఉంటున్నారు. మనందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. మాకు ఆస్పత్రి ఉన్నట్లే: డాక్టర్ స్నేహారెడ్డి ప్రస్తుతం మా ఆశ్రమంలో 300 మంది విద్యార్థులం ఉన్నాం. ఈ ఉచిత వైద్యశాల వల్ల ఆశ్రమానికి ఆస్పత్రి అందుబాటులోకి వచ్చింది. దీనికితోడు ఉచిత వైద్యసేవలతో మాకు సాయం చేసిన ఈ సమాజానికి తిరిగి సాయం చేస్తున్నామనే సంతృప్తి కూడా ఉంది. మేము చేస్తున్న కృషికి ప్రభుత్వ సహకారం తోడైతే మా సేవలు విస్తరిస్తాం. బాధ్యతగా భావిస్తున్నాను - పబ్బతి హరీశ్ (బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిజియోథెరపీ విద్యార్థి) బాల్యంలోనే తలిదండ్రులను కోల్పోయిన నేను లలితా టీచర్ సాయంతో టెంత్ పాసయ్యాను. ఆమే నన్ను అప్పటి జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా దగ్గరికి తీసుకెళ్లి సాయం చేయాలని కోరారు. అప్పుడు కలెక్టర్ గారు నన్ను ప్రజాదరణ ఆశ్రమంలో చేర్పించారు. మా టీచర్ చేసిన సహాయం వల్లే నేను ఈ రోజు నా పేరు ముందు డాక్టర్ అని పెట్టుకునే స్థాయికి చేరుకున్నాను. అందుకే మరికొందరికి సాయం చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను. అరవై పడకలకు విస్తరిస్తాం - ఇన్నారెడ్డి (ప్రజాదరణ ఆశ్రమ నిర్వాహకుడు) మా ఆశ్రమంలో చదువుకున్నవారిలో కొద్దిమంది తమ చదువును పూర్తిచేసి ఉద్యోగాలు చేసే స్థాయికి వచ్చారు. అంతా కలిసి ఓ జట్టుగా ఏర్పడి తమకు సాయం చేసిన సమాజానికి తిరిగి సహాయ పడేందుకు సిద్ధమై ఉచిత వైద్యసేవలు ప్రారంభించారు. 2013లోపదిపడకల సామర్థ్యంతో ఈ ఆస్పత్రిని ప్రారంభించాం. క్రమంగా 60 పడకల ఆస్పత్రి స్థాయికి తీసుకెళ్తాం. - తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి, హన్మకొండ -
కేరళ పంచకర్మ చికిత్సతో వెన్నునొప్పి మాయం
వెన్నునొప్పి ప్రాణాలేమీ తీయకపోవచ్చు కానీ, శరీరాన్ని ఎందుకూ పనికిరానంత నిర్జీవంగా మార్చేస్తుంది. దీనికి పెయిన్ కిల్లర్స్, సర్జరీ, బెడ్‌రెస్ట్, ఫిజియోథెరపీ శాశ్వత పరిష్కారం కాదు. ఆయుర్వేదంలో సూచించిన కేరళ పంచకర్మ, మర్మ చికిత్సల ద్వారా వెన్ను నొప్పికున్న మూల కారణాలను శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పంపవచ్చు. అంతే కాకుండా వెన్నెముకని ఉక్కు స్తంభంలా మారుస్తుందంటున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ పి.కృష్ణప్రసాద్. భవనానికి పిల్లర్స్ ఏవిధంగా బలాన్నిస్తాయో, అదేవిధంగా మానవుని శరీరానికి వెన్నెముక మూల స్తంభం. అలాంటి వెన్నెముకలో ఏ సమస్య వచ్చినా శరీరమంతా ప్రభావం చూపుతుంది. వెన్ను సమస్యలకు శాశ్వత పరిష్కారం ఒక్క ఆయుర్వేద చికిత్సలోనే ఉంది. వెన్నెముక వర్సెస్ పవర్‌హౌస్ వెన్నెముక పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడను స్థిరంగా నిలబడేలా చేస్తుంది. వివిధ కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్‌హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడినట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. ఎవరికైనా వెన్నుపాములోని డిస్క్‌లు, నరాలు ఒత్తిడికి గురైతే.. కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా తలెత్తవచ్చు. సర్జరీతో ఒరిగేది శూన్యం... వెన్నునొప్పితో వెళితే వైద్యులు మొట్టమొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లే. అవి వాడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది గానీ, అందుకు గల కారణాలను మాత్రం తగ్గించలేదు. సర్జరీ చేయించుకొంటే.. పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం శూన్యం. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే.. చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు. ఆయుర్వేదం ఏం చేస్తుంది..? ముందుగా వెన్ను నొప్పి రావడానికి గల మూల కారణాన్ని సమూలంగా ఆయుర్వేదం కనిబెడుతుంది. అస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్ను నొప్పికి, కాలంతా పాకే సయాటికా నొప్పికి మూలం అవుతుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవస్థను కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ విధానంలో మర్మ, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని ఆ నొప్పిని సమూలంగా తగ్గించి వేస్తుంది. కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడుకోండి. అది జీవితాంతం మిమ్మల్ని కాపాడుతుంది. అడ్రస్ శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నం.17, హైదరాబాద్, వివరాలకు: డా॥పి.కృష్ణ ప్రసాద్. 9030013688/ 9440213688/ 040- 65986352 E mail: krishnaprasad.6600@gmail.com -
బయోనిక్ కాలు...
ప్రమాదవశాత్తూ లేదంటే కొన్ని అరుదైన వ్యాధుల కారణంగా కాళ్లు చేతులు చచ్చుబడిపోయిన వారిని మనం చూస్తూనే ఉంటాం. ఏళ్లతరబడి ఫిజియోథెరపీ చేయించినా, ఎన్ని రకాల మందులు వాడినా వీరిలో కొందరి పరిస్థితిలో ఏమాత్రం మార్పు ఉండదు. అటువంటి వారికి కొంచెం స్వాంతనిచ్చే వార్త ఇది. అమెరికాలోని ఓ కంపెనీ చచ్చుబడిపోయిన కాళ్లకు మళ్లీ కదలికల తాలూకూ ‘జ్ఞానాన్ని’ అందించేందుకు ఓ అత్యాధునిక కృత్రిమ కాలును తయారు చేసింది. దీన్ని తగిలంచుకుంటే అందులోని సెన్సర్లు, రోబోల సాయంతో మళ్లీ నడవవచ్చునని అంటోంది. కండరాలు సక్రమంగా తమ శక్తిని ఉపయోగించుకునేందుకు తద్వారా కదలికలను ప్రేరేపించేందుకు ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. -
కేరళ పంచకర్మ చికిత్సతో.. వెన్నునొప్పి మాయం
వెన్నునొప్పి ప్రాణాలేమీ తీయకపోవచ్చు కానీ, శరీరాన్ని ఎందుకూ పనికిరానంత నిర్జీవంగా మార్చేస్తుంది. దీనికి పెయిన్ కిల్లర్స్, సర్జరీ, బెడ్‌రెస్ట్, ఫిజియోథెరపీ శాశ్వత పరిష్కారం కాదు. ఆయుర్వేదంలో సూచించిన కేరళ పంచకర్మ, మర్మ చికిత్సల ద్వారా వెన్ను నొప్పికున్న మూల కారణాలను శాశ్వతంగా శరీరం నుంచి బయటకు పంపవచ్చు. అంతే కాకుండా వెన్నెముకని ఉక్కు స్తంభంలా మారుస్తుందంటున్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ పంచకర్మ స్పెషలిస్ట్ డాక్టర్ పి.కృష్ణప్రసాద్. భవనానికి పిల్లర్స్ ఏవిధంగా బలాన్నిస్తాయో, అదేవిధంగా మానవుని శరీరానికి వెన్నెముక మూల స్తంభం. అలాంటి వెన్నెముకలో ఏ సమస్య వచ్చినా శరీరమంతా ప్రభావం చూపుతుంది. వెన్ను సమస్యలకు శాశ్వత పరిష్కారం ఒక్క ఆయుర్వేద చికిత్సలోనే ఉంది. వెన్నునొప్పి, జలుబు సామాన్యంగా అనిపిస్తాయి. కానీ ఒక దశలో భరించలేని నొప్పిని కలిగిస్తుంది. పక్షవాతంలా జీవితాన్ని కుప్పకూల్చివేస్తుంది. పైగా ఈ సమస్యలు ఏదో 5, 10 నిమిషాలు వచ్చి తగ్గిపోయేవీ కాదు. ఏళ్లకేళ్లు మంచాన పడేస్తాయి. వెన్నెముక వర్సెస్ పవర్‌హౌస్ వెన్నెముక పవర్ హౌస్ లాంటిది. ఇది కాళ్లు, చేతులు, తల, భుజాలు, మెడను స్థిరంగా నిలబడేలా చేస్తుంది. వివిధ కారణాలవల్ల ఒక్కోసారి ఈ పవర్‌హౌస్ శక్తిహీనంగా మారుతుంది. సరైన సమయంలో వైద్య చికిత్సలేవీ అందకపోతే భుజం నొప్పులు, మెడ నొప్పులు, కళ్ల నొప్పులు మొదలౌతాయి. వెన్ను భాగంలో మొద్దుబారినట్లు, బలహీన పడినట్లు, చురకలు, పోట్లు, మంటలు మొదలౌతాయి. జీర్ణ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. అలాగే కొనసాగితే కొన్ని లైంగిక సమస్యలు సైతం తలెత్తవచ్చు. ఎవరికైనా వెన్నుపాములోని డిస్క్‌లు, నరాలు ఒత్తిడికి గురైతే.. కాళ్లు, చేతులు పక్షవాతానికి కూడా తలెత్తవచ్చు. సర్జరీతో ఒరిగేది శూన్యం... వెన్నునొప్పితో వెళితే వైద్యులు మొట్టమొదటగా సూచించేది పెయిన్ కిల్లర్లే. అవి వాడితే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది గానీ, అందుకు గల కారణాలను మాత్రం తగ్గించలేదు. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం వల్ల తలనొప్పి, కడుపుబ్బరం, లివర్, కిడ్నీలు దెబ్బతినడం వంటివి తలెత్తుతాయి. సర్జరీ చేయించుకొంటే.. పెద్ద మొత్తంలో ఖర్చు అవడమే తప్ప కలిగే ప్రయోజనం మాత్రం శూన్యం. కనీసం ఆ ఒక్క సర్జరీతో అంతా అయిపోతుందా అంటే.. చెప్పలేం. ఆ తరువాత మరో సర్జరీ అవసరం కూడా రావచ్చు. ఆయుర్వేదం ఏం చేస్తుంది..? ముందుగా వెన్ను నొప్పి రావడానికి గల ప్రత్యేక కారణాన్ని సమూలంగా ఆయుర్వేదం కనిబెడుతుంది. అస్థిధాతుక్షయం, మార్గావరోధాల వల్లే శరీరంలో వాతం పెరుగుతుంది. ఆ వాతమే వెన్ను నొప్పికి, కాలంతా పాకే సయాటికా నొప్పికి మూలం అవుతుంది. అందుకే ధాతుక్షయాన్ని, మార్గావరోధాన్ని నివారించే చికిత్సలకు ఆయుర్వేదం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. చికిత్స క్రమంలో కీళ్లు, లిగమెంట్లు, టెండాన్లు, డిస్కులు, వెన్నెముకతో అనుబంధంగా ఉండే కండరాలను సమస్థితికి తీసుకురావడం చాలా ముఖ్యం. అదే సమయంలో నరాల వ్యవస్థను కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ నొప్పిని తగ్గించడమే కాదు.. మరోసారి ఆ నొప్పి రాకుండా చేస్తాయి. ఈ విధానంలో మర్మ, పంచకర్మ చికిత్సల ద్వారా వెన్నునొప్పికి మూలకారణాన్ని కనుగొని ఆ నొప్పిని సమూలంగా తగ్గించి వేస్తుంది. కేరళ ఆయుర్వేద పంచకర్మ చికిత్సల ద్వారా మీ వెన్నెముకను కాపాడుకోండి. అది జీవితాంతం మిమ్మల్ని కాపాడుతుంది. అడ్రస్ శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ బిసైడ్ ఎస్.బి.హెచ్, నియర్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్ నం.17, హైదరాబాద్, వివరాలకు: డా॥ పి.కృష్ణ ప్రసాద్. 9030013688/ 9440213688/ 040- 65986352 E mail: krishnaprasad.6600@gmail.com -
కన్నవారికి దూరమై...ఉన్న వారికి భారమై..
అలజంగి (బొబ్బిలి రూరల్): బాల్యం ఎవరికైనా మధురమే. కానీ వీరికి జీవితమంతా బాల్యమే అయిపోతూ... బతుకులో తీపి చచ్చిపోయి, చేదు మిగిలింది. ఆ చిన్నారులందరికీ ఏదో ఒక వైకల్యం. అందరి తల్లిదండ్రులూ పిల్లలను వదిలి దూరంగా వెళ్లిపోయిన వారే. వివిధ సమస్యలతో బాధపడుతున్న వీరందరినీ వారి నాయనమ్మలు, అమ్మమ్మలు సంరక్షిస్తున్నారు. వీరికి సేవలు చేయలేక, కనీసం ఫిజియోథెరపీ చేయించడానికి లేదా సదరంలో పరీక్షలు చేయించడానికి తీసుకెళ్లలేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మండలంలో అలజంగి గ్రామానికి చెందిన 11 ఏళ్ల రాంబార్కి మాధవి మానసిక స్థితి సరిగా లేదు. అమ్మానాన్న మాధవిని నానమ్మ చిన్నమ్మి దగ్గర వదిలేయడంతో ఆమే పెంచుతోంది. తల పెరుగుతూ వైద్యులకు అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు చందక సాయి. తల్లిదండ్రులు భారమని విడిచివెళ్లడంతో సాయి నానమ్మ సూరమ్మ వద్దే ఉం టున్నాడు.పెద్దగా తెలివితేటలు లేకపోవడంతో పాఠశా ల చదువు అంతంతమాత్రం.రోడ్డుపై ఎవరు వెళ్లినా పల కరిస్తూ ఇంట్లోనే సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు. తల చిన్నగా ఉన్న పైల ఈశ్వరమ్మ చిన్నప్పటి నుంచి ఈ సమస్యతో బాధపడుతోంది. తల్లిదండ్రులు వలస కూలీలుగా సుదూర ప్రాంతాలకు వెళ్లడంతో వృద్ధురాలైన నానమ్మ సీతమ్మ వద్ద పెరుగుతోంది. ఈ చిన్నారికి కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా తెలీదు. కాళ్లు సరిగా రాని సువ్వాడ మహేష్‌ది మరో కథ. ఆరోగ్యశ్రీ కార్డు ఉండడంతో ఆపరేషన్ చేయించారు. కానీ ఆపరేషన్ ముందు కాసింతైనా నడవగలిగిన మహేష్ తర్వాత నడవడం లేదు. మానసిక స్థితి కూడా సరిగా లేని మహేష్‌ను నాయనమ్మ నారాయణమ్మ పెంచుతోంది. అలాగే రాపాక చంద్రశేఖర్, వెంపటాపు స్వాతి మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎమ్మార్టీలు ఉండడంతో వీరిని కొంతమేర పర్యవేక్షించి సాయం చేసేవారు. ప్రస్తుతం వీరిని చూడడానికి తల్లిదండ్రులు కూడా లేరు. వీరంతా ఆ వృద్ధులపైనే ఆధారపడి బతుకుతున్నారు. మనసున్న వారు వచ్చి సాయం చేస్తే తమ పిల్లలు మళ్లీ మామూలుగా బతుకుతారని ఆ వృద్ధులు ఆశపడుతున్నారు. అవగాహన లేమి అసలు శాపం అలజంగి: బొబ్బిలి మండలంలోని చిన్న గ్రామం. ఈ గ్రామంలో ఎక్కువగా మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు కనిపిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం గ్రామస్తుల్లో అవగాహన లోపం. ఇక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు, మేనరిక వివాహాలు జరుగుతున్నట్టు తెలిసింది. బాల్య, మేన రిక వివాహాల వల్ల వచ్చే దుష్పరిణామాలు తెలియక వీరు ఇలా అవస్థలు పడుతున్నారు. ఎక్కువ మంది కూలీలే కావడం వల్ల ఈ తరహా వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాని ఫలితాన్ని చిన్నారులు ఇలా అనుభవిస్తున్నారు. -
ఫిజియోథెరపీతో ఆటగాళ్లకెంతో మేలు: ముకేశ్
తార్నాక, న్యూస్‌లైన్: క్రీడాకారుల ఫిట్నెస్ పెం చేందుకు ఫిజియోథెరపీ చేసే మేలు అంతాఇంతా కాదని భారత మాజీ హాకీ ఆటగాడు, ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్ అన్నారు. ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఫిజియోథెరపీ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం తార్నాకలోని ఐఐసీటీ ఆడిటోరియంలో జాతీయస్థాయి ఫిజియోథెరపీ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముకేశ్ మాట్లాడుతూ... ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కే కాకుండా ఫిజియోథెరపీ అవసరం అందరికీ ఉందన్నారు. ప్రస్తుత జీవనశైలిలో దీని ప్రాముఖ్యం పెరిగిందని చెప్పారు. ఫిజియోథెరపీ వైద్యంపై ప్రజలలో మరింత అవగాహన కల్పించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. సదస్సు నిర్వాహకులు మాట్లాడుతూ చాలా మందిలో ఫిజియోథెరపీ అంటే కేవలం మసాజ్ అనే భావన ఉందన్నారు. ఈ విధమైన దృక్పథం తగదన్నారు. అన్ని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపీ నిపుణుల అవసరం ఉందన్నారు. విద్యార్థులు దీన్ని ఓ ప్రొఫెషనల్ కోర్సుగా అభ్యసిస్తే ఉజ్వలమైన భవిష్యత్ ఉందని పలువురు చెప్పుకొచ్చారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో ఫిజియోథెరపీలో వస్తున్న నూతన పద్ధతులపై చర్చిస్తామని వివరించారు. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 400 మందికి పైగా విద్యార్థులతో పాటు పలువురు పరిశోధకులు, నిపుణులు హాజరయ్యారు. ఇందులో ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలు కె.లక్షి, డాక్టర్ రత్నాకర్, కళాశాల ప్రిన్సిపాల్ మాధవి శ్రీవిద్య, డాక్టర్ వైఎస్‌ఎన్‌మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడాలి
న్యూఢిల్లీ: మహిళ వేషధారణ వారి మీద జరుగుతున్న నేరాలకు కారణమనడం సహేతుకం కాదు. మహిళలు వారి మీద జరుగుతున్న దాడులకు వ్యతి రేకంగా తిరగబడాల్సి ఉంది అని జామియామిలియాలో జరిగిన ఓ సదస్సులో పిలుపునిచ్చింది. నిర్భయ మీద జరిగిన దాడితో దేశవ్యాప్తంగా ఆందోళనలు వెలువెత్తినా పురుషుల ఆలోచనా ధోరణిలో మార్పు రాలేదని విమర్శించారు. లింగవివక్షపై జామియా మిలియాలో జరిగిన సదస్సులో పాలుపంచుకొన్న విద్యార్థులు వేధింపులకు వ్యతిరేకంగా తిరగబడడమే మహిళ ముందున్న పరిష్కార మార్గమని విద్యార్థులు ఎలుగెత్తారు. విశ్వవిద్యాలయంలో స్పోర్ట్స్ ఫిజియో థెరపీలో పీజీ చేస్తున్న టాంజీలా తాజ్ మాట్లాడుతూ‘‘ఆకతాయిలు చేసే వాఖ్యానాలను అనేక సార్లు తిప్పికొట్టాను. ఒక సందర్భంగా ఉద్దేశపూర్వకంగా ఒంటిని తాకినవాడిని ఈడ్చికొట్టాను. మరొకరిని పోలీసులకు పట్టిం చాను’’ అని గుర్తుచేసుకొంది. ‘‘మగవాళ్లు చేసే సంజ్ఞలు న్యాయస్థానంలో రుజువు చేయడం కుదరదు. చాలా సందర్భాల్లో ఇలాంటి వాటిని మహిళలు పట్టించుకొని ఫిర్యాదులు కూడా చేయరు’’ అని ఆమె ఎత్తిచూపింది. ‘‘ఫిర్యాదులు చేసిన సందర్భాల్లోనూ అనుమానం మహిళపైనే ఉంటుంది. ఆ అవమానం కూడా ఫిర్యాదుదారు భరించాల్సి వస్తుంది. అందుకే ఫిర్యాదు చేసేందుకు బాధిత మహిళలు సిద్ధపడడం లేదు’’ అని జామియామిలియా న్యాయ విభాగం ప్రొఫెసర్ మంజులా బాత్రా అన్నారు. అడుగడుగునా మహిళలు ఎదుర్కొంటున్న వివక్షల పట్ల విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిజియోథెరపీ మూడవ సంవత్సరం చదువుతున్న జేబా సైఫా మాట్లాడుతూ ‘‘విద్యార్థినుల వేషధారణ విషయంలో సహ విద్యార్థులైన అబ్బాయిల ఆలోచనా ధోరణికి వ్యతిరేకంగా పోరాడాల్సి ఉంది. ఆలోచనల్లో వక్రత్వం తప్ప రెచ్చగొట్టేది వేషధారణ కాదు. ఏదో సాకుతో యువతులు ధరించే దుస్తుల మీద కూడా హద్దులు పెట్టడం తప్ప ఇది మరేమి కాదు’’ అని అభిప్రాయపడింది. ‘‘దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళనలు జరిగినా బస్సుల్లో వేధింపులు సాగుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి వారితో ఎలా వ్యవహరించాలో తెలిసేది కాదు. అయితే నిర్భయ మీద జరిగిన దాడికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్న తరువాత వీరిని తిప్పి కొట్టడానికి సంసిద్ధత పెరిగింది. ఇప్పుడు దీటుగా జవాబివ్వగలుగుతున్నాను’’ అని సైఫీ చెప్పింది. ఈ సదస్సుకు హాజరయిన కొద్ది మంది విద్యార్థుల్లో ఒకడైన ఫర్హాన్ హయత్ మాట్లాడుతూ ‘‘మా తరగతిలో నలుగురమే అబ్బాయిలం. మిగ తా వారంతా అమ్మాయిలే. ఫిజియోథెరపీ ప్రాక్టికల్స్‌లో అమ్మాయిలకు మేమే లక్ష్యమౌతుంటాం. తప్పుడు ప్రవర్తన అనేది ఇరుపక్షాల్లోనూ కనిపిస్తోంది’’ అని అభిప్రాయపడ్డాడు. అయితే బీహార్ దర్బంగా నుంచి వచ్చిన విద్యార్థి మహ్మద్ గుల్జార్ ఇక్బాల్ మరో కోణంలో సమస్యను వివరించాడు. ‘‘మనం బృందాలుగా వేరువేరుగా ఉన్నప్పుడు యథాలాపంగానే పలు వాఖ్యానాలు చేస్తాము. ఇవి తరచూ శృంగారానికి సంబంధించినవే అయి ఉంటాయి. మనం తొలుత మాట్లాడే బాషను గురించి జాగ్రత్త తీసుకోవడం అవసరం’’ అని హయత్ సూచించాడు. విశ్వవిద్యాలయంలో సీనియర్ అధ్యాపకురాలు అంజలిగాంధీ మాట్లాడుతూ‘‘ యువతులు ధరించిన దుస్తుల గురించి మాట్లాడే హక్కు యువకులకు లేదు. వారు ధరించిన దుస్తులను బట్టి వక్ర దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. ఆ హక్కు లేదు. ఎవరికి నచ్చిన తీరులో వారు దుస్తులు ధరించవచ్చు. ఉదాహరణకు సహాధ్యాయిని ఓ అమ్మాయి నోట్స్ అడిగినంత మాత్రాన ఆమె ఇష్టపడుతోందని ఉహించుకోవడం తప్పు. వారిని ఎక్స్‌రే కళ్లతో ఒళ్లంతా తడమడం అవసరం లేదు. ఇది కూడా ఒక రకమైన లైంగిక వేధింపే అవుతుంది’’ అని స్పష్టం చేసింది. సామాజిక సేవ విభాగం అధ్యాపకురాలై న అంజలి గాంధీ జామియామిలియా లైంగిక వేదింపుల నిరోధక కమిటీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ‘‘గుచ్చిగుచ్చి చూడడం, వెన్నాడడం, చొరవతీసుకోవడం, శృంగార సంబంధ వాఖ్యానాలు చేయడం వంటివి చేసేవారు తప్పనిసరిగా కష్టాల పాలవుతారు. ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తమయ్యే విధంగా సామాజిక సంబంధాల వెబ్సైట్లలో కోట్ చేస్తే కూడా వారికి తిప్పలు తప్పవు’’ అని స్పష్టం చేశారు. లైంగికదాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించడంలో జరుగుతున్న జాప్యం పట్ల సదస్సు అగ్రహం వ్యక్తం చేసింది. ‘‘లైంగిక దాడులు చేసిన నేరస్తులను శిక్షించడానికి న్యాయవ్యవస్థలో అభ్యుదయకాముకులైన జడ్జిల అవసరం ఉంది. నేరస్తులను శిక్షించాల్సిన పరిస్థితిలో ధైర్యంగా వ్యవహరించి తీర్పు చెప్పాల్సిన అవసరం ఉంది’’ న్యాయ విభా గం ప్రొఫెసర్ మంజులా బాత్రా అన్నారు. శుక్రవారంనాడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్భయ కేసులో నలుగురు దోషులకు మరణ శిక్ష విధించడాన్ని హర్షిం చారు. మహ్మద్ ఎజాజ్ హుస్సేన్ మాట్లాడుతూ‘‘జామియామిలియాతో పాటు అన్ని విశ్వవిద్యాలయాల్లో లింగ వివక్షత పట్ల అవగాహన సదస్సుల నిర్వహణ తప్పని సరిచేయాలి. వివక్షతకు వ్యతిరేకంగా పోరాడుతున్నవి చిన్న బృందాలే అయినప్పటికీ సమాజం మీద పెద్ద ప్రభావం వేయగలుగుతాయి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. సదస్సు లో వక్తలు జామియాలో యాసిడ్ సంస్కృతి పట్ల ఎమాత్రం ఉపేక్షభావం ఉండదని స్పష్టం చేశారు. -
నర్సింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
2013-14 విద్యాసంవత్సరంలో ఎంఎస్సీ(నర్సింగ్), పోస్టు బేసిక్ బీఎస్సీ(నర్సింగ్) కోర్సుల ప్రవేశ పరీక్షకు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మాస్టర్ ఆఫ్ ఫిజయోథెరపీ కోర్సులో ప్రవేశానికి (ఎంట్రెన్స్ లేకుండా) కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ బాబూలాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 5 నుంచి 16వ తేదీ వరకూ యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి దరఖాస్తులను పొందవచ్చని చెప్పారు. ఎంఎస్సీ (నర్సింగ్) ప్రవేశ పరీక్ష దరఖాస్తులు హెచ్‌టీటీపీ://పీజీఎన్టీఆర్యూహెచ్ఎస్.ఓఆర్జీ వెబ్సైట్లోను, పోస్టు బేసిక్ బీఎస్సీ (నర్సింగ్) దరఖాస్తులు హెచ్‌టీటీపీ://యూజీఎన్టీ ఆర్యూహెచ్ఎస్.ఓఆర్జీ వెబ్సైట్లోను అందుబాటులో ఉంటాయని వివరించారు.