ఉన్నట్టుండి కుడివైపు మూతి వంకరపోతోంది! | Physiotherapy for facial muscles is likely to decrease rapidly | Sakshi
Sakshi News home page

ఉన్నట్టుండి కుడివైపు మూతి వంకరపోతోంది!

Published Wed, May 22 2019 12:54 AM | Last Updated on Wed, May 22 2019 12:54 AM

Physiotherapy for facial muscles is likely to decrease rapidly - Sakshi

నా వయసు 52 ఏళ్లు. నాకు ఉన్నట్టుండి మూడు రోజులుగా కుడి పైపున మూతి వంకరపోతోంది. నీళ్లు ఒక్క పక్క నుంచి కారిపోతున్నాయి. ఎంత ప్రయత్నించినా  కనురెప్ప మూసుకుపోవడం లేదు. ఇది పక్షవాత లక్షణమా?

మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘బెల్స్‌ పాల్సీ’ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ముఖానికి వెళ్లే ఏడవ నరం  (ఫేషియల్‌ నర్వ్‌) తాత్కాలికంగా పని చేయకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కొందరిలో  వైరల్‌ జ్వరాల తర్వాత, వాటి కారణంగా కూడా  సమస్య రావచ్చు. అయితే ఇది పక్షవాతం అనే అపోహ కొందరిలో ఉంటుంది. అది ఎంత మాత్రమూ నిజం కాదు. కొన్నిరకాల మందులతో దీన్ని తగ్గించవచ్చు. ముఖానికి సంబంధించిన కండరాలకు ఫిజియోథెరపీ చేయడం వల్ల ఇది తొందరగా తగ్గే అవకాశం ఉంది. ఈ జబ్బు వచ్చిన వారిలో దాని తీవ్రతను బట్టి అది నయమయ్యే సమయం ఆధారపడి ఉంటుంది.

నూటికి 80 నుంచి 90 మందిలో మొదటి ఆరు నెలల్లో నయమవుతుంది. బెల్స్‌పాల్సీ ముఖానికి సంబంధించిన  కండరాలకు తప్పించి, శరీరంలోని ఏ భాగాలనూ ప్రభావితం చేయదు.  అయితే... చేయి, కాళ్లలో బలం కోల్పోయినా, మింగడంలో ఇబ్బంది ఏర్పడినా, కనుచూపులో మార్పు కనబడినా... ఈ లక్షణాలలో ఏవి కనిపించినా తక్షణమే డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన అంశాలను బట్టి  మీరు అంతగా ఆందోళనపడాల్సిన అవసరం లేదు. డాక్టరును సంప్రదించి సరైన మందులు, ఫిజియోథెరపీ తీసుకోండి. బెల్స్‌ పాల్సీ తప్పక నయమవుతుంది.

కొన్నేళ్లుగా తీవ్రమైన తలనొప్పి...ఎందుకిలా?

నా వయసు 33. గత కొన్నేళ్లుగా నాకు తరచూ తలనొప్పి వస్తూ, తగ్గుతూ ఉంది. ఒక్కోసారి అది నెలలో నాలుగైదుసార్లు కూడా వస్తోంది. ఒక్కోసారి నా రోజువారీ పనులేవీ చేసుకోలేనంత తీవ్రంగా ఈ నొప్పి ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి.

తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్‌ కావచ్చు. మీకు మైగ్రేన్‌ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్‌పోజ్‌ కావడం, ఘాటైన వాసనలు, పర్‌ఫ్యూమ్స్‌ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే దాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్‌ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు ఒకసారి న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి.

డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌ రెడ్డి,
చీఫ్‌ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్,
రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement