తార్నాక, న్యూస్‌లైన్: క్రీడాకారుల ఫిట్‌నెస్ పెం చేందుకు ఫిజియోథెరపీ చేసే మేలు అంతాఇంతా కాదని భారత మాజీ హాకీ ఆటగాడు, ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్ అన్నారు. ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఫిజియోథెరపీ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం తార్నాకలోని ఐఐసీటీ ఆడిటోరియంలో జాతీయస్థాయి ఫిజియోథెరపీ సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముకేశ్ మాట్లాడుతూ... ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కే కాకుండా ఫిజియోథెరపీ అవసరం అందరికీ ఉందన్నారు. ప్రస్తుత జీవనశైలిలో దీని ప్రాముఖ్యం పెరిగిందని చెప్పారు. ఫిజియోథెరపీ వైద్యంపై ప్రజలలో మరింత అవగాహన కల్పించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. సదస్సు నిర్వాహకులు మాట్లాడుతూ చాలా మందిలో ఫిజియోథెరపీ అంటే కేవలం మసాజ్ అనే భావన ఉందన్నారు. ఈ విధమైన దృక్పథం తగదన్నారు. అన్ని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపీ నిపుణుల అవసరం ఉందన్నారు.
విద్యార్థులు దీన్ని ఓ ప్రొఫెషనల్ కోర్సుగా అభ్యసిస్తే ఉజ్వలమైన భవిష్యత్ ఉందని పలువురు చెప్పుకొచ్చారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో ఫిజియోథెరపీలో వస్తున్న నూతన పద్ధతులపై చర్చిస్తామని వివరించారు. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 400 మందికి పైగా విద్యార్థులతో పాటు పలువురు పరిశోధకులు, నిపుణులు హాజరయ్యారు. ఇందులో ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలు కె.లక్షి, డాక్టర్ రత్నాకర్, కళాశాల ప్రిన్సిపాల్ మాధవి శ్రీవిద్య, డాక్టర్ వైఎస్‌ఎన్‌మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఫిజియోథెరపీతో ఆటగాళ్లకెంతో మేలు: ముకేశ్
Published Sat, Mar 8 2014 12:10 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM
Advertisement
Advertisement