![If daily activities are physio exercises - Sakshi](/styles/webp/s3/article_images/2023/03/12/11.jpg.webp?itok=FjDKaVQv)
సాధారణంగా పక్షవాతంతో అవయవాలు చచ్చుబడ్డా లేదా ఇతరత్రా ఏదైనా ప్రమాదం కారణంగా అవయవాల్ని కొద్ది రోజులు పని చేయించలేకపో తే... అవి మళ్లీ నార్మల్‌గా పని చేయడానికి ఫిజియోథెరపీ వ్యాయామాలు అవసరమవుతాయి. మునపటిలా పని చేయడానికి ఉపకరిస్తాయి కాబట్టి కొన్ని సందర్భాల్లో వీటినే రీ–హ్యాబ్ వ్యాయామాలని కూడా అంటారు. వ్యాయామం అనగానే ఏదో శ్రమతో కూడిన పని అనీ, ఎలాగోలా తప్పించుకుంటే బెటరని అనిపించేవాళ్ల సంఖ్యే ఎక్కువ.
చాలా సందర్భాల్లో కంప్యూటర్ సహాయంతోనో లేదా రొబోటిక్స్ సహాయంతోనో వినోదాత్మకంగా తీర్చిదిద్దిన వ్యాయామాలూ ఎక్కువగానే ఉంటాయి. ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ పద్ధతుల కంటే మనం రోజూ చేసే పనులనే ‘ఫిజియో’ వ్యాయామ పద్ధతులుగా తీర్చిదిద్దడమే మంచిదనీ, అవే ఎక్కువ మేలు చేస్తాయంటున్నారు కొందరు నిపుణులు. రోజువారీ పనులే ‘ఫిజియో’ వ్యాయామరీతులెలా అవుతాయో తెలుసుకుందాం.
ఫిజియోవ్యాయామాలు అనగానే ‘పక్షవాతం’లాంటి స్ట్రోక్‌కు గురై, కోలుకునే ఏ కొందరికి మాత్రమే పరిమితమైనవనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ మన మొత్తం దేశ జనాభాలో... ఆ మాటకొస్తే ప్రపంచ జనాభాలోని 15% మందికి ఫిజియో అవసరమనేది ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా.
ఒక్క పక్షవాతం వచ్చిన వారే కాదు, ప్రమాదాలకు లోనై మళ్లీ కోలుకునే క్రమంలో తమ అవయవాలను మునుపటిలా కదిలించడానికీ, కొన్ని జబ్బులతో చాలాకాలం పాటు మంచం పట్టి... ఆ తర్వాత మళ్లీ తమ పనులు యధావిధిగా చేసుకోవాలనుకుంటున్నవారికీ, మోకాళ్ల కీలు మార్పిడి చికిత్సల తర్వాత మళ్లీ మునపటిలా నడవాలనీ, జాగింగ్‌చేయాలనుకునేవారు... ఇలా ప్రపంచమంతటా కనీసం 100 కోట్ల మందికి రీ–హ్యాబ్ అవసరం.
వీళ్లే కాదు... గుండెపో టు వచ్చాక కూడా వ్యాయామాలు అవసరం కానీ అవి గుండెపై ఏమాత్రం భారం మోపకుండా ఉండేంత సున్నితంగా ఉంటూనే... శరీరానికి తగినంత పని చెప్పేంత శ్రమతో ఉండాలి. ఈ సున్నితమైన బ్యాలెన్స్ పాటించేలా వ్యాయామాలు రూపొందించడం, చేయించడం ‘ఫిజియోథెరపిస్ట్’ ల పని. వాటిని సైంటిఫిక్‌గా రూపొందించడం ఎంతో కీలకం.
కంప్యూటర్, రొబోటిక్ ఆధారితమైనవి ఎన్నెన్నో...
వ్యాయామాల్ని ఉత్సాహంగా చేయడానికి వీలుగా రూపొందించడం కోసం ‘ఫిజియో’లు ఎన్నెన్నో మార్గాలను అన్వేషిస్తుంటారు. ఉదాహరణకు కంప్యూటర్ స్క్రీన్ మీద చుక్కల్ని ఓ వరసలో కలిపి, ఓ ఆకృతి వచ్చేలా చేయడం.
లేదా ఏదో టాస్క్‌ని ఓ నిర్ణీత/నిర్దేశిత పద్ధతుల్లో పూర్తి చేయడం వంటివి. ఒక రకంగా చెప్పా లంటే చిన్నపిల్లలు కంప్యూటర్ గేమ్స్ ఆడి విజయం సాధించనప్పటి థ్రిల్ పొందేలా ఈ కంప్యూటర్ లేదా రొబోటిక్ ఆధారిత ఫిజియో(గేమ్స్) పద్ధతులు ఉంటాయి. ఇవి కూడా చాలావరకు మేలే చేస్తాయి.
కంప్యూటర్, రొబోటిక్ వ్యాయామాల్లో పరిమితులు
అయితే వాటిలో కొన్ని పరిమితులు ఉండేందుకు అవకాశం ఉంది. 2008లో దాదాపు 330 మందిపై జరిగిన ఓ అధ్యయనంలో ఈ సంగతి రుజువైంది. ఏ వ్యాయామ రీతిలోనైనా... భారం ఎక్కువగా పడుతూ, తక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామం కంటే తక్కువ భారం పడుతూ... ఎక్కువ రిపిటీషన్లతో సమకూరే వ్యాయామంలోనే కండరానికి ఎక్కువ సామర్థ్యం అలవడుతుంది. ఇలా బరువును క్రమంగా పెంచుకుంటూ, దానికి అనుగుణంగానే రిపిటీషన్లను పెంచుతూ పో వడం వల్లనే ప్రయోజనం ఎక్కువ అని అనేక అధ్యయనాలు నిరూపించాయి.
అధిగమించడం ఇలా...
పైన పేర్కొన్న అధ్యయనం ప్రకారం ఆ పరిమితుల్ని అధిగమించేందుకు కొన్ని దేశీయ పద్ధతులతో వ్యాయామ రీతుల్ని మన నిపుణులు అభివృద్ధి చేశారు. మనం రోజూ చేసే పాత పనుల్నే వ్యాయామ రీతులుగా సరికొత్తగా రూపొందించారు.
రొబోటిక్ రీ–హ్యాబ్ ప్రక్రియల్లో కంప్యూటర్ ఆధారంగా కొన్ని డిజైన్లు వచ్చేలా చుక్కల్ని కలపడం, రొబోటిక్ కదలికలతో కండరం బలం పెంచుకున్నా కదలికల నైపుణ్యం తగ్గడం వల్ల ఒనగూరాల్సిన ప్రయోజనం అందదు. కానీ రోజువారీ పనులతో రూపొందించిన పద్ధతులతో చచ్చుబడ్డ కండరానికి బలమూ, నైపుణ్యమూ పెరుగుతాయి.
ప్రయోజనమూ ఎక్కువే, స్వావలంబనా సహజమే
ఇలాంటి దేశీయ పద్ధతులతో ఓ ప్రయోజనమూ ఉంది. కంప్యూటర్‌పై ఆటలు చిన్నతనంలో ఆసక్తిగా ఉండవచ్చు. కానీ స్ట్రోక్ లాంటివి మధ్యవయసు దాటాకే వస్తుంటాయి. అందువల్ల ఆ వయసులో కంప్యూటర్‌పై రొటీన్ సీక్వెన్సింగ్ పనులు బోర్‌గా అనిపించవచ్చు.
కానీ రోజువారీ పనులు చేస్తుండటం, వాటిలో రోజురోజుకూ మెరుగుదల కనిపించడంతో పేషెంట్లకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పైగా అవి అటు తర్వాత కూడా వారి రోజువారీ జీవితంలో చేసుకోవాల్సిన పనులు కావడంతో స్వావలంబనా, ఎవరిపైనా ఆధారపడకుండా తమ పనులు తామే చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసమూ పెరుగుతాయి.
రోజువారీ పద్ధతుల్లో కొన్ని...
రోటీలు చేయడం...
చచ్చుబడ్డ కండరాల సహాయంతోనే రోటీలు చేసే ప్రక్రియ కొనసాగుతుంది. రొట్టెలు చేయడంలో అప్పడాల కర్రతో రొట్టెల్ని గుండ్రంగా వచ్చేలా చేయడం. ఇందులో చేతి వేళ్లన్నింటితో పాటు ముంజేయి కండరాలు, మోచేతి కీలు వంటి వాటికి వ్యాయామం సమకూరుతుంది.
కూరగాయలు తరగడం
పూర్తిగా నైపుణ్యంతో కాకపో యినా... వీలైనంత మేరకు కూరగాయలు తరిగేలా చేయిస్తారు. దాంతో బొటనవేలితో పాటు, కత్తి చుట్టూ మిగతా వేళ్ల గ్రిప్ పెరుగుతుంది. చేయి, ముంజేయి, మోచేతి కండరాలతో పాటు మణికట్టు ఎముకల కదలికలతో చేతికి కావాల్సిన రీ–హ్యాబ్ వ్యాయామం సమకూరుతుంది. ఇది క్రమంగా బలమూ పెంచుతుంది. నైపుణ్యాలను సైతం పెరిగేలా చేస్తుంది.
చీర కుచ్చిళ్ల కదలికలతో
మహిళల్లో అయితే వారు రీ–హ్యాబ్ కార్యక్రమంలో ఉన్నప్పుడు నైటీ మీదే చీర కట్టుకునేలా ్రపో త్సహించడం. ఈ ప్రక్రియలో చీర కుచ్చిళ్లను అల్లుకునేలా మాటిమాటికీ చేతులు కదిలించేలా చేస్తారు. స్ట్రోక్‌తో చేతుల్లోని, వేళ్లలోని నరాల కేంద్రం దెబ్బతిన్న వారిలో ఈ వ్యాయామ రీతి వల్ల అతి సున్నితమైన వేలి కండరాలు, వేళ్లకు సప్లై అయ్యే నరాల్లో కదలికల్ని క్రమంగా నింపేలా చూస్తారు.
తోట పని ప్రక్రియలు
మనం తోట పని చేసేప్పుడు గడ్డపారతో తవ్వడం, పార (స్పేడ్) లాంటి పరికరాలతో మట్టిని నిర్దేశిత రీతిలో పో గుపడేలా చేయడం, కిందపడ్డ ఆకుల్ని కాళ్లలో ఓ పక్కకు తోయడం... ఇవన్నీ పూర్తిస్థాయిలో కాకపో యినా... ఆ పనుల్లో కాళ్లూ, చేతులతో ఎలాంటి కదలికలు అవసరమో, అవే జరిగేలా చూస్తారు. ఇక్కడ నైపుణ్యానికి తావు లేకుండా తొలుత ఆసక్తిగా తోట పనిలో పాలు పంచుకునేలా చేస్తుంటారు. క్రమక్రమంగా ఆయా అవయవాలకు బలం సమకూరడమే కాకుండా... నైపుణ్యమూ పెరుగుతుంది.
-డాక్టర్ విజయ్ బత్తిన (పీటీ) ఫిజికల్ మెడిసిన్ అండ్ రీహాబిలిటేషన్ స్పెషలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment