యూఎన్‌హెచ్‌ఆర్‌సీకి ట్రంప్‌ గుడ్‌బై | Trump announces withdrawal from UN human rights body | Sakshi
Sakshi News home page

యూఎన్‌హెచ్‌ఆర్‌సీకి ట్రంప్‌ గుడ్‌బై

Published Thu, Feb 6 2025 4:33 AM | Last Updated on Thu, Feb 6 2025 4:33 AM

Trump announces withdrawal from UN human rights body

త్వరలో యునెస్కోకు కూడా!

న్యూయార్క్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘానికి (యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) కూడా గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వుపై మంగళవారం ఆయన సంతకం చేశారు. ‘‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధాలను నిలువరించి అంతర్జాతీయంగా శాంతిభద్రతల స్థాపనకు కృషి చేసే లక్ష్యంతో ఐరాస స్థాపనకు అమెరికా సాయపడింది. 

కానీ ఐరాసకు చెందిన పలు ఏజెన్సీలు కొంతకాలంగా సంస్థ లక్ష్యానికి భిన్నంగా పని చేస్తున్నాయి. పైగా అమెరికా ప్రయోజనాలనే దెబ్బ తీస్తున్నాయి’’ అంటూ ఉత్తర్వుల్లో తూర్పారబట్టారు. పాలస్తీనా శరణార్థులకు ఆ సంస్థ అందిస్తున్న సాయానికి అమెరికా నిధుల సాయాన్ని తక్షణం నిలిపేయాల్సిందిగా కూడా ట్రంప్‌ ఆదేశించారు. అంతేకాదు, ఐరాస విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ (యునెస్కో), పాలస్తీనా శరణార్థుల సహాయ, పనుల సంస్థ (యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ)ల్లో కొనసాగడం అవసరమా పరిశీలించాల్సిందిగా కూడా అధికారులకు సూచించారు. 

‘‘మానవ హక్కుల ఉల్లంఘనదారులను యూఎన్‌హెచ్‌ఆర్‌సీ కాపాడుతోంది. విదేశీ ఉగ్ర సంస్థలుగా అమెరికా విదేశాంగ శాఖ చాన్నాళ్ల క్రితమే ప్రకటించిన పలు మూకలు నానా ముసుగుల్లో యూఎన్‌ఆర్‌ డబ్ల్యూఏలో చొరబడ్డారు. ఇక యునెస్కో తనను తాను సంస్కరించుకోవడంలో నిత్యం విఫల మవుతూనే ఉంది’’ అని ఉత్తర్వుల్లో ట్రంప్‌ ఆక్షేపించారు. గాజా యుద్ధం విషంలో యూఎన్‌హెచ్‌ఆర్‌సీ తమపై ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతోందని ఇజ్రాయెల్, అమెరికా కొంతకాలంగా ఆరోపిస్తుండటం తెలిసిందే. ట్రంప్‌ తన తొలి హయాంలో కూడా యూఎన్‌హెచ్‌ఆర్‌సీ నుంచి వైదొలగుతూ నిర్ణయం తీసుకున్నారు. యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏకు నిధులను నిలిపేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement