
నా వయసు 45 ఏళ్లు. పది రోజుల కిందట నాకు ఒక పక్క కురుపులు వచ్చాయి. బాగా నొప్పిగానూ ఉన్నాయి. పదిరోజుల్లో మాడిపోయాయి. అయితే ఇప్పుడు లోపలి నుంచి భరించలేనంత నొప్పి వస్తోంది. నా సమస్యకు పరిష్కారం ఏమిటి?
– ఎన్. కిశోర్, నూజివీడు
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు పోస్ట్ హెర్పటిక్ న్యూరాల్జియా అనే సమస్యతో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. ఇది వారిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వస్తుంది. షుగర్ వ్యాధి ఉన్నవారిలో, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇది రావచ్చు. కురుపులు కనిపించినప్పుడు ఎసైక్లోవిర్ అనే టాబ్లెట్లు వాడటంతో అవి తగ్గిపోతాయి. అలా వాడని వారిలో కురుపులు మానిపోయాక భరించలేనంత నొప్పి వస్తుంది. దీనినే హెర్పటిక్ న్యూరాల్జియా అని అంటారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు రెండు, మూడు రకాల మందులు వాడి, సమస్యను అదుపు చేయవచ్చు. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి. మీ వయసును, బరువును బట్టి డాక్టర్లు ఆ మందులు ఇస్తారు. వాటిని వాడటం వల్ల మీ సమస్య అదుపులోకి వచ్చే అవకాశం ఉంది.
యాక్సిడెంట్ తర్వాత ఫిట్స్... తగ్గేదెలా?
నా వయసు 32 ఏళ్లు. నాకు ఒక యాక్సిడెంట్‌లో తలకు కుట్లు పడ్డాయి. మెదడు స్కానింగ్ చేస్తే... ఎముక ఫ్రాక్చర్ అయినట్లుగా రిపోర్టు వచ్చింది. మెదడులో రక్తస్రావం కూడా అయ్యింది. ఇది జరిగి దాదాపు ఐదేళ్లు అయ్యింది. అయితే అప్పట్నుంచి నాకు ఏడాదికోసారి ఫిట్స్ వస్తున్నాయి. ఇవి తగ్గే మార్గం చెప్పండి. – ఎమ్. ఆదిత్య, నల్లగొండ
మెదడుకు దెబ్బ తగిలినప్పుడు కొందరిలో మెదడు కణజాలంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా మెదడు కణాలలో అవసరానికంటే ఎక్కువగా విద్యుత్తు ఉత్పత్తి జరిగి, ఫిట్స్ వస్తాయి. ఇలాంటి వారు చాలా సందర్భాల్లో జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందికి దెబ్బతగిలినప్పుడు ఫిట్స్ వచ్చి, స్కానింగ్‌లో నార్మల్‌గా ఉంటుంది. అలాంటి ఫలితం వచ్చినవారు కొన్ని నెలల పాటు మందులు వాడితే చాలు. మీరు ఒకసారి మీ డాక్టర్‌ను సంప్రదించండి. వారు మీ వైద్యపరీక్షల ఫలితాలను బట్టి మీకు తగిన మందులు సూచిస్తారు.
బాబుకు చేతులు, మెడ వంకర్లు పోతున్నాయి..?
మా అబ్బాయి వయసు 16 ఏళ్లు. దాదాపు ఏడాది కాలంగా బాగా నీరసంగా ఉంటున్నాడు. మందకొడిగా ఉంటాడు. ఏ పనిచేయాలన్నా చాలా సమయం తీసుకుంటున్నాడు. ఒక్కోసారి చేతులు, మెడ వంకర్లు పోతున్నాయి. వాడికి ఉన్న సమస్య ఏమిటి? పరిష్కారం చెప్పండి.
– ఎమ్. ఆంజనేయులు, భీమవరం
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి అది విల్సన్ డిసీజ్‌గా కనిపిస్తోంది. ఆ వయసులో ఉన్న పిల్ల్లలకు ఆ జబ్బు కారణంగా చేతులు, కాళ్లు వంకర్లు పోవడం, మాట స్పష్టంగా రాకపోవడం, పోనుపోను నీళ్లు కూడా మింగలేకపోవడం జరగవచ్చు. ఈ జబ్బును స్లిట్‌ల్యాంప్ పరీక్ష, కొన్ని రక్తపరీక్షలు, ఎమ్మారై స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ జబ్బు వల్ల మన శరీరంలో ‘కాపర్’ అనే ఖనిజం ఎక్కువగా పేరుకుపోతుంది. దీనిని పెనిసిల్లమిన్ వంటి మందుల ద్వారా తగ్గించవచ్చు. చేతులు, కాళ్లు వంకర్లు తగ్గించడానికి కూడా మందులు వాడాలి. కొన్ని నెలల నుంచి సంవత్సరాల పాటు మందులు వాడాల్సి రావచ్చు. ఇది జన్యుపరమైన జబ్బు. కాబట్టి ఒకే కుటుంబంలో చాలా మంది పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మున్ముందు మేనరికపు సంబంధాల జోలికి వెళ్లకపోవడం మంచిది.
బాబుకు ఇంత చిన్న వయసులో ఏమిటీ సమస్య?
మా అబ్బాయి వయసు పదకొండేళ్లు. దాదాపుగా గత ఐదేళ్లుగా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు నేల మీద కూర్చొని పైకి లేవలేడు. కాళ్ల పిక్కలు రెండూ బాగా లావుగా అయ్యాయి. మా బాబు సమస్య ఏమిటి? అతడికి నయమయ్యే అవకాశం ఉందా? నాది, మా ఆయనది చాలా దగ్గరి సంబంధం. మాది మేనరికం. దాని వల్లనే ఈ సమస్య వచ్చిందంటున్నారు. మాకు తగిన సలహా ఇవ్వండి. – డి. సుందరి, ఖమ్మం
మీ అబ్బాయి డీఎమ్‌డీ అనే జబ్బుతో బాధపడుతున్నాడు. ఇది చిన్నవయసులోనే ప్రారంభమై పదిహేను సంవత్సరాలకల్లా పూర్తిగా బలహీనమైపోయేలా చేస్తుంది. ఇప్పటికైతే దీనికి సరైన మందులంటూ ఏవీ లేవు. మేనరికం వంటి దగ్గరి సంబంధాలు చేసుకున్నవారిలో జన్యుపరమైన కారణాల వల్లనే ఇది వస్తుంది. అయితే జబ్బు తీవ్రత తగ్గించేందుకు కొంతమందిలో స్టెరాయిడ్స్ వాడవచ్చు గానీ వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. ఫిజియోథెరపీ ద్వారా కండరాలు బలహీనం కాకుండా చేయవచ్చు. అయితే దగ్గరి సంబంధాలు చేసుకోకుండా ఈ జబ్బును నివారించాలి తప్ప, ఇది జన్యుపరమైన సమస్య కావడంతో ఒకసారి జబ్బు వచ్చిన తర్వాత నయం చేయడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు.
మూర్ఛవ్యాధి ఉంది – గర్భం దాల్చాను... మందులు మార్చాలా?
నా వయసు 25 ఏళ్లు. గత పదేళ్లుగా మూర్ఛవ్యాధితో బాధపడుతున్నాను. క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి, వారు సూచించినట్లుగానే మందులు వాడుతున్నాను. ప్రస్తుతం నేను మూడు నెలల గర్భవతిని. అవే మందులు వాడితే కడుపులోని బిడ్డకు ఏదైనా ప్రమాదమా? – సుగుణ, నిజామాబాద్
మూర్ఛవ్యాధి వచ్చిన వారు క్రమం తప్పకుండా ఖచ్చితంగా మందులు వాడాల్సిందే. అయితే తల్లి వాడే ఫిట్స్ మందుల వల్ల కడుపులోని బిడ్డకు కొన్ని రకాల లోపాలు వచ్చే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే, ఇలా మూర్ఛవ్యాధి వచ్చి చికిత్స తీసుకుంటున్న మహిళలు గర్భం రాకముందునుంచే ‘ఫోలేట్’ అనే మందును తీసుకోవడం చాలా మంచిది. ఇది తీసుకుంటూ ఉండటం వల్ల బిడ్డకు లోపాలు వచ్చే అవకాశాలను చాలావరకు తగ్గించవచ్చు. అయితే ఒకసారి గర్భం దాల్చాక... ఇప్పుడు ఆ మందులు మొదలుపెట్టడం వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. మీరు చెబుతున్న దాని ప్రకారం ఇప్పటికే మీకు మూడు నెలలు నిండాయి కాబట్టి... డాక్టర్‌ను కలిసి, మీ ఆరోగ్యచరిత్ర (కేస్ హిస్టరీ)ని వివరించండి. వారు సూచించిన ప్రకారం ఇక నుంచి క్రమం తప్పకుండా స్కానింగ్ చేయించుకుంటూ బిడ్డలో ఏవైనా లోపాలు ఉన్నాయేమో చూసుకుంటూ ఉండాలి. మీరు ఫిట్స్ కోసం వాడుతున్న మందులను మీ డాక్టర్ కొనసాగించడం గానీ లేదా మీకు తగినట్లుగా కొన్ని మందులను మార్చడం గానీ చేయవచ్చు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఫిట్స్ మందులను ఆపవద్దు. అదే జరిగి మళ్లీ మీకు ఫిట్స్ వస్తే అది మీకూ, బిడ్డకూ కూడా ప్రమాదకరం.
డాక్టర్ మురళీధర్‌రెడ్డి,
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment