అలజంగి (బొబ్బిలి రూరల్): బాల్యం ఎవరికైనా మధురమే. కానీ వీరికి జీవితమంతా బాల్యమే అయిపోతూ... బతుకులో తీపి చచ్చిపోయి, చేదు మిగిలింది. ఆ చిన్నారులందరికీ ఏదో ఒక వైకల్యం. అందరి తల్లిదండ్రులూ పిల్లలను వదిలి దూరంగా వెళ్లిపోయిన వారే. వివిధ సమస్యలతో బాధపడుతున్న వీరందరినీ వారి నాయనమ్మలు, అమ్మమ్మలు సంరక్షిస్తున్నారు. వీరికి సేవలు చేయలేక, కనీసం ఫిజియోథెరపీ చేయించడానికి లేదా సదరంలో పరీక్షలు చేయించడానికి తీసుకెళ్లలేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.
మండలంలో అలజంగి గ్రామానికి చెందిన 11 ఏళ్ల రాంబార్కి మాధవి మానసిక స్థితి సరిగా లేదు. అమ్మానాన్న మాధవిని నానమ్మ చిన్నమ్మి దగ్గర వదిలేయడంతో ఆమే పెంచుతోంది.
తల పెరుగుతూ వైద్యులకు అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్నాడు చందక సాయి. తల్లిదండ్రులు భారమని విడిచివెళ్లడంతో సాయి నానమ్మ సూరమ్మ వద్దే ఉం టున్నాడు.పెద్దగా తెలివితేటలు లేకపోవడంతో పాఠశా ల చదువు అంతంతమాత్రం.రోడ్డుపై ఎవరు వెళ్లినా పల కరిస్తూ ఇంట్లోనే సహాయం కోసం ఎదురుచూస్తున్నాడు.
తల చిన్నగా ఉన్న పైల ఈశ్వరమ్మ చిన్నప్పటి నుంచి ఈ సమస్యతో బాధపడుతోంది. తల్లిదండ్రులు వలస కూలీలుగా సుదూర ప్రాంతాలకు వెళ్లడంతో వృద్ధురాలైన నానమ్మ సీతమ్మ వద్ద పెరుగుతోంది. ఈ చిన్నారికి కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా తెలీదు.
కాళ్లు సరిగా రాని సువ్వాడ మహేష్‌ది మరో కథ. ఆరోగ్యశ్రీ కార్డు ఉండడంతో ఆపరేషన్ చేయించారు. కానీ ఆపరేషన్ ముందు కాసింతైనా నడవగలిగిన మహేష్ తర్వాత నడవడం లేదు. మానసిక స్థితి కూడా సరిగా లేని మహేష్‌ను నాయనమ్మ నారాయణమ్మ పెంచుతోంది.
అలాగే రాపాక చంద్రశేఖర్, వెంపటాపు స్వాతి మానసిక స్థితి సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎమ్మార్టీలు ఉండడంతో వీరిని కొంతమేర పర్యవేక్షించి సాయం చేసేవారు. ప్రస్తుతం వీరిని చూడడానికి తల్లిదండ్రులు కూడా లేరు. వీరంతా ఆ వృద్ధులపైనే ఆధారపడి బతుకుతున్నారు. మనసున్న వారు వచ్చి సాయం చేస్తే తమ పిల్లలు మళ్లీ మామూలుగా బతుకుతారని ఆ వృద్ధులు ఆశపడుతున్నారు.
అవగాహన లేమి అసలు శాపం
అలజంగి: బొబ్బిలి మండలంలోని చిన్న గ్రామం. ఈ గ్రామంలో ఎక్కువగా మానసిక వికలాంగులు, శారీరక వికలాంగులు కనిపిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం గ్రామస్తుల్లో అవగాహన లోపం. ఇక్కడ ఎక్కువగా బాల్య వివాహాలు, మేనరిక వివాహాలు జరుగుతున్నట్టు తెలిసింది. బాల్య, మేన రిక వివాహాల వల్ల వచ్చే దుష్పరిణామాలు తెలియక వీరు ఇలా అవస్థలు పడుతున్నారు. ఎక్కువ మంది కూలీలే కావడం వల్ల ఈ తరహా వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దాని ఫలితాన్ని చిన్నారులు ఇలా అనుభవిస్తున్నారు.
కన్నవారికి దూరమై...ఉన్న వారికి భారమై..
Published Sat, Aug 9 2014 5:06 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM
Advertisement
Advertisement