తల్లిని కోల్పోయి.. కాళ్లను పోగొట్టుకుని
గాజాలో చిన్నారుల ఆవేదనభరిత వ్యధ
గాజాలోని.. ఓ ఆస్పత్రి. 22 నెలల వయసున్న చెల్లెలు మిస్క్ తో కలిసి నాలుగు నెలలుగా ఆస్పత్రిలోనే ఉంటోంది మూడేళ్ల హనన్. ‘అమ్మేది?’, ‘కాళ్లెక్కడికి పోయాయి’పదే పదే అడిగే ఈ ప్రశ్న తప్ప వారి నోటినుంచి మరో మాటలేదు. ‘నాలుగు నెలలుగా మనమో పీడకలలో ఉన్నాం’అని చెబుతోంది పక్కనే ఉన్న వారి అత్త. బాంబు దాడిలో అమ్మ చనిపోయిందని, ఆ దాడిలోనే ఇద్దరి కాళ్లూ పోయాయని వాళ్లకు చెప్పలేక కుమిలిపోతోంది. ఇది గాజాలోని ఆస్పత్రుల్లో కనిపించే నిత్య దృశ్యం. మనుషులు వేరు.. అడిగే ప్రశ్నలు వేరు.. కానీ ఎవ్వరి దగ్గరా సమాధానాలు ఉండవు. తమ ప్రమేయం ఏమాత్రం లేకపోయినా.. జరుగుతున్న మారణహోమంలో ప్రాణాలు పోగొట్టుకున్న చిన్నారులు వేలమంది. వైకల్యం పాలైనవారి లెక్కలు లేనేలేవు.
గాజాలో తొలి పోలియో కేసు నమోదు కావడంతో ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలకు టీకాలు ఇచ్చేందుకు యుద్ధానికి విరామం ప్రకటించాలని సూచించింది. ఇజ్రాయెల్, గాజా రెండూ ఈ విరామాన్ని అంగీకరించాయి. సెపె్టంబర్ 2న కార్యక్రమం మొదలైంది. డేర్ ఎల్ బలాహ్‌లో ఉంటున్న షైమా అల్ దఖీ... ఉదయాన్నే లేచి తన ఇద్దరు కుమార్తెలు హనన్, మిస్‌్కను తీసుకెళ్లి టీకా ఇప్పించింది. మరుసటి రోజు కుటుంబం భోజనం చేసింది.. నిద్రించడానికి ఉపక్రమిస్తుండగా.. వాళ్ల ఇంటిపై బాంబు దాడి. ఈ ఘటనలో షైమా ప్రాణాలు కోల్పోయింది. భర్త మహ్మద్ అల్ దఖీతో సహా ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. హనన్ రెండు కాళ్ళను కోల్పోయింది. ఆమె శరీరమంతా గాయాలే. చిన్నారి మిస్క్ ఎడమ కాలు కోల్పోయింది. తలలో తీవ్ర రక్తస్రావమవ్వడంతో మహమ్మద్ రెండు వారాలపాటు ఐసీయూలో ఉండాల్సి వచ్చింది.
భయానకంగా భవిష్యత్...
మహమ్మద్ సోదరి షెఫా.. ఇద్దరు అమ్మాయిలను ఓదార్చడానికి ప్రయతి్నస్తోంది. ఇద్దరూ భయంతో వణికిపోతూ అత్తను పట్టుకునే ఉంటున్నారు. ఇప్పటికైతే ఏదో ఒకటి చెప్పి వారిని ఊరడిస్తోంది. కానీ.. భవిష్యత్‌లో పిల్లల పరిస్థితి ఏమిటి? తమ వయసులోని ఇతర పిల్లలను చూసి వీళ్లేమనుకుంటారు. లోకమంటే తెలియని మిస్‌్కకు అంత కష్టం కాకపోయినా.. తన కుటుంబానికి ఏం జరిగిందో కొంచెం అర్థమైన హనన్‌కు మాత్రం ఇది కష్టంగా ఉంది. పెరుగుతున్న బాధితులతో చికిత్స అందించడానికే సమయం సరిపోని వైద్యులకు చిన్నారులకు మానసికంగా మద్దతు ఇచ్చే అవకాశం అసలే లేదు. షెఫాతోపాటు షైమా తల్లిదండ్రులు, షెమా సోదరుడు అహ్మద్ పిల్లలను చూసుకుంటున్నారు. పిల్లలు బొమ్మలు కావాలంటున్నారు.. కానీ రొట్టెముక్క విలాసంగా మారిన చోట బొమ్మలు దొరకడం అసాధ్యం కదా! ఏచిన్న అవకాశం దొరికినా పిల్లలను సంతోషంగా ఉంచేందుకు కానుకలు తెస్తున్నారు.
ఇతర పిల్లల కాళ్ల వైపు చూస్తూ..
‘‘గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచే షైమా బిడ్డల గురించి భయపడింది. వారికి పోషకాహారం అందించడానికి ఎంతో శ్రమించింది. వారితోనే సమయం గడిపింది. వాళ్లు కావాలన్నది ఇవ్వడానికి ప్రయతి్నంచింది. పోలియో వ్యాక్సిన్ల ప్రకటన రాగానే.. పోలియో నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్స్ తన పిల్లలకు వేయించడమే కాదు.. బంధువులందరినీ ప్రోత్సహించింది. కానీ ఏం జరిగింది. పోలియో నుంచి రక్షణ లభించింది కానీ.. ఇజ్రాయెల్ వైమానిక దాడి వారి కాళ్లను తీసుకుంది. షైమాను పొట్టన పెట్టుకుంది. తల్లి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. హనన్‌ది నా కూతురు హలాది ఒకే వయసు. హలాను ఆస్పత్రికి తీసుకొచి్చనప్పుడు.. హనన్ భావాలను నేను ఎప్పటికీ మర్చిపోలేను. హలా కాళ్ల వైపు చూస్తూ, ఆ తర్వాత తన కాళ్లను చూసుకుంటూ ఉండిపోయింది. బాంబు దాడికి ముందు వాళ్లిద్దరూ కలిసి ఆడుకునేవారు. ఇప్పుడు ఆసుపత్రి మంచంపై ఆడుకుంటున్నారు’’అంటూ కన్నీటి పర్యంతమవుతోంది షెఫా.
వైద్యం కోసం ఎదురుచూపులు
బాంబుదాడులతో గాజా ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైపోయింది. చిన్నారులిద్దరూ పూర్తిగా కోలుకోవాలంటే గాజాలో ఇచ్చే చికిత్స సరిపోదు. వాళ్లకు కేవలం ప్రోస్థెటిక్స్ అమరిస్తే సరిపోదు. పిల్లలిద్దరిదీ ఎదిగే వయసు. వయసుతో పాటు ఎముక పెరుగుదల కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే నిరంతర పర్యవేక్షణ, శస్త్రచికిత్సలు అవసరం. చికిత్స కోసం గాజాను విడిచిపెట్టాల్సిన వ్యక్తుల జాబితాలో వాళ్ల పేర్లను చేర్చారు. ఇజ్రాయెల్ ఆమోదిస్తే తప్ప వారిని విడిచిపెట్టలేరు. ఆమోదం కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘నేను బూట్లెలా వేసుకోవాలి?’, ‘నేను ఆడుకోవడానికి పార్క్‌కు వెళ్లొద్దా?’అంటూ పిల్లలడిగే ప్రశ్నలకు బదులెవరు చెప్తారు? గాజాలో జరుగుతున్న మారణహోమాన్ని నిశ్శబ్దంగా చూస్తున్న ప్రపంచాన్ని భవిష్యత్‌లో ఆ చిన్నారులు ఎలా చూస్తారు? అంతటా సమాధానం లేని ప్రశ్నలే!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment