యుద్ధం దుఃఖం
సెప్టెంబర్ 30న గాజాలో ఒక ఇంటి మీద ఇజ్రాయిల్ బాంబు వేసింది. ఆ ఇంటిలోని 10 ఏళ్ల పాప, ఆమె 11 ఏళ్ల సోదరుడు మరణించారు. తల్లిదండ్రులు వారిని అంతిమంగా సాగనంపి పాప నోట్‌బుక్ తెరిస్తే ఈ మరణాన్ని, ఇలాంటి మరణాన్ని ఊహించి, గాజాలో కొంతకాలంగా మరణించిన16,700 మంది పిల్లలతో పాటు తానూ చేరక తప్పదని తెలిసి ఆ పాప నోట్‌బుక్‌లో వీలునామా రాసి వెళ్లింది. ఆ వీలునామాలో తొలి వాక్యం ‘నేను చనిపోతే ఏడ్వొద్దు’ అని.
గాజా పసిపిల్లలు జీవించి ఉన్నారంటే వారు చిరంజీవులయ్యారని కాదు. వారి ఊపిరి కాలం పొడిగింప బడిందనే అర్థం. ఇక్కడ చూడండి... జూన్ 10న గాజాలోని ఒక ఇంటి మీద బాంబు జారవిడిచింది ఇజ్రాయిల్. ఆ ఇల్లు పాక్షికంగా ధ్వంసమైంది. ఇరుగూ పొరుగూ కలిసి లోపల ఉన్న భార్యాభర్తల్ని వారి కుమారుడు 11 ఏళ్ల అహ్మద్‌ని కూతురు 10 ఏళ్ల రాషాను బయటకు తీసుకొచ్చారు. వారంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
ఇజ్రాయిల్ ఆ ఇంటి మీద బాంబు ఎందుకు వేసింది? కారణం ఏమీ లేదు. మొన్నటి సెప్టెంబర్ 30 వరకూ కూడా ఆ కుటుంబం ఆకలిదప్పులతో వేదనలతో బతికింది. అయితే ఇజ్రాయిల్ తిరిగి సెప్టెంబర్ 30న మరో బాంబు అదే ఇంటి మీద వేసింది. కారణం ఏమిటి? ఏమీ లేదు. కాని దురదృష్టం.. ఈసారి రాషా, ఆమె సోదరుడు అహ్మద్ మృతి చెందారు. (ప్రెగ్నెన్సీ అంటే జోక్ కాదు, నిజాలు ఎవ్వరూ చెప్పరు: రాధిక ఆప్టే కష్టాలు)
తల్లిదండ్రులు ఎంతో దుఃఖంతో వారిని సాగనంపి తిరిగి వచ్చాక రాషా నోట్ పుస్తకంలో రాసిన తన వీలునామా కనిపించింది. అప్పటి వరకూ వారికి ఆ చిన్నారి అలాంటి వీలునామా రాసి ఉంటుందని తెలియదు. ఆ పాప అప్పటికే ఎందరో చిన్నపిల్లల మరణాలని చూసింది గాజాలో. మాట్లాడుకుంటుంటే వినింది. కనుక తాను కూడా చనిపోతానని భావించిందో ఏమో నోట్‌బుక్‌లో వీలునామా ఇలా రాసింది.
రాషా రాసిన ఈ వీలునామాను ఆమె మేనమామ అసిమ్ అలనబి లోకానికి చూపించాడు. రాషా ఎందుకనో తాను మరణించి తన సోదరుడు బతుకుతాడని ఆశించింది. ఆమె సోదరుడు అహ్మద్ గడుగ్గాయి. అల్లరి చేసినా అందరూ వాణ్ణి ప్రేమించేవారట. గదమాయిస్తూనే దగ్గరికి తీసుకునేవారట. కాని ఆమెతో పాటు ఆ ముద్దుల సోదరుడు కూడా మరణించాడు. గాజాలో రోజూ వందలాది మంది పిల్లలు చనిపోతున్నారు. గాజాలో పిల్లల గుండెల్లో ఎన్ని మూగబాధలు చెలరేగుతున్నాయో దూరంగా నిశ్చింతగా ఉంటూ తమ పిల్లలకు గోరుముద్దలు తినిపిస్తున్న తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు.
ఏ యుద్ధమైనా, ఎటువంటి ద్వేషమైనా, ఏ విషబీజాలైనా, ఎటువంటి వివక్ష అయినా అంతిమంగా ముందు పిల్లల్ని బాధిస్తుంది. పిల్లల్లో ఉండే కరుణను పెద్దలు ఎప్పటికైనా అందుకోగలరా?
‘నేను చనిపోతే నా కోసం ఎవరూ ఏడ్వద్దు. ఎందుకంటే మీ కన్నీళ్లు నాకు నొప్పి కలిగిస్తాయి. నా దుస్తులు అవసరమైనవారికి ఇస్తారని భావిస్తాను. నా అలంకార వస్తువులు రాహా, సరా, జూడీ, బతుల్, లానాల మధ్య సమానంగా పంచాలి. నా పూసల పెట్టె ఇకపై పూర్తిగా అహ్మద్, రాహల సొంతం. నాకు నెలవారీ అలవెన్సుగా వచ్చే 50 షెకెల్స్ (ఒక షెకెల్ 22 రూపాయలకు సమానం) సగం రాహాకు, సగం అహ్మద్‌కు ఇవ్వండి. నా కథలు, నోట్ పుస్తకాలు రాహావి. నా బొమ్మలు బతూల్‌వి. మరోటి, మా అన్న అహ్మద్‌ను గదమాయించొద్దు. ఈ కోరికలు నెరవేర్చండి’...
Comments
Please login to add a commentAdd a comment