ఇజ్రాయెల్ సైన్యం అమానుషత్వం
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) అత్యంత అమానుషంగా వ్యవహరిస్తోంది. యుద్ధ సమయంలో ఇళ్లు, సొరంగాల్లోకి ప్రవేశించడానికి పాలస్తీనా పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటోంది. ‘మస్కిటో ప్రోటోకాల్’గా పిలిచే ఈ పద్ధతిని గాజాలోని ఇజ్రాయెల్ యూనిట్లన్నీ అవలంబిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైనికుడే ఈ మేరకు వెల్లడించడం విశేషం. ఐదుగురు పాలస్తీనా మాజీ ఖైదీలు దీన్ని ధ్రువీకరించారు. ఉత్తర గాజా, గాజా సిటీ, ఖాన్ యూనిస్, రఫా... ఇలా గాజా అంతటా ఇదే పద్ధతిని అమలు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం.
– జెరూసలెం
నిషేధం బేఖాతరు
సైనిక కార్యకలాపాలలో పౌరులను ఇలా అనైతికంగా, అనుమాషంగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషిద్ధం. వెస్ట్ బ్యాంక్‌లో అనుమానిత మిలిటెంట్ల తలుపులను తట్టడానికి ఇజ్రాయల్ సైన్యం పాలస్తీనా పౌరులను ఉపయోగిస్తోందని హక్కుల సంఘాలు ఫిర్యాదు చేయడంతో ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు 2005లో ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించింది. దీన్ని క్రూరమైనదిగా, అనాగరికమైనదిగా అభివర్ణించింది. దాంతో ఈ విధానాలను మానుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం అప్పట్లో ప్రకటించింది.
కానీ దాన్ని ఇంకా అమలు చేస్తున్నట్టు తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. గాజాలో పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం మానవ కవచాలుగా ఉపయోగిస్తున్న మూడు ఫోటోలను ‘బ్రేకింగ్ ది సైలెన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ మీడియాకు విడుదల చేసింది. ఉత్తర గాజాలో విధ్వంసకర పరిస్థితుల్లో ఇద్దరు సైనికులు ఓ పౌరుడిని ముందుకు తీసుకువెళుతున్న భయానక దృశ్యం ఒక ఫొటోలో ఉంది. మరో దాంట్లో మానవ కవచాలుగా ఉపయోగించే పౌరుల కళ్లకు గంతలున్నాయి. మూడో ఫొటోలో ఒక సైనికుడు బంధించిన పౌరుడిని కాపలా కాస్తున్నాడు.
వెనుక నుంచి కాల్చారు..
గాజాలో ఐదుగురు పాలస్తీనా మాజీ ఖైదీలు కూడా దీన్ని ధ్రువీకరించారు. 20 ఏళ్ల మహ్మద్ సాద్‌ఇజ్రాయెల్ సైన్యం దాడుల తర్వాత ఉత్తర గాజా వీడి ఖాన్ యూనిస్ సమీపంలో తాత్కాలిక శిబిరంలో ఉంటున్నాడు. తనకు, తమ్ముళ్లకు ఆహారం కోసం బయటికొస్తే ఇజ్రాయెల్ సైన్యం పట్టుకుంది. ‘‘మమ్మల్ని జీపులో తీసుకెళ్లారు. 47 రోజుల పాటు రఫా సైనిక శిబిరంలో నిర్బంధించారు. నిఘా చర్యలకు ఉపయోగించారు. మాకు మిలటరీ యూనిఫాం ఇచ్చారు. తలపై కెమెరా పెట్టారు. మెటల్ కట్టర్ ఇచ్చారు. సొరంగాల్లో వెదికేటప్పుడు సాయానికి మమ్మల్ని వాడుకున్నారు. మెట్ల కింద వీడియోలు తీయాలని, ఏదైనా దొరికితే బయటికి తేవాలని చెప్పేవారు.
ఒక మిషన్ కోసం పౌర దుస్తుల్లో తీసుకెళ్లారు. సైన్యం వదిలివెళ్లిన ట్యాంకును వీడియో తీయమన్నారు. నేను భయపడితే వీపుపై తుపాకీతో కొట్టారు. నేను ట్యాంకు వద్దకు వెళ్లగానే వెనుక నుంచి కాల్చారు. అదృష్టవశాత్తూ బయటపడ్డా’’ అంటూ వీపుపై తూటా గాయాలు చూపించాడు. 17 ఏళ్ల మొహమ్మద్ షబ్బీర్‌దీ ఇదే కథ. ఖాన్ యూనిస్‌లోని అతని ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. తండ్రి, సోదరిని చంపి అతన్ని బందీగా పట్టుకుంది. ‘‘నన్ను మానవ కవచంగా వాడుకున్నారు. కూల్చేసిన ఇళ్లలోకి, ప్రమాదకరమైన, మందుపాతరలున్న ప్రదేశాల్లోకి తీసుకెళ్లారు’’ అని షబ్బీర్ చెప్పుకొచ్చాడు.
ఏమిటీ మస్కిటో ప్రోటోకాల్
శత్రువులున్న చోటికి కుక్కను పంపడం, ట్యాంక్ షెల్ లేదా సాయుధ బుల్డోజర్‌తో దాడి వంటివి చేస్తారు. కానీ ఈ పద్ధతిలో తాము దాడి చేయాలనుకున్న చోటికి బందీలనో, శత్రు దేశ పౌరులనో ముందుగా పంపిస్తారు. అక్కడ పేలుడు పదార్థాలున్నా, శత్రువులు పొంచి కాల్పులు, పేలుళ్లకు పాల్పడ్డా ముందుగా వెళ్లినవారు చనిపోతారు. ఆ ముప్పు తొలగాక సైన్యం ప్రవేశిస్తుంది. సాధారణంగా ఉగ్రవాద సంస్థలు ఉపయోగించే ఈ పద్ధతిని ఇజ్రాయెల్ సైన్యం అమలు చేస్తోంది.
డాక్టర్‌నూ వదల్లేదు...
59 ఏళ్ల డాక్టర్ యాహ్యా ఖలీల్ అల్ కయాలీ ఓ వైద్యుడు. గాజాలో అతి పెద్ద వైద్య సముదాయమైన అల్ షిఫా ఆస్పత్రిలో వేలాది మంది శరణార్థులతో కలిసి ఉండేవారు. గత మార్చిలో ఇజ్రాయెల్ సైన్యం రెండు వారాల దాడిలో ఆసుపత్రి ధ్వంసమైంది. అప్పుడే కయాలీని సైన్యం పట్టుకుంది. ‘‘నాతో అపార్ట్‌మెంట్ భవనాలను, ప్రతి గదినీ తనిఖీ చేయించారు. అదృష్టవశాత్తూ వేటిలోనూ హమాస్ ఫైటర్లు లేరు. అలా 80 అపార్ట్‌మెంట్లను తనిఖీ చేశాక నన్ను వదిలేశారు’’ అని గుర్తు చేసుకున్నారు.
మన ప్రాణాలు ముఖ్యమన్నారు..
ఉత్తర గాజాలో తమ యూనిట్ ఓ అనుమానాస్పద భవనంలోకి ప్రవేశించే ముందు ఇద్దరు పాలస్తీనా ఖైదీలను ముందుగా పంపినట్టు ఇజ్రాయెల్ సైనికుడే వెల్లడించాడు. ‘‘వారిలో ఒకరు 16 ఏళ్ల బాలుడు. మరొకరు 20 ఏళ్ల యువకుడు. ఇదేంటని ప్రశ్నిస్తే మన సైనికుల కంటే పాలస్తీనా యువకులు చనిపోవడం మంచిది కదా అని మా సీనియర్ కమాండర్ బదులిచ్చారు. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. సుదీర్ఘ కాలం యుద్ధంలో పాల్గొని అలసిపోయాక పెద్దగా ఆలోచించడానికి కుదరదు. అయినా ఈ పద్ధతిని అనుసరించడానికి కొందరు సైనికులం నిరాకరించాం. ‘అంతర్జాతీయ చట్టాల గురించి ఆలోచించొద్దు. ముందు మన ప్రాణాలు ముఖ్యం’ అని కమాండర్ చెప్పారు’’ అన్నాడు. చివరికి ఇద్దరు పాలస్తీనియన్లను వదిలేశారని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment