human shield
-
గాజన్లే కవచాలు
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) అత్యంత అమానుషంగా వ్యవహరిస్తోంది. యుద్ధ సమయంలో ఇళ్లు, సొరంగాల్లోకి ప్రవేశించడానికి పాలస్తీనా పౌరులను మానవ కవచాలుగా వాడుకుంటోంది. ‘మస్కిటో ప్రోటోకాల్’గా పిలిచే ఈ పద్ధతిని గాజాలోని ఇజ్రాయెల్ యూనిట్లన్నీ అవలంబిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైనికుడే ఈ మేరకు వెల్లడించడం విశేషం. ఐదుగురు పాలస్తీనా మాజీ ఖైదీలు దీన్ని ధ్రువీకరించారు. ఉత్తర గాజా, గాజా సిటీ, ఖాన్ యూనిస్, రఫా... ఇలా గాజా అంతటా ఇదే పద్ధతిని అమలు చేస్తోంది ఇజ్రాయెల్ సైన్యం. – జెరూసలెంనిషేధం బేఖాతరుసైనిక కార్యకలాపాలలో పౌరులను ఇలా అనైతికంగా, అనుమాషంగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిషిద్ధం. వెస్ట్ బ్యాంక్‌లో అనుమానిత మిలిటెంట్ల తలుపులను తట్టడానికి ఇజ్రాయల్ సైన్యం పాలస్తీనా పౌరులను ఉపయోగిస్తోందని హక్కుల సంఘాలు ఫిర్యాదు చేయడంతో ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు 2005లో ఈ పద్ధతిని పూర్తిగా నిషేధించింది. దీన్ని క్రూరమైనదిగా, అనాగరికమైనదిగా అభివర్ణించింది. దాంతో ఈ విధానాలను మానుకున్నట్టు ఇజ్రాయెల్ సైన్యం అప్పట్లో ప్రకటించింది. కానీ దాన్ని ఇంకా అమలు చేస్తున్నట్టు తాజా ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. గాజాలో పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ సైన్యం మానవ కవచాలుగా ఉపయోగిస్తున్న మూడు ఫోటోలను ‘బ్రేకింగ్ ది సైలెన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ మీడియాకు విడుదల చేసింది. ఉత్తర గాజాలో విధ్వంసకర పరిస్థితుల్లో ఇద్దరు సైనికులు ఓ పౌరుడిని ముందుకు తీసుకువెళుతున్న భయానక దృశ్యం ఒక ఫొటోలో ఉంది. మరో దాంట్లో మానవ కవచాలుగా ఉపయోగించే పౌరుల కళ్లకు గంతలున్నాయి. మూడో ఫొటోలో ఒక సైనికుడు బంధించిన పౌరుడిని కాపలా కాస్తున్నాడు.వెనుక నుంచి కాల్చారు..గాజాలో ఐదుగురు పాలస్తీనా మాజీ ఖైదీలు కూడా దీన్ని ధ్రువీకరించారు. 20 ఏళ్ల మహ్మద్ సాద్ఇజ్రాయెల్ సైన్యం దాడుల తర్వాత ఉత్తర గాజా వీడి ఖాన్ యూనిస్ సమీపంలో తాత్కాలిక శిబిరంలో ఉంటున్నాడు. తనకు, తమ్ముళ్లకు ఆహారం కోసం బయటికొస్తే ఇజ్రాయెల్ సైన్యం పట్టుకుంది. ‘‘మమ్మల్ని జీపులో తీసుకెళ్లారు. 47 రోజుల పాటు రఫా సైనిక శిబిరంలో నిర్బంధించారు. నిఘా చర్యలకు ఉపయోగించారు. మాకు మిలటరీ యూనిఫాం ఇచ్చారు. తలపై కెమెరా పెట్టారు. మెటల్ కట్టర్ ఇచ్చారు. సొరంగాల్లో వెదికేటప్పుడు సాయానికి మమ్మల్ని వాడుకున్నారు. మెట్ల కింద వీడియోలు తీయాలని, ఏదైనా దొరికితే బయటికి తేవాలని చెప్పేవారు. ఒక మిషన్ కోసం పౌర దుస్తుల్లో తీసుకెళ్లారు. సైన్యం వదిలివెళ్లిన ట్యాంకును వీడియో తీయమన్నారు. నేను భయపడితే వీపుపై తుపాకీతో కొట్టారు. నేను ట్యాంకు వద్దకు వెళ్లగానే వెనుక నుంచి కాల్చారు. అదృష్టవశాత్తూ బయటపడ్డా’’ అంటూ వీపుపై తూటా గాయాలు చూపించాడు. 17 ఏళ్ల మొహమ్మద్ షబ్బీర్దీ ఇదే కథ. ఖాన్ యూనిస్‌లోని అతని ఇంటిపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది. తండ్రి, సోదరిని చంపి అతన్ని బందీగా పట్టుకుంది. ‘‘నన్ను మానవ కవచంగా వాడుకున్నారు. కూల్చేసిన ఇళ్లలోకి, ప్రమాదకరమైన, మందుపాతరలున్న ప్రదేశాల్లోకి తీసుకెళ్లారు’’ అని షబ్బీర్ చెప్పుకొచ్చాడు.ఏమిటీ మస్కిటో ప్రోటోకాల్శత్రువులున్న చోటికి కుక్కను పంపడం, ట్యాంక్ షెల్ లేదా సాయుధ బుల్డోజర్తో దాడి వంటివి చేస్తారు. కానీ ఈ పద్ధతిలో తాము దాడి చేయాలనుకున్న చోటికి బందీలనో, శత్రు దేశ పౌరులనో ముందుగా పంపిస్తారు. అక్కడ పేలుడు పదార్థాలున్నా, శత్రువులు పొంచి కాల్పులు, పేలుళ్లకు పాల్పడ్డా ముందుగా వెళ్లినవారు చనిపోతారు. ఆ ముప్పు తొలగాక సైన్యం ప్రవేశిస్తుంది. సాధారణంగా ఉగ్రవాద సంస్థలు ఉపయోగించే ఈ పద్ధతిని ఇజ్రాయెల్ సైన్యం అమలు చేస్తోంది.డాక్టర్‌నూ వదల్లేదు...59 ఏళ్ల డాక్టర్ యాహ్యా ఖలీల్ అల్ కయాలీ ఓ వైద్యుడు. గాజాలో అతి పెద్ద వైద్య సముదాయమైన అల్ షిఫా ఆస్పత్రిలో వేలాది మంది శరణార్థులతో కలిసి ఉండేవారు. గత మార్చిలో ఇజ్రాయెల్ సైన్యం రెండు వారాల దాడిలో ఆసుపత్రి ధ్వంసమైంది. అప్పుడే కయాలీని సైన్యం పట్టుకుంది. ‘‘నాతో అపార్ట్మెంట్ భవనాలను, ప్రతి గదినీ తనిఖీ చేయించారు. అదృష్టవశాత్తూ వేటిలోనూ హమాస్ ఫైటర్లు లేరు. అలా 80 అపార్ట్మెంట్లను తనిఖీ చేశాక నన్ను వదిలేశారు’’ అని గుర్తు చేసుకున్నారు.మన ప్రాణాలు ముఖ్యమన్నారు.. ఉత్తర గాజాలో తమ యూనిట్ ఓ అనుమానాస్పద భవనంలోకి ప్రవేశించే ముందు ఇద్దరు పాలస్తీనా ఖైదీలను ముందుగా పంపినట్టు ఇజ్రాయెల్ సైనికుడే వెల్లడించాడు. ‘‘వారిలో ఒకరు 16 ఏళ్ల బాలుడు. మరొకరు 20 ఏళ్ల యువకుడు. ఇదేంటని ప్రశ్నిస్తే మన సైనికుల కంటే పాలస్తీనా యువకులు చనిపోవడం మంచిది కదా అని మా సీనియర్ కమాండర్ బదులిచ్చారు. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. సుదీర్ఘ కాలం యుద్ధంలో పాల్గొని అలసిపోయాక పెద్దగా ఆలోచించడానికి కుదరదు. అయినా ఈ పద్ధతిని అనుసరించడానికి కొందరు సైనికులం నిరాకరించాం. ‘అంతర్జాతీయ చట్టాల గురించి ఆలోచించొద్దు. ముందు మన ప్రాణాలు ముఖ్యం’ అని కమాండర్ చెప్పారు’’ అన్నాడు. చివరికి ఇద్దరు పాలస్తీనియన్లను వదిలేశారని చెప్పుకొచ్చాడు. -
బిగ్ బాస్‌కి నో చెప్పేశాడు
సాక్షి, ముంబై/శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో గతేడాది ఓ వీడియో సంచలనం సృష్టించింది. రాళ్ల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తిని కవచంగా మార్చుకున్న సైన్యం.. అల్లరిమూకపై ఎదురుదాడి చేసింది. బుద్గాం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయ, జాతీయ మీడియాల దృష్టిని ఆకర్షించింది. కాగా రాళ్లదాడికి పాల్పడే వ్యక్తిగా ఫరూక్ అహ్మద్ దార్ (29) సైన్యం ముద్రవేయడంతో ప్రభుత్వం అతనికి అండగా నిలువడం లేదు. మరోవైపు సైన్యానికి సహకరించాడంటూ గ్రామస్థులు కూడా సామాజికంగా బహిష్కరించారు. దీంతో జీవనోపాధి కరువై దార్ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో హిందీ బిగ్ బాస్ నిర్వాహకులు అతనికి పెద్ద మొత్తంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే అతను ఆ సాయాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ‘ఓ రోజు బిగ్ బాస్ నిర్మాత ఒకరు నాకు ఫోన్ చేశారు. రూ. 50 లక్షల చెక్కు ఇస్తామని, మీ కోసం టికెట్లు సిద్ధం చేశామని చెప్పారు. నేను వద్దని స్పష్టం చేశాను. అయినా ఫర్వాలేదు మీకోసం మేం సాయం చేసేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటామని ఆయన నాతో అన్నారు’ అని దార్ ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు వెల్లడించాడు. అయితే బిగ్‌బాస్ నిర్వాహకులు మానవతా కోణంలోనే అతనికి సాయం చేసేందుకు ముందుకొచ్చారని దార్ తరపు న్యాయవాది అహ్సన్ వుంటూ తెలిపారు. కాగా, బిగ్‌బాస్ నిర్వాహకులు మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. శ్రీనగర్ లోక్‌సభ ఉపఎన్నికల సందర్భంగా గత ఏడాది ఏప్రిల్ 9న ఎన్నికలను బహిష్కరించాలని వేర్పాటువాదులు పిలుపునిచ్చారు. అయితే వేర్పాటువాదుల హెచ్చరికలను లెక్కచేయకుండా దార్ తన ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి వెళ్లాడు. అదే సమయంలో అల్లరిమూక రాళ్లదాడికి పాల్పడింది. తమ బలం తక్కువగా ఉండటంతో వారి నుంచి తప్పించుకునేందుకు దార్‌ను ఓ జీప్ కు కట్టేసి మేజర్ లీతుల్ గొగోయ్ నేతృత్వంలోని సైన్య బృందం ప్రతిఘటించింది. ఆ ఘటన తర్వాతే దార్ జీవితం మలుపు తిరిగింది. ఎంబ్రాయిడరీ దుస్తుల నిపుణుడైన దార్‌కు.. కూలీ పని కూడా దొరకని పరిస్థితి నెలకొంది. చివరకు అహ్మద్ దార్‌కు రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని జమ్ము-కశ్మీరు మానవ హక్కుల కమిషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను మాత్రం ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో దార్ న్యాయపోరాటం కొనసాగుతోంది. -
ఏడాదిగా జీవచ్ఛవంలా బతుకుతున్నా
శ్రీనగర్ / న్యూఢిల్లీ: ఆర్మీ అధికారులు తనను మానవకవచంగా వాడుకున్న తర్వాత జీవితం నరకప్రాయమైందని కశ్మీరీ ఎంబ్రాయిడరీ కళాకారుడు ఫరూక్ అహ్మద్ దార్(28) ఆవేదన వ్యక్తం చేశాడు. శ్రీనగర్ ఎన్నికల్లో ఓటేయడంతో భారత ప్రభుత్వ ఏజెంట్‌గా ముద్రవేసిన సొంత గ్రామస్తులు తనను సామాజికంగా బహిష్కరించారని వాపోయాడు. ‘ నేను కనీసం నిద్రపోలేకపోతున్నాను. మందులు కూడా పనిచేయడం లేదు. నాకు ఎవ్వరూ పని ఇవ్వడం లేదు. ఆరోజు ఓటేయడానికి వెళ్లడమే నా తప్పా?’ అని దార్ కన్నీటి పర్యంతమయ్యాడు. తన తల్లి ఫైజాబేగం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోందనీ, ఆమె చికిత్సకు ఇంట్లో డబ్బులులేవని దార్ ఆవేదన వ్యక్తం చేశాడు. కనీసం దినసరి కూలీగా పనిచేసుకుందామన్నా ఎవ్వరూ పని ఇవ్వడం లేదని పేర్కొన్నాడు. గతేడాది ఏప్రిల్ 9న శ్రీనగర్ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బుద్గామ్ జిల్లాలో ఆర్మీ వాహనాలపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనాకారుల్ని అదుపుచేసేందుకు మేజర్ లీతుల్ గొగోయ్ దార్‌ను జీప్ బానెట్‌కు తాడుతో కట్టేసి 28 గ్రామాలకు తిప్పారు. రాళ్లు విసిరిన అల్లరిమూకలో దార్ ఒకడని ఆర్మీ వాదించగా, అతను రాళ్లు విసరలేదని కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు తేల్చాయి. -
జీపు బానెట్‌కు కట్టేసిన ఆర్మీ ఆఫీసర్‌కు సత్కారం
కశ్మీర్: కశ్మీర్లో వేర్పాటువాదుల రాళ్ల దాడి నుంచి బయటపడే క్రమంలో రాళ్ల దాడికి పాల్పడుతున్న ఓ వ్యక్తిని జీపు బానట్‌కు కట్టి ఆందోళనలు నిలువరించే ప్రయత్నం చేసిన మేజర్ లీతల్ గోగోయ్ అనే సైనికాధికారికి భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అవార్డుతో సత్కరించారు. మిలిటరీ వర్గాల సమచారం ప్రకారం ఆయనకు బిపిన్ రావత్ అత్యున్నత ప్రోత్సాహక అవార్డును అందించినట్లు తెలిసింది. చొరబాటుదారులను నిలువరించేందుకు, ఆందోళనలు సర్దుమణిగేలా చేసే ప్రయత్నం చేసినందుకు ఆయనకు ఈ అవార్డును ఇచ్చినట్లు మిలిటరీ వర్గాలు తెలిపాయి. -
‘ఇక నేను జీవితంలో ఓటేయను’
శ్రీనగర్ పార్లమెంట్ సీటుకు ఆదివారం నాడు జరిగిన ఎన్నికల్లో అతి తక్కువ మంది, అంటే 7.1 శాతం మంది ఓటేసిన విషయం తెల్సిందే. చిల్ గ్రామంలో బతుకుతెరువు కోసం శాలువాలు తయారుచేసి అమ్మే 26 ఏళ్ల యువకుడు ఫరూక్ అహ్మద్ దర్ ఆ రోజు ఉదయమే ఓటేయడానికి బయల్దేరి వెళ్లారు. రాత్రికి విరిగిన ఎడమ చేయితో ఇంటికి చేరుకున్నారు. ఎందుకలా జరిగిందో పలు పత్రికల్లో వచ్చిన ఆయన ఫొటోను చూసినా, సోషల్ మీడియాలో వచ్చిన వీడియోను చూస్తే అర్థం అవుతుంది. భారత సైన్యానికి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ జవాన్లు అహ్మద్‌ను జీపు ముందు రక్షణ కవచంలా కట్టేసి ఊరారా తిరగడం వల్లనే ఆయన ఒళ్లు ఊనం అయింది. ఎడమ చేయి విరిగింది. ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం అహ్మద్, ఆయన సోదరుడు వేర్వేరు టూ వీలర్లపై పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయడానికి సమీపంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. ముందుగా ఓటేసిన అహ్మద్ ముందుగా ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో 15 మంది జవాన్లు తారసపడ్డారు. ఎక్కడి నుంచి వస్తున్నావంటూ అహ్మద్‌ను ప్రశ్నించారు. ఓటేసి వస్తున్నానని చెప్పినా జవాన్లు వినిపించుకోకుండా రోడ్ల మీద రాళ్లు విసురుతావు కదా అంటూ చితకబాదారు. ఆ తర్వాత జీపు ముందు కట్టేసి 15, 20 ఊర్లు తిప్పారు. అహ్మద్ వెనకాలే బయల్దేరిన ఆయన సోదరుడు సైనిక జీపును వెంబడించి ఎంత బతిలాడినా వదిలిపెట్టలేదు. గొడవ చేస్తే ఇద్దరినీ కట్టేస్తామని వారు బెదిరించారు. దాంతో ఏం మాట్లాడకుండా అహ్మద్ సోదరుడు జీపును ఫాలో అవుతూ వెళ్లాడు. తాను జీవితంలో ఎన్నడూ రాళ్లు రువ్వలేదని, తాను మర్యాదగా శాలువాల వ్యాపారం చేసుకుని బతుకుతున్నానని అహ్మద్ చెప్పారు. కానీ రాళ్లు రువ్వేవారి నుంచి రక్షించుకునేందుకు సైనికులే తనను రక్షణ కవచంలా వాడుకున్నారని ఆరోపించారు. తనను అలా దాదాపు 20, 30 కిలోమీటర్లు తిప్పారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులను మీడియా సంప్రదించగా, అహ్మద్‌ను రక్షణ కవచంలా వాడుకున్న మాట వాస్తవమేనని పేరు చెప్పేందుకు ఇష్టపడని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఈ విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందితే తప్పక కేసును పరిశీలిస్తామని వారు చెప్పారు. అహ్మద్ గానీ ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంతవరకు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. చేయాలా, వద్దా అన్న సందిగ్ధంలో వారు ఉన్నారు. ఫిర్యాదు చేస్తే సైనికులు వేధిస్తారని, కిడ్నాప్ చేస్తారని వారు భయపడుతున్నారు. ఇప్పుడు తన రెండు చేతులు సరిగ్గా పనిచేయడం లేదని, తాను ఇక తన వృత్తిని ఎలా కొనసాగించాలో అర్థం కావడం లేదని అహ్మద్ తెలిపారు. ఈ సంఘటనతో తనకు ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశ్వాసం పూర్తిగా పోయిందని, ఇక భవిష్యత్తులో తానెన్నడూ ఓటేయనని చెప్పారు.