‘ఇక నేను జీవితంలో ఓటేయను’ | will never vote again in my life, says kashmiri man | Sakshi
Sakshi News home page

‘ఇక నేను జీవితంలో ఓటేయను’

Published Mon, Apr 17 2017 4:55 PM | Last Updated on Tue, Sep 5 2017 9:00 AM

will never vote again in my life, says kashmiri man

శ్రీనగర్‌ పార్లమెంట్‌ సీటుకు ఆదివారం నాడు జరిగిన ఎన్నికల్లో అతి తక్కువ మంది, అంటే 7.1 శాతం మంది ఓటేసిన విషయం తెల్సిందే.  చిల్‌ గ్రామంలో బతుకుతెరువు కోసం శాలువాలు తయారుచేసి అమ్మే 26 ఏళ్ల యువకుడు ఫరూక్‌ అహ్మద్‌ దర్‌ ఆ రోజు ఉదయమే ఓటేయడానికి బయల్దేరి వెళ్లారు. రాత్రికి విరిగిన ఎడమ చేయితో ఇంటికి చేరుకున్నారు. ఎందుకలా జరిగిందో పలు పత్రికల్లో వచ్చిన ఆయన ఫొటోను చూసినా, సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియోను చూస్తే అర్థం అవుతుంది.

భారత సైన్యానికి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్‌ జవాన్లు అహ్మద్‌ను జీపు ముందు రక్షణ కవచంలా కట్టేసి ఊరారా తిరగడం వల్లనే ఆయన ఒళ్లు ఊనం అయింది. ఎడమ చేయి విరిగింది. ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం అహ్మద్, ఆయన సోదరుడు వేర్వేరు టూ వీలర్లపై పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటేయడానికి సమీపంలోని పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. ముందుగా ఓటేసిన అహ్మద్‌ ముందుగా ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యంలో 15 మంది జవాన్లు తారసపడ్డారు. ఎక్కడి నుంచి వస్తున్నావంటూ అహ్మద్‌ను ప్రశ్నించారు. ఓటేసి వస్తున్నానని చెప్పినా జవాన్లు వినిపించుకోకుండా రోడ్ల మీద రాళ్లు విసురుతావు కదా అంటూ చితకబాదారు. ఆ తర్వాత జీపు ముందు కట్టేసి 15, 20 ఊర్లు తిప్పారు. అహ్మద్‌ వెనకాలే బయల్దేరిన ఆయన సోదరుడు సైనిక జీపును వెంబడించి ఎంత బతిలాడినా వదిలిపెట్టలేదు. గొడవ చేస్తే ఇద్దరినీ కట్టేస్తామని వారు బెదిరించారు. దాంతో ఏం మాట్లాడకుండా అహ్మద్‌ సోదరుడు జీపును ఫాలో అవుతూ వెళ్లాడు. తాను జీవితంలో ఎన్నడూ రాళ్లు రువ్వలేదని, తాను మర్యాదగా శాలువాల వ్యాపారం చేసుకుని బతుకుతున్నానని అహ్మద్‌ చెప్పారు. కానీ రాళ్లు రువ్వేవారి నుంచి రక్షించుకునేందుకు సైనికులే తనను రక్షణ కవచంలా వాడుకున్నారని ఆరోపించారు.

తనను అలా దాదాపు 20, 30 కిలోమీటర్లు తిప్పారని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులను మీడియా సంప్రదించగా, అహ్మద్‌ను రక్షణ కవచంలా వాడుకున్న మాట వాస్తవమేనని పేరు చెప్పేందుకు ఇష్టపడని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఈ విషయంలో తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందితే తప్పక కేసును పరిశీలిస్తామని వారు చెప్పారు. అహ్మద్‌ గానీ ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇంతవరకు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. చేయాలా, వద్దా అన్న సందిగ్ధంలో వారు ఉన్నారు. ఫిర్యాదు చేస్తే సైనికులు వేధిస్తారని, కిడ్నాప్‌ చేస్తారని వారు భయపడుతున్నారు.

ఇప్పుడు తన రెండు చేతులు సరిగ్గా పనిచేయడం లేదని, తాను ఇక తన వృత్తిని ఎలా కొనసాగించాలో అర్థం కావడం లేదని అహ్మద్‌ తెలిపారు. ఈ సంఘటనతో తనకు ప్రజాస్వామ్య  వ్యవస్థ పట్ల విశ్వాసం పూర్తిగా పోయిందని, ఇక భవిష్యత్తులో తానెన్నడూ ఓటేయనని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement