టెల్‌అవీవ్: గాజాలోకి ఇజ్రాయెల్ సైన్యాలు మరింతగా చొచ్చుకుపోతున్నాయి. శనివారం మరిన్ని ప్రాంతాలను హమాస్ ఉగ్రవాదుల నుంచి విముక్తం చేసినట్టు సైన్యం ప్రకటించింది. గాజాను పూర్తిగా చుట్టుముట్టినట్టు పేర్కొంది. ఈ క్రమంలో గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి సమీపంలో జరిగిన బాంబు, క్షిపణి దాడుల్లో కనీసం 15 మందికి పైగా మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు.
ఇది తమ పనేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఆంబులెన్సులో పారిపోతున్న ఉగ్రవాదులను ఏరేయడానికి దాడి చేయాల్సి వచ్చిందని పేర్కొంది. దాంతోపాటు జబాలియా శరణార్థి శిబిరం సమీపంలో ఓ స్కూలుపై జరిగిన క్షిపణి దాడిలో మరో 15 మంది దాకా మరణించారు. దాడులు ఉత్తర గాజాలోని ఐరాస శరణార్థి శిబిరాలకు కూడా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది.
ఇజ్రాయెల్ హెచ్చరిక మేరకు భారీ సంఖ్యలో దక్షిణాదికి వలస వెళ్లిన వారు పోగా ఇంకా 3 లక్షల మంది దాకా ఉత్తర గాజాలోనే చిక్కుబడ్డారు. వీరంతా ఐరాస శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పోరులో ఇప్పటిదాకా మరణించిన పాలస్తీనావాసుల సంఖ్య 9,500 దాటినట్టు గాజా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు, హమాస్ చీఫ్ నివాసంపై కూడా క్షిపణి దాడి జరిగినట్టు వార్తలొస్తున్నాయి.
సాయం... తక్షణావసరం
గాజాలోని లక్షలాది మంది పాలస్తీనియన్లకు అత్యవసరాలు కూడా అందని దుస్థితి అలాగే కొనసాగుతోంది. అతి త్వరలో లక్షలాది మంది ఆకలి చావుల బారిన పడే ప్రమాదముందని అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమైన ఐరాస తదితర అంతర్జాతీయ సంస్థల సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాజావాసులకు మానవీయ సాయం అందేలా చూడాలని అమెరికా, యూరప్‌తో సహా అంతర్జాతీయ సమాజమంతా ముక్త కంఠంతో ఇజ్రాయెల్‌కు విజ్ఞప్తి చేస్తున్నాయి.
పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే స్పందించాలని కోరుతున్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం అందుకు ససేమిరా అంటోంది. కాకపోతే యుద్ధక్షేత్రంలో చిక్కుబడ్డ పౌరులు దక్షిణాదికి పారిపోయేందుకు వీలుగా శనివారం మూడు గంటలపాటు దాడుల తీవ్రతను తగ్గించింది. ఈ నేపథ్యంలో పాలస్తీనావాసులకు అత్యవసర సాయం అందేలా చూసే మార్గాంతరాలపై చర్చించేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అరబ్ దేశాల్లో పర్యటిస్తున్నారు.
రోజుకు ఆరు నుంచి 12 గంటల పాటు కాల్పుల విరామ ప్రకటించి మానవీయ సాయం అందేందుకు, క్షతగాత్రులను తరలించేందుకు వీలు కలి్పంచాలని ఈజిప్ట్, ఖతర్ కోరుతున్నాయి. అలాగే బందీల విడుదలకు బదులుగా ఇజ్రాయెల్ చెరలో ఉన్న పాలస్తీనియన్లలో వృద్ధులు, మహిళలను వదిలేయాలని ప్రతిపాదిస్తున్నాయి. వీటిపై ఇజ్రాయెల్ ఇప్పటిదాకా స్పందించలేదు.
రోజుకు రెండే బ్రెడ్డు ముక్కలు
గాజావాసులు సగటున రోజుకు కేవలం రెండు బ్రెడ్డు ముక్కలు తిని ప్రాణాలు నిలబెట్టుకుంటున్నట్టు అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమైన ఐరాస సంస్థల డైరెక్టర్ థామస్ వైట్ వాపోయారు. అవి కూడా ఐరాస సేకరించిన పిండి నిల్వల నుంచే వారికి అందుతున్నట్టు చెప్పారు.
గాజాలో ఒక్క ప్రాంతం కూడా సురక్షితమని చెప్పడానికి వీల్లేకుండా ఉందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆవేదన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ మానవీయ చట్టాలను గౌరవిస్తూ పాలస్తీనావాసులకు సాయమందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
కానీ మానవీయ సాయం నిమిత్తం దాడులకు కాస్త విరామమివ్వాలన్న అంతర్జాతీయ విజ్ఞప్తులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తోసిపుచ్చారు. తమ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టేదాకా దాడులను తగ్గించేది లేదన్నారు. తాత్కాలిక కాల్పుల విరమణ కూడా సమ్మతం కాదన్నారు. మరోవైపు ద్వంద్వ పౌరసత్వాలున్న 380 మందికి పైగా పాలస్తీనియన్లు శుక్రవారం ఈజిప్టు చేరుకున్నారు. తామిక ఇజ్రాయెల్‌పై పూర్తిస్థాయిలో యుద్ధానికి దిగినట్టేనని హెజ్బొల్లా నేత సయ్యద్‌హసన్ నస్రల్లా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment