బుధవారం గాజాలోని అల్–షిఫా ఆస్పత్రిలోకి దూసుకొస్తున్న సాయుధ ఇజ్రాయెల్ సైనికులు
ఖాన్ యూనిస్: గాజాలో నెల రోజులకుపైగా హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం సాగిస్తున్న యుద్ధం కీలక దశకు చేరుకుంది. గాజాలో అతిపెద్దదైన అల్–షిఫా ఆసుపత్రిలోకి బుధవారం ఉదయం ఇజ్రాయెల్ సేనలు ప్రవేశించాయి. హమాస్ కమాండ్ సెంటర్ ఇక్కడే భూగర్భంలో ఉందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఆసుపత్రి కింది భాగంలో సొరంగాల్లో హమాస్ నాయకులు మాటు వేశారని చెబుతోంది. మిలిటెంట్లపై కచి్చతమైన, లక్షిత ఆపరేషన్ ప్రారంభించామని ప్రకటించింది.
అల్–షిఫా హాస్పిటల్ ఇప్పుడు రణభూమిగా మారిపోయింది. ఇజ్రాయెల్ సైనికులు ప్రతి గదినీ అణువణువూ గాలిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా ప్రశి్నస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. అన్ని డిపార్టుమెంట్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు సైతం అల్–షిఫా ఆసుపత్రి ప్రాంగణంలో మోహరించాయి.
అల్–షిఫా హాస్పిటల్‌లో ఇజ్రాయెల్ సైనికులు దారుణంగా ప్రవర్తిస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు, ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. పురుషులను నగ్నంగా మార్చి, కళ్లకు గంతలు కట్టి నిర్బంధిస్తున్నారని తెలిపారు. తరచుగా తుపాకీ మోతలు వినిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ వార్డుల్లో 180కి పైగా మృతదేహాలు పడి ఉన్నాయని, బయటకు తరలించేవారు లేక కుళ్లిపోతున్నాయని పేర్కొన్నారు. ఇక్కడ పరిస్థితి భయానకంగా ఉందన్నారు.
16 నుంచి 40 ఏళ్ల లోపు పురుషులంతా ఆసుపత్రి గదుల నుంచి బయటకు వెళ్లాలని, బయట అందరూ ఒకేచోటుకు చేరుకోవాలని లౌడ్‌స్పీకర్‌లో అరబిక్ భాషలో ఇజ్రాయెల్ సైనికులు హెచ్చరికలు జారీ చేశారని ఓ ప్రత్యక్ష సాక్షి చెప్పారు. పురుషులను బట్టలు విప్పించి ప్రశి్నస్తున్నారని పేర్కొన్నారు. 200 మందిని దూరంగా తీసుకెళ్లారని తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని మొత్తం ఇజ్రాయెల్ సైనికులు అదుపులోకి తీసుకున్నారని, ఇతర భవనాలతో కాంటాక్ట్ లేకుండాపోయిందని ప్రధాన భవనంలోని డాక్టర్లు చెప్పారు.
ఇజ్రాయెల్ వాదనకు అమెరికా మద్దతు
అల్–షిఫా హాస్పిటల్ కింద సొరంగాల్లో హమాస్ కమాండ్ సెంటర్ ఉందన్న ఇజ్రాయెల్ వాదనకు అమెరికా మద్దతు పలికింది. కమాండ్ సెంటర్‌ను తమ నిఘా వర్గాలు గుర్తించాయని వెల్లడించింది. అయితే, ఇజ్రాయెల్, అమెరికా ప్రకటనలను హమాస్ తీవ్రంగా ఖండించింది.
ఐరాస సెక్రెటరీ జనరల్ ఆందోళన
అల్–షిపా ఆసుపత్రిలో ఇజ్రాయెల్ సేనల తనిఖీలను ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఖండించారు. ఇజ్రాయెల్ చర్య ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు బుధవారం కూడా కొనసాగాయి. ఈ దాడుల్లో కనీసం 14 మంది మరణించినట్లు తెలిసింది.
అల్–షిఫా ఎందుకంత ముఖ్యం?
అల్–షిఫా అంటే స్వస్థత కేంద్రం అని అర్థం. గాజాలోనే అతిపెద్దదైన ఈ ఆసుప్రతిని 1946లో అప్పటి బ్రిటిష్ పాలనలో విశాలమైన ప్రాంగణంలో నిర్మించారు. దీన్ని గాజా గుండెచప్పుడు, ఆరోగ్య ప్రదాయినిగా పరిగణిస్తుంటారు. వైద్య సేవల విషయంలో ఇదొ వెన్నుముక లాంటింది. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణలు తలెత్తినప్పుడల్లా అల్–షిఫా హాస్పిటల్‌పై దాడులు జరగడం పరిపాటిగా మారింది. 2008–2009లోనూ ఒక్కడ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. 2014లో జరిగిన ఇజ్రాయెల్–హమాస్ యుద్ధ సమయంలో అల్–షిఫా హాస్పిటల్‌లో 9 రోజులపాటు వైద్య సేవలు నిలిచిపోయాయి. హమాస్ మిలిటెంట్లు ఈ ఆసుపత్రిని ప్రధాన స్థావరంగా మార్చుకున్నారని ఇజ్రాయెల్ గత కొన్ని దశాబ్దాలుగా ఆరోపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment