'పొరపాటుగా ఆస్పత్రిపై బాంబు దాడి చేశాం'
వాషింగ్టన్: ఆఫ్ఘానిస్థాన్‌లో ఆమెరికా వైమానిక దళాలు ఓ ఆస్పత్రిపై దాడి చేయడంపై తీవ్ర విమర్శలు రావడంతో అమెరికా తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసింది. తమ దళాలు పొరపాటుగా ఆస్పత్రిపై దాడి చేశాయని ఆఫ్ఘాన్‌లో అమెరికా దళాల కమాండర్ జాన్ క్యాంప్‌బెల్ వివరణ ఇచ్చారు.
శనివారం కుండజ్లోని ఓ ఆస్పత్రిపై జరిగిన బాంబు దాడిలో 22 మంది పౌరులు చనిపోయారు. ఈ ఘటనపై ఆఫ్ఘాన్ లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. కాగా వైద్య శిబిరాలను తాము ఎప్పుడూ లక్ష్యంగా చేసుకోలేదని క్యాంప్‌బెల్ చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయనున్నట్టు తెలిపారు. కుండజ్లో తాలిబాన్ ఉగ్రవాదులపై ఆపరేషన్‌లో భాగంగా ఆఫ్ఘాన్ దళాల విజ్ఞప్తి మేరకు తమ వైమానిక దళాలు మద్దతుగా దాడులు చేశాయని క్యాంప్‌బెల్ చెప్పారు.