నడుము శస్త్రచికిత్స!
డాక్టర్ల వద్దకు వచ్చే ఫిర్యాదుల్లో అత్యధికం నడుము నొప్పి అనే సమస్యతోనే వస్తుంటాయి. బహుశా మన సమాజంలో చాలామంది ఈ నడుమునొప్పితో బాధపడుతుండటం... దాంతో చాలా పనిగంటలు వృథా అయిపోవడంతో నడుము నొప్పి మన ఉత్పాదకతపైనా ప్రభావం చూపుతోంది. నడుము నొప్పికి చాలా అంశాలు కారణమవుతాయి. అయితే వాటిన్నింటిలోకెల్లా వయసు పెరుగుతున్న కొద్దీ అరుగుదల కారణంగా వెన్నుపూసలు అరగడంతో ఒక ప్రధాన సమస్య కాగా, వెన్నెముకల మధ్యన కుషన్‌లా ఉండే డిస్క్ (ఇంటర్ వర్టిబ్రియల్ డిస్క్) ఒత్తిడికి గురికావడం మరో సాధారణమైన అంశం. చాలా మంది పేషెంట్లు ఫిజియోథెరపీ ద్వారా నడుము నొప్పిని తగ్గించుకోడానికి ప్రయత్నిస్తారు. అయితే నొప్పి నివారణ మందులు వాడటం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, వెన్ను విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించడం కూడా ఈ సమస్యనుంచి ఉపశమనం కలిగిస్తాయి. సాధారణంగా వచ్చే నడుము నొప్పుల్లో దాదాపు 95 శాతం సంప్రదాయ చికిత్సలైన ఫిజియోథెరపీ వ్యాయామాలు, ఉపశమనంగా వాడే పూతమందులు రాయడం వంటి వాటితో తగ్గిపోతాయి. అన్ని రకాల నడుము నొప్పులు సమస్యాత్మకం కాదు గానీ వీటిలో దాదాపు 5 శాతం కేసులు చాలా తీవ్రంగా పరిణమిస్తాయి.
నరాలు అన్నీ మెదడు నుంచి మొదలై వెన్నుపాము ద్వారా అన్ని వెన్నుపూసల మధ్య ఖాళీ ప్రదేశాల నుంచి బయటకు వచ్చి మొండెం, చేతులు మొదలుకొని కాళ్ల వేళ్ల వరకు వ్యాపించి ఉంటాయన్న విషయం తెలిసిందే. ఏదైనా కారణం చేతగానీ, అరుదుగల వల్ల గానీ, వెన్నుపూసకూ, వెన్నుపూసకూ మధ్య ఉండే కుషన్ వంటి భాగమైన డిస్క్ జరగడం వల్ల గానీ నడుము ప్రాంతంలో ఏదైనా నరం మీద ఒత్తిడి పడటంతో సాధారణంగా నడుము నొప్పి వస్తుంది. కొన్ని సందర్భాల్లో నడుము భాగంలో డిస్క్ జారడం లేదా ఏదైనా ప్రమాదం వల్ల డిస్క్ నొక్కుకుపోవడంతో ఒక్కోసారి నడుము నొప్పి రావచ్చు. ఇంకొన్నిసార్లు ఆ ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్, ట్యూమర్లు, నడుములో నిర్మాణపరమైన (అనటామికల్) సమస్యలు, వెన్నెముక వంకరగా ఉండటం (స్కోలియోసిస్), నడుము వద్ద ఉండే వెన్ను ఎముకలు విరగడం (ఫ్రాక్చర్స్), కణుతులు, గడ్డలు, ఇతర ట్యూమర్లు రావడం వంటి సందర్భాల్లో తీవ్రంగా నొప్పి రావచ్చు.
శస్త్రచికిత్స అవసరమైన సందర్భాలు..
ప్రమాదాల్లో వెన్నుపూసలు విరగడం లేదా డిస్క్ పక్కకు జరిగిపోవడం, వెన్నుపూసల అరుగుదలతో వెన్నుపాము నుంచి కిందివైపునకు వెళ్లే నరాలపై ఒత్తిడి పడి మల, మూత్ర విసర్జనలపై నియంత్రణ కోల్పోవడం, వెన్నుపూసల్లో ఎముక పెరిగి అది వెన్నుపాముపై తీవ్రమైన ఒత్తిడి కలిగించడం, కాళ్లు బలహీనంగా కావడం, కాళ్ల చివర్లలో తిమ్మిరులు వచ్చి ఆ ప్రాంతం స్పర్శ కోల్పోవడం... వంటి కొన్ని సందర్భాల్లో ఇతరత్రా సంప్రదాయ ఉపశమన చికిత్సలతో ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు శస్త్రచికిత్స ఒక్కటే మార్గమవుతుంది. శస్త్రచికిత్స ప్రక్రియ దెబ్బతిన్న వెన్నెముక భాగాలను సరిచేయడమో లేదా అవసరమైన సందర్భాల్లో అక్కడ రాడ్స్, ఫ్రేమ్స్ వంటి కొన్ని పరికరాలను (ఫిక్షేషన్స్) అమర్చడం ద్వారా ద్వారా నొప్పికి కారణమైన అంశాలను తొలగించడం జరుగుతుంది. ఇంకా చాలా అనుభవించాల్సిన జీవితం ముందున్న చిన్న వయసు రోగుల్లో నడుము భాగంలోని వెన్ను ప్రాంతంలో నొప్పి వచ్చి, ఇతరత్రా సంప్రదాయ ఉపశమన చికిత్సలతో తగ్గనప్పుడు శస్త్రచికిత్స చేస్తారు. అయితే సంప్రదాయ ఉపశమన చికిత్సలు ఏడాది పాటు తీసకున్న తర్వాత కూడా నొప్పి తగ్గకుండా ఉన్నప్పుడు డాక్టర్లు శస్త్రచికిత్స అనే ప్రత్యామ్నాయానికి వెళ్తారు.
ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఇప్పుడు అత్యంత తక్కువ గాటుతో శస్త్రచికిత్స చేసే సౌకర్యాలు ఉన్నాయి. వీటిని కీ–హోల్ సర్జరీగా పేర్కొనవచ్చు. అందులో అత్యాధునికమైన కెమెరాను నడు భాగంలోకి పంపుతారు. మైక్రోస్కోప్ సహాయంతోనూ, వెన్నెముక వద్ద మంచి వెలుగు ప్రసరింపజేయడం ద్వారా వెన్నెముకను పదింతలు పెద్దగా చూసి, సమర్థంగా శస్త్రచికిత్స చేయడం సాధ్యమవుతుంది. అయితే ఇలాంటి కీ–హోల్ సర్జరీల విషయంలో ఎంతో అత్యంత నైపుణ్యం ఉన్న సర్జన్‌లతో శస్త్రచికిత్స చేయించడం మేలు. ఎందుకంటే అతి చిన్న గాటు ద్వారా లోపలి భాగాలను నేరుగా చూడకుండా శస్త్రచికిత్స చేసే సమయంలో నిర్దిష్టమైన భాగానికి కాకుండా పక్క భాగాలకు గాయం కావడం జరిగే ప్రమాదం ఉంది. అందుకే అంత్యత నిపుణులైన శస్త్రచికిత్సకులు, కీ–హోల్ సర్జరీలో ప్రత్యేక శిక్షణ పొందిన వారు వీటిని చేస్తుంటారు.
శస్త్రచికిత్సలో ఏం చేస్తారు... నడుము భాగంలో ఒకవేళ డిస్క్ పెరగడం లేదా పక్కకు తొలగడం వంటి అనర్థాలు జరిగి, అది స్పైన్ భాగంలోని (లంబార్ స్పైనల్) నరాలను నొక్కుతున్నప్పుడు, శస్త్రచికిత్స చేసి, ఆ పెరిగిన డిస్క్ భాగాన్ని తొలగించడం గానీ లేదా తన స్థానం నుంచి పక్కకు తొలగిన డిస్క్‌ను మళ్లీ సరిగా అమిరిపోయేలా చేస్తారు. ఒకవేళ ఏదైనా ప్రమాదాలలో డిస్క్ భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయినప్పుడు మళ్లీ ఆ డిస్క్ భాగాన్ని మెత్తటి ఎముకతో నింపి (బోన్ గ్రాఫ్ట్ చేసి), దానిపై ఒత్తిడి పడకుండా వెన్ను ప్రాంతంలో రాడ్స్, స్క్రూలు బిగిస్తారు. ప్రమాదాలకు గురైన యువ పేషెంట్లకు ఏడాది పాటు ఆగనవసరం లేకుండానే ఈ శస్త్రచికిత్స చేస్తారు.
డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్,
ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్,హైదరాబాద్