సాక్షి, అమరావతి: వృద్ధాప్యం కారణంగా కీళ్లు, కండరాల నొప్పులతో బాధపడేవారికి సేవలు అందించేందుకు రాష్ట్రంలో ఏడు ఫిజియోథెరపీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వాటి పరిధిలో వృద్ధులకు మరింతగా సేవలు అందించేందుకు ప్రస్తుత బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.కోటి నిధులను కేటాయించింది. రాష్ట్రంలోని విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్), విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో ఫిజియోథెరపీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
ఈ ఏడు కేంద్రాల్లో నిపుణులైన ఫిజియోథెరపిస్టులు, వైద్యులు సేవలు అందిస్తున్నారు. గడిచిన ఏడాదికాలంలో వీటి ద్వారా 12వేల మందికిపైగా వృద్ధులు ఫిజియోథెరపీ సేవలు పొందారు. వీటితోపాటు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు తెలుసుకుని వారికి తక్షణ వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వయోవృద్ధులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, మానసిక, వ్యక్తిగత సమస్యలు తెలుసుకుని వారికి తక్షణ సహాయం అందించేలా ఎల్డర్ లైన్–14567 టోల్ ఫ్రీ నంబర్‌తో జాతీయస్థాయిలో హెల్ప్‌లైన్‌ను నిర్వహిస్తోంది.
రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ప్రత్యేక ఫీల్డ్ రెస్పాన్స్ టీమ్స్‌తో ఎల్డర్‌లైన్ హెల్ప్‌లైన్ విభాగం సమర్థంగా పనిచేస్తోంది. మరోవైపు వయోవృద్ధులకు చేతికర్రలు, వినికిడి యంత్రాలు, మూడుచక్రాల కుర్చీలు వంటి పరికరాలు అందిస్తోంది. రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు(ఎన్‌జీఓ) నిర్వహిస్తున్న 70 వృద్ధాశ్రమాలకు ప్రభుత్వం గ్రాంట్‌ను నేరుగా అందిస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019, జూన్ నుంచి వృద్ధాప్య పింఛనుకు వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. ఫలితంగా వైఎస్సార్ పింఛను పథకం కింద సుమారు 35లక్షల మంది వృద్ధులు ప్రతి నెల పింఛను పొందుతున్నారు.
(చదవండి: ఇంకెన్నాళ్లీ ‘కలం’ కూట విషం?)
Comments
Please login to add a commentAdd a comment