Joint
-
వృద్ధులకు ఏడు ఫిజియోథెరపీ కేంద్రాలు
సాక్షి, అమరావతి: వృద్ధాప్యం కారణంగా కీళ్లు, కండరాల నొప్పులతో బాధపడేవారికి సేవలు అందించేందుకు రాష్ట్రంలో ఏడు ఫిజియోథెరపీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. వాటి పరిధిలో వృద్ధులకు మరింతగా సేవలు అందించేందుకు ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వం రూ.కోటి నిధులను కేటాయించింది. రాష్ట్రంలోని విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్), విజయవాడ, తిరుపతి, కర్నూలు, కడప, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రుల్లో ఫిజియోథెరపీ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడు కేంద్రాల్లో నిపుణులైన ఫిజియోథెరపిస్టులు, వైద్యులు సేవలు అందిస్తున్నారు. గడిచిన ఏడాదికాలంలో వీటి ద్వారా 12వేల మందికిపైగా వృద్ధులు ఫిజియోథెరపీ సేవలు పొందారు. వీటితోపాటు వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు తెలుసుకుని వారికి తక్షణ వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వయోవృద్ధులు ఎదుర్కొంటున్న ఆరోగ్య, మానసిక, వ్యక్తిగత సమస్యలు తెలుసుకుని వారికి తక్షణ సహాయం అందించేలా ఎల్డర్ లైన్–14567 టోల్ ఫ్రీ నంబర్‌తో జాతీయస్థాయిలో హెల్ప్‌లైన్‌ను నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ ప్రత్యేక ఫీల్డ్ రెస్పాన్స్ టీమ్స్‌తో ఎల్డర్‌లైన్ హెల్ప్‌లైన్ విభాగం సమర్థంగా పనిచేస్తోంది. మరోవైపు వయోవృద్ధులకు చేతికర్రలు, వినికిడి యంత్రాలు, మూడుచక్రాల కుర్చీలు వంటి పరికరాలు అందిస్తోంది. రాష్ట్రంలో స్వచ్ఛంద సంస్థలు(ఎన్జీఓ) నిర్వహిస్తున్న 70 వృద్ధాశ్రమాలకు ప్రభుత్వం గ్రాంట్‌ను నేరుగా అందిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019, జూన్ నుంచి వృద్ధాప్య పింఛనుకు వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. ఫలితంగా వైఎస్సార్ పింఛను పథకం కింద సుమారు 35లక్షల మంది వృద్ధులు ప్రతి నెల పింఛను పొందుతున్నారు. (చదవండి: ఇంకెన్నాళ్లీ ‘కలం’ కూట విషం?) -
రాంగ్‌రూట్, ట్రిపుల్ రైడింగ్‌లపై నిబంధనలు కఠినతరం
-
Krishna, Godavari Board: ఏమీ తేల్చలేదు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం వెలువరించిన కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీల ఉమ్మడి భేటీ అసంపూర్తిగా ముగిసింది. బోర్డుల పూర్తి స్థాయి భేటీ నిర్వహించాకే సమన్వయ కమిటీల సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేసిన తెలంగాణ మంగళవారం నాటి భేటీకి గైర్హాజరయ్యింది. కాగా ఆంధ్ర ప్రదేశ్.. గెజిట్‌లోని పలు అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని, వాటిపై కేంద్రానికి లేఖ రాసి అక్కడినుంచి స్పష్టత వచ్చాకే అన్ని అంశాలపై స్పందిస్తామని తెలిపింది. ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌లు), నిధులు సహా ఏ ఇతర అంశాలైనా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాకే ముందుకెళతామని అధికారులు చెప్పారు. సీఎం సూచనలతోనే దూరం! కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే, గోదావరి బోర్డు సభ్య కార్యదర్శి బీపీ పాండ్యల అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో ఈ ఉమ్మడి సమావేశం జరిగింది. ఏపీ తరఫున ఈఎన్సీ నారాయణరెడ్డితో పాటు ఇతర ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి సోమవారమే తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ సీఎస్ రజత్‌కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు. అయితే ఈ భేటీకి దూరంగా ఉండాలని ఆయన సూచించినట్లు తెలిసింది. దీంతో తెలంగాణ ఇంజనీర్లు ఎవరూ మంగళవారం నాటి సమావేశానికి హాజరు కాలేదు. బోర్డుల పూర్తిస్థాయి భేటీ తర్వాతే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని సోమవారం గోదావరి బోర్డుకు లేఖ రాసిన తెలంగాణ.. మంగళవారం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. మా ప్రభుత్వంతో చర్చించాక చెబుతాం: ఏపీ ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవడం, వాటి అనుమతులు, అనుమతుల్లేని ప్రాజెక్టుల వివరాలు, సీఐఎస్ఎఫ్ భద్రత, నిధుల విడుదల, విద్యుదుత్పత్తి వంటి అంశాలపై సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసే విషయాన్ని బోర్డులు ప్రస్తావించినట్లు తెలిసింది. తమకు సహకరించాలని, అవసరమైన నివేదికలు, వివరాలు ఇవ్వాలని బోర్డులు ఏపీని కోరాయి. దీనిపై స్పందించిన ఏపీ ఇంజనీర్లు.. అన్ని ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తేవడం, పర్యవేక్షణకు సిబ్బంది కేటాయింపులు, నిధుల విడుదల వంటి అంశాలపై తమకు కొన్ని అభ్యంతరాలున్నాయని తెలిపారు. దీనిపై త్వరలోనే కేంద్ర జల శక్తి శాఖకు లేఖ రాస్తామని చెప్పారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వడం, నిధుల విడుదల, ప్రాజెక్టులకు అనుమతుల విషయాలపై ప్రభుత్వంతో చర్చించి నిర్ణయాలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. గోదావరిలో మున్ముందు తీవ్ర సమస్యలు: ఏపీ ఈఎన్సీ ఉమ్మడి భేటీ ముగిసిన తర్వాత ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ అభ్యంతరాలపై ఓ స్పష్టత వచ్చాకే నోటిఫికేషన్ అమలుపై పూర్తి స్థాయిలో స్పందిస్తామని బోర్డుకు చెప్పామని తెలిపారు. అన్ని ప్రాజెక్టులు, గెజిట్‌లో సూచించిన అన్ని అంశాలపై బోర్డు పర్యవేక్షణ అక్కర్లేదని, కేవలం క్లిష్టమైన అంశాలను మాత్రమే బోర్డులు చూస్తే సరిపోతుందని అన్నారు. ఇదే సమయంలో గోదావరి జలాల వినియోగం, మళ్లింపు అంశాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు కృష్ణాలో కన్నా గోదావరిలో తీవ్ర సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ‘గోదావరిలో ఉమ్మడి ఏపీకి 1,430 టీఎంసీల కేటాయింపులున్నాయి. ఇందులో 1,350 టీఎంసీలను వినియోగించేలా తెలంగాణ కాళేశ్వరం, తుపాకులగూడెం, సీతారామ, దేవాదుల వంటి పథకాలు చేపడుతోంది. గోదావరిలో మిగులు జలాలు లేవు. ఎగువ రాష్ట్రాలు వినియోగించుకోలేని నీరు మాత్రమే దిగువకు వస్తోంది. ఆయా రాష్ట్రాలు వినియోగం మొదలు పెట్టినా, తెలంగాణ 1,350 టీఎంసీలు వాడినా పూర్తి దిగువ రాష్ట్రమైన ఏపీలోని పోలవరం, గోదావరి డెల్టా సిస్టమ్( జీడీఎస్)కు తీవ్ర నీటి కొరత ఏర్పడుతుంది. ఇది ఏపీకి తీరని నష్టం చేకూర్చుతుంది..’ అని తెలిపారు. పోలవరం, పట్టిసీమలతో మళ్లిస్తున్న గోదావరి జలాలకు గానూ తమకు 45 టీఎంసీల వాటా ఇవ్వాలని తెలంగాణ కోరడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణ సైతం 241 టీఎంసీల మేర గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోందని, మరి దీని మాటేమిటి? అని ఆయన ప్రశ్నించారు. సముద్రంలోకి పూర్తి వృధాగా పోతున్న సందర్భంలో తాము మళ్లించుకునే నీటిని వినియోగ వాటాల కింద పరిగణించరాదని కోరుతున్నా తెలంగాణ వినిపించుకోవడం లేదని తెలిపారు. వృధాగా పోతున్న నీటిని వినియోగించుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. 5న రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో పర్యటన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతంలో పర్యటించే అంశం భేటీలో ప్రస్తావనకు వచ్చింది. ఈ నెల 5న జరిగే ఈ పర్యటనకు సహకరించాలని ఏపీని బోర్డు కోరింది. ఇందుకు అంగీకరించిన ఏపీ.. కమిటీలో తెలంగాణ ఇంజనీర్లు లేకుండా చూడాలని షరతు పెట్టింది. దీనిపై బోర్డు ఎలాంటి నిర్ణయం చేసిందీ తెలియలేదు. అయితే తెలంగాణ కోరుతున్నట్లుగా ఈ 12న పూర్తి స్థాయి బోర్డుల భేటీ జరిగే అవకాశం ఉందని తెలిసింది. -
అన్నదమ్ముల అపూర్వ సేద్యం
ఆరిమిల్లి కృష్ణ, బాపిరాజు సోదరులు 135 ఎకరాల సొంత భూమిలో ఉమ్మడి వ్యవసాయం చేస్తున్న పెద్దరైతులు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కోల్‌మాన్‌పేట వారి స్వగ్రామం. పశ్చిమగోదావరి జిల్లా నుంచి 1960లో వీరి తండ్రి వలస వచ్చి కోల్మాన్పేటలో స్థిరనివాసం ఏర్పరచుకొని పాడి పశువుల పోషణతోపాటు పంటలు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. కృష్ణ బీటెక్ చదువుకున్నప్పటికీ తండ్రి చూపిన బాటలో వ్యవసాయాన్నే వృత్తిగా ఎంపిక చేసుకున్నారు. అంతేకాదు, ఎన్నో ఏళ్లుగా చేస్తున్న రసాయనిక వ్యవసాయం అనేక విధాలుగా ఎలా నష్టదాయకమో గ్రహించి కుటుంబంలో అందర్నీ ఒప్పించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించడం విశేషం. 40 దేశవాళీ ఆవులను పోషిస్తూ.. వాటి పేడ, మూత్రంతో జీవామృతం, ఘనజీవామృతం తయారు చేసుకొని భూములను సజీవవంతంగా మార్చుకుంటూ ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్నారు. రసాయనిక వ్యవసాయంలో ఎరువులు, పురుగుమందుల ఖర్చులు పెరిగిపోయి క్రమంగా నికరాదాయం తగ్గిపోతూ వస్తున్న తరుణంలో 2012 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరంలో కృష్ణ పాల్గొన్నారు. రసాయనిక వ్యవసాయంతో ప్రజారోగ్యానికి, భూమికి, పర్యావరణానికి, ఆరోగ్యానికి జరుగుతున్న నష్టాన్ని అర్థం చేసుకున్న కృష్ణ.. పాలేకర్ చెప్పిన విధంగా 2012 ఖరీఫ్ పంట కాలం నుంచే ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ఏకంగా 90 ఎకరాల్లో వరి సేద్యాన్ని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోకి మార్చేశారు. అయితే, కొత్త కావడం, సందేహాలను నివృత్తి చేసే వారు అందుబాటులో లేకపోవడంతో వరి ధాన్యం దిగుబడి తొలి ఏడాది ఎకరానికి 18 బస్తాలకు పడిపోయింది. మొదటి ఏడాది రూ. లక్షల ఆదాయం తగ్గిపోయింది. అయినా, మొక్కవోని దీక్షతో ప్రకృతి వ్యవసాయంలో మెలకువలను నేర్చుకుంటూ వ్యవసాయాన్ని కొనసాగించారు. అంతేకాదు, అప్పటివరకు నిర్వహిస్తున్న రసాయనిక ఎరువులు, పురుగుమందుల దుకాణం(ఏటా రూ. 30 లక్షలకు పైగా టర్నోవర్) కూడా అదే సంవత్సరం మూసివేసి మరీ ప్రకృతి వ్యవసాయానికి కట్టుబడిన ప్రకృతి వ్యవసాయ కుటుంబం వారిది. దిగుబడి 18 నుంచి 52 బస్తాల వరకు.. ప్రకృతి వ్యవసాయంలో పట్టు సాధిస్తున్న కొద్దీ ఏటేటా దిగుబడులు పెరుగుతూ వచ్చాయి. ప్రస్తుతం తమ ప్రాంతంలో రసాయనిక వ్యవసాయదారుల కన్నా ఎక్కువగానే ప్రకృతి వ్యవసాయంలో తాము వరి ధాన్యం దిగుబడి తీయగలుగుతున్నామని గర్వంగా చెప్పుకునే స్థితికి కృష్ణ ఎదిగారు. మొదటి ఏడాదే 90 ఎకరాల్లో వరిసాగును ప్రకృతి వ్యవసాయంలో చేపట్టినప్పుడు కొన్ని పొరపాట్ల వల్ల ఎకరానికి 18 బస్తాల వరి ధాన్యం దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ఎకరానికి 35 నుంచి 40 బస్తాల (బస్తా 72 కిలోలు) దిగుబడి సాధిస్తున్నారు. రెండేళ్ల క్రితం చీడపీడల బెడద ఎక్కువగా ఉండటంతో రసాయనిక వ్యవసాయం చేసిన రైతులకు ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయినా తమ పొలంలో చీడపీడలూ లేవు, దిగుబడీ తగ్గలేదని కృష్ణ తెలిపారు. రెండు ఎకరాల్లో ప్రయోగాత్మకంగా పచ్చి పేడ స్లర్రీని బకెట్లతో పొలంలో కూలీలతో తరచూ పోయిస్తూ వచ్చానని, దిగుబడి ఎకరానికి 52 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చిందని కృష్ణ తెలిపారు. అయితే, పేడ స్లర్రీని బక్కెట్లతో పోయించడం శ్రమతోటి, ఖర్చుతోటి కూడిన పని కాబట్టి కొనసాగించడం లేదన్నారు. పత్తిలో అంతర పంటగా తెల్ల జొన్న కృష్ణ సోదరులకు 12 ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈ ఏడాది 56 ఎకరాల్లో వరి (బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, ఎన్‌డిఎల్‌ఆర్–7 రకాలు) సాగు చేశారు. ఆర్ఎన్ఆర్ ఎకరానికి 38 బస్తాల దిగుబడి వచ్చింది. ఆముదం 20 ఎకరాల్లో, 4 ఎకరాల్లో కంది సాగు చేస్తున్నారు. 14 ఎకరాల్లో అండుకొర్రలు, కొర్రలు, ఊదలు, సామలు, వరిగలు సాగు చేశారు. 6 ఎకరాల్లో బీటీ పత్తి వేసి, జొన్నను అంతరపంటగా సాగు చేస్తున్నారు. ఇప్పటికే ఎకరానికి 6 క్వింటాళ్ల పత్తి తీశారు. మరో 6 క్వింటాళ్లు రావచ్చు. పత్తి సాళ్ల మధ్య 48 అంగుళాల దూరం పెట్టారు. పత్తి సాళ్ల మధ్య రెండు వరుసలుగా తెల్ల జొన్నను విత్తారు. ఎకరానికి పది క్వింటాళ్ల జొన్న దిగుబడి వస్తుందని కృష్ణ ఆశిస్తున్నారు. షాంపూ, వేప చెక్క+గోమూత్ర కషాయం సోప్ షాంపూ, వేప చెక్క+గోమూత్రంతో చేసిన కషాయం పిచికారీ చేశాక కత్తెర పురుగు ఉధృతి రసాయనిక వ్యవసాయ పొలాల్లో కన్నా తమ పొలంలో తక్కువగా ఉందని కృష్ణ తెలిపారు. సోప్ షాంపూని రెండు సార్లు పిచికారీ చేశారు. వేపచక్క 3 కిలోలు, 12 లీటర్ల గోమూత్రం కలిపి 3 పొంగులు పొంగిస్తే 8–9 లీటర్ల కషాయం వస్తుంది. కాచిన తెల్లారి 20 లీటర్ల పంపునకు ఒక లీటరు కషాయాన్ని, 1 లీటరు గోమూత్రం, 18 లీటర్ల నీటిని కలిపి పత్తిపై పిచికారీ చేస్తున్నారు. ఈ రబీలో మినుము, పెసర, గోధుమను సాగు చేయనున్నామన్నారు. మిర్చిలో అంతరపంటలుగా జొన్న, సజ్జ గత ఏడాది ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన ఎల్‌సిఎ 625 నాటు రకం మిర్చి (వరుసల మధ్య 36 అంగుళాలు, మొక్కల మధ్య 1.5 అంగుళాల దూరం)లో జొన్న, సజ్జ (3–4 మిరప మొక్కలకు ఒక జొన్న, సజ్జ మొక్కలు నాటారు) అంతర పంటలుగా వేసి మిర్చిలో 12 క్వింటాళ్ల దిగుబడులు సాధించానని కృష్ణ తెలిపారు. జొన్న, సజ్జ అంతరపంటగా వేయడం వల్ల ఫిబ్రవరి తర్వాత ఎండ తీవ్రత నుంచి మిర్చి పంటకు నీడ దొరకడంతో ఒక కాపు ఎక్కువగా వచ్చిందన్నారు. ఈ రకం మిరప విత్తనాన్ని తిరిగి వాడుకోవచ్చని, అయితే వేరే పొలంలో పండిన లేదా లాం ఫాం నుంచి విత్తనాలు తెచ్చి వేసుకుంటే మంచిదన్నారు. వేప చెక్క+గోమూత్ర కషాయాన్ని అమావాస్యకు ముందు ఒకసారి, తర్వాత మరోసారి ఈ కషాయాన్ని పిచికారీ చేసి మంచి ఫలితాలు సాధించామని కృష్ణ తెలిపారు. ప్రదర్శనా క్షేత్రం.. శిక్షణా కేంద్రం.. కృష్ణ, బాపిరాజు సోదరులు మక్కువతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ వరి, పత్తి, మిర్చి నుంచి చిరుధాన్యాలు, మామిడి తోటల వరకు బహుళ పంటలు సాగు చేస్తూ భళా అనిపించుకుంటుండటంతో వారి వ్యవసాయ క్షేత్రం వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటకలోని బళ్లారి ప్రాంత రైతులకు సైతం ప్రదర్శన క్షేత్రంగా, రైతు శిక్షణా కేంద్రంగా రూపుదాల్చింది. సీజన్లో కనీసం రెండు సార్లు రైతులకు శిక్షణ ఇస్తున్నామని, నిరంతరం రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు ఫీల్డ్ విజిట్‌కు వస్తూ వుంటారని కృష్ణ గర్వంగా చెప్పారు. గ్రామంలో పెద్ద రైతు రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయం చేపట్టి, మిగతా రైతులకు తోడ్పాటునందిస్తూ ఉంటే ఆ గ్రామంలో చిన్న రైతులు అనుసరించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోల్మాన్పేటలో కూడా అదే జరుగుతోంది. ఇప్పటికి 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయ బాట పట్టారని కృష్ణ తెలిపారు. తాము జీవామృతం, ఘనజీవామృతం, తదితర కషాయాలను రైతులకు నామమాత్రపు ధరలకు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం తోడ్పాటుతో గ్రామంలో మిగతా రైతులను కూడా ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాని కృష్ణ ఆనందంగా చెప్పారు. స్ఫూర్తిదాయకమైన కృషి చేస్తున్న కృష్ణ సోదరులకు ‘సాగుబడి’ జేజేలు! – గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు (అగ్రికల్చర్) వెయ్యి లీటర్ల బ్యారెల్స్‌లో జీవామృతం సరఫరా అలవాటైపోయిన రసాయనిక వ్యవసాయం వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేపట్టే రైతుల్లో వారి ఆర్థిక స్తోమతను బట్టి ఎవరి బాధలు వాళ్లకుంటాయి. చిన్న రైతులకు ఉండే సమస్యలు ఒక రకమైతే, పెద్ద రైతులకు ఉండే సమస్యలు ఇంకో రకం. పాలేకర్ శిక్షణా తరగతుల్లో 200 లీటర్ల నీటిలో ఆవు పేడ, మూత్రం, బెల్లం, పప్పుల పిండి కలిపి ఎకరానికి సరిపడా జీవామృతం ఎలా తయారు చేసుకోవాలో చెబుతుంటారు. అయితే, ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలినాళ్లలో ఈ సూచనలను కృష్ణ అలాగే పాటించారు. పొలం విస్తీర్ణం ఎక్కువ కావడంతో కొద్ది పరిమాణాల్లో చిన్న డ్రమ్ముల్లో చేసిన జీవామృతం సరిపోక పంట అనుకున్నంత దిగుబడినివ్వలేదు. దీంతో, ఇలా కాదని తమ పెద్ద వ్యవసాయ క్షేత్రానికి అనుగుణంగా జీవామృతం తయారీ పద్ధతిని కృష్ణ నేర్పుగా మార్చుకున్నారు. వెయ్యి లీటర్ల ఫైబర్ బ్యారెల్స్ తెప్పించి వాటిలో జీవామృతం తయారు చేసి భూములకు అందించడం ప్రారంభించిన తర్వాత సమస్య తీరింది. పంటల దిగుబడీ పెరిగింది. జీవామృతంతో కూడిన వెయ్యిలీటర్ల బ్యారెల్స్ మూడింటిని ఒక ట్రాలీలో తరలించి ఒక విడతకు 10–15 ఎకరాలకు అందిస్తుండడంతో ఇప్పుడు పుష్కలంగా జీవామృతం పంటలకు అందుతోంది. దీంతోపాటు పల్వరైజింగ్ మిషన్‌ను తెచ్చిన తర్వాత.. 135 ఎకరాలకు సరిపడా వివిధ రకాల కషాయాల తయారీ ప్రక్రియ కూడా సులభంగా మారిందని కృష్ణ సంతృప్తిగా చెప్పారు. ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం ప్రకృతి వ్యవసాయమే నా సర్వస్వం. గతంలో రసాయన ఎరువులతో వ్యవసాయం చేసి నష్టాలను మూట కట్టుకున్నాను. సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 2012 నుంచి తమ్ముడు బాపిరాజుతో కలసి 135 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనేక మంది రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నాం. మా గ్రామంలో దాదాపు 150 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. 40 దేశవాళీ ఆవులను పోషిస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం వల్ల నాణ్యమైన ఆహారాన్ని పండిస్తున్నాం. భూమి ఆరోగ్యం అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని ప్రోత్సహిస్తుండటం శుభపరిణామం. మా ఊళ్లో రైతులందరినీ ప్రకృతి వ్యవసాయదారులుగా మార్చాలని ప్రయత్నిస్తున్నాను. – ఆరిమిల్లి కృష్ణ (95533 42667), బీటెక్, ప్రకృతి వ్యవసాయదారుడు, కోల్‌మాన్‌పేట, కొసిగి మం, కర్నూలు జిల్లా జీవామృతాన్ని పొలానికి తరలించడానికి వాడుతున్న భారీ ట్యాంకులు -
అమెజాన్, గూగుల్ దోస్తీ
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్ దాదాపు నాలుగేళ్ల తర్వాత తమ విభేదాలను పక్కన పెట్టి చేతులు కలిపాయి. దీంతో గూగుల్‌కి చెందిన యూట్యూబ్ ఇకపై అమెజాన్ ఫైర్ టీవీ యూజర్లకు కూడా అందుబాటులోకి రానుంది. అలాగే అమెజాన్‌కు చెందిన ప్రైమ్ వీడియో కంటెంట్‌ను గూగుల్ క్రోమ్‌క్యాస్ట్ యూజర్లు కూడా వీక్షించవచ్చు. ఆండ్రాయిడ్ టీవీ డివైజెస్‌లో ప్రత్యేకంగా అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌ను పొందుపర్చనుండగా, ఫైర్ టీవీ డివైజ్‌లలో యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ కిడ్స్ యాప్స్ కూడా లభ్యం కానున్నాయి. ఇరు సంస్థలు ఈ విషయం వెల్లడించాయి. అయితే, ఎప్పట్లోగా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందనేది నిర్దిష్టంగా చెప్పలేదు. తాజా దోస్తీతో ఇరు సంస్థల మధ్య కొన్నాళ్లుగా నెలకొన్న విభేదాలకు ఫుల్స్టాప్ పడినట్లయింది. అమెజాన్ సుమారు నాలుగేళ్ల నుంచి గూగుల్‌కి చెందిన క్రోమ్‌క్యాస్ట్ స్ట్రీమింగ్ అడాప్టర్ తమ పోర్టల్‌లో విక్రయించడం నిలిపేసింది. -
నగదు రహిత లావాదేవీల విస్తృతికి చర్యలు
1,976 స్వైపింగ్ మెషీన్ల జారీ జేసీ సత్యనారాయణ కొత్తపేట :పెద్ధ నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన కరెన్సీ కొరతను అధిగమించేందుకు ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు మళ్ళించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్రమేపీ నగదు రహిత లావాదేవీలు శాతం పెంచేందుకు ప్రభుత్వ చర్యల్లో భాగంగా స్వైపింగ్ మెషీన్లు వాడకంలోకి తెస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్‌లో అందరూ మొబైల్ బ్యాంకింగ్, స్వైపింగ్ మెషీన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు సాగించేలా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లాలో స్వైపింగ్ మెషీన్లకు 8,785 దరఖాస్తులు రాగా సుమారు 6,500 ఆన్లైన్లో ఉన్నాయన్నారు.1,976 మెషీన్లు జారీ చేశామన్నారు.అలాగే 44,437 యాప్స్ డౌన్లోడ్ చేయగా 1,642 ఓకే చేశామన్నారు. దీనిపై 8,618 మందికి అవగాహన కల్పించామని తెలిపారు.7,54,304 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు జన్‌ధన్ ఖాతాదారులు కాగా వారిలో 3,23,673 మందికి, సుమారు 4,60,000 మంది ఉపాధి హామీ కూలీలలో 1,22,085 మందికి రూపే కార్డులు జారీ చేసినట్టు తెలిపారు. మిగిలిన వారికీ దశలవారీగా జారీ చేస్తామన్నారు.ఈ నెల సామాజిక పింఛను పథకం కింద ఎస్బీఐ ద్వారా సుమారు రూ.67 లక్షలు, ఆంధ్రాబ్యాంక్ ద్వారా సుమారు రూ.24 లక్షలు పంపిణీ చేసినట్టు తెలిపారు. జేసీ వెంట అమలాపురం ఆర్డీఓ జి.గణేష్‌కుమార్, స్థానిక తహశీల్దార్ ఎన్.శ్రీధర్, ఆర్ఐ ఎంటీఆర్ ప్రసాద్ తదితరులున్నారు. -
ప్రజాసాధికార సర్వే పురోగతిపై సమీక్ష
కాకినాడ సిటీ : రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్ర పునేట జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో బుధవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజాసాధికార సర్వే పురోగతిని సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ సర్వే ప్రక్రియను ఈ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే చేసిన గృహాలకు డిజిటల్ ఇంటి నంబర్లు జారీ చేసేందుకు వాటి ముందు ఉన్న వీధుల జీపీఆర్ఎస్ వివరాలను సేకరించి అప్లోడ్ చేయాలని సూచించారు. అసంపూర్తి, అసంబద్ధ డేటాను సరిచేసేందుకు ప్రత్యేక అప్ రూపొందించామని, దీనితో సత్వరం సవరణలు పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పాల్గొంటూ జిల్లాలో 68 శాతం సర్వే పూర్తి చేశామన్నారు. జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి, ఎన్ఐసీ సైంటిస్ట్ ఉస్మాన్, హెచ్ సూపరింటెండెంట్ రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
జాయింట్ పవర్‌కు చెక్
సాక్షి, కరీంనగర్ :సర్పంచుల నుంచి వచ్చిన తీవ్ర ప్రతిఘటనతో జాయింట్ చెక్ పవర్ విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడిం ది. కార్యదర్శులతో అధికారాన్ని పంచుకోవాలన్న ప్రభుత్వ ఉత్తర్వులపై కొత్తగా ఎన్నికయిన సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నిరసనలను ప్రభుత్వ పెద్దల దృష్టికి వివిధ రూపాల్లో తీసుకెళ్లిన జిల్లా సర్పంచులు ప్రత్యక్ష కార్యచరణకు సిద్ధమవుతున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో తన నిర్ణయాన్ని సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. జిల్లాల వారీగా అధికారులు, సర్పంచులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను స్వీకరిస్తారు. ఆ అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు. రెండేళ్ల క్రితమే గ్రామ పంచాయతీ పాలకవర్గాలు దిగిపోగా ఇంతకాలం ప్రత్యేకాధికారులే పాలన సాగించారు. ఎట్టకేలకు ప్రభుత్వం పంచాయతీలకు గత నెల మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించగా ఈ నెల 2న కొత్త సర్పంచులు కొలువుదీరారు. భాద్యతలు తీసుకున్నా అధికారాలు లేక అయోమయస్థితిలో ఉన్న సర్పంచులు అభివృద్ధి పనులు చేసేందుకు చెక్ పవర్ ఇవ్వాలని విన్నపాలు చేయగా ఈనెల 19న 385 జీవోను ప్రభుత్వం జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శితో కలిపి జాయింట్ చెక్ పవర్ కల్పించింది. పంచాయతీ జనరల్ ఫండ్ నిధులతో కనీస వసతులు కల్పించేందుకు కూడా సర్పంచులకు అవకాశం ఇవ్వలేదు. ఈ ఉత్తర్వులపై సర్పంచులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రజల ద్వారా ఎన్నికలయిన ప్రజాప్రతినిధులను ప్రభుత్వం అవమానించిందన్న ఆగ్రహం వ్యక్తమయ్యింది. నిధులు దారి మళ్లకుండా ఉండేందుకే ఈ ఏర్పాటు చేసినట్టు అధికారులు చేస్తున్న వాదనపై వారు విరుచుకుపడుతున్నారు. గతంలో పలువురు సర్పంచులు భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు రుజువయ్యింది. కొంతమంది సర్పంచుల నుంచి రికవరీ కూడా చేశారు. ఇంకా రూ.మూడు కోట్ల వరకు రికవరీ కాలేదని అధికారులు చెప్తున్నారు. గతంలో జరిగిన దుర్వినియోగాన్ని సాకుగా చూపి ఇప్పుడు జాయింట్ చెక్ పవర్ ఇవ్వడం సరైందికాదని కొత్త సర్పంచులు అంటున్నారు. జిల్లాలో 1206 పంచాయతీల్లో పాలకవర్గాలు ఉండగా 550 మంది కార్యదర్శులే ఉన్నారు. ఒక కార్యదర్శికి రెండుమూడు పంచాయతీల బాధ్యతలు కేటాయించారు. దీని వల్ల నిధుల వినియోగంలో ఇబ్బందులు తప్పవన్న వాదన వినిపిస్తోంది. గతంలో సర్పంచులతోపాటు ఒక వార్డు సభ్యుడికి చెక్ పవర్ ఉండేది. చెక్ వవర్ సభ్యుడిని వార్డుసభ్యులు ఎన్నుకునేవారు. ఈసారి ఈ విధానానికి కూడా అవకాశం ఇవ్వలేదు. నిధుల వినియోగంలో తమకు పూర్తి అధికారాన్ని ఇవ్వాలని సర్పంచులు డిమాండ్ చేస్తున్నారు. నిధులు దారి మళ్లకుండా ప్రజావసరాలకే ఖర్చయ్యేలా ప్రభుత్వం ఎలాంటి ఏర్పాటు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం సర్పంచులకు పూర్తిస్థాయిలో చెక్ పవర్ కల్పించేందుకు జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది.