నగదు రహిత లావాదేవీల విస్తృతికి చర్యలు
నగదు రహిత లావాదేవీల విస్తృతికి చర్యలు
Published Fri, Dec 9 2016 11:05 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
1,976 స్వైపింగ్ మెషీన్ల జారీ
జేసీ సత్యనారాయణ
కొత్తపేట :పెద్ధ నోట్ల రద్దు నేపథ్యంలో ఏర్పడిన కరెన్సీ కొరతను అధిగమించేందుకు ప్రజలను నగదు రహిత లావాదేవీల వైపు మళ్ళించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ క్రమేపీ నగదు రహిత లావాదేవీలు శాతం పెంచేందుకు ప్రభుత్వ చర్యల్లో భాగంగా స్వైపింగ్ మెషీన్‌లు వాడకంలోకి తెస్తున్నట్టు తెలిపారు. భవిష్యత్‌లో అందరూ మొబైల్ బ్యాంకింగ్, స్వైపింగ్ మెషీన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు సాగించేలా అవగాహన పెంపొందించుకోవాలన్నారు. జిల్లాలో స్వైపింగ్ మెషీన్లకు 8,785 దరఖాస్తులు రాగా సుమారు 6,500 ఆన్‌లైన్‌లో ఉన్నాయన్నారు.1,976 మెషీన్‌లు జారీ చేశామన్నారు.అలాగే 44,437 యాప్స్ డౌన్‌లోడ్ చేయగా 1,642 ఓకే చేశామన్నారు. దీనిపై 8,618 మందికి అవగాహన కల్పించామని తెలిపారు.7,54,304 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు జన్‌ధన్ ఖాతాదారులు కాగా వారిలో 3,23,673 మందికి, సుమారు 4,60,000 మంది ఉపాధి హామీ కూలీలలో 1,22,085 మందికి రూపే కార్డులు జారీ చేసినట్టు తెలిపారు. మిగిలిన వారికీ దశలవారీగా జారీ చేస్తామన్నారు.ఈ నెల సామాజిక పింఛను పథకం కింద ఎస్‌బీఐ ద్వారా సుమారు రూ.67 లక్షలు, ఆంధ్రాబ్యాంక్ ద్వారా సుమారు రూ.24 లక్షలు పంపిణీ చేసినట్టు తెలిపారు. జేసీ వెంట అమలాపురం ఆర్‌డీఓ జి.గణేష్‌కుమార్, స్థానిక తహశీల్దార్ ఎన్.శ్రీధర్, ఆర్‌ఐ ఎంటీఆర్ ప్రసాద్ తదితరులున్నారు.
Advertisement