కిరాణా దుకాణం అనుకున్నారా? | Collector Vivek Yadav Fires On Officers | Sakshi
Sakshi News home page

కిరాణా దుకాణం అనుకున్నారా?

Published Wed, Apr 18 2018 9:46 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM

Collector Vivek Yadav Fires On Officers - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ 

విజయనగరం గంటస్తంభం : ‘అసలు కలెక్టర్‌ అంటే లెక్కలేదా... ఎవరు చెబితే పనిచేస్తారు? ఇంత బాధ్యతారాహిత్యం ఏమిటి... ఇదేమైనా కిరాణా దుకాణం అనుకుంటున్నారా... ఇలా అయితే కఠిన చర్యలు తప్పవు.’ అంటూ రెవెన్యూ అధి కారుల తీరుపై జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ తీవ్రంగా మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కలెక్టర్‌ ఈ సారి రెవెన్యూ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో కలెక్టరేట్‌ కాన్ఫరెన్సు హాల్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశం హాట్‌హాట్‌గా మారింది. ముందుగా గత సమావేశంలో సమీక్షించిన, చర్చించిన అంశాలపై యక్షన్‌ టేకెన్‌ రిపోర్టుపై సమీక్షించారు.

ఆ రిపోర్టులు సరిగ్గా లేకపోవడంతో విజయనగరం, పార్వతీపురం ఆర్డీవో కార్యాలయాల పరిపాలనాధికారుల(ఏవో)పై మండిపడ్డారు. భూమిశిస్తు వసూలుపై నెలవారీ లక్ష్యాలకు సంబంధించిన రిపోర్టు లేకపోవడంపై కోపోద్రిక్తులయ్యారు. నోట్స్‌ లేకుండా సమావేశానికి ఎలా వస్తున్నారని ఆగ్రహంతో ఊగిపోయారు. విజయనగరం ఏవో కాశీవిశ్వనాథాన్ని ఉద్దేశించి కిరాణా దుకాణం అనుకున్నావా? అంటూ వ్యాఖ్యలు చేయడం విశేషం. కలెక్టరేట్‌ అధికారులు తయారు చేసిన నోట్స్‌ కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఏవోతోపాటు ఇతర అధికారులపై విరుచుకుపడ్డారు.

కలెక్టర్‌ చెబితేగానీ చర్యలు తీసుకోరా?
పనితీరు ఆధారంగా గ్రేడింగ్‌ ఇస్తున్నారని, సి, డి గ్రేడింగ్‌లో ఉన్న వారిపై ఏం చర్యలు తీసుకున్నారని తహసీల్దార్లను ప్రశ్నించగా సరైన సమాధానం లేకపోవడంతో వారిపైనా మండిపడ్డారు. పత్రికల్లో వస్తున్న వ్యతిరేక కథనాల గురించి ప్రస్తావిస్తూ ఏం చేశారని పూసపాటిరేగ తహసీల్దారును ప్రశ్నించారు. ఆర్‌ఐ, వీఆర్వోలను విచారణకు పంపామని, తాను వెళ్లలేదని ఆయన చెప్పడంతో అభియోగాలు ఉన్నవారిని విచారణకు పంపిస్తే ఎలా అని నిలదీశారు. పత్రికల్లో వచ్చిన ప్రతికూల వార్తలపై వెంటనే స్పందించి నివేదికలు ఇవ్వాలన్నారు. కలెక్టర్‌ చెబితే తప్ప చర్యలు తీసుకోకూడదనుకున్నారా అంటూ మందలించారు.

సిబ్బంది లేరంటూ పనులు ఆపేస్తారా?
సర్వేశాఖలో అన్‌సర్వడ్‌ విలేజీలు, ఇతర అంశాలపై సమీక్షలో  ప్రగతిపై ప్రశ్నించగా సిబ్బంది లేకపోవడంతో సర్వే జరగలేదని చెప్పడం ఆయనకు కోపం తెప్పించిం ది. జేసీ లేకపోవడంవల్ల పనులు ఆగిపోయాయని తాను ముఖ్యమంత్రి, సీఎస్‌కు చెప్పగలనా? అని ప్రశ్నించారు. ఉన్నవారితో పని చేయించుకుని ముందుకెళ్లాలని, సకా లంలో ఇచ్చిన పనిని పూర్తి చేయాలని కచ్చితంగా చెప్పారు. వీటితోపాటు అంశాల వారీగా సమీక్షలో రెవెన్యూ అధికారుల లోపాలను ఎండగట్టారు. పనితీరు మెరుగుపరుచుకోవాలని, పక్కా నివేదికలతో సమావేశానికి రావాలని ఆదేశించారు.

వినతులపై శ్రద్ధ చూపండి
రెవెన్యూ సమస్యలపై ఇటీవల కాలంలో ప్రజల నుంచి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిని వెంటవెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మీకోసం కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. గ్రీవెన్స్‌ సెల్‌లో ఇళ్ల స్థలాల కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయని, ఈ సమస్య పరిష్కారంపై దృష్టిసారించాలనీ చెప్పారు. గ్రామాల్లో అభ్యంతరం లేని పోరంబోకు స్థలాలు గుర్తించి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజయనగరం, పార్వతీపురం ఆర్డీవోలను ఆదేశించారు.

రెండు డివిజన్లలో ఒకేసారి ఇళ్ల స్థలాలు పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. ఏడాదిలో వసూలు చేయాల్సిన నీటి పన్నును నెలవారీగా విభజించి ప్రతి నెలా లక్ష్యం మేరకు వసూలు చేయాలన్నారు. అన్ని కార్యాలయాల్లో నూరుశాతం ఇ–ఆఫీస్‌ అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్‌ఛార్జి జేసీ కె.నాగేశ్వరరావు, డీఆర్వో ఆర్‌.ఎస్‌.రాజ్‌కుమార్, విజయనగరం ఇన్‌ఛార్జి ఆర్డీవో సాల్మన్‌రాజ్, పార్వతీపురం ఆర్డీవో సుదర్శనదొర, కేఆర్‌ఆర్‌సీ ఎస్డీసీ ఆర్‌. శ్రీలత, ఇతర అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

హాజరైన రెవెన్యూ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement