వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ రొనాల్డ్‌రోస్, ఇతర అధికారులు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: తిరిగి తిరిగి అలిసిపోతున్నాం.. దయ చూపండయ్యా అంటూ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుదారులు కలెక్టర్ ఎదుట సమస్యల ఏకరువు పెట్టారు. మండలాల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే ఇక్కడికి వస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన ప్రజావాణికి కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో పాటు, డీఆర్వో వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ గోపాల్, ట్రెయినీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బెన్షాలో ప్రజల నుంచి వినతిపత్రాలు, ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారం విషయంలో జాప్యం తగదని ఫిర్యాదులను అందుకున్న కలెక్టర్ ఈ సందర్భంగా మండలాల అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. భూముల సమస్యలు, ఆసరా పెన్షన్లు, రుణాలు, ఉపాధి కోసం ఎక్కువ వినతిపత్రాలు అందగా మొత్తం 82వినతులు, ఫిర్యాదులు వచ్చాయి.
బాధ్యలపై చర్య తీసుకోవాలి
మత్స్యశాఖ కార్యాలయంలో ఏ పని జరుగాలన్నా లంచం ఇవ్వనిదే పని జరుగడంలేదని, అవినీతి అక్రమార్కులపై చర్య తీసుకోవాలని కోరుతూ తెలంగాణ మత్స్యకార్మిక సహకార సంఘం జిల్లా కార్యదర్శి తెలుగు సత్యయ్య ప్రజావాణిలో కలెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సంఘాల్లో సభ్యత్వం, లైసెన్సుల జారీ, వాహనాల మంజూరులో అక్రమాలు జరుగుతున్నాయని, అవినీతి అక్రమాలపై నిఘా ఉంచి చర్యలు తీసుకోవాలని కోరారు.
మైనింగ్ అనుమతులు నిలిపివేయాలి
తమకు ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూములను తీసుకొని ఇచ్చిన మైనింగ్ అనుమతులు నిలిపేయాలని మద్దూర్ మండలం నందిపాడ్ గ్రామానికి చెందిన దళిత రైతులు ప్రజావాణిలో కలెక్టర్‌కు విన్నవించారు. తమకు సర్వే నంబర్ 21లో 70మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందని, వాటిని రద్దు చేసి మైనింగ్ చేపట్టడంతో జీవనోపాధి పోయిందన్నారు. మైనింగ్ అనుమతులు నిలిపేసి తమ భూములను సాగు చేసుకునేలా చూడాలని కోరారు.
సేవా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు
నవాబ్‌పేట మండలం లింగంపల్లి పంచాయతీ కిషన్‌గూడ పాఠశాలలో విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు సేవాదృక్పథంతో వాటర్ ప్యూరిఫైర్‌ను ఏర్పాటు చేసేందుకు చేస్తున్న పనులను స్థానిక టీఆర్‌ఎస్ నాయకులు, అధికారులు అడ్డుకుంటున్నారని పేర్కొంటూ అనిరుధ్ యువసేన ఆధ్వర్యంలో రాజాపూర్, నవాబ్‌పేట మండలాలకు చెందిన ప్రజలు కలెక్టరేట్‌కు తరలివచ్చి కలెక్టరేట్‌లో ఆందోళన చేపట్టారు. అలాగే, పోలేపల్లి సెజ్ వద్ద స్థానిక నాయకులు కొందరు అక్రమంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి చెరువు నీటిని తరలిస్తున్నారన్నారు. రాజాపూర్ మండలం గుండ్ల పొట్లపల్లి సమీపంలో ఉన్న బిలాస్ స్పాం జ్ ఐరన్ పరిశ్రమ ద్వారా కాలుష్యం విడుదలవుతుందని, తద్వారా తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని పేర్కొన్నారు. పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు.
హద్దులు, ఆర్వోఆర్ అమలు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ గజిట్ ప్రకారం జమా మసీద్, ఈద్గాలకు కేటాయించిన భూమికి హద్దులు చూపి ఆర్వోఆర్ అమలు చేయాలి. సర్వే నంబర్ 320, 171లోని భూమిలో జామా మసీద్, ఈద్గా, ఖబ్రస్తాన్, గోఖుర్‌సాహెబ్ చెల్కలకు సంబంధించిన భూమిని సర్వే చేయించి హద్దులు నిర్ణయించి, రికార్డుల్లో నమోదు చేయాలని ఏళ్లుగా అధికారులను కోరుతున్నా పట్టించుకోవడంలేదని దామరగిద్ద మండలం లోకుర్తి గ్రామానికి చెందిన జామామసీద్ కమిటీ సభ్యులు ప్రజావాణిలో అధికారులను కలిసి విన్నవించారు. సంబంధిత భూమిని రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment