బోగస్ ఫిర్యాదులిస్తే అరెస్ట్ చేయిస్తా
ప్రజావాణిలో కలెక్టర్ కె.భాస్కర్
ఏలూరు (ఫైర్‌స్టేషన్ సెంటర్) : ప్రజావాణిలో బోగస్ ఫిర్యాదులు చేసే వ్యక్తులను, దళారులను అరెస్టు చేయిస్తామని కలెక్టర్ కె.భాస్కర్ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భీమవరం పట్టణానికి చెందిన కోయి వెంకట నాగలక్ష్మి, వెంకటహరినాథ్ దంపతులు రైతుబజార్‌లో కూరగాయలు అమ్ముకోవడానికి తమకు అనుమతివ్వాలని, ఎకరం పొలం ఉందని, దానిలో పండే కూరగాయలను రైతుబజార్‌లో అమ్ముకుంటామని కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. వారికి పొలం ఉందా లేదా, ఉంటే అందులో కూరగాయలు పండిస్తున్నారా అనే విషయాన్ని వెంటనే తెలుసుకోవాలని కలెక్టర్ జేసీ బాబూరావునాయుడిని ఆదేశించారు.
ఆయన భీమవరం తహసిల్దార్‌కు ఫోన్‌లో సమాచారం అందించి వెంటనే చెప్పాలని కోరారు. ఈలోగానే ఆ దంపతులు తమకు పొలంలేదని, రైతు బజార్‌లో లెసైన్స్ తీసుకుంటే కూరగాయల వ్యాపారం చేసుకోవచ్చనే ఉద్దేశంతో తప్పుడు వినతి అందించినట్టు వెంకట నాగలక్ష్మి తెలిపింది. దీనిపై స్పందించిన కలెక్టర్ వారిపై చర్యలు తీసుకోవాలని రిజర్వ్ సీఐ రామకృష్ణను ఆదేశించారు. మార్కెటింగ్ ఏడీని పిలిచి ఆ దంపతులపై చీటింగ్ కేసును నమోదు చేయాలని భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించాలని ఆదేశించారు.
బంగారుగూడెం కార్యదర్శిపై చర్యలకు ఆదేశం
20 రోజుల నుంచి కుళాయిల ద్వారా మురికినీరు వస్తుందని తెలిపినా కార్యదర్శి పట్టించుకోవడం లేదని ప్రజావాణిలో తాడేపల్లిగూడెం మండలం బంగారుగూడెం గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్ స్పందించి వెంటనే కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డీపీవో ఎ.నాగరాజువర్మను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చే దరఖాస్తుల్లో 20 శాతం అక్రమ చేపల చెరువుల తవ్వకాలకు సంబంధించే ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ విషయంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
గణపవరం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన వెంకట్రాజు(72) అనే వికలాంగుడు తనకు ఎటువంటి పింఛన్ మంజూరు చేయడం లేదని కలెక్టర్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన ఆయన సదరం సర్టిఫికెట్ వెంటనే తీయించి అతడికి పెన్షన్ మంజూరు చేయాలని డీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. ద్వారకాతిరుమల మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన ముత్తా నాగ మాధురి, ముత్తా సీతలకు ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద ప్రతి సంవత్సరం రూ.1200 అందేదని అయితే గత సంవత్సరం మంజూరైన ఈ స్కాలర్‌షిప్ తమకు ముట్టినట్లుగా వేలిముద్రలు వేయించుకుని అధికారులు డబ్బును ఇవ్వలేదని కలెక్టరుకు విన్నవించగా దీనిపై మండల ఏపీఎంపై చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. పలువురు వివిధ అంశాలపై ఫిర్యాదులు అందించారు.
మహిళా ప్రజాప్రతినిధుల తరఫున పెత్తనం చెలాయిస్తే చర్యలు
జిల్లాలో మహిళా సర్పంచ్‌లు, ఇతర స్థానిక సంస్థల మహిళా ప్రతినిధుల పేరుతో వారి భర్తలు లేదా బంధువులు అధికారికంగా ఎటువంటి పెత్తనం చెలాయించినా వారిపై కేసులు నమోదు చేయాలని కలెక్టర్ కె. భాస్కర్ డీపీవో ఎ.నాగరాజు వర్మను ఆదేశించారు. ప్రజావాణిలో సర్పంచ్‌ల స్థానంలో వారి బంధువులు పెత్తనం చెలాయిస్తున్నారని అనేక ఫిర్యాదులు అందుతున్నాయన్నారు.