కైకలూరు (ఏలూరు జిల్లా): దివ్యాంగుల జీవితాల్లో భవిత కేంద్రాలు చిరుదివ్వెలు వెలిగిస్తున్నాయి. విధి వంచించిన విభిన్న ప్రతిభావంతుల్లో మార్పు తీసుకువస్తున్నాయి. కేంద్రాల్లోని ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్లు(ఐఈఆర్టీ) తల్లిదండ్రులకంటే మిన్నగా చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. అడుగుతీసి అడుగువేయలేని స్థితిలో చేరిన దివ్యాంగులకు నడక నేర్పి విద్యాబుద్ధులు అందిస్తున్నారు. ప్రత్యేకావసరాల పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా ఆధునిక పరికరాలు అందిస్తోంది. దీంతో తమ బిడ్డల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది.
744 మంది చిన్నారులు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 49 భవిత కేంద్రాల్లో 744 మంది దివ్యాంగులు సేవలు అందుకుంటున్నారు. 68 మంది ఐఈఆర్టీలు వీరి ఆలనాపాలనా చూస్తున్నారు. వీరితో పాటు మరో 40 మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. బుద్ధిమాంధ్యం, మాట్లాడటంలో లోపం, పాక్షిక, పూర్తి అంధత్వం, వినికిడి, అభ్యాసనా లోపాలు, స్థిరత్వం లేమితో బాధపడుతున్న పదహారేళ్లలోపు విద్యార్థులకు భవిత కేంద్రాలు విశేష సేవలు అందిస్తున్నాయి.
వైద్య నిర్ధారణ శిబిరాలు
ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కోసం వైద్య నిర్ధారణ శిబిరాలు ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం, కై కలూరులో పూర్తికాగా నూజివీడులో నిర్వహించాల్సి ఉంది. మొత్తం 240 మంది దివ్యాంగులను శిబిరాల ద్వారా గుర్తించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరంలో జరగ్గా, 7న తణుకు, 10న పాలకొల్లులో ఉచిత శిబిరాలు నిర్వహించనున్నారు. శిబిరాల్లో గుర్తించిన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అలింకో కంపెనీ నుంచి హియిరింగ్ ఎయిడ్స్, కాలిపర్స్, వీల్‌చైర్స్, రోలెటర్స్, హ్యాండ్ స్టిక్స్, సీపీ చైర్ వంటి పరికరాలను ఉచితంగా అందించనున్నారు.
సేవలకు వందనం
భవిత కేంద్రాల్లో ప్రత్యేకావసరాల గల చిన్నారులకు ఐఈఆర్టీలు, ఆయాలు ఎనలేని సేవలు అందిస్తున్నారు. ప్రతి వారం ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. దృష్టిలోపం కలిగిన వారికి బ్రెయిలీ లిపిలో బోధిస్తున్నారు. చెవిటి, మూగ వంటి సమస్యలు ఉన్నవారికి స్పీచ్ థెరపీ అందిస్తున్నారు. నడక సరిగా రాని పిల్లల కోసం స్టెప్బర్, వాకింగ్‌బార్‌లు అందు బాటులో ఉన్నాయి. మనోవికాసం వృద్ధి చెందేలా గణిత భావనలు గుర్తుండేలా పూసల చట్రాలు, ఆట వస్తువులు ఉన్నాయి. బుద్ధిమాంధ్యం కలిగిన వారికి ఎంఆర్ కిట్‌లు అందుబాటులో ఉన్నాయి.
స్పీచ్ థెరపీతో మాటలు
ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు హకీమా. పుట్టుకతో మూగ, వినికిడి లోపం. 12 ఏళ్ల హకీమా ఆరేళ్ల క్రితం కైకలూరు భవిత కేంద్రంలో చేరింది. స్పీచ్ థెరపీలో చిన్నారికి ఐఈఆర్టీ జి.వెంకటలక్ష్మి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధగా హకీమాను రోజూ కేంద్రానికి తీసుకొస్తున్నారు. దీంతో బాలిక అక్షరాలను అర్థం చేసుకుంటోంది. ప్రస్తుతం ఉర్దూ పాఠశాలలో చదువుకుంటోంది.
త్వరలో శస్త్రచికిత్సలు
ప్రభుత్వం ప్రత్యేకావసరాల చిన్నారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. సహాయకులకు అలవెన్సు లు, రవాణా ఖర్చులు అంది స్తున్నాం. బుద్ధిమాంద్యం కలిగిన వారికి ఉచితంగా ఇచ్చే సీపీ చైర్ విలువ రూ.35 వేలు ఉంటుంది. నాడు–నేడు పథకంలో ప్రభుత్వం భవిత కేంద్రాలను తీర్చిదిద్దుతోంది. గ్రహణంమొర్రి, గ్రహణశూల, కండరాలలోపంతో బాధపడే వారికి త్వరలో శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి.
– బి.భాస్కరరాజు, ఐఈఆర్టీ జిల్లా కో–ఆర్డినేటర్, ఏలూరు
భవిత కేంద్రాల వివరాలు
ఏలూరు ‘పశ్చిమ’
కేంద్రాలు 29 20
చిన్నారులు 484 280
ఐఈఆర్టీలు 38 27
ఫిజియో-
థెరపిస్టులు 9 7
ఆయాలు 20 20
Comments
Please login to add a commentAdd a comment