physically challenged
-
TS: వికలాంగులకు మరో వెయ్యి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘వికలాంగులకు ఇప్పటివరకు రూ.3,116 ఇస్తున్నాం. శుక్రవారం మంచి రోజు. ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వికలాంగుల పింఛను మరొక వెయ్యి పెంచుతున్నం. మంచిర్యాల గడ్డ, తెలంగాణ ఈశాన్య ప్రాంతం నుంచే ఈ మాట ప్రకటించాలని నేను సస్పెన్స్‌లో పెట్టా. వచ్చే నెల నుంచే పెరిగిన రూ.4,116 అందిస్తాం..’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అధ్యక్షతన జరిగిన మంచిర్యాల ప్రగతి నివేదన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. దేశానికే తలమానికంగా తెలంగాణ ‘దేశంలో తెలంగాణ అన్నింటా నంబర్ వన్‌గా నిలుస్తోంది. మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేసి చక్కటి కలెక్టరేట్ నిర్మించాం. మెడికల్ కాలేజీ అనుబంధంగా ఆసుపత్రి కూడా సమకూర్చుకుంటున్నాం. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ సమకూర్చుకుంటూ దేశానికే తలమానికంగా రాష్ట్రాన్ని మార్చు కున్నాం. పెద్ద రాష్ట్రాల్లో తలసరి ఆదాయం, విద్యుత్ వినియోగం, మంచి గ్రామం, ము న్సిపాలిటీల్లో నంబర్ వన్ ఎవరంటే తెలంగాణ. మిషన్ భగీరథతో ప్రతిఇంటికీ నల్లా పెట్టి అందరికీ నీళ్లుసరఫరా చేసే రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమే. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నాం. రైతుబంధుతో రూ.68 వేల కోట్లు రైతులకు అందించాం. గతంలో పంటలు పండాలంటే కరెంట్, నీళ్లు లేక గోస పడిన సంగతి తెలిసిందే. ఈ యాసంగిలో దేశంలో వరి 94 లక్షల ఎకరాల్లో సాగైతే ఒక్క తెలంగాణలోనే 54.40 లక్షల ఎకరాల్లో సాగైంది. వరి ఉత్పత్తిలో పంజాబ్‌ను మించిపోయింది. దేశంలోనే అతి ఎక్కువగా వడ్లు పండిస్తూ నంబర్ వన్‌గా నిలిచాం. గతంలో కోటి టన్నులు పండితే ఎక్కువ అనుకున్నాం. అటువంటిది మూడు కోట్ల టన్నుల పై చిలుకు బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఇదంతా ప్రభుత్వ సహకారం, రైతుల కష్టంతోనే సాధ్యమైంది..’ అని కేసీఆర్ చెప్పారు. ఇలాంటి గోదావరి చూస్తామా అనుకున్నాం.. ‘రూ.500 కోట్లతో మందమర్రి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశాం. ఆదివాసీ, గిరిజ నులకు పోడు పట్టాలు ఇస్తున్నాం. యాదవులకు గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. ఎంబీసీ, బీసీ కులాల వారికి రూ.లక్ష సాయం అందిస్తున్నాం. సొంత జాగా ఉంటే రూ.3 లక్షల సాయం ఇచ్చే పథకాన్ని ప్రారంభించుకున్నాం. గతంలో గోదారిలో రూపాయి బిళ్ల వేద్దామంటే నీళ్లు కనిపించేవి కావు. బ్రిడ్జి మీద అటు ఇటు తిరిగి మడుగులో ఎక్కడో వేసి వెళ్లిపోయేవాడ్ని. ఈ రోజు హెలికాప్టర్లో వస్తుంటే బ్రçహ్మాండంగా గోదావరి ఉంది. ఇలాంటి గోదావరి చూస్తామా? అనుకున్నాం. గోదా వరిఖనికి చెందిన సదాశివ కవి ‘తలాపున పారు తుంది గోదావరి, మా చేన్లు, మా చెలక ఎడారి అని పాడేవారు’ ఈ రోజు ఎంత బ్రహ్మాండంగా ఉందో మీరంతా చూస్తున్నారు. చెన్నూరు ఎత్తిపోతలు, వార్దా బ్యారేజీతో ఆసిఫాబాద్, సిర్పూర్, బెల్లంపల్లికి లక్ష ఎకరాల చొప్పున. సాగు నీరందిస్తాం..’ అని చెప్పారు. సింగరేణి నడకా మారింది.. ‘నిజాం మొదలు పెట్టిన 134 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి మన సొంత ఆస్తి. కాంగ్రెస్ హయాంలో సర్వ నాశనం చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు తెచ్చి, చెల్లించలేక సొంత కంపెనీని 49 శాతం వాటా కింద అమ్మేశారు. సమ్మెలు, కార్మికుల అణిచివేత ఉండేది. 2014 కంటే ముందు రూ.11 వేల కోట్ల టర్నోవర్‌తో, కార్మికులకు 18 శాతం బోనస్‌తో రూ.56 కోట్లు మాత్రమే సింగరేణి పంచేది. ఈ రోజు సింగరేణి నడక మారింది. ప్రస్తుతం రూ.33 వేల కోట్ల టర్నోవర్ ఉంది. ఈ సంవత్సరం రూ.2,184 కోట్ల లాభాలు వచ్చాయి. ఇప్పుడు వచ్చే దసరాకు రూ.700 కోట్ల లాభాలు వస్తాయి. కాంగ్రెస్ హయాంలో 6,453 ఉద్యోగాలు ఇస్తే, డిపెండెండ్ల ఉద్యోగాలు పునరుద్ధరించి 15, 256మందికి ఉద్యోగాలిచ్చాం. ఇవికాక మరో 19,463 ఉద్యోగాలు ఇచ్చాం. ప్రమాదం జరిగితే కార్మికులకు రూ.లక్ష ఇచ్చి చేతులు దులి పే సుకునేవారు. ప్రస్తుతం రూ.10 లక్షలు ఇస్తున్నా. దశాబ్ది ఉత్సవాల్లో అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. మందమర్రిలో బీసీ గురుకులానికి చెందిన ఓ అమ్మాయికి 470కు 468 మార్కులు వచ్చాయి. కలెక్టర్ అయ్యేందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి రూ.5 లక్షల చెక్కు పంపిస్తామని చెప్పాం. బ్యాంకులో వేసుకుని చదువుకోమన్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేశాం. ఈ ఏడాది 1.30 లక్షల మందికి దళితబంధు ఇస్తాం..’ అని సీఎం తెలిపారు. సింగరేణికి తాళం వేయనిద్దామా? ‘కాంగ్రెస్ వాళ్లు సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రానికి అమ్మేశారు. ఇప్పుడు బొగ్గు గనుల ప్రైవే టీకరణతో సింగరేణి తాళం వేస్తామంటున్నారు. వేయనిద్దామా? సింగరేణిని నిండా ముంచేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. మోదీ తెలంగాణలో గనులు ప్రైవేటీకరణ చేయమని చెప్పి, బెంగళూరు వెళ్లి టెండర్లు పిలిచి మోసం చేశారు. అస్సాంలో పంకాలు బంద్జేయ్ మంటర్రు, ఇంకో దగ్గర ఏసీలు బంద్ చేయిమంటున్నాం, దేశ రాజధాని ఢిల్లీలో పవర్ కట్ ఉంది. కానీ నిరంతరంగా ఎటువంటి అవరోధాలు లేకుండా 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే..’ అని స్పష్టం చేశారు రైతు బొటన వేలితో పట్టామార్పు ‘గతంలో ధరణి రాకముందు రికార్డుల మార్పులకు లంచం ఇవ్వాల్సి వచ్చేది. ఆ అధికారం ఆఫీసర్లకు ఉండేది. ఇప్పుడు ఆ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుకు అప్పగించింది. వీఆర్ఏ నుంచి సీఎం వరకు ఎవరూ మార్చలేరు. రైతు బొటన వేలితో మాత్రమే మారుతుంది. ప్రతి మండల ఆఫీసులో రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఐదు నిమిషాల్లో పట్టా అవుతోంది. రైతుబీమా కింద రూ.5 లక్షలు బాధిత రైతులకు పది రోజుల్లోనే అందుతోంది. గతంలో వడ్లు అమ్ముకునేందుకు సేట్ల చుట్టూ తిరిగేవారు. ప్రస్తుతం నేరుగా డబ్బులు బ్యాంకుల్లో పడుతున్నాయి. తెలంగాణ భూ భాగమే 2.75 కోట్ల ఎకరాలు. ఇందులో 1.55 లక్షల ఎకరాలు ధరణిలో ఎక్కాయి. 66 లక్షల ఎకరాల అటవీ భూమి ఉంది. మిగిలిన కుంటలు, బావులు, ఇళ్లు తీసేస్తే ఒక లక్ష వరకు మాత్రమే ఉంది. 99 శాతం పోర్టల్‌లో ఎక్కింది. కానీ ఎలక్షన్లు రాగానే «కాంగ్రెస్ వాళ్లు ధరణి తీసేస్తాం, బంగాళాఖాతంలో వేస్తాం అంటున్నారు. వాళ్లనే బంగాళాఖాతంలో విసిరెయ్యాలి. నేను మూడేళ్లు చెమటోడ్చి కష్టపడి రైతు బాధలు పోవాలనే ఈ పోర్టల్ రూపొందించా. అంతకుముందు పె³రిగిన భూముల ధరలతో ఎన్నో కొట్లాటలు జరిగేవి. ఈ రోజు పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయి. భూమి ఉందో లేదో కంప్యూటర్లో చూసుకోవచ్చు. అలాంటి ధరణి ఉండాలా? వద్దా? (చేతులు లేపాలని సీఎం కోరారు). ధరణి తీసేస్తే మళ్లీ దళారీ రాజ్యం వస్తుంది. రైతుబంధు, బీమా ఎలా వస్తాయి. దీనిపై గ్రామాల్లో చర్చ పెట్టాలి..’ అని సీఎం కోరారు. సభకు ముందు రూ.ç55 కోట్లతో సమీకృత జిల్లా కార్యాలయ భవనం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, రూ.1,658 కోట్లతో చెన్నూరు ఎత్తిపోతల పథకం, రూ.205 కోట్లతో మంచిర్యాల మెడికల్ కాలేజీ, రూ.164 కోట్లతో మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జి, రూ.500 కోట్లతో మందమర్రి ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీతో పాటు ఎంబీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష సాయం, సొంతింటి పథకానికి రూ.3 లక్షల సాయం (గృహలక్ష్మి), రెండో విడత గొర్రెల పంపిణీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. మాజీ స్పీకర్ మధుసూదనచారి, మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, కోనప్ప, రేఖానాయక్, రాథోడ్ బాపురావు, జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు. కాగా సీఎం కేసీఆర్, అధికారులు, ప్రజాప్రతినిధులకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. నూతన కలెక్టరేట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి.. కలెక్టర్ బాదావత్ సంతోష్‌ను కుర్చీలో కూర్చోబెట్టి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. సీఎం వెంట సీఎస్ శాంతికుమారి, మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీలు జె.సంతోష్‌కుమార్, బొర్లకుంట వెంకటేష్ నేత, చీఫ్ విప్ తానిపర్తి భానుప్రసాద్‌రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మధుసూదనాచారి, దండే విఠల్, తాటిపర్తి జీవన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు. గోదావరిమాతకు కేసీఆర్ పూజలు గోదావరిఖని: మంచిర్యాల జిల్లా పర్యటను ముగించుకుని రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరిఖని సమీపంలోని గోదావరి బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి నిండుకుండలా ఉన్న గోదావరి తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. వేద బ్రాహ్మణోత్తముల మంత్రోచ్ఛరణల మధ్య పూలు, చీరసారె నదిలో వేసి కానుకలు సమర్పించుకున్నారు. అనంతరం గోదావరి తల్లికి మహాహారతి ఇచ్చారు. -
అదిగో నవలోకం.. వారికి అండగా ఆమె! దగ్గరుండి మరీ పెళ్లిళ్లు చేస్తూ..
ఉన్నది ఒకటే జీవితం ... కోరుకున్న విధంగా బతకాలన్నదే తాపత్రయం.. అడ్డుపడే వైకల్యం .. అడ్డంపడే కుటుంబ నిబంధనల నుంచి తమకంటూ ఓ కొత్త లోకాన్ని ఏర్పాటు చేసుకోవాలని తపించే వారికి అండగా ఉంటుంది కృష్ణప్రియ. హైదరాబాద్ ఉప్పల్‌లో ఉంటున్న దివ్యాంగురాలైన కృష్ణప్రియ తను నిలదొక్కుకోవడమే కాకుండా తనలాంటి వారికి దగ్గరుండి మరీ పెళ్లిళ్లు చేస్తోంది. కష్టపడుతూనే ఇష్టమైన జీవన ఫలాలను అందుకోవడానికి తపిస్తున్న కృష్ణప్రియను కలిస్తే తమ గురించి ఇలా వివరించింది.. ‘‘మూడేళ్ల వయసులో నరాల సమస్య వల్ల కాళ్లు రెండు చచ్చుబడిపోయాయి. అయినా, నా ఉత్సాహం చూసి స్కూల్ చదువు వరకు చెప్పించారు మా అమ్మానాన్న. ఇక చదువు వద్దు అంటే నేనే మొండికేసి ఇంటర్మీడియెట్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత ఇంట్లోనే ఉండేదాన్ని. ఇంట్లో సినిమాలు చూడటానికి కంప్యూటర్ తీసుకున్నారు నాన్న. ఖాళీ సమయంలో యూ ట్యూబ్ చూసి డిజిటల్ వర్క్స్ నేర్చుకున్నాను. డిటిపీ వర్క్స్, ఆన్లైన్, సోషల్‌మీడియా వర్క్స్ చేస్తుండేదాన్ని. హాస్టల్లో ఉండి నన్ను నేను పోషించుకుంటాను అని ఓ రోజు చెప్పాను. ‘మేం నీకు ఇంత తిండి పెట్టలేమా? బయట అవస్థలు పడుతుంటే నలుగురు చూసి ఏమనుకుంటారు?’ అని అమ్మానాన్నా, ‘నడవడమే సరిగా రాదు, ఏం సాధిస్తావని, ఇంటి పట్టున ఉండక’ అని తెలిసినవాళ్లు.. ఇలాంటి మాటలు విని విని విసిగిపోయాను. ప్రతిదానికి ఇంట్లో వారిపై ఆధారపడటం, భారంగా ఉండటం ఇష్టం లేక ఎనిమిదేళ్ల క్రితం బయటకు వచ్చేశాను. మూడేళ్లు ఒక్కదాన్నే రూమ్ తీసుకుని ఉన్నాను. వచ్చిన కంప్యూటర్ వర్క్స్ నాకు కొంత ఆదాయాన్ని తెచ్చిపెట్టేవి. ఒక్కొక్కరూ జతగా చేరి.. దివ్యాంగుల కోసం పనిచేస్తున్న ఎన్జీవోలను కలిశాను. అక్కడ నాలాంటి వారెందరో కలిశారు. వైకల్యం ఎలాగూ బాధిస్తుంది. మరొకరి మీద ఆధారపడటం మరింతగా బాధిస్తుంది. ఇంట్లో వారిమీద ఆధారపడటం ఇష్టలేని కొంతమంది దివ్యాంగ అమ్మాయిలు నాతో కలిశారు. దీంతో పెద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాను. ఇంటి యజమానులు మాకు అద్దెకు ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడేవారు కాదు. ‘మీ పనులు మీరే సరిగా చేసుకోలేరు. ఇక ఇంటినేం శుభ్రంగా ఉంచుతారు’ అనేవారు. కొన్ని రోజుల ప్రయత్నంతో ఎలాగో ఇల్లు దొరికింది. మరో ఆరుగురు నాతో కలిశారు. చిన్న హాస్టల్లా ‘ఆద్య’ అనే పేరుతో దివ్యాంగుల కోసం హోమ్ ప్రారంభించాను. మాలాంటి వారి సమస్యల పట్ల మాకే అవగాహన ఉంటుంది కాబట్టి, అందరం ఒకింటి సభ్యుల్లా కలిసిపోయాం. పెళ్లితో కొత్త జీవితం.. దివ్యాంగుల చదువు, ఉద్యోగం, పెళ్లి .. ప్రయత్నాల్లో ఉండేవారికి, తమ గురించి తాము ఆలోచించుకోవడానికి తగిన వాతావరణం గల ప్రత్యేక హోమ్స్ అంటూ ఏమీ లేవు. జీవితంలో నిలదొక్కుకోవడానికి కావాల్సిన వాతావరణం కల్పించే సరైన వసతి మాకు ఎక్కడా కనిపించలేదు. దాంతో ఎక్కువ వైకల్యం ఉన్న వారికోసం నేనే అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాను. రెండేళ్ల క్రితం దివ్యాంగుడైన సత్తయ్యను పెళ్లి చేసుకున్నాను. అతను ఫ్లోర్వాకర్. ఎన్జీవోల సాయంతో చిన్న షాప్ నడుపుతున్నాడు. నాకంటూ ఓ జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నాతోపాటు ఉన్న అమ్మాయిలలో నలుగురికి దగ్గరుండి పెళ్లిళ్లు జరిపించాను. ఇందుకు అవసరమైన డబ్బులను పోగుచేయడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. అవమానకరంగా మాట్లాడినవారూ ఉన్నారు. కానీ, మాకూ ఓ జీవితం ఉందని తెలియజేయాలనుకున్నాను. దివ్యాంగులైన అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి కొంచెం వెనకంజ వేసేవారు. తమనెవరు పెళ్లి చేసుకుంటారనే నిస్పృహ వారిలో ఉండేది. ఇందుకోసం చాలా కౌన్సెలింగ్ చేయాల్సి వచ్చింది. మాకు ఇళ్లలో చదువు, కళలు, వ్యాపారాలు, వృత్తి విద్యలæపట్ల ఆసక్తి ఉన్నా పెద్దగా ప్రోత్సాహం ఉండదు. ఎంత టాలెంట్ ఉన్నా ఎంత వయసు వచ్చినా ఏళ్ళకేళ్లు ఇంటికే పరిమితమవ్వాలి. ఇక వివాహం .. కల్లో కూడా ఊహించలేం. ఈ పరిస్థితులన్నీ మనకు మనమే అధిగమించాలని చెబుతుంటాను. మాకు మేమే పరిష్కారం మాకు అసలు పెళ్లి భాగ్యం ఉందా అనుకున్న అమ్మాయిలు ఒకింటి వారై తమకు తాముగా కొత్త జీవితాన్ని గడుపుతుండటం చాలా ఆనందంగా ఉంటుంది. దివ్యాంగుల పెళ్ళిళ్లు, పోషణ నిమిత్తం మా స్నేహితులు, బంధువులు, ఎన్జీవోల సాయం తీసుకుంటున్నాను. ‘ఇవన్నీ ఎందుకు? మీరే చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మళ్లీ పెళ్ళిళ్లు చేసుకొని ఎందుకు కష్టపడతారు’ అంటుంటారు. కానీ, మాకూ ఓ కుటుంబ జీవనం కావాలని, నలుగురిలో మేమూ గొప్పగా జీవించాలనీ ఉంటుంది కదా! అందుకే ఇంతగా తాపత్రయపడుతున్నాను. భార్యాభర్తలు ఇద్దరూ దివ్యాంగులే అయితే, మా సమస్యలు మాకు బాగా అర్ధం అవుతాయి. ఒకరికొకరం తోడుగా ఉంటాం. దివ్యాంగ సమావేశాలు ఎక్కడ జరిగినా, మాకు అందే అవకాశాల గురించి ఎప్పటికప్పుడు మీటింగ్‌లు ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడ అందరూ ఆప్యాయంగా అక్కా అని పిలుస్తుంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా చెప్పుకోవడానికి తోడున్నామనే భరోసా ఉంది. మరిన్ని అవకాశాలు లభిస్తే ఎవరి మీదా ఆధారరపడకుండా బతకాలన్నదే మా ఆలోచన’’ అని వివరించింది కృష్ణప్రియ. దివ్యంగా ఉన్న ఆమె ఆశయాలు నెరవేరాలని కోరుకుందాం. – నిర్మలారెడ్డి -
దివ్యాంగులకు బంగారు భవిత
కైకలూరు (ఏలూరు జిల్లా): దివ్యాంగుల జీవితాల్లో భవిత కేంద్రాలు చిరుదివ్వెలు వెలిగిస్తున్నాయి. విధి వంచించిన విభిన్న ప్రతిభావంతుల్లో మార్పు తీసుకువస్తున్నాయి. కేంద్రాల్లోని ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్లు(ఐఈఆర్టీ) తల్లిదండ్రులకంటే మిన్నగా చిన్నారులకు సేవలు అందిస్తున్నారు. అడుగుతీసి అడుగువేయలేని స్థితిలో చేరిన దివ్యాంగులకు నడక నేర్పి విద్యాబుద్ధులు అందిస్తున్నారు. ప్రత్యేకావసరాల పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా ఆధునిక పరికరాలు అందిస్తోంది. దీంతో తమ బిడ్డల్లో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తోంది. 744 మంది చిన్నారులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 49 భవిత కేంద్రాల్లో 744 మంది దివ్యాంగులు సేవలు అందుకుంటున్నారు. 68 మంది ఐఈఆర్టీలు వీరి ఆలనాపాలనా చూస్తున్నారు. వీరితో పాటు మరో 40 మంది ఆయాలు విధులు నిర్వహిస్తున్నారు. బుద్ధిమాంధ్యం, మాట్లాడటంలో లోపం, పాక్షిక, పూర్తి అంధత్వం, వినికిడి, అభ్యాసనా లోపాలు, స్థిరత్వం లేమితో బాధపడుతున్న పదహారేళ్లలోపు విద్యార్థులకు భవిత కేంద్రాలు విశేష సేవలు అందిస్తున్నాయి. వైద్య నిర్ధారణ శిబిరాలు ప్రత్యేక అవసరాలు కలిగిన బాలబాలికలకు ఉచిత ఉపకరణాల పంపిణీ కోసం వైద్య నిర్ధారణ శిబిరాలు ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం, కై కలూరులో పూర్తికాగా నూజివీడులో నిర్వహించాల్సి ఉంది. మొత్తం 240 మంది దివ్యాంగులను శిబిరాల ద్వారా గుర్తించారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరంలో జరగ్గా, 7న తణుకు, 10న పాలకొల్లులో ఉచిత శిబిరాలు నిర్వహించనున్నారు. శిబిరాల్లో గుర్తించిన దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అలింకో కంపెనీ నుంచి హియిరింగ్ ఎయిడ్స్, కాలిపర్స్, వీల్‌చైర్స్, రోలెటర్స్, హ్యాండ్ స్టిక్స్, సీపీ చైర్ వంటి పరికరాలను ఉచితంగా అందించనున్నారు. సేవలకు వందనం భవిత కేంద్రాల్లో ప్రత్యేకావసరాల గల చిన్నారులకు ఐఈఆర్టీలు, ఆయాలు ఎనలేని సేవలు అందిస్తున్నారు. ప్రతి వారం ఫిజియోథెరపీ చేయిస్తున్నారు. దృష్టిలోపం కలిగిన వారికి బ్రెయిలీ లిపిలో బోధిస్తున్నారు. చెవిటి, మూగ వంటి సమస్యలు ఉన్నవారికి స్పీచ్ థెరపీ అందిస్తున్నారు. నడక సరిగా రాని పిల్లల కోసం స్టెప్బర్, వాకింగ్బార్లు అందు బాటులో ఉన్నాయి. మనోవికాసం వృద్ధి చెందేలా గణిత భావనలు గుర్తుండేలా పూసల చట్రాలు, ఆట వస్తువులు ఉన్నాయి. బుద్ధిమాంధ్యం కలిగిన వారికి ఎంఆర్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. స్పీచ్ థెరపీతో మాటలు ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారి పేరు హకీమా. పుట్టుకతో మూగ, వినికిడి లోపం. 12 ఏళ్ల హకీమా ఆరేళ్ల క్రితం కైకలూరు భవిత కేంద్రంలో చేరింది. స్పీచ్ థెరపీలో చిన్నారికి ఐఈఆర్టీ జి.వెంకటలక్ష్మి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. తల్లిదండ్రులు కూడా శ్రద్ధగా హకీమాను రోజూ కేంద్రానికి తీసుకొస్తున్నారు. దీంతో బాలిక అక్షరాలను అర్థం చేసుకుంటోంది. ప్రస్తుతం ఉర్దూ పాఠశాలలో చదువుకుంటోంది. త్వరలో శస్త్రచికిత్సలు ప్రభుత్వం ప్రత్యేకావసరాల చిన్నారుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. సహాయకులకు అలవెన్సు లు, రవాణా ఖర్చులు అంది స్తున్నాం. బుద్ధిమాంద్యం కలిగిన వారికి ఉచితంగా ఇచ్చే సీపీ చైర్ విలువ రూ.35 వేలు ఉంటుంది. నాడు–నేడు పథకంలో ప్రభుత్వం భవిత కేంద్రాలను తీర్చిదిద్దుతోంది. గ్రహణంమొర్రి, గ్రహణశూల, కండరాలలోపంతో బాధపడే వారికి త్వరలో శస్త్రచికిత్సలు అందుబాటులోకి రానున్నాయి. – బి.భాస్కరరాజు, ఐఈఆర్టీ జిల్లా కో–ఆర్డినేటర్, ఏలూరు భవిత కేంద్రాల వివరాలు ఏలూరు ‘పశ్చిమ’ కేంద్రాలు 29 20 చిన్నారులు 484 280 ఐఈఆర్టీలు 38 27 ఫిజియో- థెరపిస్టులు 9 7 ఆయాలు 20 20 -
దివ్యాంగులకు రిజర్వేషన్లు పెంచి మానవత్వం చూపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో దివ్యాంగులకు రిజర్వేషన్లను మూడు నుంచి నాలుగు శాతానికి పెంచి మానవత్వం చూపారని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు గురువారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. దివ్యాంగులకు రిజర్వేషన్లు పెంచాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో త్వరలో వందలాదిమంది దివ్యాంగులతో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు చెబుతామని తెలిపారు. సీఎం నిర్ణయం పట్ల రాష్ట్రంలోని సుమారు పదిలక్షల మంది దివ్యాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. చదవండి: (22న సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన) -
మతి స్థిమితం లేని మహిళపై.. ట్రాఫిక్ ఏఎస్ఐ అమానుషం
సాక్షి, బనశంకరి (కర్ణాటక): మతి స్థిమితం లేని మహిళపై కనికరం లేకుండా దౌర్జన్యం చేసిన హలసూరు ట్రాఫిక్ ఏఎస్ఐ ఆర్.నారాయణ్‌ను నగర పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ సస్పెండ్ చేశారు. నారాయణ్ దాడిపై అన్నివైపులా నుంచి ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో కమిషనర్ చర్యలు తీసుకోక తప్పలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఏఎస్ఐ నారాయణ్ టోయింగ్ వాహనంలో ఉండగా మతిస్థిమితం లేకుండా రోడ్డుపై అనాథగా తిరుగుతున్న మంజుల అనే మహిళ రాయి విసిరింది. అది తగిలి ఏఎస్ఐకి ముఖం మీద రక్తం కారింది. వెంటనే వాహనం నుంచి దిగిన ఏఎస్ఐ ఆ మహిళను అసభ్యంగా దూషిస్తూ ఇష్టానుసారం కొట్టాడు. కొట్టొద్దు అని ఆమె అతని కాళ్లపై పడితే బూటుకాళ్లతో తన్నాడు. జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. ఈ దారుణమంతా కొందరు వీడియోలు తీయడంతో సోషల్ మీడియాలో, టీవీ చానెళ్లలో వైరల్ అయ్యింది. ఎందుకనో ఆ మహిళకు టోయింగ్ చేయడం కనబడితే సహించలేకపోతున్నట్లు తెలిసింది. ఎక్కడైనా టోయింగ్ చేస్తుంటే అడ్డుకునేదని స్థానికులు తెలిపారు. ఈ ఘటన అనంతరం ఎస్జే.పార్కు పోలీసులు మహిళను అరెస్ట్ చేశారు. విచారణ చేయిస్తాం: హోంమంత్రి ట్రాఫిక్ ఏఎస్ఐ దౌర్జన్యంపై హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర విచారణకు ఆదేశించారు. ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదు, దీనికి పోలీసులు మినహాయింపు కాదన్నారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులూ హద్దులు దాటొద్దు: సీఎం శివాజీనగర: టోయింగ్ వ్యవస్థను పునర్ పరిశీలిస్తామని, కాపాడాల్సిన వారే హద్దులు దాటి ప్రవర్తిస్తే తాను సహించనని సీఎం బసవరాజ బొమ్మై హెచ్చరించారు. ఆదివారం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా విధానసౌధ ఆవరణలోని ఆయన విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. ట్రాఫిక్ ఏఎస్ఐ ఉదంతాన్ని గమనించానని, ప్రజలతో చట్టబద్ధంగా నడుచుకోవాలని సూచించారు. పోలీస్ వ్యవస్థపై సోమవారం డీజీపీ, పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో సమావేశమై ప్రజలతో సత్సంబంధాలతో ప్రవర్తించేలా తీర్మానాలు చేస్తానన్నారు. -
రాంగ్ కాల్.. ఆ దివ్యాంగురాలి జీవితాన్నే మార్చేసింది..
సాక్షి, రాయచూరు(కర్ణాటక): అనుకోకుండా ఫోన్ ద్వారా పరిచయమైన దివ్యాంగురాలిని ఆర్టీసీ ఉద్యోగి ప్రేమించి ఆదర్శ వివాహం చేసుకున్నాడు. యాదగిరి తాలకా హుణసిగి బాగప్ప(34) బెంగళురు కేఎస్ ఆర్టీసీలో విధులు నిర్వహిస్తున్నాడు. తెలిసినవారికి ఫోన్ చేస్తుండగా ఆ కాల్.. అనుకోకుండా.. విజయపుర ముద్దేబిహాళ్ తాలకా తరర్కు చెందిన రేణుక(32)కు వెళ్లింది. అప్పటి నుంచి ఇద్దరూ తరచూ ఫోన్లోనే మాట్లాడుకునేవారు. రేణుక దివ్యాంగురాలు. టెన్త్ చదివి ఇంటి వద్దనే ఉంటోంది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఒప్పించి శనివారం విజయపురలోని అంబేడ్కర్ భవన్లో వివాహం చేసుకున్నారు. -
అపురూపం.. ఈ జంట వివాహం
సాక్షి, చెళ్లకెరె రూరల్(కర్ణాటక) : వినికిడి లోపంతో పాటు మాటలు రాని ఓ జంట ఆదివారం వివాహం ద్వారా ఒక్కటయ్యారు. తాలూకాలోని సిద్దా పుర గ్రామానికి చెందిన మంగళమ్మ, మంజునాథ్ దంపతుల కుమార్తె సౌమ్య, దావణగెరెకు చెందిన యమునమ్మ మంజణ్ణ దంపతుల కుమారుడు పరశురామలు పెద్దల సమక్షంలో ఒక్కటవ్వానుకున్నారు . ఈ క్రమంలో, ఆదివారం కరోనా నిబంధనలు పాటిస్తూ వివాహం చేసుకున్నారు. వీరికి మాటలు రావు, వినపడవు. నూతన దంపతులను పెద్దవాళ్లందరు ఆశీర్వదించారు. ఒకరి మనసును మరొకరు తెలుసుకుని అన్యోన్యంగా ఉండాలని పెద్దవాళ్లు ఆశీర్వదించారు. వీరి పెళ్లి పలువురికి ఆదర్శంగా నిలిచింది. చదవండి: Karnataka: రోహిణి సింధూరి బదిలీ వెనుక రాజకీయ నాయకుల కుట్ర.. -
ఘోరం: దివ్యాంగురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆపై
సాక్షి, హోసూరు(కర్ణాటక): క్రిష్ణగిరి జిల్లా సింగారపేట సమీపంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన శ్రీబాలు (32). ఇతనికి గత 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగి ముగ్గురు పిల్లలున్నారు. గత కొద్ది నెలల క్రితం భార్య గొడవ పడి పుట్టింటికెళ్లిపోయింది. ఈ సమయంలో అతడు 28 ఏళ్ల దివ్యాంగురాలితో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఫిబ్రవరి నుంచి అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ప్రస్తుతం మూడు నెలల గర్భవతి అయిన ఆమె వెంటనే పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించి హత్య చేస్తానని బెదరించాడు. బాధితురాలు సింగారపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. చదవండి: రాసలీలల కేసు: సీడీ కేసు విచారణ ఇలాగేనా? -
సోనూసూద్ స్ఫూర్తితో.. ఆటోవాలా ఔదార్యం
సాక్షి, బంజారాహిల్స్: ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ సేవా కార్యక్రమాలు గత ఏడాది కాలంగా అందరూ కళ్లారా చూస్తున్నారు. సోనూసూద్ ఇతరులకు సహాయ కార్యక్రమాలు చేస్తుంటే ఆయన ఆదర్శంగా మనమెందుకు చేయకూడదని ఓ ఆటోవాలా భావించాడు. తన చేతిలో ఉన్న కళను సేవా కార్యక్రమాలకు వినియోగించుకుంటూ సోనూసూద్‌పై అభిమానం చాటుకుంటున్నాడు. సోనూసూద్ అభిమాని అయిన ఈ ఆటో డ్రైవర్ వికలాంగులకు, గర్భిణులకు, అవిటివారికి తన ఆటోలో ఉచితంగా ప్రయాణం కల్పిస్తూ సేవాతత్పరత చాటుకుంటున్నాడు. ఆయన చేస్తున్న ఈ సేవ ప్రతి ఒక్కరినీ కదిలించడమే కాకుండా సోనూసూద్‌ను మరోసారి గుర్తు చేస్తుంది. చదవండి: పాజిటివ్ వచ్చింది.. సేవకు మరింత టైం దొరికింది.. -
అతని బుల్లెట్ గాయం..వికలాంగ విద్యార్థులకు వరం!
జీవితం అందరికీ పూలపాన్పులా ఉండదు. మనం వెళ్లే దారిలో ముళ్లు, రాళ్లు గుచ్చుకుంటాయి. వాటిని తీసేస్తూ..గాయాలు చిత్రవధ చేస్తున్నా ముందుకుసాగాల్సిన గడ్డు పరిస్థితులు ఎన్నో ఎదురవుతాయి. వీటన్నింటినీ దాటుకుని జీవితాన్ని నిలబెట్టుకునే వారు మన సమాజం లో ఎందరో ఉన్నారు. ఈ కోవకు చెందినవారే కశ్మీర్‌కు చెందిన జావేద్ అహ్మద్ తక్. ఉగ్రదాడి లో తన జీవితాన్నీ కోల్పోయినప్పటికీ నిరాశా నిస్పృహలలో కూరుకుపోకుండా తన జీవితాన్నీ నిలబెట్టుకుని.. తనలాగా అంగవైకల్యంతో బాధపడుతోన్న పిల్లలకు చదువు చెబుతూ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు జావేద్. అది 1997 జావేద్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అనంతనాగ్‌లో తన అంకుల్ ఇంట్లో జావేద్ ఉండగా అర్ధరాత్రి ఆ ఇంటిపై ముష్కరులు దాడిచేశారు. ఆ సమయంలో తన కజిన్‌ను కాపాడేందుకు ప్రయత్నించిన జావేద్‌కు బుల్లెట్ తగిలింది. బుల్లెట్ వెన్నుపూసకు తగలడంతో మూత్రపిండాలు, క్లోమం, పేగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఆసుపత్రిలో ఒక సంత్సరంపాటు చికిత్స తీసుకున్న తరువాత 1998లో జావేద్ డిశ్చార్జ్ అయ్యాడు. ఆ తరువాత కూడా కదలలేని పరిస్థితుల్లో మరో మూడేళ్లు మంచానికే పరిమితమయ్యాడు. అలా మంచం మీద ఉన్న జావేద్‌కు తన ఇంటిపక్కన పిల్లలు అరుస్తూ ఆడుకుంటున్న శబ్దాలు వినపడేవి. అలా వింటూ 2000 సంవత్సరంలో ఆ పిల్లలందరికి ఉచితంగా చదువు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అప్పటినుంచి తనను తాను మోటివేట్ చేసుకుంటూ..పిల్లలకు ఎలా చదువు చెప్పాలి వంటి అంశాలపై ఆలోచించి ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగాలనుకున్నాడు. జెబాఅపా.. 2006లో అంగవైకల్యంతో బాధపడే పిల్లల కోసం ఒక అద్దె భవనంలో ‘జెబాఅపా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్’ పేరిట స్కూలును ప్రారంభించాడు జావేద్. తన బంధువులు, స్నేహితులు చుట్టపక్కల ఊళ్లలోని అంగవైకల్యం కలిగిన పిల్లలను జెబాఅపాలో చేర్చేవారు. జావేద్ మరికొంతమంది టీచర్లను నియమించుకుని స్కూలును నడపడం ప్రారంభించాడు. స్కూల్‌తోపాటు తనూ.. మధ్యలో ఆపేసిన చదువును కొనసాగించాడు. ఈ క్రమంలోనే 2007లో కశ్మీర్ యూనివర్సిటీలో సోషల్ వర్క్‌లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. మొదట్లో ప్రాథమిక తరగతులకే పరిమితమైన జెబా స్కూలు తరువాత ఎనిమిదో తరగతివరకు పొడిగించారు. 120 మంది వికలాంగ విద్యార్థులు 25 మంది టీచర్లతో స్కూలును విజయవంతంగా నడిపిస్తున్నారు. స్పెషల్లీ ఏబుల్డ్ (వికలాంగులు) విద్యార్థులు కావడం తో వారికి ప్రత్యేకమైన పద్ధతుల ద్వారా చదువు చెప్పడంతోపాటు, స్పీచ్ థెరపిస్టులతో పాఠాలు నేర్పిస్తున్నారు. సిలబస్‌ను ప్రత్యేకంగా రూపొందించి, పిల్లలకే కాకుండా టీచర్లకు కూడా జావేద్ శిక్షణ ఇస్తున్నాడు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందకపోయినప్పటికీ దాతలు ఇచ్చిన విరాళాలు, ఎన్జీవోల సాయంతో స్కూల్‌ను నడుపుతున్నట్లు జావేద్ చెప్పాడు. జావేద్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత చదువులు చదవడంతోపాటు, క్రీడల్లోనూ రాణిస్తూ పతకాలను సాధిస్తున్నారు. హ్యుమానిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జావేద్ ఒక్క స్కూలేగాక హ్యుమానిటీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్‌ను కూడా సంస్థను స్థాపించి వైద్యం కొనుక్కోలేని నిరుపేద మహిళలకు ఉచితంగా వైద్యాన్నీ అందిస్తున్నారు. పుస్తకాలు, యూనిఫామ్, స్టేషనరీ వంటి వాటిని సేకరించి నిరుపేద విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నారు. కరోనా సమయంలోనూ ఈ ఆర్గనైజేషన్ ద్వారా అనేక సహాయ కార్యక్రమాలను చేపట్టారు. తన జీవితంలో జరిగిన ఒక అతిపెద్ద విషాద ఘటనను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని.. సమాజానికి మేలు చేసేందుకు కృషి చేస్తోన్న జావేద్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. జావేద్ మాట్లాడుతూ...‘‘ప్రారంభంలో మా స్కూలుకు బాలికలను పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడేవారు కాదు. తర్వాత వారితో నేను మాట్లాడి ఒప్పించడంతో ఎంతో ధైర్యంగా అమ్మాయిలను స్కూలుకు పంపిస్తున్నారు. ప్రస్తుతం స్కూల్లో 200 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వీరికోసం రెండు బస్సులు కొనుగోలు చేశాం. అవి సరిపోవడం లేదు. అందువల్ల కొంతమంది పిల్లలకి స్కూల్ వద్ద వసతి కల్పిస్తున్నాం. అనేక అవరోధాలు ఎదుర్కొంటూ ఒక్కో వసతిని స్కూలుకు సమకూరుస్తున్నాం. హయ్యర్ సెకండరీ లెవల్‌కు స్కూలు ఎదుగుతుంది’’ అని ఆశిస్తున్నట్లు జావేద్ చెప్పాడు. ‘‘బుల్లెట్ గాయం వల్ల నేను జీవితాన్నే కోల్పోయాను. ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా కింద కేవలం 75 వేల రూపాయలను ఇచ్చింది. కానీ ఆ సమయంలో నా చికిత్సకు లక్షల్లో ఖర్చయింది. ఆ విషాదం జరగాలని రాసి ఉంటే ఏం చేయగలం. అది జరిగిపోయింది. అక్కడే ఆగిపోతే మిగతా జీవితం కూడా చీకటైపోతుంది. అందుకే నాలాగా ఇబ్బంది పడే వికలాంగులకు చేయూతనిస్తూ ముందుకు సాగుతున్నాను’’ అని జావేద్ చెప్పాడు. -
దివ్యాంగులకు ‘ప్రత్యేకం’
సాక్షి, అమరావతి: సమాజంలో దివ్యాంగులకు మిగతా వారితో సమానావకాశాలు కల్పించడంలో భాగంగా వారికి ప్రత్యేక వాహనాలను ఉచితంగా సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి విద్య, ఉపాధికి దోహదపడేలా రూపొందించిన ఈ వాహనాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని మహిళ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఇవీ అర్హతలు ► వార్షికాదాయం మూడు లక్షల్లోపు కలిగి, 18 – 45 మధ్య వయసు ఉండాలి. 70 శాతం, ఆ పైగా వైకల్యం ఉండాలి. గ్రాడ్యుయేషన్, ఆ పై చదువులు చదివే విద్యార్థులు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో సహా స్వయం ఉపాధి లేదా పదో తరగతి ఉత్తీర్ణతతో కనీసం ఏడాది నుంచి పని చేస్తున్న దివ్యాంగులకు వీటి ని ఇస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. లేదా ప్రత్యేక వాహనం పొందడానికి ఎంపికైన దివ్యాంగులు రెండు నెలల్లోగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి. ► జిల్లా యూనిట్‌గా అర్హులైన వికలాంగులను జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన గల కమిటీ ఎంపిక చేస్తుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లతో పాటు 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తారు. తొలుత వికలాంగులైన మహిళలకు ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత పురుషులను ఎంపిక చేస్తారు. అర్హులైన దివ్యాంగులు ఏ జిల్లా నుంచి అయినా దరఖాస్తు చేసుకోవచ్చు. -
దివ్యాంగురాలిది ఆత్మహత్యే
ఒంగోలు: నగర పరిధిలోని దశరాజుపల్లి రహదారిలో ఈ నెల 18న సజీవ దహనమైన దివ్యాంగురాలిది ఆత్మహత్యేనని జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తెలిపారు. స్థానిక పోలీస్ కల్యాణ మండపంలో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. దశరాజుపల్లి రోడ్డులో దివ్యాంగులు తన వాహనంలోనే కాలిపోతుండటాన్ని గమనించిన స్థానికులు డయల్ 100 కు సమాచారం ఇచ్చారు. తాలుకా సీఐ శివరామకృష్ణారెడ్డి సిబ్బంది, ఫైర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. ఘటనాస్థలంలో లభ్యమైన బ్యాగులో లభించిన ఆధారాల ప్రకారం మృతురాలు ఉమ్మనేని భువనేశ్వరిగా గుర్తించారు. మృతురాలు స్థానిక గోపాల్‌నగరం ఏడో డివిజన్లో వార్డు వలంటీర్‌గా పనిచేస్తుంది. మృతురాలి తల్లి జానకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు సాగించారు.ఓఎస్డీ కె.చౌడేశ్వరి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. నాలుగు టీంలుగా విడిపోయి విచారణ సాగించారు. నేరస్థలంలో లభ్యమైన సాక్ష్యాలు, ప్రత్యక్ష సాక్ష్యులను గుర్తించి వారిని విచారించారు. మృతురాలు రెండు సెల్ఫోన్లు వాడుతున్నట్లుగా గుర్తించి వాటి కాల్స్ విశ్లేషించారు. మృతురాలు ప్రయాణించిన మార్గంలో సీసీ టీవీ ఫుటేజీ విశ్లేషణ ఆధారంగా దర్యాప్తు కొనసాగించి మృతురాలు జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారణకు వచ్చినట్లు ఎస్పీ వివరించారు. (దారుణం: ట్రై సైకిల్ పైనే భువనేశ్వరి సజీవ దహనం ) ► దివ్యాంగురాలు దశరాజుపల్లి రోడ్డులో తన త్రిచక్రవాహనంలో వెళుతుండడాన్ని దశరాజుపల్లికి చెందిన కిమ్స్ హాస్పిటల్ సెక్యూరిటీ గార్డు గోగిల శ్రీకాంత్ గమనించాడు. మరో సెక్యూరిటీ గార్డు పెనం కొండయ్య యువతి దగ్ధమవుతున్న విషయాన్ని గుర్తించాడు. వీరిద్దరు కిమ్స్ హాస్పిటల్ సెక్యూరిటీ ఇన్‌ఛార్జి నీరంపల్లి చండేశ్వర్‌కు తెలియపరచగా వారు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. మృతురాలు కమ్మపాలెం నుంచి జాతీయ రహదారివైపు ఒంటరిగా వెళుతుండగా పోతురాజు కాలువ బ్రిడ్జి ఎక్కలేకపోతుండడంతో అక్కడ సబ్‌స్టేషన్ సిబ్బంది బాలాజీ, తిరుమలరావులు బ్రిడ్జిపైకి వెళ్లేందుకు సాయం చేశారు. జాతీయ రహదారి కింద గోపాలనగరం 4వ లైనుకు చెందిన గొర్రెల కాపరి గొల్లప్రోలు శ్రీహరి ఆమె ఒంటరిగా వెళుతుండడాన్ని గుర్తించాడు. ► మృతురాలు సామాజిక మాధ్యమంలో గ్రూప్ ద్వారా గుంటూరుకు చెందిన మనోజ్, విశాఖకు చెందిన తనూజ, శ్రీకాకుళంకు చెందిన కృష్ణలతో ప్రతిరోజు గ్రూప్ చాటింగ్ చేస్తుంటుంది. ఈ నెల 18న సాయంత్రం 7.03 గంటల నుంచి మృతురాలు చాటింగ్‌లో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ మేరకు సాక్ష్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. సాయంత్రం 6.45గంటల సమయంలో తన స్నేహితుడైన బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మనోజ్‌కు తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు నేరస్థలం నుంచి వాట్సప్‌లో ఆడియో రికార్డు చేసి పంపించింది. అ పోస్టుమార్టం నివేదిక పరిశీలిస్తే మృతురాలి శరీరంపై ఎటువంటి గాయాలు లేవు. మృతురాలు తన స్నేహితులైన ఆటో డ్రైవర్లు రాము, నాయబ్‌రసూల్‌ల ద్వారా 18వ తేదీ సాయంత్రం 6.15 గంటల సమయంలో పెట్రోలు క్యానును తెప్పించుకుని తన త్రిచక్ర వాహనంలో పెట్టుకుండటాన్ని మార్గమధ్యంలో ఉన్న సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు. ► ఘటనకు ముందు భువనేశ్వరి తన వాట్సప్ స్టేటస్‌లో ఇక తన వాట్సప్ పనిచేయదని, కొంత మంది స్నేహితులు, బంధువులకు బాయ్..బాయ్ చెప్పడం వంటివి గుర్తించామని ఎస్పీ తెలిపారు. కేసులో కేవలం 48గంటల్లోనే నిజాలు నిగ్గుతేల్చారంటూ ప్రత్యేక దర్యాప్తు అధికారి కె.చౌడేశ్వరి, ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్, తాలూకా సీఐ ఎ.శివరామకృష్ణారెడ్డి, ఎస్సైలు సోమశేఖర్, పునావవు, నాయబ్‌రసూల్, ఏఎస్సై దయానంద్, రమేష్, హెడ్‌కానిస్టేబుళ్లు రామకృష్ణ, జి.బాబు, ఎస్బీ హెచ్‌సీ నరశింహారావు, కానిస్టేబుల్ రవిలను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రత్యేకంగా అభినందించారు. -
దారుణం: ట్రై సైకిల్ పైనే భువనేశ్వరి సజీవ దహనం
సాక్షి, ఒంగోలు: మహిళా వలంటీర్.. పైగా రెండు కాళ్లూ లేని దివ్యాంగురాలు.. నగరానికి రెండు కిలోమీటర్ల ఆవల నిర్మానుష్య ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో కాలి బూడిదైంది. ఈ సంఘటన దశరాజుపల్లికి వెళ్లే దారిలో అప్పాయకుంట వద్ద శుక్రవారం రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో జరిగింది. నిత్యం ఆమె ఏ త్రిచక్ర వాహనం ఉపయోగిస్తుందో ఆ వాహనంలోనే కాలిపోయింది. ఎవరో తగలబడుతున్నారన్న సమాచారం పోలీసులకు రావడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలార్పారు. ఆమె హ్యాండ్ బ్యాగ్ కనిపించింది. అందులో యువతి ఆధార్‌కార్డు, ఐడీ కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు ఉన్నాయి. వాటి ఆధారంగా ఆమె గోపాలనగరం వాసి ఉమ్మనేని భువనేశ్వరి (23)గా గుర్తించారు. ఈమె తల్లి జానకి స్థానికంగా ప్రకాశం భవనం ఎదుట రాఘవ బుక్‌షాప్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తుంటోంది. భువనేశ్వరికి మరో అనారోగ్యంతో బాధపడుతున్న సోదరి ఉంది. తండ్రి వీరు చిన్నప్పుడే కన్నుమూశాడు. తన బిడ్డను ఎవరో హత్య చేసుంటారంటూ జానకి సంఘటన స్థలానికి వచ్చి భోరున విలపించింది. వలంటీర్ అంతదూరం ఎందుకు వెళ్లింది, ఆమె చివరగా ఫోన్లో ఎవరెవరితో మాట్లాడింది.. తదితరాల వివరాల కోసం పోలీసులు కాల్‌డేటా సేకరించే పనిలో ఉన్నారు. భువనేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిందా.. లేక ఎవరైనా హత్య చేశారా.. అన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. చదవండి: (చెట్టంత కొడుకులు.. శవాలై తేలితే..) -
లేకున్నా ఇవ్వొచ్చు
కష్టంలో చెయ్యి చాచలేని వారుంటారు. కష్టాన్ని చూసి మనమే చెయ్యి చాచాలి. ఇరవై ఉంటే పది ఇవ్వొచ్చు. రెండు గుప్పెళ్లుంటే గుప్పెడు ఇవ్వొచ్చు. కష్టంలో కాళ్లు లేని వారూ ఉంటారు. కష్టాన్ని చూసి మనమే దగ్గరికి వెళ్లాలి. మాలతి దగ్గర ఇరవై ఉన్నాయి. రెండు గుప్పెళ్లూ ఉన్నాయి. కష్టాన్ని చూడలేని మనసూ ఉంది. వెళ్లి ఇవ్వడానికే.. ఆమెకు కాళ్లు లేవు! అయినా ఆగలేదు. లాక్డౌన్ కష్టాల్లో ఉన్న ‘పీసీ’ మహిళల కోసం ఒక నెట్‌వర్క్‌నే నడిపిస్తున్నారు!! బ్యాంకు ఉద్యోగి మాలతీ రాజా. ‘బార్క్లేస్’ బ్యాంకు చెన్నై శాఖలో పర్సనల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్‌లో పని చేస్తుంటారు. బార్క్లేస్ లండన్ బ్యాంక్. 330 ఏళ్ల నుంచి ఉంది. చెన్నై శాఖను నిలదొక్కుకునేలా చేయడం కోసం ఆ బ్యాంక్ నియమించుకున్న మెరికల్లాంటి సిబ్బందిలో.. కాళ్లలో శక్తి లేని మాలతీ కూడా ఒకరు. అవును. వీల్ చెయిర్ లేకుండా ఆమె కదలలేరు. లాక్డౌన్ ముందు వరకు ఆఫీస్‌కి వెళ్లొచ్చేవారు. ఇప్పుడు ఇంట్లోంచే పని చేస్తున్నారు. బ్యాంకు పనితో పాటు.. ఇంట్లోంచి మాలతీ చేస్తున్న పని ఇంకొకటి కూడా ఉంది. చెన్నై కార్పోరేషన్ షెల్టర్‌లో పీసీ (ఫిజికల్లీ ఛాలెంజ్డ్) మహిళల చేత పని చేయించడం! వాళ్లు చేసే పని.. షెల్టర్ చుట్టు పక్కల ఉన్న తమ లాంటి వారి కనీస నిత్యావసరాలు తీరేలా చేయడం. వాళ్ల కోసం ఉతికి వాడుకోదగిన (రీయూజబుల్) మాస్క్‌లను, శానిటరీ ప్యాడ్స్‌ను తయారు చేయడం. పసిపిల్లల కోసం డైపర్స్ చేయడం. మాలతి చెబితే వాళ్లెందుకు చేస్తారు? మాలతి టీమ్ మేట్స్ మెటిల్డా, మేరీ, కలై, నదియా, కవిత.. ఇంకా కొందరు ఆ షెల్టర్‌లోనే ఉంటున్నారు. టీమ్ మేట్స్ అంటే బ్యాంక్ టీమ్ మేట్స్ కాదు. వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ ఉమెన్ టీమ్ మేట్స్. మాలతి నేషనల్ చాంపియన్. టోర్నమెంట్ ఉన్నప్పుడు బ్యాంకు ఆమెను డిస్టర్బ్ చేయదు. ప్రాక్టీస్ చేసుకోనిస్తుంది. ∙∙ తమిళనాడు మొత్తం మీద 150 మంది వీల్‌చెయిర్ మహిళా బాస్కెట్‌బాల్ ప్లేయర్లు ఉన్నారు. కోయంబత్తూరు, తిరుచ్చి, తిరువణ్ణామలై, విల్లుపురం, వెల్లూరు.. మరికొన్ని ప్రాంతాల నుంచి వారం చివరిలో వాళ్లంతా చెన్నై వస్తారు. మాలతితో కలిసి జె.జె. కిల్పాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తారు. లాక్‌డౌన్‌తో ఇప్పుడు ఎక్కడివారక్కడే ఉండిపోయారు. కొందరు చెన్నై షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్నారు. వాళ్ల చేతే మాలతి ఇప్పుడు నిరాశ్రయులైన పీసీ మహిళలకు చేయూతను ఇప్పిస్తున్నారు. షెల్టర్‌లో మాస్క్‌లు కుడుతున్న మాలతి టీమ్ మేట్ బాగా అవసరంలో ఉన్నవారికి ఉప్పు, పప్పులతో పాటు కొంత డబ్బు కూడా. ఆ డబ్బును మాలతే తన ఫేస్బుక్ నుంచి విరాళాల ద్వారా సేకరిస్తున్నారు. నిజానికి ఆమెకు పెద్ద సర్కిలే ఉంది. బ్యాంకుతో ఏర్పడింది కొంత. క్రీడాకారిణిగా సాధించుకున్నది కొంత. వాళ్లంతా మాలతికి అన్ని విధాలా సహాయంగా ఉన్నారు. ‘ఫలానా చోట.. ఫలానా మహిళ.. ఆమె కదల్లేదు.. ఆమె కుటుంబం కష్టంలో ఉంది’ అని మాలతి మెజేస్ ఇస్తే చాలు.. వెంటనే అక్కడి వెళ్లి చేయగలిగినంతా చేసి వస్తున్నారు. ఇటువైపు షెల్టర్‌లో మాలతి సూచనల ప్రకరాం.. ఆమె టీమ్ మేట్స్, మిగతా మహిళలు తాము చేయగలిగింది చేస్తున్నారు. మొత్తం ముప్పైమంది వరకు ఉంటారు షెల్టర్‌లో. వారంతా రోజుకు పది గంటల పాటు పని చేస్తూ కనీసం 300 సింగిల్, డబుల్ లేయర్ల మాస్క్‌లతో పాటు.. శానిటరీ నేప్కిన్స్, బేబీ డైపర్స్ కుడుతున్నారు. అవన్నీ కూడా ‘ఫిజికల్లీ ఛాలెంజ్డ్’ మహిళల కోసమే. వాళ్లలా రెడీ చెయ్యగానే ‘అందుబాటులో ఉన్నాయి. అవసరమైనవారు సంప్రదించవచ్చు’’ అని మాలతి ఇలా ఫేస్బుక్లో పెట్టేస్తారు. డబ్బు పెట్టగల ఎన్జీవోలు వాటిని కొని, వైకల్యం ఉన్న మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తాయి. ఆ డబ్బును మళ్లీ రేషన్ పంపిణీ చేసేందుకు ఖర్చు చేయిస్తారు మాలతి. ఈ లాక్డౌన్లో ఉన్నచోటు నుంచి కదలకుండా మాలతి ఇప్పటి వరకు 200 మంది వైకల్యం గల మహిళలకు డ్రై రేషన్ (వండుకోడానికి అవసరమైన దినుసులు), మందులు, ఇతర నిత్యావసరాలు పంపించగలిగారు. మాలతి కుటుంబానికి కూడా పూర్తిగా ఆమే ఆధారం. ఆమెతో కలిపి మొత్తం ఐదుమంది ఉంటారు. ‘‘లాక్‌డౌన్‌తో నేను పోషించవలసిన కుటుంబం మరింత పెద్దదైంది’’ అంటారు మాలతి.. చిరునవ్వుతో. చెన్నై కార్పోరేషన్ షెల్టర్‌లో మాలతీ టీమ్ మేట్స్, ఇతర మహిళలు. -
బ్యాట్ పట్టిన చేతితో దోశలు వేస్తున్నాడు
తిరుపాపులి దేవరాజ్... దివ్యాంగుల క్రికెట్లో ఈయన పేరు తెలియని వారుండరు.. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూరాణిస్తున్నాడు.. జీవనపోరాటంలో విజయం సాధించలేక.. నమ్ముకున్న కుటుంబాన్ని పోషించుకునేందుకు బ్యాట్ పట్టిన చేతితో దోశలు.. బౌలింగ్ వేసిన చేత్తో వడలు వేసుకుంటూ జీవనాన్ని గడుపుతున్నాడు.. తన ప్రతిభను గుర్తించి ప్రభుత్వం సాయమందించాలని వేడుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఉద్యోగం కోసం ఎందరో అధికారుల చుట్టూ తిరిగానని.. నన్ను చూసి జాలిపడి..డబ్బులిచ్చి పంపేయత్నం చేస్తున్నారే తప్ప.. కుటుంబపోషణకు అవసరమైన ఉద్యోగమిచ్చేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదంటున్నాడు.. ప్రభుత్వం ఆదుకుని న్యాయం చేయాలని కోరుతున్నాడు. కడప స్పోర్ట్స్ : కడప నగరం రామాంజనేయపురానికి చెందిన తిరుపాపులి దేవరాజ్‌కు క్రికెట్ అంటే ఎంతో మక్కువ. 2–3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే పాము కాటేసింది.. ఆ సమయంలో నాటు వైద్యం చేశారు. ఇది వికటించడంతో ఎడమకాలు చచ్చుబడింది. ఫలితంగా అవిటిగా మారాడు... తోటి వారందరూ ఆడుకోవడం చూసిన తనకు ఇష్టమైన క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. కొందరు నువ్వు కుంటివాడివి.. క్రికెట్‌కు పనికిరావని అన్నారు.. అయినా క్రికెట్‌పై ఉన్న మక్కువతో ఆడటం ప్రారంభించాడు. 1993–94 సంవత్సరంలో పదోతరగతి చదువుతున్నప్పుడు వికలాంగులకు క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారని తెలుసుకున్నాడు. ఎంపికలకు వెళ్లాడు. ప్రతిభ కనబరచడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లో ఏపీ జట్టుకు ఎంపికయ్యాడు. రాజస్తాన్‌లో నిర్వహించిన జాతీయస్థాయి వికలాంగుల క్రికెట్‌లోరాణించడంతో పాటు బెస్ట్ బౌలర్‌గా అవార్డు పొందాడు. అప్పటి నుంచి ప్రారంభమైన దేవరాజ్ ప్రస్థానం ఎందరో వికలాంగ క్రీడాకారులకు మార్గదర్శకంగా నిలిచింది. శివకోటి లాంటి వారు జిల్లా నుంచి జాతీయస్థాయిలో ప్రాతినిథ్యం వహించడానికి స్ఫూర్తయింది.ఈయనతో పాటు మరికొందరు కలిసి దివ్యాంగుల క్రికెట్‌కు బీసీసీఐ గుర్తింపుకోసం శ్రమించారు. ఇప్పటి వరకు దీనికి బీసీసీఐ గుర్తింపు లభించనప్పటికీ దివ్యాంగుల క్రికెట్‌ను రానున్న రోజుల్లో బీసీసీఐలో విలీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా వీరి సంఘానికి చేయూతనిచ్చే దిశగా చర్యలు చేపట్టింది. 40 సంవత్సరాలు వయసు కలిగిన ఈయన ఇప్పటికీ క్రికెట్ ఆడుతూనే ఉండటం గమనార్హం. తాజాగా ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు అనంతపురంలోని ఆర్డీటీ మైదానంలో నిర్వహించనున్న నేషనల్ డిజేబుల్డ్ క్రికెట్ టోర్నమెంట్లో ఈయన ఏపీ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. ఈ మేరకు ఆయన అనంతపురం పయనమయ్యాడు. పొట్టకూటి కోసం.. బీసీసీఐ గుర్తింపు వికలాంగుల క్రికెట్‌కు లేకపోవడంతో ఈయనకు ఎన్నో అవార్డులు, సర్టిఫికెట్లు ఇచ్చినప్పటికీ అవేవీ స్పోర్ట్స్‌కోటా పరిధిలోకి రావు. అదే ఇతనికి శాపంగా మారింది. పదో తరగతి వరకు చదివిన ఏదైనా చిరుద్యోగమైనా కల్పించాలని గతంలో ఎందరో కలెక్టర్లు, ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించాడు. వారు ఈయన పరిస్థితిని చూసి జాలి పడి తాత్కాలికంగా ఎంతో సాయం చేసి తర్వాత చూద్దామని పంపించారే తప్ప కుటుంబపోషణకు శాశ్వత ఆధారమయ్యే ఉద్యోగ అవకాశం కల్పించలేదు. దీంతో పాటు ఇతని తల్లికి కూడా వైకల్యం ఉంది. కుటుంబపోషణ కూడా దేవరాజ్‌పైనే పడింది. భార్య, ఇద్దరు పిల్లలు తోడయ్యారు. పోషణ మరింత భారమైంది. తనకెంతో ఇష్టమైన క్రికెట్‌ను ఓ వైపు సంసారాన్ని మరోవైపు నెట్టుకొచ్చేందుకు దోశల కొట్టును నడపుతున్నాడు. దోశలు, వడలు వేసుకుంటూ వచ్చిన దాంట్లో పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఏదైనా ఉద్యోగం ఇప్పించండి సారూ.. నేను పదోతరగతి పాసయ్యను. వైకల్యం ఉన్నప్పటికీ క్రికెట్లో చాలా ఏళ్లుగా ప్రతిభ కనబరిచా. అర్హతకు తగిన చిన్న ఉద్యోగమైనా ఇప్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటానని ఎన్నో మార్లు అధికారుల చుట్టూ తిరిగాను. జాలి చూపించి.. ఎంతో కొంత డబ్బు ఇచ్చి పంపిస్తున్నారు. బతుకు తెరువు కోసం దోశలు వేసుకుంటున్నాను. ప్రభుత్వం, అధికారులు స్పందించి చిరుద్యోగమైనా ఇప్పించి న్యాయం చేయాలి. – పి. దేవరాజ్, క్రికెటర్, కడప -
వికలాంగురాలిపై అత్యాచారం
కందుకూరు : వికలాంగురాలిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ భాస్కర్ కథనం ప్రకారం వివరా లు... మండల పరిధిలోని నేదునూరుకు చెందిన ఓ వికలాంగురాలైన అవివాహితæ(43) తన తల్లిదండ్రులు, పెద్ద వదినతో (పెద్ద అన్న మరణించాడు) కలిసి గ్రామంలోనే ఉంటోంది. కాగా ఈ నెల 16న తన వదినకు జ్వరం రావడంతో హస్తినాపు రంలోని కుమారుడి ఇంటికి వెళ్లి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అప్పటి నుంచి బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉం టోంది. కాగా ఈ నెల 20న రాత్రి పది గంటల సమయంలో గే టు కొట్టిన చప్పుడు రావడంతో మెల్లగా ఆమె తలుపు తీసు కుని బయటికి వచ్చింది. అదే సమయంలో ఇంటి సమీపంలో ఉండే గుమ్మడి వెంకటరమణారెడ్డి అలియాస్ వెంకటకిషన్రెడ్డి(20) ప్రహరీ దూకి లోనికి వచ్చాడు. తెలిసిన వ్యక్తి కావడంతో లోనికి వెళ్లింది. ఇదే అదనుగా అత ను ఇంట్లోకి చొరబడి తలుపులు మూసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు తనకు జరిగిన ఘోరంపై కుటుంబ సభ్యులతో కలిసి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు లించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలి వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందుతుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితి(వీహెచ్పీఎస్) ఆధ్వర్యంలో గురువారం స్థానిక పీఎస్‌లో సీఐ భాస్కర్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కె.జంగయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు ముచ్చర్ల నర్సింహ మాట్లాడుతూ.. అభాగ్యురాలైన వికలాంగ మహిళపై జరిగిన లైంగిక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నామని తెలిపారు. -
యాసిడ్ దాడి బాధితులూ దివ్యాంగులే
కేంద్ర దివ్యాంగుల సాధికార విభాగ కార్యదర్శి నవ్రీత్ కాంగ్ దివ్యాంగులకు సౌకర్యాల్లేకుంటే కొత్త భవనాలకు సర్టిఫికెట్లు ఇవ్వం సాక్షి, హైదరాబాద్: యాసిడ్ దాడి, తలసే మిమా బాధితులు, మేధోపరమైన, నేర్చుకో వడంలో సమస్యలు ఉన్నవారిని కూడా ఇకపై దివ్యాంగులుగానే పరిగణిస్తారని కేంద్ర దివ్యాంగుల సాధికార విభాగ కార్యదర్శి నవ్రీత్ కాంగ్ తెలిపారు. ఐటీ దిగ్గజం మైక్రో సాఫ్ట్ మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహిం చిన తొలి ‘యాక్సెసబిలిటీ సమ్మిట్’లో పాల్గొ నేందుకు వచ్చిన నవ్రీత్ కాంగ్ విలేకరులతో మాట్లాడుతూ... యాక్సెస్బిలిటీæ ఇండియా పేరుతో కేంద్రం గత నెల 19 నుంచి అమల్లోకి తెచ్చిన కొత్త చట్టం ప్రకారం సినిమాహాళ్లు, మాల్స్ మొదలుకొని అన్ని పబ్లిక్ భవనాల్లోనూ దివ్యాంగులకు అనుకూలమైన ఏర్పాట్లు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేయని కొత్త భవనాలకు స్థానిక ప్రభుత్వ సంస్థలు నిర్మాణం పూర్తయిందన్న సర్టిఫికెట్ జారీ చేయరాదని, ఇప్పటికే నిర్మాణం పూర్తయిన వాటిల్లో వచ్చే ఐదేళ్లలో వీటిని ఏర్పాటు చేయాలని ఆయన వివరించారు. దీంతోపాటు దేశవ్యాప్తంగా దాదాపు 2000 ప్రభుత్వ భవనాలను దివ్యాంగులకు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం నిధులు అందిస్తోందని చెప్పారు. లెర్నింగ్, ఇంటలెక్చువల్ డిసెబిలిటీలు ఉన్న వారిని దివ్యాంగులుగా పరిగణించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, వచ్చే నెల చివరికల్లా దాదాపు ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఐటీ శక్తిని వాడుకోవాలి: మధు ఖత్రీ టెక్నాలజీని దివ్యాంగుల చెంతకు చేర్చేందుకు భారత్ తన ఐటీ శక్తిని ఉపయోగించాలని మైక్రోసాఫ్ట్ ఇండియా అసోసియేట్ జనరల్ కౌన్సెల్ అండ్ యాక్సెసబిలిటీ లీడ్ మధు ఖత్రీ సూచించారు. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉందని, దివ్యాంగులకు సాయపడే చాలా ప్రాజెక్టుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ పాలుపంచుకుంటోందని ఆమె తెలిపారు. విండోస వర్డ్‌లోని స్క్రీన్‌రీడర్, మాగ్నిఫయర్, టెక్ట్స్‌ను మాటల్లోకి మార్చే నరేటర్ వంటివి ఇందులో భాగమేనని అన్నారు. వీటితోపాటు మైక్రోసాఫ్ట్ సిద్ధంచేసిన వన్‌నోట్ సాఫ్ట్‌వేర్‌లోని లెర్నింగ్ టూల్స్ ఆప్షన్ ద్వారా డిస్లెక్సియాతో బాధపడుతున్న పిల్లలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని, దీని సాయంతో వారు మునుపటి కంటే ఎంతో వేగంగా పదాలను గుర్తించగలగుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగుల భద్రతకు ప్రత్యేక చర్యలు
– తెలుగులో అనువదించిన దివ్యాంగుల చట్టం–2016 పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎస్పీ కర్నూలు: దివ్యాంగుల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో దివ్యాంగుల జేఏసీ సభ్యులు ఎస్పీని కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన దివ్యాంగుల చట్టం–2016 తెలుగు అనువాద పుస్తకాన్ని దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల జేఏసీ నాయకులు మధుబాబు, గోపాల్, అభిలాష్, వినోద్, లీలప్ప తదితరులు మాట్లాడుతూ.. తమకు రక్షణ కల్పించి కించపరిచేలా మాట్లాడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా కృషి చేయాలని ఎస్పీని కోరారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ దివ్యాంగుల చట్టం–2016 పుస్తకాన్ని జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లకు పంపిస్తానని, దివ్యాంగులకు భద్రత కల్పించేలా సిబ్బందికి సూచనలిస్తామని హామీ ఇచ్చారు. దివ్యాంగుల చట్టం–2016లో వారి రక్షణకు పొందుపరచిన కొన్ని ముఖ్యాంశాలు... సెక్షన్ 92 ప్రకారం వికలాంగులను కించపరచినా, అవమానించినా, భయపెట్టినా, మాన మర్యాదలు భంగపరచినా, పెత్తనం చేసినా, లైంగిక దాడి చేసినా, లైంగికంగా వాడుకున్నా, గాయపరచినా, భావజాలంపై దాడి చేసినా, సహాయ పరికరాన్ని ధ్వంసం చేసినా ఆరు నెలల నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష. సెక్షన్ 7/4 ఎ, బి, సి, డి ప్రకారం వికలాంగులపై వేధింపులు, హింస, దోపిడీ, ఇతర అఘాయిత్యాలకు పాల్పడితే చట్టప్రకారం తీసుకునే బాధ్యతల నుంచి పోలీసు అధికారి తప్పించుకునే అవకాశం లేదు. సెక్షన్ 20/5 ప్రకారం కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న వికలాంగులకు న్యాయం, హక్కుల కోసం ప్రభుత్వం అధిక మద్దతు ఇవ్వాలి. సెక్షన్ 29హెచ్ సైగల భాషలో అనువాదంతో సబ్‌టైటిల్స్‌తో టీవీ కార్యక్రమాలు రూపొందించి బధిరులు పాల్గొనేటట్లు చూడాలి. -
దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ అవయవాలు
కర్నూలు(టౌన్): దివ్యాంగుల పునరావాస యోజన కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు, చేతులు, క్యాలిపర్స్ అందిస్తున్నట్లు భారత్ వికాస్ పరిషత్ ఆంధ్ర ప్రాంత సహ కార్యదర్శి బీవీ బాలసుబ్రమణ్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొలిమేర వేణుగోపాల్, కామాక్షమ్మ చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో జైపూర్ కాలు కంటే నాణ్యమైన కృత్రిమ కాలును ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వచ్చే నెల 14వ తేదీ లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 94404 41447 నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. -
దివ్యాంగుడిపై పోలీసుల దురాగతం
-
జిల్లా స్థాయి ఆటల పోటీలు ప్రారంభం
కర్నూలు (టౌన్): అంతర్జాతీయ విభిన్న ప్రతిభ వంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక ఔట్‌డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమానికి అతిథులుగా డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, వయోజన విద్య డిప్యూటీ డైరక్టర్, వికలాంగుల సంక్షేమ శాఖ అడిషనల్ డైరక్టర్ భాస్కర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ మాట్లాడుతూ ఈ ఆటల పోటీలలో మొదటి స్థానం గెలుపొందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం వారు శారీరక విభిన్న ప్రతిభావంతులకు ట్రైసైకి ల్ పోటీలను జెండాఊపి ప్రారంభించారు. -
మొక్కలు నాటిన దివ్యాంగులు
రామకష్ణాపూర్ : పట్టణంలోని అంగడిబజార్ ప్రాంతంలోని ఖాళీ స్థలంలో సోమవారం పట్టణానికి చెందిన పలువురు దివ్యాంగులు మొక్కలను నాటారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా దివ్యాంగుల చైతన్య వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు. మనిషి మనుగడ చెట్ల మీదే ఆధారపడి ఉందని, గాలి, నీరు, భూమి, ఆకాశం కలుషితం కాకుండా చెట్లు కాపాడుతాయని దివ్యాంగుల చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు మెడపట్ల సతీశ్ అన్నారు. కార్యక్రమంలో వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు రామిల్ల చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి సముద్రాల చిరంజీవి, తల్లపెల్లి దుర్గయ్య, గోపాలకృష్ణ, బెడవేన సతీశ్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు. -
పట్టుదలే అతడి విజయం
శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (అనంతపురం) : ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం చిన్నబోయింది. పట్టుదల అతన్ని ముందుకు నడిపిస్తోంది. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రానికి చెందిన తిమ్మప్పకు వైకల్యం కారణంగా రెండు చేతులూ పనిచేయని స్థితి. అలా అని అతడు ఆగిపోలేదు. కాళ్లనే తన అక్షరాయుధంగా మార్చుకున్నాడు. కాలితో చక్కగా రాస్తాడు. బీఏ ఉత్తీర్ణుడైన తిమ్మప్ప.. పోస్ట్ గ్రాడ్యుయేషన్(పొలిటికల్ సైన్స్)లో ప్రవేశం కోసం సోమవారం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (స్కూసెట్)కు హాజరయ్యాడు. కచ్చితంగా మంచి ర్యాంకు సాధిస్తాననే ధీమా వ్యక్తం చేశాడు. -
అనంతపురంలో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్
అనంతపురం : అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో త్వరలో భారత్-పాక్ మధ్య వికలాంగుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ నిర్వహించనున్నట్లు భారత జట్టు మాజీ కెప్టెన్, జాతీయ వికలాంగుల క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజిత్ వాడేకర్ తెలిపారు. శనివారం 6వ అఖిల భారత ఇంటర్ జోనల్ వికలాంగుల క్రికెట్ టోర్నీని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనంతపురంలో అంతర్జాతీయ క్రికెట్ పోటీల నిర్వహణకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్, ఆంధ్ర వికలాంగుల క్రికెట్ సంఘం అధ్యక్షుడు మాంఛో ఫై, జాతీయ వికలాంగుల క్రికెట్ సంఘం కార్యదర్శి టిపి మిరాజ్కర్ తదితరులు పాల్గొన్నారు. -
వైకల్యం.. ప్రతిభకు అడ్డుకాలేదు..!
-
కోల్పోయింది కాలు మాత్రమే.. ఆత్మ విశ్వాసం కాదు..
-
వికలాంగులపై ఇంత నిర్లక్ష్యమా?!
సంపాదకీయం శారీరక వైకల్యం ఇబ్బందులు పెడుతున్నా, సమాజం చిన్నచూపు చూస్తున్నా తమలో దాగివున్న ప్రతిభా సామర్థ్యాలను ఈ సమాజోన్నతికి వినియోగిస్తున్న వికలాంగులకు ఇప్పుడు సర్కారే శాపంగా మారినట్టు కనిపిస్తోంది. నాలుగేళ్లకుపైగా కసరత్తులు చేసి రూపొందించిన వికలాంగుల హక్కుల బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టడానికి యూపీఏ సర్కారు సిద్ధపడుతుండగా... ఆ బిల్లువల్ల తమకు ఒరిగేదేమీ లేదని వికలాంగులు చెబుతున్నారు. 2012లో రూపొందించిన బిల్లే ఎన్నెన్నో లోపాలతో ఉన్నదని, దాన్లో మార్పులు తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలని మొత్తుకుంటే అంతకుమించిన అడ్డుపుల్లలెన్నో తాజా బిల్లులో దాగున్నాయని వారు చెబుతున్న మాట. దేశంలో దాదాపు పదికోట్లమంది వికలాంగులున్నారని అంచనా. 1995లో తీసుకొచ్చిన చట్టం చట్టుబండలై నిరర్ధకంగా మారాక వికలాంగులు జాతీయస్థాయిలో ఎన్నో పోరాటాలు చేశారు. సరికొత్త చట్టం తెచ్చి తమకు అవరోధంగా మారిన అంశాలను సరిచేయమని కోరారు. తీరా 2012లో తీసుకొచ్చిన బిల్లు చూసి వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఎందుకంటే, రెండేళ్లపాటు ఎందరో వ్యక్తులతో, సంస్థలతో సమాలోచనలు జరిపాక రూపొందించిన ఆ బిల్లు సమగ్రంగా ఉండటం మాట అటుంచి వారి కనీస డిమాండ్లను కూడా సరిగా పట్టించుకోలేదు. వైకల్యం ఉన్నవారి కోసం ప్రత్యేక విద్యా సంస్థలు నెలకొల్పడంకాక, ఇతర పిల్లలతోపాటే వారు కూడా చదువుకొనే పరిస్థితి కల్పించాలన్నది ఆ బిల్లు ఉద్దేశం. పైకి చూడటానికి ఇది బాగానే ఉన్నా అంధత్వం, బధిరత్వం ఉన్న పిల్లలకు ఆచరణలో అలాంటి పాఠశాలలు పెద్దగా ఉపయోగపడవు. అలాగే, వీల్చైర్లు వినియోగించాల్సిన స్థితిలో ఉండే పిల్లలకు అనువైన మౌలిక సదుపాయాలు అలాంటి స్కూళ్లలో ఉండవు. ప్రత్యేక పాఠశాలల్లో అయితే అలాంటి పిల్లలకు అనువైన వాతావరణం లభించడంతోపాటు, ప్రత్యేక తర్ఫీదు పొందిన ఉపాధ్యాయుల ద్వారా విద్య నేర్చుకునే వీలుంటుంది. దేశంలో వైకల్యంతో బాధపడేవారికోసం బిల్లు రూపొందిస్తూ ఇలాంటి ప్రాథమిక అంశాలను విస్మరించడం వింతగొలిపే విషయం. ఇక ఉద్యోగాల విషయంలో ఆ బిల్లు మరిన్ని విన్యాసాలు చేసింది. ఏదైనా విభాగంలో సంబంధిత ఉన్నతాధికారులు నిర్ణయించిన పోస్టులకు మాత్రమే వికలాంగులు అర్హులని తేల్చింది. సారాంశంలో... ఇతర పోస్టులకు అవసరమైన శక్తిసామర్ధ్యాలున్నా వికలాంగులకు అవి అందకుండా చేసింది. ఇది ఐక్యరాజ్యసమితి ఒడంబడికకు పూర్తి విరుద్ధం. ఆ ఒడంబడికలో మన దేశమూ భాగస్వామిగానే ఉన్నా దాని స్ఫూర్తికి ఆ బిల్లు తూట్లుపొడిచింది. మళ్లీ ఎన్నో ఆందోళనలు, నిరసనోద్యమాల తర్వాత ఆ బిల్లును సరిదిద్దడానికి కేంద్రం అంగీకరించింది. మరోసారి భారీయెత్తున కసరత్తు జరిగింది. వికలాంగుల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు, వ్యక్తులు ఎన్నెన్నో సూచనలు చేశారు. మొన్న డిసెంబర్లో కేంద్ర మంత్రివర్గం ఆ బిల్లును ఆమోదించినప్పుడు వికలాంగులు సంతోషపడ్డారు. ఇక తమ కష్టాలు గట్టెక్కగలవని భావించారు. కోట్లాదిమంది వ్యక్తుల ప్రయోజనాలతో ముడిపడివున్న బిల్లులోని అంశాలేమిటో సంక్షిప్తంగా నైనా తెలిస్తే ఇంకేమి అంశాలు దానిలో పొందుపరచాలో... ఎక్కడెక్కడ లోపాలున్నాయో సలహాలూ, సూచనలూ వస్తాయి. కానీ, ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇప్పుడు మరో రెండు రోజుల్లో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారనగా చివరి నిమిషంలో అనధికారికంగా వెల్లడైన అంశాలను చూసి వికలాంగుల హక్కుల సంస్థలు భగ్గుమంటున్నాయి. వికలాంగుల విషయంలో ఈ బిల్లు ‘మెడికల్ మోడల్’నే గుర్తిస్తున్నదని, ఇందువల్ల వైకల్యంతో బాధపడేవారిని వైద్యపరమైన సాయం అవసరమైనవారిగా మాత్రమే పరిగణిస్తారని సంస్థలు చెబుతున్నాయి. ఇతర పౌరులతో సమానంగా పరిగణించి, వారికి అన్నిటా అవకాశాలను కల్పించాలని నిర్దేశించే ఐక్యరాజ్యసమితి ఒడంబడికలోని 12వ అధికరణాన్ని ఇది నీరుగారుస్తున్నదని ఆ సంస్థలు ఆరోపిస్తున్నాయి. మహిళలు, పిల్లల వైకల్యానికి సంబంధించి ఈ బిల్లు ప్రత్యేక చర్యలు సూచించలేదంటున్నాయి. నిరుడు అక్టోబర్‌లో ఇచ్చిన తీర్పు ద్వారా సర్వోన్నత న్యాయస్థానం వికలాంగులకు అన్ని రకాల ప్రభుత్వ విభాగాల్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వికలాంగుల సంక్షేమంపై సర్వోన్నత న్యాయస్థానం అంతటి ఆందోళన కనబరిచినా ఇప్పుడు రూపొందించిన బిల్లులో కేంద్రం దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. వికలాంగులకు ఉద్యోగాల కేటాయింపుపై అందులో నిర్దిష్ట సూచనలు లేవు. అలాగే రిజర్వేషన్లు, ప్రమోషన్లలో ఎలాంటి విధానాలు అనుసరించాలన్న విషయంలోనూ స్పష్టత లేదు. వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాల్సిన నియంత్రణా యంత్రాంగం గురించి బిల్లు చెప్పినదేమీ లేదు. వికలాంగుల కోసం ఎంతో చేస్తామని ఆశలు పెడుతున్న ప్రభుత్వాలు బడ్జెట్ రూపొందించేటపుడు అలాంటి హామీలకు తిలోదకాలిస్తున్నాయి. నామమాత్ర కేటాయింపులతో ఉసూరనిపిస్తున్నాయి. పర్యవసానంగా విద్య, ఆరోగ్యం, పునరావాసం వంటి అంశాల్లో వారికి అన్యాయమే జరుగుతున్నది. ఇవన్నీ ఇలావుంటే...దశాబ్దాలుగా తమ కష్టాలనూ, కన్నీళ్లనూ చెప్పుకుంటున్న వికలాంగుల ఆర్తనాదాలు సర్కారు చెవికి సోకలేదని తాజా బిల్లు వెల్లడిస్తోంది. కనీసం ఇప్పుడైనా వికలాంగుల డిమాండ్లేమిటో, తాము రూపొందించిన బిల్లునుంచి వారు ఆశిస్తున్నదేమిటో యూపీఏ ప్రభుత్వం గుర్తించాలి. తగిన దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి. -
4న మందకృష్ణ కొత్త పార్టీ!
వేలాది మంది వికలాంగుల మధ్య ప్రకటన సాక్షి, హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తన కొత్త పార్టీని జనవరి 4న ప్రకటించాలని నిర్ణయించారు. అంధుల ఆరాధ్యుడు లూయి బ్రెయిలీ జన్మదినం సందర్భంగా పార్టీని ప్రకటించడం ద్వారా వికలాంగులకు కూడా రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలనే డిమాండ్‌ను తెరపైకి తేవాలనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలిసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలతో పాటు వికలాంగులను కూడా రాజ్యాధికారంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో కొత్త పార్టీని ముందుకు తీసుకెళ్లనున్నారు. హైదరాబాద్‌లో వేలాది మంది వికలాంగుల సమక్షంలో ‘రాయితీల నుంచి రాజ్యాధికారం వరకు’ అనే ప్రధాన నినాదంతో పార్టీని ప్రకటించేందుకు కృష్ణమాదిగ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి పెద్దఎత్తున వికలాంగులను సమీకరిస్తున్నారు. ఎవరికీ పట్టని సమస్యలే తన ఎజెండా అని గతంలో చెప్పిన మందకృష్ణ... అదే రీతిలో గతంలో ఎవ్వరూ చేయని విధంగా వికలాంగుల మధ్య పార్టీని ప్రకటిస్తుండడం గమనార్హం. -
ఇదేం ‘వసతి’
అదొక శారీరక వికలాంగుల బాలుర వసతి గృహం. దీనిని జిల్లా స్థాయిలో గత జూన్ 28న నర్సాపూర్‌లో ప్రారంభించారు. వంద మంది వికలాంగ విద్యార్థులకు వసతి కల్పించాలన్న సంకల్పంతో ఈ గృహాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఇద్దరే వికలాంగ బోర్డర్లు అందులో చేరారు. చేరిన 15 రోజులకే వారూ వెళ్లిపోయారు. అదేమని ఆరా తీస్తే వసతి గృహానికి పాఠశాల చాలా దూరంగా ఉండటమే.. ఇలా జూలై మొదటి వారం నుంచి వసతి గృహంలో బోర్డర్లు లేక వెలవెలపోతోంది. నర్సాపూర్, న్యూస్‌లైన్: వికలాంగ వసతి గృహం.. ప్రభుత్వ బాలుర పాఠశాలకు చాలా దూరంలో ఉండడం తో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవు తున్నం దున వికలాంగ విద్యార్థులు అందులో చేరడానికి ఆసక్తి చూపడం లేదు. వసతి గృహం ప్రభుత్వ పాఠశాలలకు దగ్గరలో ఉంటే వారు పాఠశాలకు వెళ్లి వచ్చేందుకు అనుకూలంగా ఉండేది. పాఠశాలకు దూరంగా ఉండడంతో వెళ్లడం రావడం కష్టమై ఉన్న ఇద్దరు విద్యార్థులూ తమ ఇంటికి వెళ్లిపోయారు. ఇదిలాఉండగా మరి కొంత మంది బోర్డర్లు వచ్చే అవకాశాలున్నా హాస్టల్ పాఠశాలలకు దూరంగా ఉందన్న కారణంతో ఎవరూ రావడం లేదని తెలిసింది. ఇప్పటికైన పాఠశాలలకు దగ్గర్లో హాస్టల్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నెలసరి వ్యయం యథాతథం జిల్లాస్థాయి వికలాంగ హాస్టల్లో ఒక్క బోర్డరు లేకపోయినా ప్రైవేటు భవనం కావడంతో నెలనెలా వేల రూపాయలు అద్దెను ప్రభుత్వం చెల్లిస్తోంది. అంతేగాక వాచ్‌మన్‌తో పాటు మ్యాట్రిన్‌కు జీతాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వానికి వేల రూపాయల వ్యయం అవుతున్నా పాఠశాలకు దగ్గరలోకి హాస్టల్‌ను మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఐదు నెలలైనా ప్రారంభంకాని పనులు నర్సాపూర్‌లో శారీరక వికలాంగుల వసతి గృహం నిర్మించేందుకు ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. మంత్రి సునీతారెడ్డి గత జూలై 1న హాస్టల్ భవన నిర్మాణానికి స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పక్కన గల ఖాళీ స్థలంలో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసి ఐదు నెలలు దాటినా నిర్మాణ పనులు చేపట్టలేదు. భవనాన్ని సకాలంలో నిర్మిస్తే వికలాంగ విద్యార్థులకు మేలు జరగడంతో పాటు ప్రభుత్వానికి నెలనెలా అనవసర వ్యయం మిగులుతుంది. త్వరలో మారుస్తాం: పాఠశాలకు దూరంగా వికలాంగ హాస్టల్ ఉన్నందున పిల్లలు రావడం లేదని జిల్లా వికలాంగ సంక్షేమ విభాగం ఏడీ లక్ష్మణ్‌చారి చెప్పారు. పాఠశాలకు దగ్గరలో ఉన్న భవనంలోకి త్వరలో మారుస్తామన్నారు. కొత్త భవనం నిర్మాణ పనుల టెండర్లు పూర్తయ్యాయని, వచ్చే విద్యా సంవత్సరానికి కొత్త భవనం పూర్తి కాగలదని ఆయన తెలిపారు. -
ప్రోత్సాహకం కరువు
నా పేరు బెయిరి సత్యనారాయణ. మాది మంచిర్యాల. డిగ్రీ వరకు చదువుకున్న. నేను పుట్టుకతోనే వికలాంగుడిని. డిసెంబర్లో సకలాంగ యువతితో నాకు వివాహమైంది. ఆ సమయంలోనే ప్రభుత్వం ఇచ్చే వివాహ ప్రోత్సాహకం(రూ. 50 వేలు) కోసం దరఖాస్తు చేసుకున్న. ఇంతవరకు నాకు నయాపైసా రాలేదు. కుటుంబపోషణ భారం కావడంతో మంచిర్యాలలో మీ సేవ నిర్వహించుకుంటున్న. ప్రభుత్వం స్పందించి ప్రోత్సాహకం తొందరగా ఇవ్వాలి. సాక్షి, మంచిర్యాల : జిల్లాలో ఆదర్శ వివాహం చేసుకున్న జంటలను ప్రభుత్వం నిరుత్సాహ పరుస్తోంది. వికలాంగులను వివాహం చేసుకున్న సకలాంగులకు ప్రోత్సాహకాల కింద రూ.50 వేలు ఇస్తామని విస్మరించింది. నిధులు విడుదల చేయకుండా తాత్సారం చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 142 ఆదర్శ జంటలు దరఖాస్తు చేసుకుంటే కేవలం 16 జంటలకే నగదు అందజేసి చే తులు దులుపుకుంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల కోసం 126 మంది వికలాంగులు జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిరుత్సాహమే మిగిలింది.. జిల్లా వ్యాప్తంగా ఆరు వేలకు పైగా వికలాంగులున్నారు. వీరిలో 3,900 వరకు వయోవృద్ధులు ఉన్నారు. మిగిలిన వారు విద్యార్థులు, యువతీయువకులు. సమాజంలో అంగవైకల్యం, మానసిక వికలాంగులపై కొనసాగుతున్న వివక్ష, చిన్నచూపును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారిలో ఆత్మవిశ్వాసం పెంచాలని నిర్ణయించింది. ఎవరైన సకలాంగులు వికలాంగులను పెళ్లాడితే వారిని ఆదర్శ జంటలుగా పరిగణించి రూ.50 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరమే మార్గదర్శకాలు విడుదల చేసింది. వివాహం జరిగినట్లు నిరూపించే పెళ్లి ఫొటోలు, వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరించే సర్టిఫికెట్, గుర్తింపు కార్డు, తహశీల్దార్లు, గ్రామ కార్యదర్శులు ధ్రువీకరించే పత్రాలతో ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో రెండేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా 142 వికలాంగ జంటలు దరఖాస్తు చేసుకున్నాయి. కొందరికే ప్రోత్సాహకం వికలాంగులను వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచిన యువ జంటలను కాదని కొందరికే ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 22 జూలై, 2011 తర్వాత వివాహం చేసుకున్న జంటలే దరఖాస్తు చేసుకోవాలని, వారికి మాత్రమే ప్రోత్సాహక నగదు ఇస్తామని ప్రకటించడంతో అంతకు ముందు వివాహం చేసుకున్న జంటలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మరోపక్క.. దరఖాస్తు విధానంపై అవగాహన లేకపోవడంతో చాలా జంటలు దరఖాస్తు చేసుకోలేద. 142 జంటలకు రూ.71 లక్షలు విడుదల చేయాల్సి ఉండగా, ప్రభుత్వం కేవలం రూ. 8 లక్ష లు విడుదల చేసింది. ఇందులో 16 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. దీంతో దరఖాస్తు చేసుకున్న అర్హులైన ఆదర్శ జంటలు ప్రోత్సాహకాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలావుంటే ఇప్పటి వరకు ఆదర్శ జంటలకు ప్రభుత్వం నేరుగా నగదు ఇచ్చింది. కానీ ఇక మీదట ప్రోత్సాహక నగదును ఆధార్ కు అనుసంధానం చేయాలని నిర్ణయించింది. దీంతో భవిష్యత్తులో ప్రోత్సాహకాల పంపిణీలో జాప్యమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు త్వరగా అందజేస్తే మిగతా సకలాంగులనూ ప్రోత్సహించినట్లు ఉంటుంది. నిధులు విడుదల కాకపోవడంతోనే.. వికలాంగ వివాహ ప్రోత్సాహక నిధులు విడుదల కాకపోవడంతోనే ఆదర్శ జంటలకు నగదు ఇవ్వలేకపోతున్నాం. నిధులు విడుదల అయిన వెంటనే మిగతా అర్హులైన వారందరికీ అందజేస్తాం. అప్పటి వరకు ఆగాల్సిందే. - ఏవీడీ నారాయణరావు, అసిస్టెంట్ డెరైక్టర్, వికలాంగ సంక్షేమ శాఖ