సంపాదకీయం
శారీరక వైకల్యం ఇబ్బందులు పెడుతున్నా, సమాజం చిన్నచూపు చూస్తున్నా తమలో దాగివున్న ప్రతిభా సామర్థ్యాలను ఈ సమాజోన్నతికి వినియోగిస్తున్న వికలాంగులకు ఇప్పుడు సర్కారే శాపంగా మారినట్టు కనిపిస్తోంది. నాలుగేళ్లకుపైగా కసరత్తులు చేసి రూపొందించిన వికలాంగుల హక్కుల బిల్లును ఈ పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టడానికి యూపీఏ సర్కారు సిద్ధపడుతుండగా... ఆ బిల్లువల్ల తమకు ఒరిగేదేమీ లేదని వికలాంగులు చెబుతున్నారు. 2012లో రూపొందించిన బిల్లే ఎన్నెన్నో లోపాలతో ఉన్నదని, దాన్లో మార్పులు తీసుకొచ్చి తమకు న్యాయం చేయాలని మొత్తుకుంటే అంతకుమించిన అడ్డుపుల్లలెన్నో తాజా బిల్లులో దాగున్నాయని వారు చెబుతున్న మాట. దేశంలో దాదాపు పదికోట్లమంది వికలాంగులున్నారని అంచనా.
1995లో తీసుకొచ్చిన చట్టం చట్టుబండలై నిరర్ధకంగా మారాక వికలాంగులు జాతీయస్థాయిలో ఎన్నో పోరాటాలు చేశారు. సరికొత్త చట్టం తెచ్చి తమకు అవరోధంగా మారిన అంశాలను సరిచేయమని కోరారు. తీరా 2012లో తీసుకొచ్చిన బిల్లు చూసి వారంతా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఎందుకంటే, రెండేళ్లపాటు ఎందరో వ్యక్తులతో, సంస్థలతో సమాలోచనలు జరిపాక రూపొందించిన ఆ బిల్లు సమగ్రంగా ఉండటం మాట అటుంచి వారి కనీస డిమాండ్లను కూడా సరిగా పట్టించుకోలేదు.
వైకల్యం ఉన్నవారి కోసం ప్రత్యేక విద్యా సంస్థలు నెలకొల్పడంకాక, ఇతర పిల్లలతోపాటే వారు కూడా చదువుకొనే పరిస్థితి కల్పించాలన్నది ఆ బిల్లు ఉద్దేశం. పైకి చూడటానికి ఇది బాగానే ఉన్నా అంధత్వం, బధిరత్వం ఉన్న పిల్లలకు ఆచరణలో అలాంటి పాఠశాలలు పెద్దగా ఉపయోగపడవు. అలాగే, వీల్‌చైర్లు వినియోగించాల్సిన స్థితిలో ఉండే పిల్లలకు అనువైన మౌలిక సదుపాయాలు అలాంటి స్కూళ్లలో ఉండవు. ప్రత్యేక పాఠశాలల్లో అయితే అలాంటి పిల్లలకు అనువైన వాతావరణం లభించడంతోపాటు, ప్రత్యేక తర్ఫీదు పొందిన ఉపాధ్యాయుల ద్వారా విద్య నేర్చుకునే వీలుంటుంది. దేశంలో వైకల్యంతో బాధపడేవారికోసం బిల్లు రూపొందిస్తూ ఇలాంటి ప్రాథమిక అంశాలను విస్మరించడం వింతగొలిపే విషయం.
ఇక ఉద్యోగాల విషయంలో ఆ బిల్లు మరిన్ని విన్యాసాలు చేసింది. ఏదైనా విభాగంలో సంబంధిత ఉన్నతాధికారులు నిర్ణయించిన పోస్టులకు మాత్రమే వికలాంగులు అర్హులని తేల్చింది. సారాంశంలో... ఇతర పోస్టులకు అవసరమైన శక్తిసామర్ధ్యాలున్నా వికలాంగులకు అవి అందకుండా చేసింది. ఇది ఐక్యరాజ్యసమితి ఒడంబడికకు పూర్తి విరుద్ధం. ఆ ఒడంబడికలో మన దేశమూ భాగస్వామిగానే ఉన్నా దాని స్ఫూర్తికి ఆ బిల్లు తూట్లుపొడిచింది.
మళ్లీ ఎన్నో ఆందోళనలు, నిరసనోద్యమాల తర్వాత ఆ బిల్లును సరిదిద్దడానికి కేంద్రం అంగీకరించింది. మరోసారి భారీయెత్తున కసరత్తు జరిగింది. వికలాంగుల హక్కుల కోసం పోరాడుతున్న సంస్థలు, వ్యక్తులు ఎన్నెన్నో సూచనలు చేశారు. మొన్న డిసెంబర్‌లో కేంద్ర మంత్రివర్గం ఆ బిల్లును ఆమోదించినప్పుడు వికలాంగులు సంతోషపడ్డారు. ఇక తమ కష్టాలు గట్టెక్కగలవని భావించారు. కోట్లాదిమంది వ్యక్తుల ప్రయోజనాలతో ముడిపడివున్న బిల్లులోని అంశాలేమిటో సంక్షిప్తంగా నైనా తెలిస్తే ఇంకేమి అంశాలు దానిలో పొందుపరచాలో... ఎక్కడెక్కడ లోపాలున్నాయో సలహాలూ, సూచనలూ వస్తాయి. కానీ, ప్రభుత్వం ఆ పని చేయలేదు.
ఇప్పుడు మరో రెండు రోజుల్లో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారనగా చివరి నిమిషంలో అనధికారికంగా వెల్లడైన అంశాలను చూసి వికలాంగుల హక్కుల సంస్థలు భగ్గుమంటున్నాయి. వికలాంగుల విషయంలో ఈ బిల్లు ‘మెడికల్ మోడల్’నే గుర్తిస్తున్నదని, ఇందువల్ల వైకల్యంతో బాధపడేవారిని వైద్యపరమైన సాయం అవసరమైనవారిగా మాత్రమే పరిగణిస్తారని సంస్థలు చెబుతున్నాయి. ఇతర పౌరులతో సమానంగా పరిగణించి, వారికి అన్నిటా అవకాశాలను కల్పించాలని నిర్దేశించే ఐక్యరాజ్యసమితి ఒడంబడికలోని 12వ అధికరణాన్ని ఇది నీరుగారుస్తున్నదని ఆ సంస్థలు ఆరోపిస్తున్నాయి. మహిళలు, పిల్లల వైకల్యానికి సంబంధించి ఈ బిల్లు ప్రత్యేక చర్యలు సూచించలేదంటున్నాయి.
నిరుడు అక్టోబర్‌లో ఇచ్చిన తీర్పు ద్వారా సర్వోన్నత న్యాయస్థానం వికలాంగులకు అన్ని రకాల ప్రభుత్వ విభాగాల్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వికలాంగుల సంక్షేమంపై సర్వోన్నత న్యాయస్థానం అంతటి ఆందోళన కనబరిచినా ఇప్పుడు రూపొందించిన బిల్లులో కేంద్రం దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. వికలాంగులకు ఉద్యోగాల కేటాయింపుపై అందులో నిర్దిష్ట సూచనలు లేవు. అలాగే రిజర్వేషన్లు, ప్రమోషన్లలో ఎలాంటి విధానాలు అనుసరించాలన్న విషయంలోనూ స్పష్టత లేదు.
వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెట్టాల్సిన నియంత్రణా యంత్రాంగం గురించి బిల్లు చెప్పినదేమీ లేదు. వికలాంగుల కోసం ఎంతో చేస్తామని ఆశలు పెడుతున్న ప్రభుత్వాలు బడ్జెట్ రూపొందించేటపుడు అలాంటి హామీలకు తిలోదకాలిస్తున్నాయి. నామమాత్ర కేటాయింపులతో ఉసూరనిపిస్తున్నాయి. పర్యవసానంగా విద్య, ఆరోగ్యం, పునరావాసం వంటి అంశాల్లో వారికి అన్యాయమే జరుగుతున్నది. ఇవన్నీ ఇలావుంటే...దశాబ్దాలుగా తమ కష్టాలనూ, కన్నీళ్లనూ చెప్పుకుంటున్న వికలాంగుల ఆర్తనాదాలు సర్కారు చెవికి సోకలేదని తాజా బిల్లు వెల్లడిస్తోంది. కనీసం ఇప్పుడైనా వికలాంగుల డిమాండ్లేమిటో, తాము రూపొందించిన బిల్లునుంచి వారు ఆశిస్తున్నదేమిటో యూపీఏ ప్రభుత్వం గుర్తించాలి. తగిన దిద్దుబాటు చర్యలు ప్రారంభించాలి.