మాలతీ రాజా, వీల్‌ఛెయిర్ బాస్కెట్ బాల్ ప్లేయర్
కష్టంలో చెయ్యి చాచలేని వారుంటారు. కష్టాన్ని చూసి మనమే చెయ్యి చాచాలి. ఇరవై ఉంటే పది ఇవ్వొచ్చు. రెండు గుప్పెళ్లుంటే గుప్పెడు ఇవ్వొచ్చు. కష్టంలో కాళ్లు లేని వారూ ఉంటారు. కష్టాన్ని చూసి మనమే దగ్గరికి వెళ్లాలి. మాలతి దగ్గర ఇరవై ఉన్నాయి. రెండు గుప్పెళ్లూ ఉన్నాయి. కష్టాన్ని చూడలేని మనసూ ఉంది. వెళ్లి ఇవ్వడానికే.. ఆమెకు కాళ్లు లేవు! అయినా ఆగలేదు. లాక్‌డౌన్ కష్టాల్లో ఉన్న ‘పీసీ’ మహిళల కోసం ఒక నెట్‌వర్క్‌నే నడిపిస్తున్నారు!!
బ్యాంకు ఉద్యోగి మాలతీ రాజా. ‘బార్‌క్లేస్’ బ్యాంకు చెన్నై శాఖలో పర్సనల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్‌లో పని చేస్తుంటారు. బార్‌క్లేస్ లండన్ బ్యాంక్. 330 ఏళ్ల నుంచి ఉంది. చెన్నై శాఖను నిలదొక్కుకునేలా చేయడం కోసం ఆ బ్యాంక్ నియమించుకున్న మెరికల్లాంటి సిబ్బందిలో.. కాళ్లలో శక్తి లేని మాలతీ కూడా ఒకరు. అవును. వీల్ చెయిర్ లేకుండా ఆమె కదలలేరు. లాక్‌డౌన్ ముందు వరకు ఆఫీస్‌కి వెళ్లొచ్చేవారు. ఇప్పుడు ఇంట్లోంచే పని చేస్తున్నారు.
బ్యాంకు పనితో పాటు.. ఇంట్లోంచి మాలతీ చేస్తున్న పని ఇంకొకటి కూడా ఉంది. చెన్నై కార్పోరేషన్ షెల్టర్‌లో పీసీ (ఫిజికల్లీ ఛాలెంజ్డ్) మహిళల చేత పని చేయించడం! వాళ్లు చేసే పని.. షెల్టర్ చుట్టు పక్కల ఉన్న తమ లాంటి వారి కనీస నిత్యావసరాలు తీరేలా చేయడం. వాళ్ల కోసం ఉతికి వాడుకోదగిన (రీయూజబుల్) మాస్క్‌లను, శానిటరీ ప్యాడ్స్‌ను తయారు చేయడం. పసిపిల్లల కోసం డైపర్స్ చేయడం. మాలతి చెబితే వాళ్లెందుకు చేస్తారు? మాలతి టీమ్ మేట్స్ మెటిల్డా, మేరీ, కలై, నదియా, కవిత.. ఇంకా కొందరు ఆ షెల్టర్‌లోనే ఉంటున్నారు. టీమ్ మేట్స్ అంటే బ్యాంక్ టీమ్ మేట్స్ కాదు. వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ ఉమెన్ టీమ్ మేట్స్. మాలతి నేషనల్ చాంపియన్. టోర్నమెంట్ ఉన్నప్పుడు బ్యాంకు ఆమెను డిస్టర్బ్ చేయదు. ప్రాక్టీస్ చేసుకోనిస్తుంది.
∙∙
తమిళనాడు మొత్తం మీద 150 మంది వీల్‌చెయిర్ మహిళా బాస్కెట్‌బాల్ ప్లేయర్‌లు ఉన్నారు. కోయంబత్తూరు, తిరుచ్చి, తిరువణ్ణామలై, విల్లుపురం, వెల్లూరు.. మరికొన్ని ప్రాంతాల నుంచి వారం చివరిలో వాళ్లంతా చెన్నై వస్తారు. మాలతితో కలిసి జె.జె. కిల్పాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తారు. లాక్‌డౌన్‌తో ఇప్పుడు ఎక్కడివారక్కడే ఉండిపోయారు. కొందరు చెన్నై షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్నారు. వాళ్ల చేతే మాలతి ఇప్పుడు నిరాశ్రయులైన పీసీ మహిళలకు చేయూతను ఇప్పిస్తున్నారు.
షెల్టర్‌లో మాస్క్‌లు కుడుతున్న మాలతి టీమ్ మేట్
బాగా అవసరంలో ఉన్నవారికి ఉప్పు, పప్పులతో పాటు కొంత డబ్బు కూడా. ఆ డబ్బును మాలతే తన ఫేస్‌బుక్ నుంచి విరాళాల ద్వారా సేకరిస్తున్నారు. నిజానికి ఆమెకు పెద్ద సర్కిలే ఉంది. బ్యాంకుతో ఏర్పడింది కొంత. క్రీడాకారిణిగా సాధించుకున్నది కొంత. వాళ్లంతా మాలతికి అన్ని విధాలా సహాయంగా ఉన్నారు. ‘ఫలానా చోట.. ఫలానా మహిళ.. ఆమె కదల్లేదు.. ఆమె కుటుంబం కష్టంలో ఉంది’ అని మాలతి మెజేస్ ఇస్తే చాలు.. వెంటనే అక్కడి వెళ్లి చేయగలిగినంతా చేసి వస్తున్నారు. ఇటువైపు షెల్టర్‌లో మాలతి సూచనల ప్రకరాం.. ఆమె టీమ్ మేట్స్, మిగతా మహిళలు తాము చేయగలిగింది చేస్తున్నారు.
మొత్తం ముప్పైమంది వరకు ఉంటారు షెల్టర్‌లో. వారంతా రోజుకు పది గంటల పాటు పని చేస్తూ కనీసం 300 సింగిల్, డబుల్ లేయర్‌ల మాస్క్‌లతో పాటు.. శానిటరీ నేప్‌కిన్స్, బేబీ డైపర్స్ కుడుతున్నారు. అవన్నీ కూడా ‘ఫిజికల్లీ ఛాలెంజ్డ్’ మహిళల కోసమే. వాళ్లలా రెడీ చెయ్యగానే ‘అందుబాటులో ఉన్నాయి. అవసరమైనవారు సంప్రదించవచ్చు’’ అని మాలతి ఇలా ఫేస్‌బుక్‌లో పెట్టేస్తారు. డబ్బు పెట్టగల ఎన్జీవోలు వాటిని కొని, వైకల్యం ఉన్న మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తాయి. ఆ డబ్బును మళ్లీ రేషన్ పంపిణీ చేసేందుకు ఖర్చు చేయిస్తారు మాలతి.
ఈ లాక్‌డౌన్‌లో ఉన్నచోటు నుంచి కదలకుండా మాలతి ఇప్పటి వరకు 200 మంది వైకల్యం గల మహిళలకు డ్రై రేషన్ (వండుకోడానికి అవసరమైన దినుసులు), మందులు, ఇతర నిత్యావసరాలు పంపించగలిగారు. మాలతి కుటుంబానికి కూడా పూర్తిగా ఆమే ఆధారం. ఆమెతో కలిపి మొత్తం ఐదుమంది ఉంటారు. ‘‘లాక్‌డౌన్‌తో నేను పోషించవలసిన కుటుంబం మరింత పెద్దదైంది’’ అంటారు మాలతి.. చిరునవ్వుతో.
చెన్నై కార్పోరేషన్ షెల్టర్‌లో మాలతీ టీమ్ మేట్స్, ఇతర మహిళలు.
Comments
Please login to add a commentAdd a comment