చెన్నై: కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన తర్వాత భారీ సడలింపులతో అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను ప్రభుత్వం మళ్లీ బిగించింది. కొన్ని రోజుల క్రితం సడలింపులను సవరించగా ప్రతి ఆది వారం పూర్తి లాక్‌డౌన్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా సెకండ్ వేవ్‌లో తొలి పూర్తి లాక్‌డౌన్ ఈ నెల 25వ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. 236 రోజుల తర్వాత మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ చట్రంలోకి ప్రజలు మళ్లీ వెళ్లిపోవాల్సి వస్తోంది.
ఆదివారాల్లో వర్తక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలు మూసివేస్తారు. వాహనాల రాకపోకలు కూడా పూర్తిగా నిషేధం. ప్రజలు రోడ్లపైకొస్తే అరెస్టు చేసేలా ఆంక్షలు తీసుకొచ్చారు. ఆదివారాల్లో మెట్రో రైలును ప్రతిగంటకోసారి సేవలందించేలా సవరించారు. ప్రతి ఆదివారం పూర్తి లాక్‌డౌన్ వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడకుండా అమ్మ క్యాంటీన్‌లను యథావిధిగా నిర్వహిస్తున్నారు.
26 నుంచి అదనపు ఆంక్షలు:
కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈనెల 26వ తేదీ నుంచి కొత్తగా అమల్లోకి తెస్తున్న ఆంక్షలను ఒక ప్రకటన ద్వారా సమాచారశాఖ శనివారం విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్నవి, కొత్తగా తీసుకొచ్చిన ఆంక్షలను పాటించి ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.
ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు లాక్‌డౌన్ పొడిగించింది. కంటైన్‌మెంట్ జోన్లలో ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా ప్రజలు కరోనా ఆంక్షలు పాటించని కారణంగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు ప్రమాదస్థాయికి చేరుకుంటున్నాయి. గత నెల 28వ తేదీన 13,070 మంది చికిత్సలో ఉండగా, ఈనెల 23వ తేదీ నాటికి ఈ సంఖ్య 95,048కి చేరుకుంది. అందుకే ఈనెల 26వ తేదీ నుంచి అదనపు ఆంక్షలను అమల్లోకి వస్తున్నాయి.
- పజలు ఎక్కువగా చేరుకునే ప్రాంతాలైన సినిమా థియేటర్లు, వ్యాయామ కేంద్రాలు, రిక్రియేషన్ క్లబ్బులు, మద్యం బార్లు, ఆడిటోరియంలు, సమావేశ మందిరాలు, పెద్ద దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, మాళ్లకు అనుమతి లేదు.
- ఫలసరుకులు, కూరగాయల దుకాణాలు యథావిధిగా నిబంధనలు పాటిస్తూ నిర్వహించవచ్చు. షాపింగ్ మాళ్లలోని ఫలసరుకులు, కూరగాయల దుకాణాలకు అనుమతి లేదు. డిపార్టుమెంట్ స్టోర్లు ఏసీ లేకుండా వ్యాపారాలు సాగించవచ్చు
- సెటూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలకు అనుమతి లేదు
- హోటళ్లు, టీ బంకుల్లో పార్సిల్ మాత్రమే
- లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లలో బస చేసిన వారికి రూముల్లోకే ఆహార సరఫరా
- ఈ– సేవా కేంద్రాలు పరిమిత వేళల్లో పనిచేయాలి
- అన్ని మతాల ప్రార్థనా కేంద్రాల్లోకి భక్తుల అనుమతి లేదు. పూజలు, ప్రార్థనలు సిబ్బంది, పూజారుల చేత యథావిధిగా జరుపుకోవచ్చు.
- జిల్లా కలెక్టర్ నుంచి ముందుగా అనుమతి పొంది మత సంబంధిత ఉత్సవాలను ప్రజలకు ప్రవేశం లేకుండా 50 మంది సిబ్బందితో నిర్వహించవచ్చు.
- వివాహం, సంబందిత శుభ కార్యాలను 50 మందితో జరుపుకోవచ్చు.
- అంత్యక్రియలు, అందుకు సంబంధించిన కార్యక్రమాలకు 25 మంది మాత్రమే అనుమతి.
- ఐటీ, అనుబంధ కంపెనీలు 50 శాతం సిబ్బందిని మాత్రమే పరిమితం చేయాలి.
- పుదుచ్చేరీ మినహా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి తమిళనాడుకు వచ్చే వ్యక్తులు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ–పాస్ పొందాలి. సరిహద్దుల్లో అధికారులకు ఈ–పాస్ చూపితేనే రాష్ట్రంలోకి ప్రవేశం.
- క్యాబ్‌లలో డ్రైవర్ మినహా ముగ్గురు, ఆటోల్లో డ్రైవర్ మినహా ఇద్దరికి మాత్రమే అనుమతి.
- రాత్రి వేళ లాక్‌డౌన్, ఆదివారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment