
తిరువొత్తియూర్: మలేషియాలో నివాసం ఉంటున్న తమిళ కుటుంబానికి కరోనా సోకడంతో విరక్తి చెంది తల్లి, కుమార్తె మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోగా, ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ తండ్రి మృతిచెందాడు. కడలూరు జిల్లా దిట్టకుడి కి చెందిన రవిరాజా (40) కంప్యూటర్ ఇంజినీర్. 12ఏళ్లకు పైగా మలేషియాలో భార్య సత్య (37), కుమార్తె గుహదరాణి (5)తో నివాసముంటున్నారు. గత వారం రవిరాజా సహా భార్య, కుమార్తెకు కరోనా వైరస్ సోకినట్లు తెలిసింది. రవిరాజా ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. సత్య, గుహదమణి హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిసింది.
ఈ క్రమంలో విరక్తి చెందిన సత్య, గుహదమణి నాలుగు రోజుల ముందు ఇంటి మిద్దెపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి రవిరాజా ఆరోగ్యం మరింత క్షీణించడంతో శనివారం సాయంత్రం మృతిచెందాడు. రవిరాజా బంధువులు మాట్లాడుతూ మృతదేహాలను ఇవ్వడానికి మలేషియా ప్రభుత్వం తిరస్కరించిందని, భారత ప్రభుత్వం అనుమతిస్తే వారి అస్తికలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారన్నారు. భారత రాయబార కార్యాలయం చర్చలు జరిపి అస్తికలు సొంత గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment