Barclays
-
బార్ల్కేస్ హురున్ లిస్ట్.. బిజినెస్‌లో ఈ ఫ్యామిలీలదే హవా
దేశంలోని వ్యాపార కుటుంబాల్లో అంబానీ ఫ్యామిలీ హవా చాటింది. 2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యూబుల్ ఫ్యామిలీ బిజినెస్‌ల జాబితా ప్రారంభ ఎడిషన్‌లో అగ్రస్థానాన్ని పొందింది. అంబానీ కుటుంబం విలువ 309 బిలియన్ డాలర్లు (రూ.25.75 లక్షల కోట్లు). ఇది భారతదేశ జీడీపీలో దాదాపు 10 శాతానికి సమానం.బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్, హురున్ ఇండియా 2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాల జాబితాను విడుదల చేశాయి. ఈ లిస్ట్ విలువ పరంగా దేశంలోని అత్యంత విలువైన కుటుంబ వ్యాపారాలకు ర్యాంక్ ఇచ్చింది. వ్యవస్థాపక కుటుంబం నుంచి తదుపరి తరం సభ్యులు వ్యాపార నిర్వహణలో లేదా దాని బోర్డులో ఉంటున్న కుటుంబ వ్యాపారాలను మాత్రమే ఈ జాబితాలోకి తీసుకున్నారు. 2024 మార్చి 20 నాటికి ఈ విలువలను లెక్కించారు.ఈ జాబితాలో బజాజ్ కుటుంబం మొత్తం రూ.7.13 లక్షల కోట్ల వ్యాపార విలువతో రెండో స్థానాంలో ఉండగా బిర్లా కుటుంబం రూ.5.39 లక్షల కోట్ల విలువతో మూడవ స్థానాన్ని ఆక్రమించింది. ఇక మొదటి తరం వ్యవస్థాపక కుటుంబాల ప్రత్యేక కేటగిరీలో అదానీ కుటుంబం రూ.15.45 లక్షల కోట్ల విలువతో ముందంజలో ఉంది. ఆ తర్వాత రూ.2.37 లక్షల కోట్ల విలువతో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహణలో పేరుగాంచిన పూనావాలా కుటుంబం ఉంది.2024 బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ హురున్ ఇండియా మోస్ట్ వాల్యూయబుల్ ఫ్యామిలీ బిజినెస్‌ల ఉమ్మడి విలువ రూ.130 లక్షల కోట్లు. ఇది స్విట్జర్లాండ్, యూఏఈ వంటి దేశాల జీడీపీ కంటే అధికం. ఈ లిస్ట్‌లో మొదటి మూడు కుటుంబ వ్యాపారాల విలువ మాత్రమే రూ.46 లక్షల కోట్లు. ఇది సింగపూర్ జీడీపీకి సమానం. -
కొత్త విమానాలకు కీలక మార్కెట్‌గా భారత్..
న్యూఢిల్లీ: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లకు భారత్ అత్యంత కీలక మార్కెట్‌గా మారనుందని బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ ఒక నివేదికలో పేర్కొంది. కేంద్రం ప్రవేశపెట్టిన ప్రాంతీయ కనెక్టివిటీ స్కీము ఉడాన్‌తో విమాన ప్రయాణాలు చేసే మధ్య తరగతి వర్గాల సంఖ్య పెరుగుతోందని వివరించింది. దీనితో పాటు మరికొన్ని సానుకూల అంశాలు భారత్‌ను కొత్త విమానాలకు కీలక కేంద్రంగా మారుస్తున్నాయని పేర్కొంది. దేశీయంగా విమాన ప్రయాణాలకు సంబంధించి ప్రస్తుతం అమెరికా, చైనాల తర్వాత భారత్ మూడో అతి పెద్ద ఏవియేషన్ మార్కెట్‌గా ఉంది. ప్యాసింజర్ ట్రాఫిక్ విషయంలో ప్రపంచంలోనే అత్యధికంగా వృద్ధి రేటు నమోదు చేస్తోంది. కొత్త విమానాలకు ఆర్డర్లివ్వడంలో అమెరికా తర్వాత భారతీయ విమానయాన సంస్థలు రెండో స్థానంలో ఉన్నాయి. బోయింగ్, ఎయిర్‌బస్ డెలివరీ చేసే వాటిల్లో 7 శాతం విమానాలను భారతీయ ఎయిర్‌లైన్స్ దక్కించుకుంటున్నాయి. మార్కెట్ వాటాను పెంచుకునేందుకు ఇండిగో, ఆకాశ ఎయిర్ తదితర సంస్థలు పోటీపడనున్న నేపథ్యంలో విమానాల కొనుగోళ్ల నిర్ణయాలు ప్రాధాన్యతాంశంగా ఉండనున్నాయని బార్క్లేస్ తెలిపింది. దేశీయంగా తయారు చేసుకున్న కొమాక్ సీ919 విమానాలను చైనా పూర్తి స్థాయిలో వాడటం మొదలుపెడితే అక్కడి నుంచి ఆర్డర్లు తగ్గగలవని పేర్కొంది. అదే సమయంలో భారత మార్కెట్లో ఆర్డర్లు దక్కించుకుంటే సుదీర్ఘకాలం పాటు పని లభించగలదని వివరించింది. ఏటా 11 శాతం ట్రాఫిక్ వృద్ధి.. ‘అంతర్జాతీయ ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమ భారత మార్కెట్‌పై ప్రధానంగా దృష్టి పెట్టనున్నాయి. 2006–2019 మధ్య కాలంలో భారత్‌లో దేశీ ట్రాఫిక్ వార్షికంగా 11 శాతం వృద్ధి చెందింది. దీర్ఘకాలంలో అంతర్జాతీయ సగటుకన్నా 200 బేసిస్ పాయింట్లు అధికంగా ఉండవచ్చని అంచనా. 2009–22 మధ్య కాలంలో భారత ఎయిర్‌లైన్స్ 1,400 పైచిలుకు ఎయిర్‌క్రాఫ్ట్‌లకు ఆర్డర్లు ఇచ్చాయి‘ అని బార్క్లేస్ వివరించింది. జీటీఎఫ్, లీప్ ఇంజిన్లు బిగించిన వాటిల్లో (ఏ320నియో, మ్యాక్స్ ఏరోప్లేన్లు) 10 శాతం విమానాలకు భారత్ కేంద్రంగా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ ఏరోస్పేస్ పరిశ్రమ ఆర్థిక పనితీరుకు కూడా భారత్ కీలకంగా ఉండనుందని వివరించింది. ఎయిర్‌బస్‌కు సానుకూలం.. భారత ఎయిర్‌లైన్స్ ఎక్కువగా చిన్న (నారో బాడీ) విమానాల వైపు మొగ్గు చూపుతున్నాయి కనుక బోయింగ్‌తో పోలిస్తే ఎయిర్‌బస్‌కు పరిస్థితులు సానుకూలంగా ఉన్నట్లుగా కనిపిస్తోందని బార్క్లేస్ తెలిపింది. 2009 నుంచి చూస్తే దేశీ విమానయాన సంస్థలు ఇచ్చిన ఆర్డర్లలో 65 శాతం వాటా ఎయిర్‌బస్‌దే ఉన్నట్లు వివరించింది. మరోవైపు, డిఫెన్స్ విషయానికొస్తే 81.4 బిలియన్ డాలర్ల కేటాయింపులతో అమెరికా, చైనా, రష్యా తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. సౌదీ అరేబియా తర్వాత అత్యధికంగా రక్షణ పరికరాలను దిగుమతి చేసుకుంటోంది.2018–22 మధ్య కాలంలో ప్రపంచ దేశాల మిలిటరీ పరికరాల దిగుమతుల్లో భారత్ వాటా 11 శాతంగా ఉంది. అటు చైనా తమ మిలిటరీపై వ్యయాలను పెంచుకుంటున్నందున డిఫెన్స్‌కు భారత్ కేటాయింపులు కూడా అధిక స్థాయుల్లోనే కొనసాగవచ్చని బార్క్లేస్ తెలిపింది. భారతీయ మిలిటరీ పరికరాల విశ్లేషణ బట్టి చూస్తే భారతీయ వైమానిక దళానికి మరిన్ని ఫైటర్ జెట్ల అవసరం ఉన్నట్లుగా తెలుస్తోందని వివరించింది. -
వేదాంత 250 మిలియన్ డాలర్ల రుణ చెల్లింపు
న్యూఢిల్లీ: మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత రిసోర్సెస్.. తాజాగా బార్క్లేస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు నుంచి తీసుకున్న 250 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2,000 కోట్లు) రుణాన్ని తిరిగి చెల్లించేసింది. బార్క్లేస్ బ్యాంకుకు 150 మిలియన్ డాలర్లు, స్టాండర్డ్ చార్టర్డ్‌కు 100 మిలియన్ డాలర్లు చెల్లించినట్లు సంస్థ తెలిపింది. సంస్థ ఆర్థిక పరిస్థితులపై ఇన్వెస్టర్లలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే రోజుల్లోనూ జరపాల్సిన చెల్లింపులకు తగినన్ని నిధులు తమ దగ్గర ఉన్నట్లు కొద్ది రోజుల క్రితమే తెలిపింది. మార్చి నాటికి చెల్లించాల్సిన రుణాలన్నింటినీ ముందుగానే చెల్లించేసినట్లు వివరించింది. 1.75 బిలియన్ డాలర్ల నిధులను సమకూర్చుకునే ప్రయత్నాలు తుది దశలో ఉన్నట్లు వేదాంత రిసోర్సెస్ పేర్కొంది. -
కాల్పుల కలకలం.. పరుగులు పెట్టిన ప్రేక్షకులు; ఊహించని ట్విస్ట్
బాక్సింగ్ మ్యాచ్‌లో ఊహించని సంఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ముగిసిన తర్వాత కాల్పుల శబ్దం వినిపించడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో స్టేడియం బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. బ్రూక్లిన్ వేదికగా బార్క్లేస్ సెంటర్లో గెర్వొంటా డేవిస్, రొనాల్డో రొమేరో మధ్య బాక్సింగ్ ఫైట్ జరిగింది. పోరు ముగిసిన తర్వాత విజేతను ప్రకటిస్తున్న సమయంలో కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో ఎరీనాలోకి అగంతకుడు తుపాకీతో చంపడానికి వచ్చాడేమోనని భయపడిన ప్రేక్షకులు ఒకరినొకరు తోసుకుంటూ బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. కాల్పులు జరిగింది బార్క్లే సెంటర్లో కాదని.. బయట జరిగాయని తేలింది. విషయం తెలుసుకున్న ప్రేక్షకులు శాంతించడంతో కాసేపట్లోనే పరిస్థితి మొత్తం అదుపులోకి వచ్చింది. కాగా అదే బార్క్లే సెంటర్‌కు జపాన్ టెన్నిస్ స్టార్ నయామి ఒసాకా కూడా వచ్చింది. అక్కడ జరిగిన అనుభవాన్ని ఒసాకా తన ట్విటర్లో షేర్ చేసుకుంది. ''నేనప్పుడే బార్క్లే సెంటర్‌లోనికి వచ్చాను. అప్పుడే సడెన్‌గా నాకు కాల్పుల శబ్దం వినిపించడం.. ప్రాణభయంతో ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీయడంతో నాకు భయమేసింది. వెంటనే పక్కనే ఉన్న ఒక రూమ్‌లోకి వెళ్లిపోయి డోర్స్ క్లోజ్ చేసుకున్నాం. ఆ క్షణంలో మాకు ప్రాణం మీద ఆశ కలిగింది. నా జీవితంలో ఇలాంటి అనుభవం ఇదే తొలిసారి అనుకుంటా'' అంటూ పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గెర్వొంటో డేవిస్.. రొనాల్డో రెమోరోపై నాకౌట్ విజయం సాధించాడు. చదవండి: Viral Video: అదృష్టం బాగుంది.. కొంచెమైతే పరువు పోయేదే! Scary moment as crowds pour back into Barclays Center, my fear was a shooting but those fears proved unfounded. pic.twitter.com/pcBdfwWplt — Ryan Songalia (@ryansongalia) May 29, 2022 DOWN GOES ROMERO 😱 #DavisRomero pic.twitter.com/nKDMPhD89h — CBS Sports (@CBSSports) May 29, 2022 -
గోధుమ ఎగుమతులపై నిషేధం సానుకూలం
ముంబై: గోధుమల ఎగుమతులపై భారత్ విధించిన నిషేధం ద్రవ్యోల్బణం నియంత్రణకు కొంత సానుకూలమని అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘ప్రస్తుత అధిక వేడి వాతావరణం గోధుమల దిగుబడికి ఎన్నో సవాళ్లను విసురుతోంది. ప్రభుత్వం అనూహ్యంగా గోధుమల ఎగుమతులను నిషేధించడం దేశీయంగా ధరల ఒత్తిళ్లను కొంత వరకు తగ్గించగలదు’’అని బార్క్లేస్ పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలకు 8 శాతం సమీపానికి చేరడం తెలిసిందే. కొద్ది కాలం పాటు గరిష్ట స్థాయిల్లోనే ఇది కొనసాగొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ రెపో రేటు పెంపు, గోధుమల ఎగుమతులపై నిషేధం సానుకూలిస్తాయన్న అభిప్రాయాలను బార్క్లేస్ వ్యక్తం చేసింది. గోధుమల ధరలు 10 శాతం పెరిగితే ద్రవ్యోల్బణంపై 0.27 శాతం ప్రభావం ఉంటుందని పేర్కొంది. ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులను నిషేధించడం, సెర్బియా, కజకిస్థాన్ ఆహార ధాన్యాల ఎగుమతులను నిషేధించిన తరహాలోనే భారత్ నిర్ణయం కూడా ఉందని బార్క్లేస్ గుర్తు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో గోధుమల ధరలు ఇప్పటికే 44 శాతం పెరగ్గగా.. దేశీయంగా మూడు శాతమే పెరగడం గమనార్హం. ఎగుమతులపై నిషేధం విధించకుండా 10 మిలియన్ టన్నుల సమీకరణ లక్ష్యాన్ని ధరలపై ఒత్తిడి లేకుండా ప్రభుత్వం సాధించడం కష్టమవుతుందని బార్క్లేస్ నివేదిక పేర్కొంది. -
రివర్స్ రెపో పావు శాతం పెరగొచ్చు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) చివరి సమీక్షా సమావేశం వచ్చే వారం (8–10వ తేదీల్లో) జరగనుంది. ఈ సందర్భంగా కీలక రేట్లను పావు శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ‘‘ఒమిక్రాన్ వేరియంట్ విస్తరణ నేపథ్యంలో వృద్ధిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ద్రవ్యోల్బణం దాదాపుగా ఆర్బీఐ నియంత్రణల పరిధిలోనే ఉంది. దీంతో వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ సర్దుబాటు విధానాన్నే కొనసాగించొచ్చు. రివర్స్ రెపో రేటును 0.20–0.25 శాతం వరకు పెంచొచ్చు’’ అని బార్క్లేస్ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ రేటు 3.35%గా ఉంది. ప్రభుత్వం ఊహించని విధంగా రుణ సమీకరణ పరిమాణాన్ని బడ్జెట్లో పెంచినందున ఇది పాలసీ సాధారణీకరణ దిశగా ఆర్బీఐకి సంకేతం ఇచ్చినట్టేనని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్లో మూలధన వ్యయాలపై దృష్టి సారించడం ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిస్తుందని.. ద్రవ్యోల్బణం సహా స్థూల ఆర్థిక నేపథ్యాన్ని మార్చదని బార్క్లేస్ పేర్కొంది. చమురు ధరలు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు పెరగకపోవచ్చని అంచనా వేసింది. ఆర్బీఐ అప్రమత్తంగా ఉంటూ, ద్రవ్యోల్బణం అంచనాలను ఎగువవైపు పరిమితి (2–6) వద్ద కొనసాగించొచ్చని పేర్కొంది. -
థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సీతారామన్ సన్నద్ధం!
ముంబై: కోవిడ్–19 మూడవ వేవ్‌ను ఎదుర్కొంటున్న భారత్ ఎకానమీని సవాళ్ల నుంచి గట్టెక్కించడానికి, బలహీనంగా ఉన్న రికవరీకి మద్దతును అందించడానికి ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ రానున్న వార్షిక బడ్జెట్లో పలు ద్రవ్యపరమైన చర్యలను తీసుకునే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. ఇది ద్రవ్యలోటు పెరుగుదలకు దారితీయవచ్చని వివరించింది. ఫిబ్రవరి ఒకటవ తేదీన ఆర్థికమంత్రి పార్లమెంటులో 2022–23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. బార్క్లేస్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎకనమిస్ట్ రాహుల్ బజోరియా వెల్లడించిన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► 2021–22 బడ్జెట్లో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తలో (జీడీపీ)6.8 శాతం ఉంటుందని అంచనా వేయడం జరిగింది. అయితే 7.1 శాతానికి ఈ పరిమాణం పెరిగే అవకాశం ఉంది. ► కన్సాలిడేటెడ్ (కేంద్రం, రాష్ట్రాలు) ద్రవ్యలోటు 2021–22లో 11.1 శాతంగా ఉండే వీలుంది. కేంద్రం విషయంలో ఇది 7.1 శాతం అయితే, రాష్ట్రాలకు సంబంధించి 4 శాతంగా ఉం టుందన్నది అంచనా. కన్సాలిడేటెడ్ ద్రవ్యలోటు వచ్చే ఐదేళ్లలో 7 శాతం దిశగా దిగిరావచ్చు. ► 2022–23లో కన్సాలిటేడెడ్ ద్రవ్యలోటు 10.5 శాతానికి తగ్గవచ్చు. ఇందులో కేంద్రం వాటా 6.5 శాతంగా (రూ.17.5 లక్షల కోట్లు) నమోదుకావచ్చు. ► ఆయా అంశాల నేపథ్యంలో కేంద్రం వ్యయాల మొత్తం దాదాపు రూ.41.8 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ రుణాలు రూ.12 లక్షల కోట్లయితే, ఇది 2022–23లో రూ. 16 లక్షల కోట్లకు పెరిగే వీలుంది. ► కొత్త బడ్జెట్లో సంక్షేమ కార్యక్రమాలకు వ్యయాలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ద్రవ్యలోటు పెరుగుదలకు ఇది దారితీస్తుంది. ► ఇప్పటికే బలహీనంగా ఉన్న రికవరీ పటిష్టతకు మూలధన వ్యయాల పెంపు అవసరం. ► పన్ను, పన్ను యేతర ఆదాయాలు 2021–22లో అలాగే 2022–23లో బడ్జెట్ లక్ష్యాలను అధిగమించే వీలుంది. ► ప్రస్తుత ధరల ప్రాతిపదిక (నామినల్ బేస్) జీడీపీ 2021–22లో 19.6 శాతంగా నమోదుకావచ్చు. ప్రభుత్వ అంచనా (17.4 శాతం) ఇది అధికం కావడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నామినల్ ఎకానమీ విలువ 13.6 శాతం పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యలోటు ధోరణి ఇది... కరోనా తీవ్ర పరిస్థితుల నేపథ్యంలో 2020–21 స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ద్రవ్యలోటు 9.3 (బడ్జెట్ లక్ష్యం 3.5 శాతానికి మించి) శాతంగా నమోదయ్యింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దీనిని 6.8 శాతం (రూ.15.06 లక్షల కోట్లు) వద్ద కట్టడి చేయాలని 2021–22 బడ్జెట్ నిర్దేశించింది. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీతారామన్ 2021–22 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాలి. కాగా, ద్రవ్యలోటు విషయంలో కొంత ధైర్య సాహసాలతో కూడిన విధానాన్ని అనుసరించాలని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ లాంటి వారు సూచిస్తుండడం మరో విషయం. ద్రవ్యలోటును పూడ్చుకోవడంలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2021–22) ప్రభుత్వ రంగ కంపెనీలు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి వాటాల విక్రయం ద్వారా (పెట్టుబడుల ఉపసంహరణల) కేంద్రం రూ.1.75 లక్షలు సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ తద్వారా ఒనగూడింది కేవలం రూ.9,330 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. కేంద్రం ఆదాయ వ్యత్యాసం భర్తీలో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) బాండ్ల జారీ ద్వారా 7.02 లక్షల కోట్లు సమీకరించింది. మొత్తం రూ.12.05 లక్షల కోట్ల సమీకరణలో భాగంగా అక్టోబర్ నుంచి 2022 మార్చి వరకూ రూ.5.03 లక్షల కోట్ల రుణ సమీకరణ జరపనుంది. -
60 బిలియన్ డాలర్లకు క్యాడ్ లోటు
ముంబై: భారత్ కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) 60 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందని బ్రిటన్ బ్యాంకింగ్ సేవల దిగ్గజం– బార్క్లేస్ తన తాజా నివేదికలో పేర్కొంది. ఈ మేరకు గత 45 బిలియన్ డాలర్ల అంచనాలను ఎగువముఖంగా సవరించింది. బార్క్లేస్ తాజా అంచనాలు నిజమైతే, క్యాడ్ పరిమాణం 2021–22 స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 2 శాతంగా ఉంటుంది. కరెంట్ అకౌంట్ అంటే... ఒక దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని ప్రతిబింబించేదే కరెంట్ అకౌంట్. వచ్చినదానికన్నా ఇతర దేశాలకు చెల్లింపులు అధికంగా ఉండే పరిస్థితి ‘కరెంట్ అకౌంట్ లోటు’. చెల్లింపులకన్నా దేశంలోకి వచ్చిన మొత్తాలు అధికంగా ఉంటే అది కరెంట్ అకౌంట్ మిగులు. 2020–21లో మిగులే కరోనా సవాళ్లు, దిగుమతులు భారీగా పడిపోవడం వంటి అంశాల నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే (2020 ఏప్రిల్–2021 మార్చి) కరెంట్ అకౌంట్ మిగుల్లోనే ఉంది. విలువలో 102.2 బిలియన్ డాలర్లుగా (జీడీపీలో 0.9 శాతం) నమోదయ్యింది. 2021–22 మొదటి త్రైమాసికంలోనూ తిరిగి మిగులును నమోదుచేయడం గమనార్హం. 2021–22 క్యూ1 (ఏప్రిల్–జూన్)లో కరెంట్ అకౌంట్ 6.5 బిలియన్ డాలర్ల మిగులు (జీడీపీలో 0.9 శాతం) ఉంది. 2021–22 మొత్తంగా కూడా కరెంట్ అకౌంట్ మిగులే నమోదవుతుందని తొలుత అంచనాలు నెలకొన్నాయి. అయితే పరిస్థితి గణనీయంగా మారుతూ వచ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు, బొగ్గు, మెటల్ వంటి కీలక దిగుమతి ఉత్పత్తుల ధరలు తీవ్రంకావడం వల్ల కరెంట్ అకౌంట్‌ను లోటు దిశగా నడిపిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మారకద్రవ్య నిల్వల బలం కాగా భారత్ వద్ద ఉన్న 600 బిలియన్ డాలర్లకుపైగా విదేశీ మారకద్రవ్య నిల్వలు అంతర్జాతీయంగా ఒడిదుడుకుల నుంచి దేశ ప్రయోజనాలు కాపాడ్డానికి దోహదపడతాయని అంచనా. దాదాపు 15 నెలల దిగుమతులకు సరిపడా నిల్వలు భారత్ వద్ద ఉండడం గమనార్హం. 2013లో జీడీపీలో 15 శాతం ఫారెక్స్ నిల్వలు ఉంటే, ఇప్పుడు ఈ నిష్పత్తి దాదాపు 22 శాతానికి పెరిగింది. -
ఫారెక్స్ నిల్వల పెంపునకు ఆర్బీఐ మొగ్గు!
ముంబై: విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలను మరింత పెంచుకోవడానికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మొగ్గుచూపుతుందని భావిస్తున్నట్లు ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– బార్క్లేస్ ఇండియా తన తాజా నివేదికలో అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారత్ ఫారెక్స్ 655 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనావేసింది. అంతర్జాతీయంగా ఎటువంటి ఆర్థిక ఒడిదుడుకులు ఎదురయినప్పటికీ తట్టుకుని నిలబడగలిగే అసాధారణ ద్రవ్య విధానానికి, దాని కొనసాగింపునకు మద్దతు నివ్వడానికి ప్రస్తుత పరిస్థితిలో ఫారెక్స్ నిల్వలను పెంచుకోవడంవైపు ఆర్బీఐ దృష్టి సారించే వీలుందని విశ్లేషించింది. ఆగస్టు 6వ తేదీతో ముగిసిన వారంలో భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు జీవితకాల గరిష్టం 621.464 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.45 లక్షల కోట్లు తాకిన సంగతి తెలిసిందే. దాదాపు 16 నెలల దిగుమతులుకు సరిపోతాయి. రూపాయి మరింత బలహీనత! డాలర్ మారకంలో రూపాయి విలువ మరింత బలహీనపడే అవకాశం ఉందని కూడా బార్క్లేస్ అంచనావేయడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇందుకు కొంత సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నట్లు వివరించింది. రూపాయి విలువను మద్దతుగా హెడ్జింగ్ విధానాలకు వినియోగించడానికి ఉద్దేశించిన ‘ఫార్వర్డ్ డాలర్ హోల్డింగ్స్’ బుక్ పరిమాణాన్ని క్రమంగా తగ్గిస్తూ, స్పాట్ డాలర్ల నిల్వలను ఆర్బీఐ పెంచుకోడావడాన్ని ఈ సందర్భంగా బార్క్లేస్ ఇండియా ప్రస్తావించింది. బార్క్లేస్ వెలువరించిన గణాంకాల ప్రకారం ఆర్బీఐ ‘ఫార్వర్డ్ డాలర్ హోల్డింగ్స్’ బుక్ పరిమాణం 2021 మార్చి నాటికి 74.2 బిలియన్ డాలర్లు ఉంటే, ఈ విలువ జూన్ ముగింపునకు 49 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. జూలై నాటికి మరింత తగ్గి 42 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇటీవలి వారాల్లో రిజర్వ్ భారీగా పెరగడానికి కారణం ఆర్బీఐ డాలర్లను ‘ఫార్వర్డ్ హోల్డింగ్స్’ నుంచి ‘స్పాట్ నిల్వల్లోకి’ మార్చడం కూడా ఒక కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే వరవడి మున్ముందూ కొనసాగే అవకాశం ఉందని బార్క్లేస్ అంచనావేసింది. ఈ పరిస్థితుల్లో 2022 మార్చి నాటికి డాలర్ మారకంలో రూపాయి విలువ 75.50 –80.70 శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇం ట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). రూపాయి బలహీనత వల్ల భారత్‌కు ఎగుమతుల ద్వారా అధిక ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. -
వృద్ధి క్షీణత 7.3 శాతం : ఎస్బీఐ
ముంబై: భారత్ ఎకానమీ 2020-21 ఆర్థిక సంవత్సరం గణాంకాలు ఈ నెల 31వ తేదీన వెలువడుతున్న నేపథ్యంలో దీనిపై అంచనాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఎస్బీఐ రిసెర్చ్ నివేదిక ‘ఎకోర్యాప్’ తన తాజా అంచనాలను వెలువరించింది. ఆర్థిక సంవత్సరంలో 7.3% క్షీణత నమోదవుతుందని (క్రితం అంచనా 7.4%) తాజాగా పేర్కొంది. నాల్గవ త్రైమాసికంలో 1.3 శాతం వృద్ధి ఉంటుందని అంచనావేసింది. రేటింగ్ ఏజన్నీ ఇక్రా ఇప్పటికే ఈ అంచనాలను వరుసగా 7.3 శాతం, 2 శాతంగా అంచనావేసిన సంగతి తెలిసిందే. మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగింది. ఈ పరిస్థితి ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4%), రెండు (-7.3%) త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4% స్వల్ప వృద్ధి నమోదయ్యింది. ఎస్బీఐ రిసెర్చ్ తాజా అంచనాలు.. స్టేట్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీడర్షిప్, కోల్‌కతా భాగస్వామ్యంతో 41 హై ఫ్రీక్వెన్సీ సూచీ కదలికల అధ్యయనం ప్రాతిపదికన తాజా అంచనాలు వెలువడ్డాయి. ఇందులో సేవలు, పారిశ్రామిక రంగ క్రియాశీలత, గ్లోబల్ ఎకానమీ వంటి అంశాలు ఉన్నాయి. ఇప్పటికే జీడీపీ గణాంకాలను ప్రకటించిన 25 దేశాల లెక్కలను పరిశీలిస్తే, వేగంగా అభివృద్ధి చెందిన దేశాల వరుసలో భారత్ ఐదవ స్థానంలో నిలవనుంది. కఠిన లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో భారత్ నామినల్ జీడీపీ (బేస్ ఇయర్ ప్రాతిపదికన ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయనిది) 2020-21 మొదటి త్రైమాసికంలో రూ.11 లక్షల కోట్లను నష్టపోయింది. అయితే 2021-22 క్యూ1లో ఈ నష్టం రూ.6 లక్షల కోట్లే ఉంటుందన్నది అంచనా. వృద్ధి 7.7 శాతమే: బార్క్లేస్ భారత్ ఆర్థిక వ్యవస్థ 2021-22 వృద్ధి తొలి అంచనాలకు బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ- బార్క్లేస్ మంగళవారం కోత పెట్టింది. క్రితం అంచనాలకు 80 బేసిస్ పాయింట్లు తగ్గించి (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) 9.2 శాతానికి కుదించింది. థర్డ్ వేవ్ సంక్షోభం తలెత్తి లాక్డౌన్లు మరో మూడు కొనసాగడం, వ్యాక్సినేషనలో ఆలస్యం వంటి సవాళ్లు తలెత్తితే వృద్ధి రేటు 7.7 శాతానికి పడిపోతుందని కూడా అంచనా వేసింది. తొలుత ఊహించిన దానికన్నా తీవ్రంగా సెకండ్ వేవ్ సవాళ్లు ఉన్నాయని విశ్లేషించింది. ఇప్పటికే పలు రేటింగ్, బ్రోకరేజ్ సంస్థలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధికి సంబంధించి తమ తొలి అంచనాలను సవరించాయి. ఇక్రా (10.5 శాతం నుంచి 11 శాతానికి ) కేర్ (10.2 శాతం నుంచి 10.7 శాతానికి) ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (10.1 శాతం నుంచి 10.4 శాతానికి) ఎస్బీఐ రిసెర్చ్ (10.4 శాతం నుంచి 11 శాతానికి) ఆక్స్ఫర్డ్ ఎకానమీస్ (11.8 శాతం నుంచి 10.2 శాతానికి) బ్రిక్‌వర్క్ రేటింగ్స్ (11 శాతం నుంచి 9 శాతానికి) వంటివి ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బార్క్లేస్ తాజా అంచనాలను పరిశీలిస్తే.. కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో స్థానిక లాక్డౌన్లు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా నెమ్మదించింది. వ్యాక్సినేషన్ మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉంది. వృద్ధికి సంబంధించి మధ్యకాలికంగా ప్రభావితం చూపే అంశమిది. ప్రత్యేకించి ఇక్కడ థర్డ్ వేవ్ ఆందోళనలూ తలెత్తుతుండడం గమనార్హం. సరఫరా, రవాణా రంగాలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పరిస్థితిని చూస్తుంటే, సెపె్టంబర్ త్రైమాసికంలోనే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ వరకూ స్థానిక లాక్డౌన్లు కొనసాగితే ఎకానమీకి 38.4 బిలియన్ డాలర్ల నష్టం జరుగుతుంది. -
లేకున్నా ఇవ్వొచ్చు
కష్టంలో చెయ్యి చాచలేని వారుంటారు. కష్టాన్ని చూసి మనమే చెయ్యి చాచాలి. ఇరవై ఉంటే పది ఇవ్వొచ్చు. రెండు గుప్పెళ్లుంటే గుప్పెడు ఇవ్వొచ్చు. కష్టంలో కాళ్లు లేని వారూ ఉంటారు. కష్టాన్ని చూసి మనమే దగ్గరికి వెళ్లాలి. మాలతి దగ్గర ఇరవై ఉన్నాయి. రెండు గుప్పెళ్లూ ఉన్నాయి. కష్టాన్ని చూడలేని మనసూ ఉంది. వెళ్లి ఇవ్వడానికే.. ఆమెకు కాళ్లు లేవు! అయినా ఆగలేదు. లాక్డౌన్ కష్టాల్లో ఉన్న ‘పీసీ’ మహిళల కోసం ఒక నెట్‌వర్క్‌నే నడిపిస్తున్నారు!! బ్యాంకు ఉద్యోగి మాలతీ రాజా. ‘బార్క్లేస్’ బ్యాంకు చెన్నై శాఖలో పర్సనల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్‌లో పని చేస్తుంటారు. బార్క్లేస్ లండన్ బ్యాంక్. 330 ఏళ్ల నుంచి ఉంది. చెన్నై శాఖను నిలదొక్కుకునేలా చేయడం కోసం ఆ బ్యాంక్ నియమించుకున్న మెరికల్లాంటి సిబ్బందిలో.. కాళ్లలో శక్తి లేని మాలతీ కూడా ఒకరు. అవును. వీల్ చెయిర్ లేకుండా ఆమె కదలలేరు. లాక్డౌన్ ముందు వరకు ఆఫీస్‌కి వెళ్లొచ్చేవారు. ఇప్పుడు ఇంట్లోంచే పని చేస్తున్నారు. బ్యాంకు పనితో పాటు.. ఇంట్లోంచి మాలతీ చేస్తున్న పని ఇంకొకటి కూడా ఉంది. చెన్నై కార్పోరేషన్ షెల్టర్‌లో పీసీ (ఫిజికల్లీ ఛాలెంజ్డ్) మహిళల చేత పని చేయించడం! వాళ్లు చేసే పని.. షెల్టర్ చుట్టు పక్కల ఉన్న తమ లాంటి వారి కనీస నిత్యావసరాలు తీరేలా చేయడం. వాళ్ల కోసం ఉతికి వాడుకోదగిన (రీయూజబుల్) మాస్క్‌లను, శానిటరీ ప్యాడ్స్‌ను తయారు చేయడం. పసిపిల్లల కోసం డైపర్స్ చేయడం. మాలతి చెబితే వాళ్లెందుకు చేస్తారు? మాలతి టీమ్ మేట్స్ మెటిల్డా, మేరీ, కలై, నదియా, కవిత.. ఇంకా కొందరు ఆ షెల్టర్‌లోనే ఉంటున్నారు. టీమ్ మేట్స్ అంటే బ్యాంక్ టీమ్ మేట్స్ కాదు. వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ ఉమెన్ టీమ్ మేట్స్. మాలతి నేషనల్ చాంపియన్. టోర్నమెంట్ ఉన్నప్పుడు బ్యాంకు ఆమెను డిస్టర్బ్ చేయదు. ప్రాక్టీస్ చేసుకోనిస్తుంది. ∙∙ తమిళనాడు మొత్తం మీద 150 మంది వీల్‌చెయిర్ మహిళా బాస్కెట్‌బాల్ ప్లేయర్లు ఉన్నారు. కోయంబత్తూరు, తిరుచ్చి, తిరువణ్ణామలై, విల్లుపురం, వెల్లూరు.. మరికొన్ని ప్రాంతాల నుంచి వారం చివరిలో వాళ్లంతా చెన్నై వస్తారు. మాలతితో కలిసి జె.జె. కిల్పాక్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తారు. లాక్‌డౌన్‌తో ఇప్పుడు ఎక్కడివారక్కడే ఉండిపోయారు. కొందరు చెన్నై షెల్టర్‌లో ఆశ్రయం పొందుతున్నారు. వాళ్ల చేతే మాలతి ఇప్పుడు నిరాశ్రయులైన పీసీ మహిళలకు చేయూతను ఇప్పిస్తున్నారు. షెల్టర్‌లో మాస్క్‌లు కుడుతున్న మాలతి టీమ్ మేట్ బాగా అవసరంలో ఉన్నవారికి ఉప్పు, పప్పులతో పాటు కొంత డబ్బు కూడా. ఆ డబ్బును మాలతే తన ఫేస్బుక్ నుంచి విరాళాల ద్వారా సేకరిస్తున్నారు. నిజానికి ఆమెకు పెద్ద సర్కిలే ఉంది. బ్యాంకుతో ఏర్పడింది కొంత. క్రీడాకారిణిగా సాధించుకున్నది కొంత. వాళ్లంతా మాలతికి అన్ని విధాలా సహాయంగా ఉన్నారు. ‘ఫలానా చోట.. ఫలానా మహిళ.. ఆమె కదల్లేదు.. ఆమె కుటుంబం కష్టంలో ఉంది’ అని మాలతి మెజేస్ ఇస్తే చాలు.. వెంటనే అక్కడి వెళ్లి చేయగలిగినంతా చేసి వస్తున్నారు. ఇటువైపు షెల్టర్‌లో మాలతి సూచనల ప్రకరాం.. ఆమె టీమ్ మేట్స్, మిగతా మహిళలు తాము చేయగలిగింది చేస్తున్నారు. మొత్తం ముప్పైమంది వరకు ఉంటారు షెల్టర్‌లో. వారంతా రోజుకు పది గంటల పాటు పని చేస్తూ కనీసం 300 సింగిల్, డబుల్ లేయర్ల మాస్క్‌లతో పాటు.. శానిటరీ నేప్కిన్స్, బేబీ డైపర్స్ కుడుతున్నారు. అవన్నీ కూడా ‘ఫిజికల్లీ ఛాలెంజ్డ్’ మహిళల కోసమే. వాళ్లలా రెడీ చెయ్యగానే ‘అందుబాటులో ఉన్నాయి. అవసరమైనవారు సంప్రదించవచ్చు’’ అని మాలతి ఇలా ఫేస్బుక్లో పెట్టేస్తారు. డబ్బు పెట్టగల ఎన్జీవోలు వాటిని కొని, వైకల్యం ఉన్న మహిళలకు ఉచితంగా పంపిణీ చేస్తాయి. ఆ డబ్బును మళ్లీ రేషన్ పంపిణీ చేసేందుకు ఖర్చు చేయిస్తారు మాలతి. ఈ లాక్డౌన్లో ఉన్నచోటు నుంచి కదలకుండా మాలతి ఇప్పటి వరకు 200 మంది వైకల్యం గల మహిళలకు డ్రై రేషన్ (వండుకోడానికి అవసరమైన దినుసులు), మందులు, ఇతర నిత్యావసరాలు పంపించగలిగారు. మాలతి కుటుంబానికి కూడా పూర్తిగా ఆమే ఆధారం. ఆమెతో కలిపి మొత్తం ఐదుమంది ఉంటారు. ‘‘లాక్‌డౌన్‌తో నేను పోషించవలసిన కుటుంబం మరింత పెద్దదైంది’’ అంటారు మాలతి.. చిరునవ్వుతో. చెన్నై కార్పోరేషన్ షెల్టర్‌లో మాలతీ టీమ్ మేట్స్, ఇతర మహిళలు. -
లాక్డౌన్ మూల్యం రూ.9 లక్షల కోట్లు
ముంబై: కోవిడ్ మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపించనుంది. వైరస్ విస్తరించకుండా నివారణ చర్యల్లో భాగంగా మూడు వారాల పాటు దేశవ్యాప్త లౌక్‌డౌన్ (మూసివేత)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల 120 బిలియన్ డాలర్లు (సుమారు రూ.9 లక్షల కోట్లు) మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ఇది భారత జీడీపీలో 4 శాతానికి సమానమని పేర్కొంది. మూడు వారాల లాక్డౌన్ వల్ల నష్టమే 90 బిలియన్ డాలర్లు ఉంటుందని, దీనికి అంతకుముందే పలు రాష్ట్రాల్లో లౌక్‌డౌన్ ప్రభావం అదనమని వివరించింది. కాగా, దేశవ్యాప్త లౌక్‌డౌన్ నిర్ణయం బుధవారం ఈక్విటీ మార్కెట్లను ఏ మాత్రం ప్రభావితం చేయకపోవడం గమనార్హం. వృద్ధికి దెబ్బ...: అలాగే, 2020–21 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి అంచనాలను 1.7 శాతం మేర తగ్గించి 3.5 శాతంగా ఉంటుందని తాజాగా విడుదల చేసిన నివేదికలో బార్క్లేస్ పేర్కొంది. వడ్డీ రేట్లకు భారీగా కోత..: ఆర్బీఐ ఏప్రిల్ 3న తన విధాన ప్రకటనను విడుదల చేయనుంది. ఆ సందర్భంగా కీలక రేట్లను 0.65 శాతం తగ్గించే అవకాశాలున్నాయని, ఈ ఏడాది మిగిలిన కాలంలో మరో ఒక శాతం వరకు రేట్లను తగ్గించొచ్చని తెలిపింది. ద్రవ్యలోటు కూడా లక్ష్యాన్ని దాటిపోతుందని బార్క్లేస్ పేర్కొంది. ద్రవ్యలోటు 5 శాతానికి చేరుతుందని అంచనా వేసింది. ఆర్థిక చర్యల్లేవు..: ఇతర దేశాలతో పోలిస్తే ముందుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకున్న చర్యలను బ్రోకరేజీ సంస్థ ఎడెల్వీజ్ అభినందిస్తూనే.. దీని కారణంగా ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని ఎదుర్కొనే చర్యలు లోపించాయని పేర్కొంది. లాక్డౌన్ వల్ల ఆర్థికంగా పడే ప్రభావం విషయమై కేంద్ర సర్కారు మౌనం దాల్చినట్టు వ్యాఖ్యానించింది. ఇప్పటికే డీమోనిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాలతో ఇబ్బందులు పడుతున్న అసంఘటిత రంగాన్ని కోవిడ్ మహమ్మారి మరింత అగాధంలోకి నెట్టేసినట్టయిందని పేర్కొంది. మానిటరీ పరంగా ఎన్నో చర్యలు అవసరమని సూచించింది. క్యూ4లో వృద్ధిరేటు 1.5–2.5 శాతమే! లాక్డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రతికూల ప్రభావం చూపుతుందని కేర్ రేటింగ్స్ తాజా నివేదికలో అంచనావేసింది. 21 రోజుల్లో ఆర్థిక వ్యవస్థలో నిత్యావసర సేవలు, వ్యవసాయ రంగం (20% ఉత్పత్తి) మినహా 80 శాతం ఉత్పత్తి నష్టం జరుగుతుందని వివరించింది. ఆర్థిక వ్యవస్థకు రోజుకు రూ.35,000 కోట్ల నుంచి రూ.40,000 కోట్ల నష్టం వాటిల్లుతుందని విశ్లేషించింది. మొత్తంగా రూ.6.3 లక్షల కోట్ల నుంచి రూ.7.2 లక్షల కోట్ల వరకూ ఎకానమీ దెబ్బతింటుందని అంచనావేసింది. 2019–20 లో స్థూల దేశీయోత్పత్తి విలువ రూ.140 లక్షల కోట్ల నుంచి రూ. 150 లక్షల కోట్ల వరకే ఉంటుందని అంచనావేసింది. పరిస్థితి చూస్తుంటే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి–మార్చి) మైనస్‌లోకి వెళ్లే అవకాశంలేదుకానీ, 1.5–2.5 శాతం శ్రేణిలో నమోదయ్యే అవకాశం ఉంటుందని పేర్కొంది. -
మళ్లీ అపర కుబేరుడు అంబానీ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సంపన్న భారతీయుల జాబితాలో పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. దాదాపు రూ.3,71,000 కోట్ల సంపదతో బార్క్లేస్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్–2018లో కూడా అగ్రస్థానం దక్కించుకున్నారు. ఆయన టాప్–1 స్థానంలో ఉండటం ఇది వరసగా ఏడోసారి. సుమారు రూ.1,000 కోట్లకు పైగా సంపద గల సంపన్న భారతీయులతో బార్క్లేస్ ఈ జాబితా రూపొందించింది. ఈ సారి లిస్టులో చోటు దక్కించుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు హురున్ రిపోర్ట్ ఇండియా ఎండీ రెహ్మాన్ జునైద్ తెలిపారు. 2017లో ఈ సంఖ్య 617గా ఉండగా.. ఈసారి 831కి చేరినట్లు వెల్లడించారు. వీరందరి సంపద కలిపితే 719 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. భారత్ స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఇది పావు భాగం కావడం గమనార్హం. అంతర్జాతీయ ద్రవ్య నిధి అంచనాల ప్రకారం భారత జీడీపీ 2.85 ట్రిలియన్ డాలర్లు. గతంలో ఎన్నడూ లేనంత వేగంగా భారత్‌లో సంపద సృష్టి జరుగుతోందని, ఇంతకు ముందుతో పోలిస్తే సంపద సమకూర్చుకోవడానికి పట్టే వ్యవధి తగ్గిపోతోందని జాబితాను విడుదల చేసిన సందర్భంగా బార్క్లేస్ ప్రైవేట్ క్లయింట్స్ సీఈవో ఎస్ఎన్ బన్సల్ పేర్కొన్నారు. ఓ వైపు విధానకర్తలు ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు మార్గాలు వెతుకుతుండగా.. మరోవైపు రూ. 1,000 కోట్ల పైబడి సంపద కలిగిన వారి భారతీయుల సంఖ్య 34 శాతం పెరగడం గమనార్హమని నివేదిక పేర్కొంది. ముంబై టాప్.. అత్యంత సంపన్నుల కేంద్రంగా ముంబై అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ రూ.1,000 కోట్లు పైగా సంపద గల వారు మొత్తం 233 మంది ఉన్నారు. 163 మంది సంపన్నులతో న్యూఢిల్లీ రెండో స్థానంలో, 70 మందితో బెంగళూరు మూడోస్థానంలో ఉంది. 2018 జాబితాలో కొత్తగా 306 మంది చోటు దక్కించుకోగా.. గతేడాది లిస్టులో ఉన్న 75 మంది ఈ సారి స్థానం కోల్పోయారు. ఒరావెల్ స్టేస్ (ఓయో రూమ్స్) వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ (24 ఏళ్లు).. ఈ లిస్టులో అత్యంత పిన్న వయస్కుడు కాగా.. ఎండీహెచ్ మసాలా వ్యవస్థాపకుడు ధరమ్ పాల్ గులాటి (95 సంవత్సరాలు) వయోధికుడు. ఫార్మా రంగానికి చెందిన వారు అత్యధికంగా సుమారు 14 శాతం మంది ఉండగా, సాఫ్ట్వేర్ .. సర్వీసుల విభాగానికి చెందినవారు 7.9 శాతం మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 46 మంది... రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ.1,000 కోట్లకు పైబడిన సంపద గల వారి సంఖ్య 50కి పైగానే ఉంది. వీరిలో రూ.1,200 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సతీమణి నారా భువనేశ్వరి కూడా ఉండటం గమనార్హం. హెరిటేజ్ ఫుడ్స్ వాటాదారుగా ఆమె సంపద రూ.1,200 కోట్లున్నట్లు బార్క్లేస్ తాజా జాబితా తెలియజేసింది. ఇంకా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జాబితాలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రమోటర్లు పి.పిచ్చిరెడ్డి, పి.వి.కృష్ణారెడ్డి, హెటెరో డ్రగ్స్ ప్రమోటరు బి.పార్థసారథి రెడ్డి టాప్–3 స్థానాల్లో నిలిచారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ జాబితాలో స్థానం పొందిన వారిలో ఎక్కువ మంది ఫార్మా సంస్థల అధిపతులే ఉండటం గమనార్హం. -
తిరుమల మిల్క్ ఫ్రెంచ్ కంపెనీ చేతికి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచంలోనే అతిపెద్ద డెయిరీ సంస్థగా ఉన్న ఫ్రెంచ్ కంపెనీ లాక్టాలిస్... దేశీయ పాల ఉత్పత్తుల వ్యాపారంలోకి ప్రవేశించింది. రాష్ట్రానికి చెందిన తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్‌ను రూ.1,750 కోట్లకు (275 మిలియన్ డాలర్లు) లాక్టాలిస్ కొనుగోలు చేసింది. నలుగురు ప్రమోటర్లకు చెందిన 76 శాతం వాటాతో పాటు, ప్రైవేటు ఈక్విటీ సంస్థ కార్లీ గ్రోత్ క్యాపిటల్ ఫండ్ చేతిలో ఉన్న 24 శాతం వాటాను కూడా లాక్టాలిస్ కొనుగోలు చేస్తోంది. ఈ ఒప్పందాన్ని ప్రమోటర్లలో ఒకరైన బొల్లా బ్రహ్మ నాయుడు ధృవీకరించారు. అయితే ఒప్పందం వివరాలు, విలువను తెలియచేయడానికి ఆయన నిరాకరించారు. లాక్టాలిస్ అధికార ప్రతినిధి మైకెల్ నాలెట్ మాత్రం ఈ ఒప్పందాన్ని జాతీయ మీడియాకి నిర్ధారించారు. 2010లో కార్లే గ్రోత్ ఫండ్ తిరుమల మిల్క్‌లో 24 శాతం వాటాను 22 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇపుడు అదే వాటా కోసం లాక్టాలిస్ 85 మిలియన్ డాలర్లు చెల్లించింది. అంటే మూడేళ్లలో కార్లీ గ్రోత్ ఫండ్‌కు 225 శాతానికి పైగా లాభాలొచ్చాయి. దేశీయ డెయిరీ పరిశ్రమపై దృష్టి దాదాపు 150కిపైగా దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న లాక్టాలిస్ అమ్మకాల పరిమాణం రూ.1.40 లక్షల కోట్లు. రూ.60,000 కోట్ల పాల ఉత్పత్తుల మార్కెట్ కలిగిన ఇండియాలోకి లాక్టాలిస్ తొలి అడుగు కూడా ఇదే. ప్రపంచ పాల ఉత్పత్తిలో దాదాపు 20 శాతం వాటా కలిగిన ఇండియా అంతర్జాతీయ డెయిరీ కంపెనీలకు ప్రధానమైన మార్కెట్‌గా కనిపిస్తోంది. రూ.1,500 కోట్ల అమ్మకాలతో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తుల తయారీ సంస్థగా ఉన్న తిరుమల డెయిరీని కోనుగోలు చేయడం ద్వారా ఇండియాలో అడుగు పెట్టడమే కాకుండా మరింతగా విస్తరిచే యోచనలో ఈ ఫ్రెంచ్ కంపెనీ ఉంది. లాక్టాలిస్ రంగ ప్రవేశంతో ఇప్పటి వరకు ఇండియాలో నంబర్ వన్‌గా ఉన్న ‘అమూల్’కి గట్టి పోటీ తప్పదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.2.25 లక్షలతో ఆరంభమైన తిరుమల... ఆటో మొబైల్ ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్న నలుగురు స్నేహితులు కలిసి రూ.2.25 లక్షల మూలధనంతో 1998లో తిరుమల డెయిరీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న తిరుమల డెయిరీ... రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్నాటకల్లో బాగా విస్తరించింది. పాల ప్యాకెట్లు, టెట్రా ప్యాకెట్లు, పాలపొడి, స్వీట్లు, పన్నీర్, నెయ్యి, వెన్న వంటి ఉత్పత్తులను ఇది అందిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1427 కోట్ల వ్యాపారంపై రూ.70 కోట్ల లాభాన్ని తిరుమల మిల్క్ ప్రకటించింది.