ముంబై: భారత్ ఎకానమీ 2020-21 ఆర్థిక సంవత్సరం గణాంకాలు ఈ నెల 31వ తేదీన వెలువడుతున్న నేపథ్యంలో దీనిపై అంచనాలు ఊపందుకుంటున్నాయి. తాజాగా ఎస్‌బీఐ రిసెర్చ్ నివేదిక ‘ఎకోర్యాప్’ తన తాజా అంచనాలను వెలువరించింది. ఆర్థిక సంవత్సరంలో 7.3% క్షీణత నమోదవుతుందని (క్రితం అంచనా 7.4%) తాజాగా పేర్కొంది. నాల్గవ త్రైమాసికంలో 1.3 శాతం వృద్ధి ఉంటుందని అంచనావేసింది. రేటింగ్ ఏజన్నీ ఇక్రా ఇప్పటికే ఈ అంచనాలను వరుసగా 7.3 శాతం, 2 శాతంగా అంచనావేసిన సంగతి తెలిసిందే.
మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో దేశ వ్యాప్త కఠిన లాక్డౌన్ అమలు జరిగింది. ఈ పరిస్థితి ఆర్థిక సంవత్సరం మొదటి (-24.4%), రెండు (-7.3%) త్రైమాసికాల్లో ఎకానమీని క్షీణతలోకి తోసింది. అయితే లాక్‌డౌన్ ఆంక్షలు తొలగిపోయి, దేశంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ఊపందుకోవడంతో మూడవ త్రైమాసికంలో 0.4% స్వల్ప వృద్ధి నమోదయ్యింది. ఎస్‌బీఐ రిసెర్చ్ తాజా అంచనాలు..
- స్టేట్ బ్యాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీడర్‌షిప్, కోల్‌కతా భాగస్వామ్యంతో 41 హై ఫ్రీక్వెన్సీ సూచీ కదలికల అధ్యయనం ప్రాతిపదికన తాజా అంచనాలు వెలువడ్డాయి. ఇందులో సేవలు, పారిశ్రామిక రంగ క్రియాశీలత, గ్లోబల్ ఎకానమీ వంటి అంశాలు ఉన్నాయి.
- ఇప్పటికే జీడీపీ గణాంకాలను ప్రకటించిన 25 దేశాల లెక్కలను పరిశీలిస్తే, వేగంగా అభివృద్ధి చెందిన దేశాల వరుసలో భారత్ ఐదవ స్థానంలో నిలవనుంది.
- కఠిన లాక్‌డౌన్ పరిస్థితుల నేపథ్యంలో భారత్ నామినల్ జీడీపీ (బేస్ ఇయర్ ప్రాతిపదికన ద్రవ్యోల్బణాన్ని సర్దుబాటు చేయనిది) 2020-21 మొదటి త్రైమాసికంలో రూ.11 లక్షల కోట్లను నష్టపోయింది. అయితే 2021-22 క్యూ1లో ఈ నష్టం రూ.6 లక్షల కోట్లే ఉంటుందన్నది అంచనా.
వృద్ధి 7.7 శాతమే: బార్‌క్లేస్
భారత్ ఆర్థిక వ్యవస్థ 2021-22 వృద్ధి తొలి అంచనాలకు బ్రిటిష్ బ్రోకరేజ్ సంస్థ- బార్‌క్లేస్ మంగళవారం కోత పెట్టింది. క్రితం అంచనాలకు 80 బేసిస్ పాయింట్లు తగ్గించి (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) 9.2 శాతానికి కుదించింది. థర్డ్ వేవ్ సంక్షోభం తలెత్తి లాక్‌డౌన్లు మరో మూడు కొనసాగడం, వ్యాక్సినేషనలో ఆలస్యం వంటి సవాళ్లు తలెత్తితే వృద్ధి రేటు 7.7 శాతానికి పడిపోతుందని కూడా అంచనా వేసింది. తొలుత ఊహించిన దానికన్నా తీవ్రంగా సెకండ్ వేవ్ సవాళ్లు ఉన్నాయని విశ్లేషించింది. ఇప్పటికే పలు రేటింగ్, బ్రోకరేజ్ సంస్థలు 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధికి సంబంధించి తమ తొలి అంచనాలను సవరించాయి.
ఇక్రా (10.5 శాతం నుంచి 11 శాతానికి ) కేర్ (10.2 శాతం నుంచి 10.7 శాతానికి) ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ (10.1 శాతం నుంచి 10.4 శాతానికి) ఎస్‌బీఐ రిసెర్చ్ (10.4 శాతం నుంచి 11 శాతానికి) ఆక్స్‌ఫర్డ్ ఎకానమీస్ (11.8 శాతం నుంచి 10.2 శాతానికి) బ్రిక్‌వర్క్ రేటింగ్స్ (11 శాతం నుంచి 9 శాతానికి) వంటివి ఇందులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బార్‌క్లేస్ తాజా అంచనాలను పరిశీలిస్తే..
- కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో స్థానిక లాక్‌డౌన్లు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
- భారత్ వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా నెమ్మదించింది. వ్యాక్సినేషన్ మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉంది. వృద్ధికి సంబంధించి మధ్యకాలికంగా ప్రభావితం చూపే అంశమిది. ప్రత్యేకించి ఇక్కడ థర్డ్ వేవ్ ఆందోళనలూ తలెత్తుతుండడం గమనార్హం.
- సరఫరా, రవాణా రంగాలు తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పరిస్థితిని చూస్తుంటే, సెపె్టంబర్ త్రైమాసికంలోనే పరిస్థితి కొంత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- జూన్ వరకూ స్థానిక లాక్‌డౌన్లు కొనసాగితే ఎకానమీకి 38.4 బిలియన్ డాలర్ల నష్టం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment