విప్రో, ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ 1,125 కోట్లు | Wipro And Premji Foundation to give Rs 1125 crore for fight against Coronavirus | Sakshi
Sakshi News home page

విప్రో, ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ 1,125 కోట్లు

Published Thu, Apr 2 2020 6:29 AM | Last Updated on Thu, Apr 2 2020 6:29 AM

Wipro And Premji Foundation to give Rs 1125 crore for fight against Coronavirus - Sakshi

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఏర్పడిన ముప్పును అధిగమించేందుకు విప్రో కంపెనీ, విప్రో ఎంటర్‌ప్రైజెస్, ఆ సంస్థల ప్రమోటర్‌కు చెందిన అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ సంయుక్తంగా రూ.1,125 కోట్లను ఖర్చు చేసేందుకు సంసిద్ధత ప్రకటించాయి. ఇందులో విప్రో కంపెనీ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ రూ.25 కోట్లు, అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ రూ.1,000 కోట్లను ఖర్చు పెట్టనున్నాయి. విప్రో వార్షికంగా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద చేసే ఖర్చుకు అదనంగా ఈ మొత్తాన్ని వెచ్చించనుంది.

భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.100 కోట్లు
కరోనాపై పోరులో భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా చేరిపోయింది. రూ.100 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ప్రభుత్వరంగ పవర్‌గ్రిడ్‌ సంస్థ కూడా పీఎం కేర్స్‌కు తొలి విడతగా రూ.130 కోట్లను అందించింది. మరో రూ.70 కోట్లను 2020–21లో ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే, ఇఫ్కో రూ.25 కోట్లు, క్రిబ్కో రూ.2 కోట్లు, ఎన్‌ఎఫ్‌ఎల్‌–కిసాన్‌ రూ.64 లక్షలు, కల్యాణి గ్రూపు రూ.25 కోట్లను పీఎంకేర్స్‌కు ప్రకటించాయి.

ఎల్‌ఐసీ రూ.105 కోట్లు..
లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కరోనాపై యుద్ధంలో పాలుపంచుకుంటోంది. పీఎం–కేర్స్‌ ఫండ్‌కు రూ.105 కోట్ల విరాళం ఇచ్చినట్టు ప్రకటించింది. మొత్తం విరాళంలో రూ.5 కోట్లు గోల్డెన్‌ జూబ్లీ ఫండ్‌ నుంచి సమకూర్చినట్టు ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎం.ఆర్‌.కుమార్‌ తెలిపారు.

ఎస్‌బీఐ రూ.100 కోట్లు..
దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వరంగ సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) సైతం రూ.100 కోట్లను పీఎంకేర్స్‌కు ప్రకటించింది.   

ఎల్‌జీ ఉచిత భోజన ఏర్పాట్లు..
లాక్‌డౌన్‌ నేపథ్యంలో దినసరి కూలీలు, వలస కార్మికుల సహాయార్థం కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ బ్రాండ్‌ ఎల్‌జీ దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి భోజన ఏర్పాట్లను అందిస్తుంది. ఈ మేరకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంపిక చేసిన 50 రాష్ట్రాల్లోని ఆయా ఆసుపత్రుల్లో ఐసోలేషన్, క్వారంటైన్‌ వార్డుల్లో వాటర్‌ ప్యూరిఫయర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లను అందించనున్నట్లు ఎల్‌జీ ఇండియా ఎండీ యంగ్‌ లాక్‌ కిమ్‌ తెలిపారు.

పుణేలో మెర్సిడెజ్‌ బెంజ్‌ కోవిడ్‌ ఆసుపత్రి
ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మెర్సిడెజ్‌ బెంజ్‌ పుణేలో తాత్కాలిక కరోనా ఆసుపత్రిని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. చకాన్‌ ఖేడ్‌లోని మహలుంగే–ఇంగాలే గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఈ హాస్పటల్‌లో 1,500 మంది కరోనా రోగులకు చికిత్స అందించవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇండియా ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది.

రామ్‌కో ఐసోలేషన్‌ సెంటర్లు
రామ్‌కో సిమెంట్స్‌ లిమిటెడ్‌ తయారీ కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు, వలస కూలీలకు మాస్క్‌లు, బియ్యం, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందిస్తున్నట్లు తెలిపింది. తమిళనాడు, ఒడిశాలోని రామ్‌కో ప్లాంట్‌ వద్ద ఐసోలేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేసి కార్మికులకు, స్థానిక గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తుంది. రూ.3 కోట్ల వ్యయంతో వైద్య పరికరాలు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

ఓలెక్ట్రా రూ.17 లక్షలు..
కరోన కట్టడిలో భాగంగా ప్రభుత్వానికి సాయంగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌ నడుం బిగించింది. పీఎం కేర్స్‌ ఫండ్‌కు రూ.17.26 లక్షల మొత్తాన్ని విరాళంగా అందించింది. ఇందులో ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.7.26 లక్షలు, కంపెనీ రూ.10 లక్షలు సమకూర్చిందని ఓలెక్ట్రా ఈడీ ఎన్‌.నాగసత్యం తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement