CSR expenditure
-
ఐదు లక్షల మంది రైతులకు సాయం
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కార్యక్రమాల్లో భాగంగా చిన్న రైతులకు సాయం చేయాలని నిర్ణయించింది. 2025 నాటికి వార్షిక ఆదాయం రూ.60,000 కంటే తక్కువ ఉండే దాదాపు ఐదు లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. హెచ్డీఎఫ్సీ సీఎస్ఆర్ కార్యక్రమాల్లో ఒకటైన ‘పరివర్తన్’ ద్వారా ఈ సాయం అందించనున్నట్లు బ్యాంకు డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (డీఎండీ) కైజాద్ ఎం బారుచా తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘బ్యాంకు గ్రామీణాభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించింది. స్థిరమైన వృద్ధిని పెంపొందించడంతోపాటు అల్పాదాయ వర్గాలకు అండగా నిలుస్తోంది. 2014లో ప్రారంభమైన ‘పరివర్తన్’ కార్యక్రమం దేశంలోనే అతిపెద్ద సీఎస్ఆర్ ప్రోగ్రామ్‌ల్లో ఒకటి. 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ద్వారా సేవలందిస్తున్నాం. గత పదేళ్ల కాలంలో రూ.5000 కోట్లు ఖర్చు చేశాం. రానున్న రోజుల్లో ఈ నిధులు పెంచుతాం. ఇప్పటికే పరివర్తన్ ద్వారా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాం. సేంద్రియ వ్యవసాయానికి మద్దతుగా నిలిచాం. 2025 నాటికి వార్షిక ఆదాయం రూ.60,000 కంటే తక్కువ ఉండే దాదాపు ఐదు లక్షల మంది సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం. 25,000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తున్నాం. స్మార్ట్ తరగతులు, పాఠశాల ఫర్నిచర్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. గ్రామాల్లో బహిరంగ మలవిసర్జనను నిరోధించడానికి స్వచ్ఛ భారత్ అభియాన్‌కు అనుగుణంగా 25000 వ్యక్తిగత గృహ మరుగుదొడ్లను ఇప్పటికే నిర్మించాం’ అని చెప్పారు.ఇదీ చదవండి: బీమా ప్రీమియంపై జీఎస్టీ.. మంత్రుల సంఘం ఏర్పాటుకేంద్ర ప్రభుత్వం 2013 తరువాత కంపెనీల చట్టంలో మార్పులు తీసుకొచ్చింది. అందులోని సెక్షన్ 135లో సీఎస్ఆర్ నిబంధనను చేర్చింది. దాని ప్రకారం కార్పొరేట్ సంస్థల నికర లాభంలో రెండు శాతం సీఎస్ఆర్కు కేటాయించాలి. ఆర్థిక సర్వేలోని వివరాల ప్రకారం గడిచిన ఎనిమిదేళ్లలో అన్ని దేశీయ కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ కింద దాదాపు రూ.1.53 లక్షల కోట్లు ఖర్చు చేశాయి. -
విప్రో, ప్రేమ్‌జీ ఫౌండేషన్ 1,125 కోట్లు
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఏర్పడిన ముప్పును అధిగమించేందుకు విప్రో కంపెనీ, విప్రో ఎంటర్ప్రైజెస్, ఆ సంస్థల ప్రమోటర్‌కు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సంయుక్తంగా రూ.1,125 కోట్లను ఖర్చు చేసేందుకు సంసిద్ధత ప్రకటించాయి. ఇందులో విప్రో కంపెనీ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్ప్రైజెస్ రూ.25 కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ.1,000 కోట్లను ఖర్చు పెట్టనున్నాయి. విప్రో వార్షికంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద చేసే ఖర్చుకు అదనంగా ఈ మొత్తాన్ని వెచ్చించనుంది. భారతీ ఎంటర్ప్రైజెస్ రూ.100 కోట్లు కరోనాపై పోరులో భారతీ ఎంటర్ప్రైజెస్ కూడా చేరిపోయింది. రూ.100 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ప్రభుత్వరంగ పవర్‌గ్రిడ్ సంస్థ కూడా పీఎం కేర్స్‌కు తొలి విడతగా రూ.130 కోట్లను అందించింది. మరో రూ.70 కోట్లను 2020–21లో ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే, ఇఫ్కో రూ.25 కోట్లు, క్రిబ్కో రూ.2 కోట్లు, ఎన్ఎఫ్ఎల్–కిసాన్ రూ.64 లక్షలు, కల్యాణి గ్రూపు రూ.25 కోట్లను పీఎంకేర్స్‌కు ప్రకటించాయి. ఎల్ఐసీ రూ.105 కోట్లు.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కరోనాపై యుద్ధంలో పాలుపంచుకుంటోంది. పీఎం–కేర్స్ ఫండ్‌కు రూ.105 కోట్ల విరాళం ఇచ్చినట్టు ప్రకటించింది. మొత్తం విరాళంలో రూ.5 కోట్లు గోల్డెన్ జూబ్లీ ఫండ్ నుంచి సమకూర్చినట్టు ఎల్ఐసీ చైర్మన్ ఎం.ఆర్.కుమార్ తెలిపారు. ఎస్బీఐ రూ.100 కోట్లు.. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సైతం రూ.100 కోట్లను పీఎంకేర్స్‌కు ప్రకటించింది. ఎల్జీ ఉచిత భోజన ఏర్పాట్లు.. లాక్డౌన్ నేపథ్యంలో దినసరి కూలీలు, వలస కార్మికుల సహాయార్థం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ ఎల్జీ దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి భోజన ఏర్పాట్లను అందిస్తుంది. ఈ మేరకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంపిక చేసిన 50 రాష్ట్రాల్లోని ఆయా ఆసుపత్రుల్లో ఐసోలేషన్, క్వారంటైన్ వార్డుల్లో వాటర్ ప్యూరిఫయర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లను అందించనున్నట్లు ఎల్జీ ఇండియా ఎండీ యంగ్ లాక్ కిమ్ తెలిపారు. పుణేలో మెర్సిడెజ్ బెంజ్ కోవిడ్ ఆసుపత్రి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మెర్సిడెజ్ బెంజ్ పుణేలో తాత్కాలిక కరోనా ఆసుపత్రిని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. చకాన్ ఖేడ్‌లోని మహలుంగే–ఇంగాలే గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఈ హాస్పటల్లో 1,500 మంది కరోనా రోగులకు చికిత్స అందించవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. రామ్‌కో ఐసోలేషన్ సెంటర్లు రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్ తయారీ కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు, వలస కూలీలకు మాస్క్‌లు, బియ్యం, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందిస్తున్నట్లు తెలిపింది. తమిళనాడు, ఒడిశాలోని రామ్‌కో ప్లాంట్ వద్ద ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి కార్మికులకు, స్థానిక గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తుంది. రూ.3 కోట్ల వ్యయంతో వైద్య పరికరాలు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఓలెక్ట్రా రూ.17 లక్షలు.. కరోన కట్టడిలో భాగంగా ప్రభుత్వానికి సాయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ నడుం బిగించింది. పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.17.26 లక్షల మొత్తాన్ని విరాళంగా అందించింది. ఇందులో ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.7.26 లక్షలు, కంపెనీ రూ.10 లక్షలు సమకూర్చిందని ఓలెక్ట్రా ఈడీ ఎన్.నాగసత్యం తెలిపారు. -
ఐటీ కంపెనీల ప్రాధాన్యత ఇదే...
సాక్షి,న్యూఢిల్లీ: ఐటీ కంపెనీలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను అత్యధికంగా విద్యా రంగంపై వెచ్చిస్తున్నాయి. నాస్కామ్ ఫౌండేషన్ నిర్వహించిన అథ్యయనంలో ఐటీ కంపెనీలు విద్యపైనే తమ సీఎస్ఆర్ నిధులను భారీగా ఖర్చు చేస్తున్నారని తేలింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి బహుళజాతి సంస్థల్లో 76 శాతం కంపెనీలు మానవ వనరులను అందించే విద్యపై ఖర్చు చేసినట్టు వెల్లడైంది. ఇక లింగ సమానత్వంపై 18 శాతం సంస్థలు, ఆకలి, పేదరిక నియంత్రణపై 12 శాతం సంస్థలు అధికంగా నిధులు వెచ్చించినట్టు తేలింది. సామాజిక అభివృద్ధిపై ఐటీ, బీపీఎం సంస్థలు చురుకుగా పనిచేస్తున్నాయని, వినూత్న పోకడలత ఐటీ సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యతను తలకెత్తుకున్నాయని నాస్కామ్ ఫౌండేషన్ చీఫ్ శ్రీకాంత్ సిన్హా చెప్పారు.ప్రభుత్వ అజెండాకు అనుగుణంగా సీఎస్ఆర్ కార్యక్రమాలను అత్యున్నత సాంకేతిక సాయంతో ఆయా నిధులను బాధ్యతాయుతంగా కంపెనీలు ఖర్చు చేస్తున్నాయని అన్నారు.గత ఆర్థిక సంవత్సరంలో భారత, బహుళజాతి కంపెనీల్లో 62 శాతం సంస్థలు తమ సీఎస్ఆర్ నిధుల్లో నూటికి నూరు శాతం విద్యపైనే వెచ్చించాయని ఈ సర్వేలో వెల్లడైంది. విద్యపై సీఎస్ఆర్ నిధుల్లో 50 శాతం కంటే తక్కువగా వెచ్చించినట్టు కేవలం 5 శాతం ఐటీ కంపెనీలే పేర్కొన్నాయని తెలిపింది.రూ 100 కోట్ల లోపు టర్నోవర్ కలిగిన చిన్న సంస్థలు సైతం సీఎస్ఆర్ నిధులను సమర్థవంతంగా ఖర్చు చేశాయని అథ్యయనం వెల్లడించింది. -
ఐటీ మినహాయింపు పరిమితి పెంచలేం
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను కనీస మినహాయింపును(బేసిక్ లిమిట్) రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ఆర్థిక శాఖ తోసిపుచ్చింది. వ్యక్తిగత పన్ను శ్లాబులను సవరిస్తే సుమారు రూ.60,000 కోట్ల ఆదాయాన్ని నష్టపోవాల్సి వస్తుందని, దీంతో ఈ ప్రతిపాదనలను ఆమోదించడం లేదని ఆర్థిక శాఖ పేర్కొంది. కొత్తగా అమల్లోకి రానున్న డెరైక్ట్ ట్యాక్స్ కోడ్(డీటీసీ)లో పన్ను శ్లాబులను సవరిస్తూ యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కొన్ని సిఫార్సులను చేసింది. బేసిక్ లిమిట్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచడమే కాకుండా, రూ.3-10 లక్షల ఆదాయంపై10%, 10-20 లక్షల ఆదాయంపై 20%, ఆపైన ఆదాయం ఉన్న వారిపై 30% పన్ను విధించాలని సిఫార్సు చేసింది. ఈ సూచనలు పాటిస్తే భారీగా పన్ను ఆదాయం తగ్గుతుందని 2013 డీటీసీ ప్రతిపాదనల విడుదల సందర్భంగా ఆర్థిక శాఖ వ్యాఖ్యానించింది. ప్రస్తుత స్లాబుల ప్రకారం వార్షిక ఆదాయం రూ. 2 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. రూ.2-5 లక్షల వరకూ 10%, రూ. 5-10 లక్షలకు 20%, రూ. 10 లక్షలు దాటితే 30% పన్ను అమలవుతోంది. సీనియర్ సిటిజన్లకు సంబంధించి పన్ను మినహాయింపుల వర్తింపు వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదనకు మాత్రం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అలాగే వార్షిక ఆదాయం రూ.10 కోట్లు దాటితే సూపర్ రిచ్ ట్యాక్స్ పేరుతో కొత్త ట్యాక్స్ శ్లాబ్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వార్షిక ఆదాయం రూ.10 కోట్లు దాటితే 35 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. జీవిత బీమా కంపెనీలపై విధిస్తున్న 30% పన్ను పరిమితిని 15%కు కుదించాలన్న సలహాలను కూడా ఆర్థిక శాఖ పక్కనపెట్టింది. ఇదే విధంగా రిటైల్ ధరల ద్రవ్యోల్బణం ఆధారంగా పన్ను విధించాలన్న సూచననూ తిరస్కరించింది.