ఐటీ మినహాయింపు పరిమితి పెంచలేం | FinMin against raising income-tax exemption limit to Rs 3 lakh | Sakshi
Sakshi News home page

ఐటీ మినహాయింపు పరిమితి పెంచలేం

Published Wed, Apr 2 2014 1:11 AM | Last Updated on Thu, Sep 27 2018 4:27 PM

FinMin against raising income-tax exemption limit to Rs 3 lakh

న్యూఢిల్లీ: ఆదాయ పన్ను కనీస మినహాయింపును(బేసిక్ లిమిట్) రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలన్న పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులను ఆర్థిక   శాఖ తోసిపుచ్చింది. వ్యక్తిగత పన్ను శ్లాబులను సవరిస్తే సుమారు రూ.60,000 కోట్ల ఆదాయాన్ని నష్టపోవాల్సి వస్తుందని, దీంతో ఈ ప్రతిపాదనలను ఆమోదించడం లేదని ఆర్థిక శాఖ పేర్కొంది. కొత్తగా అమల్లోకి రానున్న డెరైక్ట్ ట్యాక్స్ కోడ్(డీటీసీ)లో పన్ను శ్లాబులను సవరిస్తూ యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కొన్ని సిఫార్సులను చేసింది.

 బేసిక్ లిమిట్‌ను ప్రస్తుతం ఉన్న రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచడమే కాకుండా, రూ.3-10 లక్షల ఆదాయంపై10%, 10-20 లక్షల ఆదాయంపై 20%, ఆపైన ఆదాయం ఉన్న వారిపై 30% పన్ను విధించాలని   సిఫార్సు చేసింది. ఈ సూచనలు పాటిస్తే భారీగా పన్ను ఆదాయం తగ్గుతుందని 2013 డీటీసీ ప్రతిపాదనల విడుదల సందర్భంగా ఆర్థిక శాఖ వ్యాఖ్యానించింది. ప్రస్తుత స్లాబుల ప్రకారం వార్షిక ఆదాయం రూ. 2 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. రూ.2-5 లక్షల వరకూ 10%,  రూ. 5-10 లక్షలకు 20%, రూ. 10 లక్షలు దాటితే 30% పన్ను అమలవుతోంది.

  సీనియర్ సిటిజన్లకు సంబంధించి పన్ను మినహాయింపుల వర్తింపు వయస్సును  65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాలన్న ప్రతిపాదనకు మాత్రం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అలాగే వార్షిక ఆదాయం రూ.10 కోట్లు దాటితే సూపర్ రిచ్ ట్యాక్స్ పేరుతో కొత్త ట్యాక్స్ శ్లాబ్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వార్షిక ఆదాయం రూ.10 కోట్లు దాటితే 35 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  జీవిత బీమా కంపెనీలపై విధిస్తున్న 30% పన్ను పరిమితిని 15%కు కుదించాలన్న సలహాలను కూడా ఆర్థిక శాఖ పక్కనపెట్టింది. ఇదే విధంగా రిటైల్ ధరల ద్రవ్యోల్బణం ఆధారంగా పన్ను విధించాలన్న సూచననూ తిరస్కరించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement